హెబ్రీ భాషలో దినవృత్తాంతములు అనే మాటకు జరుగుతున్న చరిత్ర అనే అర్థమిస్తుంది. అంటే అది ఒక దినపత్రిక, ఒక డైరీ, లేక ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల జాబితాను నమోదు చేయడంలాంటిది. ఈ రెండు గ్రంథాలు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలతో కూడిన ఒక నాలుగు గ్రంథాల పరంపరలో మొదటి మరియు రెండవ భాగాలు. ఈ నాలుగు గ్రంథాలు కలిసి ఆదాము కాలం నుండి దేవుని మందిరాన్ని, యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేదాకా జరిగిన ఇశ్రాయేలు యాజక పరిచర్య చరిత్రను మనకు తెలియజేస్తున్నాయి. ఒక సమయంలో దినవృత్తాంతములు అనేది బహుశా ఒకే గ్రంథపు చుట్ట అయి ఉంటుంది. ఆ తరవాత అది పాత నిబంధనను గ్రీకులోకి అనువదించిన (సెప్టువజింట్) వారిద్వారా మరింత సౌకర్యంగా ఉండడం కోసం విభజించబడింది.
Read More
గ్రంథ రచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఒక ప్రాచీన సాంప్రదాయం ప్రకారం దినవృత్తాంతాలు గ్రంథకర్తృత్వం ఎజ్రాకు ఆపాదించబడిరది. రచయిత బబులోను చెరనుండి ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తరవాత జీవించినవాడై ఉండాలి. అతనికి ధర్మశాస్త్రాన్ని, దేవాలయ నియమనిబంధనలను తిరిగి అమలులోకి తేవాలనే తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండడమే కాక చారిత్రక దస్తావేజులతో అతడు పరిచయం, ప్రవేశం కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఎజ్రాలో కనిపిస్తున్నాయి. ఈ గుర్తింపు దినవృత్తాంతాల్లోని చివరి వచనాలే ఎజ్రా గ్రంథంలోని ప్రారంభ వచనాలు అనే వాస్తవంతో రూఢపిరచబడిరది. ఏదేమైనా ఈ గ్రంథంలో దాని రచయిత ఎజ్రా అని నేరుగా పేర్కొనకపోవడం బట్టి ఈ నోట్సులో మనం అతనిని ‘‘వృత్తాంతకారుడు’’ అని ప్రస్తావిస్తాం.
నేపథ్యం: 1,2 దినవృత్తాంతాలు గ్రంథాలలో ఆదాము కాలం మొదలుకొని యూదు ప్రజలు చెరలోకి వెళ్ళిన సమయం, చెరనుండి తిరిగి వచ్చిన సమయం వరకు ఉన్న వివిధ వంశావళులు విస్తారంగా కనిపిస్తాయి. 1దినవృత్తాంతాలు గ్రంథం మనకు వంశావళులు అందిస్తూ రాజైన దావీదు పరిపాలన వివరాలపై దృష్టి నిలిపింది. 2దినవృత్తాంతాలు దావీదు తరువాత నుండి యూదులు చెరలోకి వెళ్ళేటంతవరకు పరిపాలించిన రాజుల గురించీ, ఇశ్రాయేలు జాతి పునరుద్ధరణ గురించీ వివరిస్తుంది. 1,2 రాజులు చరిత్ర ఏ కాలంలో జరిగిందో ఆ కాలపు చరిత్రనే 2దినవృత్తాంతాలు గ్రంథం కూడా వివరించింది. అయితే ఈ గ్రంథం ప్రత్యేకంగా యూదా రాజులపైనే తన దృష్టి నిలిపింది. ఈ గ్రంథాల్లోని సమాచారం ప్రకారం ఇవి చెరనుండి తిరిగి వచ్చిన కొద్దికాలానికి, బహుశా క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో రాయబడి ఉంటాయి.
