1పేతురు సాధారణ పత్రికల్లో ఒకటిగా పరిగణించబడిరది. ఉత్తర ఆసియా మైనర్లో తీవ్రమైన హింసలు ఎదుర్కొంటున్న విశ్వాసులకు ఇది ప్రోత్సాహాన్ని అందించింది. అణచివేత కింద ఉన్నప్పటికీ నమ్మకత్వంగా కొనసాగాలని ఈ పత్రిక ప్రోత్సహించింది. మరి ముఖ్యంగా దేవుని పరిశుద్ధ జనాంగం ఒక పరాయి దేశంలో జీవిస్తున్న వారిలాగా ప్రత్యేకమైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఈ క్రైస్తవేతర లోకంలో జీవించి ఉండగా వారు క్రీస్తు కోసం శ్రమలు పొందుతారు గానీ వారి భవిష్యత్ స్వదేశం పరలోకమే అని వారు గుర్తుంచుకోవాలి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: 1పేతురు పత్రిక రచయిత తనను తాను ‘‘యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు’’ అని పరిచయం చేసుకున్నాడు (1:1). అతడు తన గురించి దైవికమైన అభిషేకం పొంది, ప్రభువైన యేసుచేత నేరుగా నియమింపబడి ఆయనకు అధికార ప్రతినిధిగా పరిగణించుకున్నాడు. ఈ ఉత్తరంలో అనేక వాక్యాలు సువార్తలలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన పేతురే దీని రచయిత అని సూచిస్తున్నాయి. ఉదాహరణకు, అతడు తనను ‘‘తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని’’ అని పిలుచుకున్నాడు (5:1). పైగా అతడు క్రీస్తు సిలువ ఘట్టాన్ని కేవలం ఒక శిష్యుడు మాత్రమే వర్ణించగలిగినంత సన్నిహితమైన విధంగా వర్ణించాడు (2:21-24).
1పేతురు గ్రంథంలో అనేక వ్యక్తీకరణలు యేసుతో పేతురుకున్న అనుభవాలను ప్రతిబింబిస్తున్నాయి. ఉదాహరణకు, ‘‘దేవుని మందను పైవిచారణ చేయుడి’’ (5:2) అనే హెచ్చరిక యోహాను 21:15-17 లో యేసు పేతురుకు అప్పగించిన బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఇదే కాక, ‘‘దీనమనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి’’ (1పేతురు 5:5) అనే మాటలు యోహాను 13:2-17 లో యేసు శిష్యుల పాదాలను కడిగిన సంఘటనను గుర్తు చేస్తాయి.
1పేతురు పత్రికలోని అనేక అంశాలు అపొస్తలుల కార్యాలు గ్రంథంలోని పేతురు ప్రసంగాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు, దేవుడు ‘‘పక్షపాతము లేకుండ… తీర్పు తీర్చువాడు తండ్రి’’ (1:17 ని అపొ.కా.10:34 తో పోల్చండి), క్రీస్తును మృతులలో నుండి లేపి మహిమనిచ్చాడు (1:21 ని అపొ.కా.2:32-36 తో పోల్చండి). ‘‘ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి’’ క్రీస్తే (2:7-8 ని అపొ.కా.4:10-11 తో పోల్చండి).
ఈ ఉత్తరాన్ని పేతురు రాయలేదని చెప్పే అభ్యంతరాలన్నీ అసమగ్రంగా, రుజువు చేయలేనివిగా ఉన్నాయి. అపొస్తలుని పేరు వాడుకొని వేరొకరు ఈ ఉత్తరం రాశాడని చెప్పేది నిలబడే వాదన కాదు. ఆది సంఘంలోని అనేకమంది నాయకులు – ఉదా. ఇరేనియస్, తెర్తుల్లియన్, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంతు అనేవారు ఈ ఉత్తరం ప్రామాణికతను రూఢపిరిచారు. అంతేగాక, ఆదిసంఘం ఒక అపొస్తలుని పేరు మీద వేరొకరు రాసిన దేన్నైనా నకిలీ రచనగా గుర్తించి తోసిపుచ్చింది. ఈ దృష్టితో చూస్తే ఈ ఉత్తరం యథార్థంగా అపొస్తలుడైన పేతురు రాశాడని అంగీకరించాలి. ఏదో ఒక రీతిలో సిల్వాను ఈ ఉత్తరం రాయడానికి పేతురుకు అతని కార్యదర్శిగా (గ్రీకు. అమ్మన్యుయెన్సిస్) సహాయపడి ఉంటాడు. దానికంటే అతడు ఈ ఉత్తరాన్ని పాఠకుల దగ్గరకు తీసుకెళ్ళి ఉంటాడన్నది మరింత వాస్తవికంగా ఉంది (5:12).
