థెస్సలోనిక నగరంలో పౌలు గడిపింది బహు కొద్ది కాలమే. ఆ సమయంలోనే అతడక్కడ ఒక సంఘాన్ని స్థాపించగలిగాడు. మారుమనస్సు పొందిన ఆ నూతన విశ్వాసులకు ఉపదేశం ఇవ్వడానికి అతనికి సరిపడినంత సమయం లభించి ఉండకపోవచ్చు. అందుకే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం కోసం పౌలు ఈ ఉత్తరం రాయడంలో ఆశ్చరం ఏమీ లేదు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: 1థెస్స. పత్రికను పౌలు రాశాడు అనే వాదనకు వ్యతిరేకంగా ఎలాంటి తీవ్రమైన అభ్యంతరమూ రాలేదు (1:1). దీనిలోని ప్రారంభ పలకరింపులో కూడా సిల్వాను, తిమోతిలను ప్రస్తావించాడు. కొన్నిసార్లు పౌలు తన ఉత్తరాలను తనతో ఉన్న వారందరి పక్షంగా రాసినట్టున్నా, ప్రాథమికంగా అతడే దాని రచయిత (2:18; 3:2).
నేపథ్యం: సుమారు క్రీ.శ.50 నాటికి పౌలు, సీల (సిల్వాను)ల నాయకత్వంలోని మిషనరీ బృందం ఫిలిప్పీని వదిలి పశ్చిమ దిక్కుగా ‘వయా ఎగ్నేషియా’ అనే రోమా రహదారిలో ప్రయాణం సాగించి మాసిదోనియ అనే రోమా రాష్ట్రానికి వ్యూహాత్మకమైన రాజధాని అయిన థెస్సలోనిక వైపుకు కొనసాగారు. థెస్సలోనిక నగరం ఆధునిక గ్రీసు లోని ఏజియన్ సముద్ర తీరాన ఉన్న ఒక పెద్ద ఓడరేవు. దాని జనాభా సుమారు 2,00,000. ఆ నగరం అంతా విగ్రహాలను ఆరాధించే అన్యులతో, రకరకాల గ్రీకు, రోమను దేవుళ్ళ విగ్రహాలతో నిండి ఉంది. అది వారి చక్రవర్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. థెస్సలోనిక కైసరుకు పూర్తి విధేయత చూపిన నగరం కావడం చేత అతడు ఆ నగరపౌరులకు అనేక అధిక్యతలు కల్పించాడు.
తన అలవాటు చొప్పున పౌలు అక్కడ ఒక స్థానిక యూదుల సమాజమందిరాన్ని వెదకి దానిలో బోధించడం ప్రారంభించాడు. మూడు విశ్రాంతి దినాలపాటు అతడు యూదులతో లేఖనాలను చర్చించాడు. వాగ్దానం చేయబడిన మెస్సీయ శ్రమలు పొంది మరణించి తిరిగి లేచాడని అతడు వారికి రూఢగాి వివరించాడు. యేసు జీవితం, మరణం, పునరుత్థానాల గురించి బోధించిన తరవాత అతడు లేచి, ‘‘నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి యున్నాడని’’ వారికి ప్రకటించాడు (అపొ.కా.17:3). అక్కడ ఉన్న కొందరు యూదులు, సమాజమందిరములో ఆరాధించే భక్తిగల గ్రీకు ప్రజలు, పేరుపొందిన స్త్రీలలో కొందరు అతని మాటలచేత ఒప్పించబడ్డారు. వారు పౌలు, సీలలతో చేరడం వలన అక్కడ థెస్సలోనిక సంఘం ప్రారంభమైంది. అతని బోధను అంగీకరించని యూదులు కూడా కొందరు అక్కడ ఉన్నారు. వారు పౌలు, సీలలు చేసినదానిని చూసి అసూయతో నిండిపోయారు. వారు ప్రజలను రెచ్చగొట్టి ఆ మిషనరీ బృందం బసచేసిన యాసోను అనే అతని ఇంటిపై దాడిచేశారు. పౌలును, సీలను ఆ ప్రజల ముందుకు లాక్కురావడానికి వెళ్ళిన వారికి యాసోను, కొందరు కొత్త విశ్వాసులు కనిపించారు. వారిని నగర అధికారుల ముందుకు ఈడ్చుకెళ్ళారు. అక్కడ మరింత అల్లరి జరగకూడదనే ఉద్దేశంతో ఆ నగరంలో జరిగిన ఈ గలాటా ఇంకోసారి జరగదు అనే భరోసాతో యాసోను, ఇతర సహోదరుల నుండి కొంత జామీనుతో హామీ పత్రాలు రాయించుకున్నారు. అదే రాత్రి థెస్సలోనిక విశ్వాసులు పౌలును, సీలను బెరయకు పంపించారు. వారు అక్కడ తమ పరిచర్యను కొనసాగించారు (అపొ.కా.17:1-9).
