థెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రికకు కొనసాగింపుగా పౌలు రాబోయే క్రీస్తు రాకడ వెలుగులో మనం ఏ విధంగా క్రైస్తవ జీవితం గడపాలి అనే విషయంలో మరిన్ని వివరణలు ఇవ్వడానికి ఈ రెండవ పత్రిక రాశాడు. క్రీస్తు రెండవ రాకడ సుదూర భవిష్యత్తులో ఉంది కాబట్టి థెస్సలోనికయులు స్థిరంగా నిలిచి ఇతరులకు ప్రయోజనకరమైన రీతిలో జీవించాలని పౌలు వారికి పిలుపునిచ్చాడు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: థెస్సలోనికయులకు రాసిన రెండవ పత్రికను రాసింది పౌలు అని చెప్పబడ్డాడు (1:1). దీని ప్రారంభ శుభాకాంక్షల్లో కూడా సిల్వాను, తిమోతిలు పేర్కొనబడ్డారు. అయితే ప్రాథమికంగా పౌలే దీనికి గ్రంథకర్త (3:17).
నేపథ్యం: 1థెస్స పరిచయంలోని చర్చను చదవండి. 2థెస్సలోనికయులకు రాసిన కాలం విషయంలో కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. ఇది బహుశా 1థెస్స పత్రిక రాసిన కొద్ది కాలం తరవాత కొరింథు నుండి సుమారు క్రీ.శ.50-51 లో రాసి ఉండవచ్చు. 1థెస్స ప్రారంభంలోని అభివాదంలో ఉన్నట్టుగానే (1థెస్స 1:1) దీనిలో కూడా పౌలు, సిల్వాను, తిమోతిలు ఒకేచోట పేర్కొనబడడం దీనిని సమర్ధిస్తుంది. దీనిని సమర్ధిస్తూ కనిపించే మరొక ఆధారం ఏమిటంటే దీనికి ముందుగా ఒక ఉత్తరం రాశాను అని చెప్పడం (2థెస్స 2:15). బహుశా అది థెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రికే కావచ్చు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
పౌలు ఈ ఉత్తరాన్ని థెస్సలోనిక సంఘ విశ్వాసులు శ్రమల మధ్య సత్యం నిమిత్తమై స్థిరంగా నిలిచి ఉండాలని ప్రోత్సహించడానికీ, అదే సమయంలో వారిని బాధించేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడని భరోసా ఇవ్వడానికీ రాశాడు (1:6-10; 2:13-15). చూస్తుంటే థెస్సలోనికయులు తాము అప్పటికే ప్రభువు దినములో ప్రవేశించామని భావిస్తున్నట్టు ఉంది (2:2). అది నిజం కాదనీ, ఎందుకంటే దానికి ముందు అంత్యకాల సంభవాల్లో ఇంకా కొన్ని నెరవేరవలసి ఉందనీ పౌలు వారికి భరోసా ఇచ్చాడు. అంతే కాక ‘‘ధర్మవిరోధి’’ ప్రత్యక్షపరచ బడకుండా ఏదో ఒకటి వానిని అడ్డగిస్తున్నదని చెప్పాడు (2:6-7). అసలు ప్రాథమికంగా ఈ ఉత్తరం రాయడానికి కారణం ఇదే కావచ్చు. థెస్సలోనిక సంఘంలో కొందరు పనిచేయడం మానివేశారనే వాస్తవం వారి అవగాహనా లోపం వారిని నిర్లక్ష్యానికి బద్ధకానికీ లోనయ్యేలా చేస్తున్నదని సూచిస్తుంది (3:10-11). ఈ పత్రిక అంత పెద్దదేమీ కాదు, ఇది మనకేమీ సంపూర్ణమైన క్రైస్తవ విశ్వాసం గురించిన స్పష్టమైన రూపురేఖలను అందించడంలేదు. అప్పటికి ఉన్న ఒక అవసరతను తీర్చడానికి అక్కడి స్థానిక పరిస్థితులపై దృష్టిసారిస్తూ పౌలు ఈ ఉత్తరం రాశాడు.
దేవుని గొప్పతనం: థెస్సలోనికయుల వంటి ప్రజలను దేవుడు ప్రేమించాడు కాబట్టే వారిని తన సంఘంలోకి తీసుకువచ్చాడు (1:4). ఆయన వారిని ఎన్నుకున్నాడు (2:13), వారిని పిలిచాడు (1:11-12; 2:14), వారిని రక్షించాడు. క్రీస్తు రెండవ రాకడ, తీర్పు దినంతో ముగిసే వారి అంతం వరకు వారి విషయంలో ఆయన సంకల్పం కొనసాగుతూనే ఉంటుంది. పౌలుకు ఎంతో ఇష్టమైన ఎన్నిక, పిలుపు అనే ఈ గొప్ప సిద్ధాంతాల గురించి తన ఈ ప్రారంభ పత్రికల్లోనే స్పష్టంగా వెల్లడి చేయగలగడం ఆసక్తిదాయకం. అలాగే దేవుడు తన విశ్వాసులను యోగ్యులుగా ఎంచడం (1:5,11), విశ్వాసం గురించి అతని బోధ (1:3-4,11; 2:13; 3:2) వెనుక నీతిమంతునిగా తీర్చబడడం అనే సిద్ధాంతాన్ని కూడా మనం గమనించవచ్చు.