నేపథ్యం: 1పేతురు పత్రికను అందుకున్న పాఠకులెవరో 1:1 లో పేర్కొనబడిరది. పేతురు, ‘‘పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశములయందు చెదరిన వారి’’కి రాశాడు. ఇది నేటి ఆధునిక టర్కీ దేశానికి ఉత్తర భాగంలో ఉన్న ఆనాటి రోమా సామ్రాజ్యానికి చెందిన రాష్ట్రాలు. అక్కడి వారు హింసింపబడుతూ ఉన్న అన్య క్రైస్తవులై ఉండవచ్చు. వారంతకు ముందు, అంటే క్రీస్తును ఎరుగక ముందు విగ్రహారాధన చేసేవారు (4:3), అజ్ఞానంలో ఉన్నవారు (1:14-16), ‘‘వ్యర్థులు’’ (1:18), ఒకప్పుడు ‘‘ప్రజ’’గా కాక ఇప్పుడు ‘‘దేవుని ప్రజలు’’ గా మారారు (2:9-10).
1పేతురు 5:13 లోని ‘‘బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు…’’ అనే మాటలు ఈ ఉత్తరం రోమా నుండి రాయబడిరదని సూచిస్తున్నాయి. ‘‘బబులోను’’ అనే మాట గూఢార్థంలో పరవాసానికి సంబంధించి వాడబడేది అయినా ప్రత్యేకంగా అది రోమా నగరాన్ని సూచిస్తుంది. మెసొపొతమియలోని బబులోనుకు, ఐగుప్తుకు చెందిన ఇతర నగరాలను కూడా సూచించే అవకాశం ఉంది గానీ పేతురు ఆ ప్రాంతాలకు ఎన్నడూ వెళ్ళిన దాఖలాలు లేవు కాబట్టి అది నిజం కాకపోవచ్చు.
1పేతురు పత్రిక క్రీ.శ. 62 – 64 మధ్య రాసి ఉండవచ్చు. క్రీ.శ. 60-62 మధ్య పౌలు గృహ నిర్బంధంలో ఉండగా అతడు రోమాలో పేతురు ఉండడం గురించి ఏమీ ప్రస్తావించలేదు. అదే విధంగా పేతురు కూడా పౌలు ఆ సమయంలో రోమాలో ఉన్న సంగతిని ప్రస్తావించలేదు. ఆ సమయంలో సిల్వాను, మార్కు మాత్రమే అతనితో ఉన్నారు (5:12-13). ఈ వాస్తవాల ఆధారంగా చూస్తే పేతురు తన మొదటి పత్రికను క్రీ.శ.62 తరవాత కొద్ది కాలానికి, 2పేతురు పత్రికకు ముందు రాసి ఉంటాడని భావించవచ్చు.