పౌలు బెరయ నుండి ఏథెన్సుకు వెళ్ళాడు. థెస్సలోనికయులను మళ్ళీ చూడాలని అతడు ఆశించాడు. ఇక ఎంతో కాలం కనిపెట్టలేక, అతడు థెస్సలోనిక విశ్వాసులను ప్రోత్సహించడానికి తిమోతిని వారి దగ్గరకు పంపించాడు (1థెస్స 3:2-4). థెస్సలోనిక సంఘం గురించి తిమోతి ఒక ప్రోత్సాహకరమైన నివేదికతో తిరిగి వచ్చాడు (3:6). తిమోతి నివేదికకు తన స్పందనగా పౌలు కొరింథు నుండి థెస్సలోనిక వారికి ఈ ఉత్తరం రాశాడు. అప్పటి అకయ ప్రాంతానికి అధిపతిగా ఉన్న గల్లియోను పేరుతో (అపొ.కా.18:12) తేదీలతో సహా లభించిన కొన్ని పురావస్తు రుజువులను, గల్లియోను అక్కడ ఉన్నప్పుడు పౌలు కొరింథును దర్శించిన సమయాన్ని కలిపి చూస్తే 1థెస్స పత్రికను క్రీ.శ.50 లేక 51లో రాశాడని నిర్థారణగా చెప్పవచ్చు. గలతీ పత్రికను తప్పిస్తే పౌలు రాసిన పత్రికల్లోకెల్లా బహుశా 1థెస్సలోనికయులకు రాసిన ఉత్తరం మొదటిది అని చెప్పవచ్చు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
థెస్సలోనిక సంఘం శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ వారు విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతున్నారని తిమోతి పౌలుకు వివరించాడు. సైద్ధాంతిక పరమైన కొన్ని అపార్థాలు వారి మధ్య ఉన్నప్పటికీ వారు ప్రేమతో, ఓపికతో క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తూ ప్రభువుకోసం పనిచేస్తున్నారు. సంఘాన్ని విశ్వాసంలో ప్రోత్సహిస్తూ, పరిశుద్ధత పొందడమే వారి విషయంలో దేవుని చిత్తం అని గుర్తు చేస్తూ, వారిలో అంత్యకాల సంభవాల గురించిన కొన్ని అపోహలను తొలగించడానికి పౌలు ఈ ఉత్తరం రాశాడు. 1థెస్స. పత్రిక నాలుగు ప్రధాన అంశాలను చర్చించింది.
పరిచర్యలో పౌలు నడవడి: పౌలు పరిచర్య రెండు అంశాలపై కేంద్రీకృతమై ఉంది – దేవుని వాక్యాన్ని వారికి అందించడం, వారితో తన ప్రాణాన్ని కూడా పంచుకోవడం (2:8). సువార్త కేవలం మాట రూపంలో మాత్రమే కాక శక్తితో, క్రియాత్మకంగా వారి దగ్గరకు వచ్చింది. పౌలు ఉద్దేశం అంతా దేవుణ్ణి సంతోషపరచడం (2:4; 4:1), థెస్సలోనికయుల క్షేమం విషయంలో తన శ్రద్ధను వెల్లడిరచడం (2:8). అతని సందేశం కపటమైంది, అపవిత్రమైంది, మోసయుక్తమైంది కాక అనింద్యమైందిగా (2:3,10) వారి దగ్గరకు వచ్చింది. అంతేకాక పౌలు పరిచర్యను తన ధనాపేక్షను కప్పిపెట్టుకోడానికి ఒక వేషంలాగా వాడుకోలేదు (2:5). ఇది అతడు తన జీవనం కోసం కష్టపడి పనిచేసి సంపాదించుకోవడంలో వెల్లడైంది (2:9).
