పద్దెనిమిదవ శతాబ్దం నుండి 1తిమోతి, 2తిమోతి, తీతు పత్రికలను ‘‘కాపరి పత్రికలు’’ అని పిలవడం ప్రారంభించారు. ఈ మూడు పత్రికలను కలిపి ఒకే విభాగంగా పరిగణించడం సమంజసమే. ఎందుకంటే వాటి శైలిలో, పదజాలంలో, నిర్మాణంలో పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పౌలు తన సహపనివారిని ఉద్దేశించి రాసిన పత్రికలు కావడం వలన అతడు రాసిన పత్రికలన్నిటిలో ఇవి ప్రత్యేకంగా నిలుస్తాయి. కాపరి పత్రికలు సంఘ నిర్మాణానికి సంబంధించిన అంశాలను చర్చిస్తాయి. పౌలు ఇతర పత్రికల్లాగా సంఘాలను కాక కాపరి పాత్రల్లో పనిచేస్తున్న వ్యక్తులను ఉద్దేశించి ఇవి రాయబడ్డాయి. అదే సమయంలో ఇవి తమ స్వంత ప్రత్యేకతలు కలిగిన వేరు వేరు పత్రికలు అని కూడా మనం గుర్తించాలి. ఇవి ప్రాథమికంగా కేవలం సంఘ నిర్మాణం గురించీ లేక కాపరి పరిచర్య గురించీ (అనేకమంది అభిప్రాయానికి విరుద్ధంగా) మాత్రమే కాక సువార్తకు స్పందనగా మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో బోధించడానికి రాయబడ్డాయి.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ పత్రికలు ఒక్కొక్కదానిలో ఆరంభంలో ప్రస్తావించబడిన విధంగా ఈ మూడు పత్రికలనూ పౌలు రాశాడు (1తిమోతి 1:1; 2తిమోతి 1:1; తీతు 1:1-4). అయితే ఈనాడు చాలామంది పండితులు ఈ పత్రికలను రాసింది పౌలు కాదని భావిస్తున్నారు. దీనికి కారణం ఈ పత్రికలకూ, పౌలు రాసిన ఇతర పత్రికలకూ మధ్య పదజాలంలో, శైలిలో, వేదాంతంలో, అపొస్తలుని జీవితంలో ఏ సమయంలో ఈ పత్రికలు రాయబడ్డాయనే విషయంలో సందిగ్ధతలు. వాస్తవానికి శైలిలో, పదజాలంలో కనిపించే తేడాలు అంత సమస్యాత్మకం కాదు. ఎందుకంటే రచయితలు వివిధ రకాల గుంపులకు, వేరు వేరు పరిస్థితుల్లో రాస్తున్నప్పుడు వేరు వేరు పదజాలం వాడవచ్చు. ఈ ఉత్తరాల్లో పౌలు నేరుగా సంఘాలను కాక, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య పరిచర్య చేస్తున్న తన సహపనివారిని సంబోధిస్తున్నాడు. కాబట్టి వీటిలో విభిన్నమైన పదజాలం కనిపించడం సహజమే. అలాగే అప్పటి చారిత్రక పరిస్థితి గురించిన సాంప్రదాయిక ధోరణి సమంజసంగా, సమర్ధించుకోదగిందిగా ఉంది. కాబట్టి కొంతమంది నుండి వచ్చే వ్యతిరేకతను తోసిపుచ్చి ఈ కాపరి పత్రికలను పౌలు రాశాడనే వాదనకు గట్టి ఆధారాలున్నాయి.
నేపథ్యం: పౌలు ఈ మూడు పత్రికలను అపొస్తలుల కార్యములు గ్రంథం జరిగిన కాలం ముగిసిన తరవాత రాసి ఉంటాడు. పౌలు చెరసాలలో ఉండగా అపొస్తలుల కార్యములు గ్రంథం ముగిసింది. సాంప్రదాయికంగా నమ్మేదేమిటంటే పౌలు ఆ చెరనుండి విడుదల పొంది మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ప్రాంతంలో, బహుశా స్పెయిన్ దేశంలో (రోమా 15:22-29) కూడా తన పరిచర్యను కొనసాగించి ఉంటాడు. ఆ సమయంలో అతడు క్రేతు, మరికొన్ని ఇతర ప్రదేశాలు సందర్శించాడు. ఈ విధంగా అతని చెర అనంతర పరిచర్యలో 1తిమోతి, తీతు పత్రికలు రాసి ఉంటాడు.
