ఈ గ్రంథాల శీర్షికలు వాటిలోని అంశాలను వివరిస్తున్నాయి: ఇశ్రాయేలు, యూదా రాజులు, రాజ్యాల చరిత్ర. రాజులు మొదటి, రెండవ గ్రంథాలు పాత నిబంధనలో 12 చరిత్ర గ్రంథాల (యెహోషువ -ఎస్తేరు) విభాగంలో ఒక భాగం అని చెప్పవచ్చు. మూలంలో ఈ రెండు గ్రంథాలు ఒక్కటిగానే ఉండేవి. సెప్టువజింట్ (పా.ని. గ్రీకు అనువాదం) అనువాదకులు దీనిని రెండుగా విభజించారు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: ఈ గ్రంథాలలోని ఏ భాగానికీ రచయితలు ఎవరో పండితులు గుర్తించలేదు. సమూయేలు అనీ, యిర్మీయా అనీ సాంప్రదాయకంగా వస్తున్న అభిప్రాయాలకు సరైన రుజువులు లేవు. అయితే యెహోవాను ఆరాధించే యిర్మీయాలాంటి ప్రముఖమైన వ్యక్తి ఈ గ్రంథాల రచనలో ప్రభావం చూపి ఉండవచ్చు. ఈ గ్రంథాల రచనలో అనేక పూర్వ గ్రంథాలను ఆధారంగా తీసుకోవడం బట్టి వాటన్నిటినీ రచించిన వారిని కూడా ఈ గ్రంథాల రచయితలుగానే చెప్పుకోవాలి. ఏదో ఒక సమయంలో పరిశుద్ధాత్మ ఈ మానవ రచయితలపై పనిచేసి ఆత్మ ప్రేరితమైన, లోపం లేని విధంగా 1,2 రాజులు గ్రంథాలను అధీకృతమైన రచనలుగా రూపించాడు. ఈ గ్రంథాల సంకలనం లేక సమకూర్పుల అంతిమ ఘట్టం బబులోను చెరలోనుండి రాజైన యెహోయాకీను విడిపించబడిన తరువాత జరిగి ఉంటుంది (క్రీ.పూ. సుమారు 562 సం.). అది దీనిలో గత అనేక సంవత్సరాలకు పూర్వమే పూర్తయిన రచనలకు చేర్చిన ఒక ముక్తాయింపు అయి ఉంటుంది లేక దానిలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలను కూడా చేర్చి ఉండవచ్చు.
నేపథ్యం: 1,2 రాజులు గ్రంథాల్లోని చరిత్ర సుమారు 410 సంవత్సరాల నిడివి కలిగి ఉంది. 1రాజులు గ్రంథం రాజైన దావీదు చనిపోయిన తరువాత క్రీ.పూ. రమారమి 970 లో ప్రారంభమైతే 2రాజులు గ్రంథం క్రీ.పూ. సుమారు 560 సంవత్సరంలో రాజైన యెహోయాకీను బబులోనులో చెరసాలనుండి విడుదల పొందడంతో ముగుస్తున్నది. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు రాజ్యం రెండు రాజ్యాలుగా చీలిపోయింది (క్రీ.పూ.930), ఈ రెండు రాజ్యాలూ చెరలోకి కొనిపోబడ్డాయి (క్రీ.పూ.722లో ఇశ్రాయేలు రాజ్యం, క్రీ.పూ.587 లో యూదారాజ్యం).
గ్రంథాల సందేశం, ఉద్దేశం
1,2 రాజులు గ్రంథాల వేదాంతపరమైన దృక్పథం అనేక రకాల అంశాల ద్వారా వెల్లడిరచబడిరది: (1) రాజుల యొక్క, రాజ్యం యొక్క పాపస్వభావం, (2) ఆచరణాత్మకమైన రాజకీయాలు, విశ్వాసం, ఈ రెండూ ప్రజల నుండి ఎదురుచూసే అంశాల మధ్య సంఘర్షణ, (3) తనకు విధేయత చూపిన నిబంధనా రాజులకు దేవుడు అనుగ్రహించిన మహిమ, (4) కొన్ని సందర్భాల్లో దేవుడు వారిపై ప్రకటించిన తీర్పుల తీవ్రత, మరి కొన్ని సందర్భాల్లో ఆయన చూపిన ఉదారత, (5) యెహోవాను ఆరాధించడం, అన్యదేవతలను ఆరాధించడం మధ్య ఏర్పడిన సంఘర్షణ.