1పేతురు పత్రిక అంతటిలో శ్రమలు అనే అంశం కొనసాగింది. ఈ ఉత్తరంలోని ఐదు అధ్యాయాల్లో నాలుగు అధ్యాయాలు శ్రమల్లో ఉన్నవారికి రాయబడినవి. క్రీ.శ. 62-64 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పత్రిక నీరో చక్రవర్తి పాలనలో క్రైస్తవులు హింసలు పొందుతున్న కాలంలో రాయబడినది. హింస రోమ్‌లో ప్రారంభమై ఆసియా మైనర్ అంతటా వ్యాపిస్తూ ఉంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఆసియా మైనర్‌లోని విశ్వాసులు అనుభవిస్తున్న హింసల మధ్య వారిని క్రీస్తుకోసం స్థిరంగా నిలిచి ఉండమని ప్రోత్సహించడానికి పేతురు ఈ పత్రికను రాశాడు. వారు తమ ఆధ్యాత్మికమైన హక్కులపై లేక విశేషాధికారాలపై దృష్టి సారించడం ద్వారా, మరి ముఖ్యంగా, ఆ హక్కులు, ఆధిక్యతలు ఎక్కడ ఉన్నాయో ఆ మరణానంతర జీవంపై దృష్టి సారించడం ద్వారా ఆ పనిచేయాలని వారిని హెచ్చరించాడు. ఈ లోకంలో యేసులో విశ్వాసులు ‘‘యాత్రికులు’’ (గ్రీకు. పారెపైడే మోయ్, 1:1; 2:11), ‘‘పరదేశులు’’ (గ్రీకు. పారోయ్, 2:11). వారికి ఇక్కడ నిజమైన హక్కులు, అధికారాలు లేవు. క్రైస్తవులకు స్వాస్థ్యపు హక్కులు, అధికారాలు, న్యాయం – ఇవన్నీ దేవుడు విశ్వాసులను తరలించబోయే మరో లోకానికి చెందినవి. అంటే వారి అంతిమ గృహమైన పరలోకానికి చెందినవి. విశ్వాసులు ఈ లోకంలో తాత్కాలిక నివాసులు కాబట్టి వారికి శ్రమలు అనేవి అతి సాధారణమైన విషయం. కాబట్టి, ఈ విదేశీ భూమిలో వారికి హక్కులేమీ ఉండవు, వారికి న్యాయం లభించదు. యాత్రికులైన వీరికి ఈ భూమి మీద శ్రమలు సంభవించినప్పటికీ వారి శాశ్వత దేశంలో వారికోసం స్వాస్థ్యం, మహిమ ఎదురు చూస్తున్నాయి.
బైబిల్లో దీని పాత్ర
ఈ పత్రిక రాయడంలో పేతురు ఉద్దేశం విశ్వాసులు ఎదుర్కొంటున్న బాధలు, హింసల మధ్య వారిని బలపరచడమే. వారికి అతడు ఇచ్చిన సందేశం మన బాధల మధ్య మన పరలోకపు నిరీక్షణను, నిత్యమైన స్వాస్థ్యమును గుర్తు చేస్తూ నేటి విశ్వాసులతో కూడా మాట్లాడుతూనే ఉంది. పరిశుద్ధమైన, ప్రేమగల జీవితాలను జీవించడానికి మనం పిలవబడిన వారము. మనం మన అనుదిన జీవితాల్లో క్రీస్తును అనుకరిస్తూ దేవుణ్ణి మహిమపరచడానికి కూడా పిలవబడిన వారము.
గ్రంథ నిర్మాణం
క్రైస్తవ సంఘ చరిత్ర ప్రారంభ దినాల నుండీ కూడా 1పేతురు నిర్మాణం ఎన్నో చర్చలకు దారితీసింది. ఒక ఉత్తరానికి సాధారణంగా ఉండాల్సిన ప్రారంభం పేతురు ఉత్తరంలోను కనిపిస్తుంది (1:1-2), దాని తరవాతి పెద్ద భాగం (1:3-2:10) ఒక ఆశీర్వాదంతో ప్రారంభమైంది (1:3-4). ఆ తరవాతి రెండు విభాగాలు, ‘‘ప్రియులారా’’ (గ్రీకు. అగపే టోయ్, 2:11; 4:12) అనే సంబోధనతో ప్రారంభమై, ఇంతకు ముందు చూసినట్లు 2:11-4:11 విభాగం ఒక మహిమవాక్యంతో, ‘‘ఆమేన్’’ అనే మాటతో ముగిసింది. పత్రికలోని నాల్గవ భాగం కూడా ఒక మహిమవాక్యం, ‘‘ఆమేన్’’ (5:11) తో ముగిసింది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”