కొన్ని అబద్ధ బోధలతో వచ్చిన సమస్యలను పరిష్కరించడం కోసం పౌలు తిమోతిని ఎఫెసులో విడిచిపెట్టి వచ్చాడు (1తిమోతి 1:3-4). క్రేతులో సంఘ పరిచర్య ప్రారంభించిన తరవాత తీతును అక్కడ విడిచి వచ్చాడు (తీతు 1:5). కాలక్రమంలో పౌలు మళ్ళీ చెరసాలలో ఉంచబడ్డాడు. ఇది అతని శిరచ్ఛేదనానికి దారితీసింది. అతని ఈ చివరి చెరసాల సమయంలో పౌలు మరొకసారి తనను దర్శించేందుకు రమ్మని తిమోతికి చెప్పడానికీ, త్వరలో తాను హతసాక్షిగా చనిపోతున్నాననే గ్రహింపుతో అతనికి తన చివరి హెచ్చరికలు ఇవ్వడానికీ 2తిమోతి పత్రికను రాశాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ ఉత్తరాలన్నిటిలో పౌలు యువకుడైన తన సహచరునికి తన విశ్వాసాన్ని ఆచరణాత్మకంగా జీవించాలనీ ఆ విధంగా చేయాలని ఇతరులకు కూడా బోధించాలనీ ఆజ్ఞాపించాడు. ఈ ప్రతి ఉత్తరమూ అబద్ధ బోధల గురించీ, సంఘంలో దాని ప్రమాదకరమైన ఫలితాల గురించీ ప్రత్యేకంగా హెచ్చరించింది. ఒక్కొక్క ఉత్తరంలో పౌలు సంఘం యెదుట తన ప్రతినిధిని సరైన సిద్ధాంత ప్రమాణానికి కట్టుబడి ఉండమనీ, సరైన సిద్ధాంతం సరైన జీవితానికి దారితీయాలనీ నొక్కి చెబుతూ రాశాడు.
1తిమోతి పత్రికలో అబద్ధ బోధను చురుకుగా ఎదిరించమని తిమోతిని హెచ్చరించాడు. అలాగే సంఘంలో ఎలాంటి నడవడి, లక్షణాలను కలిగి ఉండాలో కూడా వివరించాడు. తీతు పత్రిక కూడా దీనికంటే కొంచెం చిన్నదైనా ఇదే రకమైన బోధను కలిగి ఉంది. సంఘ సభ్యుల లక్షణాలను వివరించేటప్పుడు పౌలు వాటిని క్రీస్తు యొక్క పని వెలుగులో వారికి వెల్లడిపరిచాడు. పౌలు చివరి ఉత్తరమైన 2తిమోతి పత్రికలోని సందేశంలో దీనికి పూర్తి వ్యత్యాసం కనిపిస్తుంది. అది మరింత వ్యక్తిగతంగా, ఒకడు తన స్నేహితునికి రాస్తున్నట్టుగా ఉంది. పౌలు తాను వెళ్ళిపోయిన తరవాత తన పరిచర్యను కొనసాగించేవాడుగా తిమోతిని సిద్ధం చేస్తున్నాడు. ఈ ఉత్తరాల్లో అనేకమైన అంశాలు కనిపిస్తాయి.
సువార్త: పౌలు సువార్త సత్యం గురించిన చింతను వ్యక్తపరిచాడు. సువార్తను గురించి వివరించేటప్పుడు పౌలు వాడిన పదజాలం అతని ఇతర రచనల్లో కనిపించదు. అలాగని అవి ఈ ఉత్తరాలకే ప్రత్యేకం అని కాదు. సువార్తను అతడు ‘‘విశ్వాసము’’ అనీ (1తిమోతి 3:9; 2తిమోతి 4:7; తీతు 1:13-14), ‘‘సత్యము’’ అనీ (1తిమోతి 4:3; 2తిమోతి 2:24-26; తీతు 1:1), మంచి బోధ లేక హితవాక్యము (ఆరోగ్యకరమైన) అనీ (1తిమోతి 1:8-11; 2తిమోతి 1:13; 4:3; తీతు 1:9; 2:1), దైవభక్తి, హితవాక్యము అనీ (1తిమోతి 3:16; 6:3; తీతు 1:1) వర్ణించాడు. పౌలు ఈ పదజాలం వాడడానికి ప్రేరణ అతని విరోధులు వాడిన పదజాలమే కావచ్చు. వాటిని వాడుతూనే అతడు వాటిని మెరుగుపరచి వాటికి కొత్త అర్థాన్ని జోడిరచాడు.
