సమూయేలు రెండు గ్రంథాలు ఇశ్రాయేలు చరిత్రలోనే ప్రాముఖ్యమైన కాలగమనంలో వచ్చిన మార్పులను చూపిస్తాయి. 1సమూయేలు ప్రారంభంలో, ఇశ్రాయేలు అనేది పేలవమైన ఆధ్యాత్మిక నాయకత్వంలో బలహీనమైన సంబంధాలు కలిగిన కొన్ని గోత్రాల కూర్పుగా ఉంది. అయినప్పటికీ తన ప్రజల పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్పు కొనసాగుతూనే ఉంది. దైవపరిపాలన విధానంలో నుండి రాజుల పరిపాలన విధానంలోకి ఇశ్రాయేలును నడిపించడానికి ఆయన సమూయేలును లేవనెత్తాడు. 1సమూయేలు తరువాతి భాగంలో సౌలు పరిపాలన గురించిన వివరాలు ఉండగా 2సమూయేలు గ్రంథంలో దావీదు రాజరిక విషయాలు వివరించబడి ఉన్నాయి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ప్రారంభంలో 1, 2 సమూయేలు గ్రంథాలు ఒకటే పుస్తకంగా ఉన్నాయని భావిస్తారు. 1సమూయేలు 1 నుంచి 25 అధ్యాయం వరకు సమూయేలు రాశాడనీ, మిగిలిన రచనలో నాతాను, గాదు ప్రవక్తలు ప్రధాన పాత్రను పోషించారనీ (1దిన 29:30) కొందరు పండితుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ ఆలోచన కేవలము ఊహా జనితమే అయివుండవచ్చు. ఎందుకంటే ఈ పుస్తకాలలో రచయితల గురించి ఎక్కడా పేర్కొనలేదు. క్రీ.పూ.930లో రాజ్యం రెండుగా విభజించబడిన కొన్ని తరాలు తరువాతే ఈ గ్రంథాలు రాయబడినట్లు 1సమూ 27:6 సూచిస్తుంది.
నేపథ్యం: యెహోషువ కాలంలో ఇశ్రాయేలు వాగ్దాన భూమిని స్వతంత్రించు కొనిన తరవాత, ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా భ్రష్ట కాలంలో ప్రవేశించారు. ఇలాంటి పరిస్థితులు ఊహించగలిగే అవధులలో పదే పదే పునరావృతమైనట్లు న్యాయాధిపతులు గ్రంథం వివరిస్తుంది. మొదటగా ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసి విగ్రహారాధనలో పడిపోయారు. రెండవదిగా, దేవుడు వారికి విరోధంగా ఒక శత్రువును రేపి వారిని తనవైపు తిప్పుకునేవాడు. మూడవదిగా, ప్రజలు పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టేవారు. నాలుగవదిగా, దేవుడు ఒక న్యాయాధిపతిని లేవనెత్తి అతని ద్వారా వారికి విడుదలను కలుగజేసేవాడు. ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (21:25) అంటూ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రాముఖ్యంగా కనిపించే వచనం ఆనాటి పరిస్థితులను స్పష్టంగా వివరిస్తుంది. అలాంటి అపాయకరమైన రోజుల చివరిభాగం నుంచి 1సమూయేలు గ్రంథం ప్రారంభమైంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
నాయకత్వం: 1, 2 సమూయేలు గ్రంథాలు మంచి, చెడ్డ నాయకత్వానికి అనేక ఉదాహరణలు ఇస్తున్నాయి. నాయకులు యెహోవా మీద దృష్టిపెట్టి తమ నాయకత్వం ఆయనకు మహిమ కలిగించే విధంగా నెరవేర్చినపుడు వారు అభివృద్ది చెందారు. దేవుణ్ణి విడిచిపెట్టి అధికారాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడు వారు విఫలమయ్యారు. ఏలీ, అతని కుమారులు మొదలుకొని సమూయేలు, సౌలు, దావీదు తదితరుల జీవితాలు ఈ సూత్రాల్ని స్థిరంగా విశదీకరించాయి.