రాజు పాత్ర: నిబంధనా ఉద్దేశాలకు సంబంధించి దావీదు నిబంధన రాజును ప్రజలకు ఒక నైతిక ప్రతినిధిగా స్థిరపరచింది. కాబట్టి రాజులైన అజర్యా (ఉజ్జీయా అని మారుపేరు), యోతాముల వరకు రాజు యొక్క నైతిక స్థాయి ప్రజల నైతిక స్థాయితో సమానమైనదిగా పరిగణించబడిరది. రాజు ప్రవర్తనపై ఆధారపడి నిబంధనా సంబంధమైన దీవెనలు అనుగ్రహించడమో, త్రోసిపుచ్చడమో జరిగేది. ఆ విధంగా ఏ పాలనకైనా రాజు ప్రవర్తనే ప్రాముఖ్యమైన నిబంధనగా, నైతిక వాస్తవంగా చెలామణి అయ్యింది.
ప్రవక్త పాత్ర: ఈ కాలం ప్రవక్త కార్యకలాపాలు విస్తరించి ప్రబలిన కాలం. ఈ ప్రవక్తల కార్యకలాపాల స్వభావం ప్రజలను పరవశింపజేసే ఆశ్చర్యకార్యాలు జరిగించే ప్రవక్తలైన సౌలు (1సమూ 19:24), ఎలీషా (2రాజులు 3:14-16)లు, ఆ తరువాత ఆశ్చర్యకార్యాలు ఏమీ జరిగించని రాజాస్థాన ప్రవక్తలైన గాదు, మీకాయా, చివరిగా లేఖనాల్లో పేర్కొన్న గొప్ప రచయితలైన ప్రవక్తలు అనే రకరకాల స్థాయిలగుండా పయనించింది.
ఉజ్జీవం: యూదా రాజ్యంలో ఉజ్జీవానికి కారకులైన చివరి ఇద్దరు రాజులు (హిజ్కియా, యోషీయా) వ్యక్తిగతంగా అనుభవించిన ఉజ్జీవం వారి రాజకుటుంబాలపైనా లేక రాజ్యంపైనా ప్రభావం చూపింది. ఈ ఇద్దరు మంచి రాజులు మరణించిన వెనువెంటనే రాజ్యం తిరిగి భ్రష్టత్వంలోకి దిగజారిపోయింది. ఆ విధంగా ఈ రెండు ఉజ్జీవాలు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా, సంపదపరంగా పూర్తి పునరుద్ధరణను తీసుకురాలేకపోయాయి. కాకపోతే తప్పనిసరిగా రాబోతున్న తీర్పును అవి కొంచెం ఆలస్యం చేశాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
బైబిలు రచయితల దృక్పథంలో దేవుని ఉద్దేశాల నెరవేర్పు కోసం కాకుండా చరిత్ర అనేదే లేదు. ఈ భావన చరిత్ర అంతటినీ వేదాంతపరమైన అంశంగా మార్చివేసింది. 1,2 రాజులు గ్రంథాలు హెబ్రీ చరిత్రను పాత నిబంధన వేదాంతపు వెలుగులో విశదీకరించింది. బబులోను చెర ఈ విధమైన చారిత్రిక సమర్ధనావాదం యొక్క ఆవశ్యకతను కల్పించింది. ఈ చెరలు సార్వభౌముడైన దేవుడు నెలకొల్పిన భక్తివిధానపు వైఫల్యాన్ని వివరించాల్సివచ్చింది. ఈ వైఫల్యం ద్వితీయోపదేశ కాండంలోని నిబంధనా షరతులు వర్తించే చరిత్రలో అంటే యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు గ్రంథాలు, 1,2 రాజులు గ్రంథాల్లోని చరిత్రలో నిబంధనకు సంబంధించి ప్రజలు తమ పాత్రను పోషించడంలో వైఫల్యం చెందడంగా పదే పదే వివరించబడిరది.
గ్రంథ నిర్మాణం
1,2 రాజులు గ్రంథాల మౌలిక సూత్రం కథనాత్మకం లేక వివరణాత్మకం కాదు. రాజులు గ్రంథం ప్రత్యేకమైంది, ఎందుకంటే రాజాస్థాన కార్యకలాపాల దస్తావేజుల పైనే దాని ప్రాథమిక నిర్మాణం ఆధారపడి ఉంది. దాని అధికారిక ప్రారంభం (1రాజులు 15:9-10), ముగింపు (1రాజులు 15:23-24) ఈ దస్తావేజుల పరిమితులను నిర్వచిస్తున్నాయి. ఆ తరవాతే రచయితలు తమ వివరణలు, ప్రార్థనలు, వర్ణనలు, మొదలైన ఇతర సాహిత్యాన్ని వాటికి ముందు, మధ్యలో, వెనుక చేర్చగలిగారు. అయితే వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనదేమిటంటే నిబంధన విషయంలో పాలకుని నమ్మకత్వం ఏవిధంగా పరిణామం చెందింది అన్నదే (1రాజులు 15:11-15). ఈ సమాచారమంతా కలిసి ప్రజలు నిబంధనకు విధేయులుగా లేక అవిధేయులుగా ఉన్న చరిత్రను రూపుదిద్దింది.