క్రైస్తవ జీవితం: దేవుని రక్షణ కార్యానికి స్పందనగా పరిశుద్ధతను కనపరచాల్సిన ప్రాముఖ్యతను పౌలు నొక్కి చెప్పాడు (1తిమోతి 2:15; 4:12; 5:10; 2తిమోతి 1:9; తీతు 2:12). పరిశుద్ధత అనేది దాని ఉపయోగంలో సకారాత్మకమైన (తీతు 3:5), నకారాత్మకమైన (2తిమోతి 2:19) నడవడులను కనపరచాలని అతడు పిలుపునిచ్చాడు.
సంఘ పరిపాలన: సంఘం అనేది ఐక్యంగా ఉన్న ఒక కుటుంబం అని, తన పరిధిలో పరిచర్య చేస్తూ సేవా నిర్వహణ నిమిత్తం ఉన్న ఒక వ్యవస్థ అని ఈ ఉత్తరాల్లో సూచించబడిరది. సంఘం దేవుని కుటుంబం (1తిమోతి 3:5,15), విశ్వాసులు సోదరులు, సోదరీలు (1తిమోతి 4:6; 5:1-2; 6:2; 2తిమోతి 4:21). బీదలకు పరిచర్య చేసే బాధ్యతను చేపట్టాలనీ (1తిమోతి 5:16), సిద్ధాంత పరంగా, నైతిక సత్యానికి ఒక పునాదిగా (1తిమోతి 3:14-15) సేవచేయాలనీ పౌలు సంఘాన్ని హెచ్చరించాడు. సంఘ నాయకులను విచారణ చేసేవారు అని లేక పెద్దలు అని పిలిచారు (1తిమోతి 3:1-7; 5:17-19; తీతు 1:5-9). వారికి సహకరించడానికి పరిచారకులు ఉంటారు (1తిమోతి 3:8-13).
బైబిల్లో ఈ పత్రికల పాత్ర
వేదాంతపరంగా, నైతికపరంగా ఈ ఉత్తరాలు సంపన్నవంతంగా ఉన్నాయి. సిద్ధాంతం, నైతికత, నమ్మకం, నడవడి అనేవాటి మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టమైన విధంగా కనపరచడం ఇవి అందించే కీలకమైన తోడ్పాటు. ఈ ఉత్తరాల మౌలిక ఉద్దేశం సంఘ పరిపాలన గురించి సవిస్తరమైన సూచనలు చేయడం కాకపోయినా అవి ఈ అంశంపై కొంతమట్టుకు గమనించదగిన పరిజ్ఞానాన్ని అందించాయి. వీటిలో కనిపించే పై విచారణ చేసేవారి (1తిమోతి 3:1-16; తీతు 1:5-9), పరిచారకుల (1తిమోతి 3:8-13) లక్షణాల జాబితాలు కొ.ని. లో మరెక్కడా కనిపించవు.
గ్రంథ నిర్మాణం
ఈ మూడు ఉత్తరాలూ ఒక గ్రీకు పత్రికలో ఉండాల్సిన లక్షణాలన్నిటినీ కలిగి ఉన్నాయి. పౌలు రాసిన ఇతర ఉత్తరాలతో కొన్ని వ్యాకరణపరమైన వ్యత్యాసాలు కనిపించినప్పటికీ ఈ పత్రికలు నిర్ధిష్టమైన వ్యక్తులకు రాయబడ్డాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉత్తరాల నిర్మాణంలో కనిపించే ఒక ప్రత్యేకత ఎమిటంటే అవి సంఘ నాయకత్వంపై దృష్టి సారించిన విధానం.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”