దేవుని సార్వభౌమత్వం: 1, 2 సమూయేలు గ్రంథాలు అన్ని పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులను పోషించిన విధానాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. సమూయేలు ద్వారా దేవుడు వారికి మంచి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అనుగ్రహించాడు, ఆ సమయంలో రాజరిక వ్యవస్థ తన ప్రజల విషయంలో తన పరిపూర్ణ చిత్తం కాకపోయినా దేవుడు వారికి మొదటి రాజును ఇచ్చాడు. ప్రజలు, నాయకులు ఆయన అంచనాలను అనేక పర్యాయాలు వమ్ముచేసినా, శత్రువులను జయించడానికి వారికి కావలసిన నాయకులను, వనరులను అందించి, వారికి ఇచ్చిన దేశంలో ఆయన ఉద్దేశాల ప్రకారం జీవించడానికి సమస్తం సమకూర్చాడు.
పాపపు ఫలితం: 1, 2 సమూయేలు గ్రంథాలు పాపాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, క్షమించబడిన పాపంతో సహా, ప్రతి పాపానికి ఉండే భయంకరమైన పరిణామాలను విపులంగా వివరించాయి. సౌలు దేవునికి చూపిన అవిధేయత, తన కుమారునితో, దావీదుతో ఎడబాటుకు, చివరకు యుద్ధంలో అతని మరణానికి దారితీసింది. దావీదు బత్షెబతో చేసిన పాపం దేవుడు క్షమించినా, దాని పరిణామాలు దావీదును అతని శేషజీవితమంతా వెంటాడాయి.
నిబంధన: 1, 2 సమూయేలు గ్రంథాలు తన నిబంధన జనముతో దేవుని సంబంధాన్ని, నిబంధనలోని షరతులకు దేవుడు నమ్మకంగా స్పందించిన విధానాన్ని వివరిస్తునాయి. యెహోవా దావీదుతో ఒక ప్రత్యేకమైన నిబంధన స్థాపించాడు, ఆ నిబంధన అంతిమంగా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
దేవుని ఆధిపత్యంలో వేర్వేరు గోత్రాల కూటమిగా ఉన్న స్థితి నుండి ఇశ్రాయేలు దేవునికి జవాబుదారిగా ఉండే (రాజరిక) రాజు నాయకత్వంలోకి వచ్చిన విధానాన్ని 1, 2 సమూయేలు గ్రంథాలు వివరిస్తాయి. నిత్యం ప్రజలను దేవుని వైపుకు మరల్చిన సమూయేలు జీవితం, పరిచర్య ఈ పునర్నిర్మాణ కాలాన్ని గొప్పగా రూపుదిద్దింది. తమను నడిపించడానికి రాజు కావాలని మొఱ్ఱపెట్టిన ప్రజలు దానిలోని ప్రమాదాలకు ఎలా బాధితులయ్యారో సౌలు పాలన వారికి ప్రత్యేకంగా చూపించింది. పొరుగు రాజ్యాలవలె ఉండాలనే ఆలోచనతో దేవుని ప్రజలు సమూయేలు హెచ్చరికను (1సమూ 8:10-20) పెడచెవిని పెట్టారు. చివరికి వారు అడిగింది పొందినప్పటికీ దానికి దారుణమైన మూల్యం చెల్లించారు. జీవితపు అవసరాలకు దేవుని సమయం కోసం కనిపెట్టాలని సౌలు జీవితం ఒక్క గొప్ప హెచ్చరికగా నిలిచింది. దేవునికి లోబడిన జీవితాల ద్వారా దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలడో లేదా చేస్తాడో అన్నదానికి దావీదు పాలన ఒక సాక్ష్యంగా ఉంది. ఇశ్రాయేలు రెండవరాజు తన జీవితంలో దేవుని ఆశీర్వాదం గురించి తెలిసినట్లే ప్రవర్తించాడు, దేవుని సంగతుల పట్ల మృదు హృదయాన్ని చూపించాడు (2సమూ 5:12; 7:1-2; 22:1-51; 23:1-7). దావీదు జీవితాన్ని బట్టి తరువాతి తరాలు ఆశీర్వదించబడతారు (యెషయా 37:35). దేవుడు దావీదుతో చేసిన ప్రత్యేకమైన నిబంధన (2సమూ 7:1-29) అంతిమంగా దావీదు కుమారుడైన యేసులో నెరవేరింది (లూకా 1:32-33). అయినప్పటికీ, బత్షెబతో దావీదు చేసిన పాపం వలన కలిగిన పరిణామాలు పాపపు ఆకర్షణలో పడేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తాయి. దేవుడు తన ప్రజలను వారి క్రియలకు బాధ్యులను చేస్తాడు. క్షమించబడిన పాపాలకు కూడా కొన్నిసార్లు భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి.