గ్రంథ సందేశం, ఉద్దేశం
చెరనుండి తిరిగివచ్చి యెరూషలేములో స్థిరపడిన తరువాత ప్రజలు తాము దేవుని ప్రజలమనే గుర్తింపును తిరిగి సంపాదించుకోవలసిన అవసరత ఏర్పడిరది. దినవృత్తాంతాలు గ్రంథాలు వారికి తమ వారసత్వాన్ని గుర్తు చేస్తూ, దేవాలయం దేనికైతే సూచనగా వారి మధ్య ఉన్నదో ఆ దేవుని సన్నిధికి వారిని నడిపించడం ద్వారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాయి. 1,2 దినవృత్తాంతాలు గ్రంథాల్లో ఈ కింది విషయాలు నొక్కి చెప్పబడ్డాయి: (1) గతంలో జీవించిన దేవుని ప్రజలతో నేరుగా ఉన్న సంబంధం, (2) యూదా రాజ్య సింహాసనంపై దావీదు వారసుని కొనసాగింపు, (3) దేవునిపై దృష్టి పెట్టడంలో దేవాలయం, దాని ఆచారాల ప్రాముఖ్యత, (4) దేవుణ్ణి ఆరాధించడంలో సంగీతం యొక్క ప్రాధాన్యత, (5) దేవునికి లోబడినప్పుడు దేవుని ప్రజల అజేయమైన శక్తి, (6) దేవుని ప్రజలు ఆయనకు అవిధేయులైనప్పుడు వారిపైకి తప్పనిసరిగా వచ్చే తీర్పు.
1,2 దినవృత్తాంతాలు గ్రంథాల్లో అనేక కీలకమైన అంశాలు కనిపిస్తాయి. అవి:
చరిత్రపై దేవుని ఆధిపత్యం: ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ సంబంధంలో దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకుంటాడు. దానిలో ఆయన దేవుడుగా, విమోచింపబడిన వారు ఆయన ప్రజలుగా ఉంటారు. ప్రత్యక్ష గుడారం, దేవాలయం ఇట్టి దేవుని కోరికకు సూచనగా నిలిచాయి. అంతిమంగా ఇది దావీదు కుమారుడైన యేసు క్రీస్తులో నెరవేర్చబడిరది. ఆదాము కాలం నుండీ మరి ముఖ్యంగా దావీదు కాలంలో, ఎజ్రా, నెహెమ్యాల ద్వారా పరిశుద్ధతతో తన ప్రజలమధ్య నివసించాలనే తన కోరికను నెరవేర్చుకోడానికి దేవుడు ఏ విధంగా పనిచేస్తూ వచ్చాడో దినవృత్తాంతములు తెలియజేస్తున్నాయి.
దావీదుతో నిబంధన: దేవుడు తన ఇంటిని నిర్మించడానికి దావీదును, అతని వంశాన్ని ఎన్నుకున్నాడు. ఈ వంశంలో చివరి పాలకుడు దావీదు కుమారుడు అని చెప్పబడిన మెస్సీయ. సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించాడు గానీ దేవుని నిజమైన ఇంటిని నిర్మించేదీ, నిర్మిస్తున్నదీ యేసే. శాశ్వతంగా పరిపాలించే వాడు క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాక ఆయనలో విశ్వాసముంచి సమస్త దేశాలకూ చెందిన వారంతా ఆయన ప్రజలే.
పరిశుద్ధుడైన దేవుడు సక్రమంగా ఆరాధించబడాలి: దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రానుసారంగానే ప్రజలు పరిశుద్ధతలో నివసించే ఆ దేవుణ్ణి సమీపించాలని ఈ రెండు దినవృత్తాంత గ్రంథములు చూపిస్తున్నాయి. తన ప్రజలను దేవుని సన్నిధికి సమీపస్తులుగా చేయాలని కోరుకున్న దావీదు ఒక సక్రమమైన మార్గంలో దేవుణ్ణి వెదకాలని అని నేర్చుకున్నాడు. లేవీ యాజకవ్యవస్థ పరిచర్య చేసినట్లుగా బలిపీఠంపైన బలుల ద్వారా దేవుని ఆరాధించడం ప్రాముఖ్యమైన విషయం. ఆ బలిపీఠం యెరూషలేములో ఒర్నాను (అంటే అరౌనా) కళ్ళం ఉన్న స్థలంలో ఉండాలి. అక్కడే దావీదు బలిపీఠాన్ని నిలిపాడు, అక్కడే సొలొమోను దేవుని సూచనలను అనుసరించి దేవాలయాన్ని నిర్మించాడు.