హింసలు: థెస్సలోనిక సంఘం హింసల మధ్య ప్రారంభించబడిరది. ఆ కారణం చేత పౌలు ఆ నగరాన్ని విడిచి వెళ్లవలసి వచ్చినా, అతడు వెళ్ళిన తరవాత కూడా ఆ సంఘం ముందుకు కొనసాగింది (1:6; 2:14-15). ఇలాంటి ఇబ్బందుల వలన చెదరిపోవద్దనీ, ఎందుకంటే క్రైస్తవులకు శ్రమలు తప్పనిసరి అనీ పౌలు వారిని ప్రోత్సహించాడు (3:2-4).
పవిత్రీకరణ: ఒక వ్యక్తి క్రీస్తులో విశ్వాసముంచి పాపక్షమాపణను పొందడంతో రక్షణ కార్యం ముగిసిపోదు. దేవుడు థెస్సలోనికలోని విశ్వాసుల హృదయాలను పరిశుద్ధతలో అనింద్యులుగా నిలపాలన్నదే 3:13 లోని పౌలు ప్రార్థన. వారు జారత్వానికి దూరంగా ఉండాలనీ, ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నదే వారి విషయంలో దేవుని చిత్తం (4:1-12). పని విషయంలో తనను తానే ఉదాహరణగా చూపించుకుంటూ వారు కూడా తమ స్వంతకార్యాలను చేసుకోవాలనీ ఆ విధంగా మరొకరి మీద అనవసరంగా ఆధారపడకూడదనీ అతడు వారిని హెచ్చరించాడు (4:10-12; 5:14).
క్రీస్తు రెండవరాకడ: 1థెస్స పత్రికలోని ప్రతి అధ్యాయంలోనూ యేసు రెండవ రాకడ గురించిన ప్రస్తావన ఉంది. ‘‘ప్రభువు దినము’’ గురించిన నిర్దిష్టమైన వైఖరులు, సంఘటనలు, ప్రోత్సాహకాలు పేర్కొనడంతో బాటు క్రైస్తవులు దేవుని ఉగ్రత కోసం ఏర్పరచబడలేదనే భరోసా ఇవ్వబడిరది (5:9).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
క్రీస్తు రెండవ రాకడను అర్థం చేసుకోవడంలో థెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక దోహదం చేస్తుంది. ఈ సిద్ధాంతం విషయంలో ఉన్న కొన్ని అపోహలను సరిదిద్దడానికి పౌలు ఈ ఉత్తరం రాశాడు. ఆ ప్రక్రియలో క్రీస్తు తిరిగి రావడం మనకు నిజమైన నిరీక్షణను కలిగిస్తుందని అతడు బోధించాడు. క్రీస్తు రాకడ సమయంలో జీవించి ఉన్న క్రైస్తవులు మార్పు చెంది మరణం చూడకుండానే క్రీస్తును ఆకాశంలో ఎదుర్కొంటారు అనే విషయం 1థెస్స., 1కొరింథీ (15 అధ్యా.) పత్రికలు రెండిరటిలో మాత్రమే స్పష్టంగా రాసి ఉంది.
గ్రంథ నిర్మాణం
మొదటి శతాబ్దపు లేఖల్లో కనిపించే సాధారణ పద్ధతే థెస్సలోనికయులకు మొదటి పత్రికలో కూడా కనిపిస్తుంది: శుభాకాంక్షలు (1:1), కృతజ్ఞతలు (1:2-4), ప్రధానాంశాలు (1:5-5:22), వీడ్కోలు (5:23-28). అయితే ఈ ఉత్తరం నిర్మాణంలో సాధారణంగా పౌలు అలవాటైన ‘మొదట సిద్ధాంతం, తరువాత దాని కార్యాచరణ గురించిన హెచ్చరిక’ అనే పద్ధతిని పాటించలేదు. సిద్ధాంతం, కార్యాచరణ, ఈ రెండూ అటూ ఇటూ మారుతూ ఈ పత్రిక కొనసాగింది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”