గ్రంథ నిర్మాణం
1సమూయేలు మొదటి ఏడు అధ్యాయాలు సమూయేలు పుట్టుక, పిలుపు, ఇశ్రాయేలీయుల మధ్య అతడు చేసిన ప్రారంభ పరిచర్యను వివరిస్తాయి. ‘‘సకల జనుల మర్యాద చొప్పున’’ (1సమూ 8:5) తమను ఏలుటకు రాజు కావాలని ప్రజలు అడగడంతో ఎనిమిదవ అధ్యాయంలో వృత్తాంతం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఆ సమయానికి దేవుని సంపూర్ణమైన చిత్తం కానప్పటికీ ఆయన నడిపింపులో జరిగిన సౌలు ఎంపికను 9-12 అధ్యాయాలు వివరించాయి (1సమూ 12:16-18). 1సమూ 13-31 అధ్యా. సౌలు విజయాలను, వైఫల్యాలను వివరించాయి. సౌలు గొప్ప దేహదారుఢ్యం, మంచి యుద్ధనేర్పు కలిగిన రాజు (1సమూ 14:47-52), కానీ అతని హృదయం దేవునితో ఒకటిగా లేదు (1సమూ 13:14). దేవుని ఆజ్ఞలకు అతడు చూపిన అవిధేయత అతడు సాధించిన వాటిని అల్పంగా చేసింది. అతని పాలన తిరోగమన పథంలో నడిచిన వైనాన్ని 16-31 అధ్యాయాలు వివరించాయి. అ సమయంలో, దేవుడు సౌలుకు వారసునిగా దావీదును లేవనెత్తి, సౌలుకు బదులుగా సింహాసనం అధిష్టించేటందుకు అతణ్ణి సిద్ధపరిచాడు. ఆ సత్యం సౌలు క్రమేణా తెలుసుకున్నాడు (1సమూ 15:28; 24:20-21; 28:17).
ఇశ్రాయేలు సింహాసనం విషయంలో సౌలు మరణంతో ప్రారంభమైన కష్టాన్ని 2సమూ 1-4 అధ్యాయాలు వివరించాయి. యూదా గోత్రీకులు దావీదును రాజుగా అభిషేకించారు (2సమూ 2:4). కానీ అబ్నేరు సౌలు కుమారులలో బ్రతికివున్న వారిలో పెద్దవాడైన ఇష్బోషెతును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు (2సమూ 2:8-9). రెండు సంవత్సరాల అంతర్యుద్ధం ఇష్బోషెతు మరణానికీ, ఇశ్రాయేలు అంతటి మీద దావీదు రాజు కావడానికీ దారితీసింది. 2సమూ 5-24 అధ్యాయాలు దావీదు పాలనలోని ప్రాముఖ్య ఘట్టాలను చూపించాయి. దావీదు రాజ్య సింహాసనం శాశ్వతంగా స్థాపిస్తానని దేవుడు దావీదుతో ఒక ప్రత్యేకమైన నిబంధన చేశాడు (2సమూ 7:1-29). ఏదేమైనా, దావీదు బత్షెబతో చేసిన పాపం అతని పాలనలో విపత్కరమైన పరిణామాలను తీసుకుని వచ్చింది, అది 2సమూయేలు గ్రంథంలోనే ఒక మలుపుగా మారింది. చివరికి, దావీదు పశ్చాత్తాప పడటం అతడు దేవుని హృదయానుసారుడు అన్న మాటను ధృవపరుస్తుంది. అయితే రాజైనా దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం కుదరదని అతని పాపం తెలియజేస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”