దేవుని ఇల్లు: దేవుని ఇంటిని నిర్మించడానికి దేవునితో, ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలని దినవృత్తాంతములు గ్రంథాలు దేవుని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నించాయి. యెరూషలేముకు ఎక్కి వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించమని ఈ గ్రంథాలు ప్రజలను సవాలు చేశాయి. తన ప్రజల పట్ల, తన మందిరం పట్ల, దేవుని విశ్వాస్యతా చరిత్రను ఈ గ్రంథాలు ప్రజలకు జ్ఞాపకం చేశాయి. ఈ పిలుపుకు స్పందించి లోబడినవారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
బైబిలులో ఈ గ్రంథం పాత్ర
బైబిలు ప్రత్యక్షతలోని అనేక కోణాలను దినవృత్తాంతములు ఒకచోటకు సమకూర్చాయి. వాటిలో చారిత్రక సంఘటనలు (ఆదికాండం నుండి 2రాజులు వరకు), దేవాలయ ఆచారకాండలు (లేవీకాండంలో సూచించినట్లు), పాపము, తీర్పు (ప్రవక్తల బోధలు), ఇంకా కొన్ని కీర్తనలు సహితం ఉన్నాయి. ప్రజలు ఎంత దుర్మార్గులుగా వ్యవహరించినప్పటికీ తన దగ్గరకు తిరిగి వచ్చేవారిని దేవుడు ఎల్లప్పుడూ అంగీకరిస్తాడని దీనిలో మళ్ళీ మళ్ళీ కనిపించే సూత్రాన్ని బట్టి కొంచెం విచిత్రంగా అనిపించేలా బహుశా ఈ గ్రంథాన్ని ‘‘ఎజ్రా సువార్త’’ అని పిలిచారు. 1,2 దినవృత్తాంతాలు గ్రంథాలు ఆదామునుండి దావీదు నిబంధన వరకు ఇశ్రాయేలు చరిత్ర వెలుగులో పాత నిబంధన చరిత్రయొక్క విశాల చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. మెస్సీయ పరిపాలనలో ఆ నిబంధన శాశ్వత కొనసాగింపును ఈ గ్రంథాలు మనకు చూపిస్తాయి.
గ్రంథ నిర్మాణం
హెబ్రీ బైబిలు దాని గ్రంథాలను మూడు వర్గాలుగా విభజించింది: ధర్మశాస్త్రము, ప్రవక్తలు, చరిత్ర గ్రంథాలు. ఈ ఏర్పాటులో సమూయేలు, రాజులు గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. దినవృత్తాంతాలు చరిత్ర గ్రంథాలు జాబితాకు చెందుతాయి. అంతకు ముందు ఆదికాండంలోని వంశావళులు, సమూయేలు, రాజులు గ్రంథాల్లోని యూదా రాజుల చరిత్రలు గురించిన సమాచారం దినవృత్తాంతములు గ్రంథాల్లో పునరావృతం కావడమే ఇలాంటి విభజనకు కారణం కావచ్చు. అయినప్పటికీ దినవృత్తాంతకారుడు తాను చెప్పదలచుకున్నదానిని సమర్ధించుకోవడం కోసమే ఈ పునరావృత సమాచారాన్ని వాడాలని ఎన్నుకున్నాడు. అంతేకాక దినవృత్తాంతములులో మాత్రమే మనకు కనిపించే మరింత విస్తారమైన సమాచారాన్ని జోడిరచాడు. ఆయా రాజుల గురించిన చర్చను అతడు పూర్తిగా దక్షిణ రాజ్యమైన యూదా రాజులకు మాత్రమే పరిమితం చేశాడు.