క్రీస్తులో రక్షణ: సువార్తలో క్రీస్తులోని రక్షణ గురించి ప్రకటించబడిరది. అది క్రీస్తు సమస్తమైన దుర్మార్గాన్ని కూలదోసి, తనవారికి విశ్రాంతినిచ్చి, వారిని మహిమపరచడానికి తిరిగి వచ్చిన సమయంలో ముగింపుకు చేరుతుంది. ఈ గొప్ప దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు. శ్రమల పాలవుతున్న ప్రజలకు (2:16) కావలసిన అతి ముఖ్యమైన లక్షణాలైన ఆదరణ, నిరీక్షణలను ఆయన వారికి దయచేశాడు. తనద్వారా మారుమనస్సు పొందిన ప్రజల హృదయాలు ‘‘దేవుని ప్రేమ’’ వైపుకు మరల్చబడాలని అపొస్తలుడు ప్రార్థించాడు. (3:5). అది వారిపట్ల దేవుని ప్రేమను లేదా దేవునిపట్ల వారి ప్రేమను సూచిస్తుంది. బహుశా అతని ప్రాథమిక తలంపు వారిపట్ల దేవుని ప్రేమ గురించే అయినప్పటికీ ఆ నూతన విశ్వాసులలో ఆయనపట్ల ఒక పరస్పర ప్రేమను గమనించాడు. ప్రత్యక్షత గురించిన ప్రస్తావనలు పదే పదే కనిపిస్తాయి (1:7; 2:6,8). ఇతర చోట్ల ప్రస్తావించిన రీతిలో ఆ మాట ఇక్కడ వాడకపోయినా దేవుడు మన ఊహలకు మనల్ని విడిచిపెట్టలేదు అని అది జ్ఞాపకం చేస్తుంది. మనకెంతవరకు అవసరమో దానిని ఆయన ఇప్పటికే బహిర్గతం చేశాడు. ఈ అంత్యదినాల కోసం మరిన్ని ప్రత్యక్షతలను ఆయన మనకోసం దాచి ఉంచాడు.
రెండవ రాకడ: లోకంలోని సమస్త దుర్మార్గతను, మరి ముఖ్యంగా ‘‘ధర్మవిరోధి’’ని కూలదోయడం అనే దృక్పథంలో రెండవ రాకడ ఇక్కడ దృష్టించబడిరది. క్రీస్తు రాకడ ఒక ఘనమైన సంఘటనగా వర్ణిస్తూ అది దేవుణ్ణి ఎరగడానికి అంగీకరించక, సువార్తను తృణీకరించేవారికి తీర్పుదినంగా ఉంటుందనీ, విశ్వాసులకు అది విశ్రాంతిని, మహిమను తెస్తుందనీ (1:7-10) పౌలు స్పష్టం చేశాడు. అంతంలో దేవుడు, నీతి మాత్రమే విజేతలుగా నిలుస్తారు. సాతాను, దుష్టత్వం కాదు.
ప్రభువు దినం ఇంకా సంభవించలేదని పౌలు స్పష్టం చేశాడు. దానికి ముందుగా అనేక విషయాలు జరగాలి – ఉదాహరణకు, ‘‘విశ్వాస భ్రష్టత్వం’’ జరగాలి, ‘‘ధర్మవిరోధి’’ బహిర్గతం కావాలి (2:3). అయితే వీటిలో దేనిని గురించీ పౌలు వివరించలేదు. బహుశా పౌలు థెస్సలోనికయులతో ఉన్నప్పుడు వారితో చెప్పిన విషయం గురించి ఇక్కడ పేర్కొని ఉండవచ్చు. దురదృష్టవశాత్తూ అప్పుడతడు వారితో ఏమని చెప్పాడో మనకు తెలియదు. కాబట్టి దానిని మనకు మనం ఊహించుకోవాల్సిందే. ప్రభువు రాకడకు ముందు విశ్వాసంపై ఒక తిరుగుబాటు జరుగుతుందనేది క్రైస్తవ బోధలో ప్రసిద్ధి చెందిన అంశం (మత్తయి 24:10-14; 1తిమోతి 4:1-3; 2తిమోతి 3:1-9; 4:3-4).
జీవితం, పని: బద్ధకంగా, ఏమీ పని చేయకుండా సమయం గడుపుతూ పౌలు చేత ‘‘అక్రమముగా నడుచుకొనువారు’’ (3:6-12) అని పిలవబడిన వారిని గురించి చెప్పడానికి అతని దగ్గర చాలా విషయాలున్నాయి. వారు ఆ విధంగా ప్రవర్తించడానికి కారణం బహుశా వారు ప్రభువు రాకడ బహు సమీపంగా ఉంది కాబట్టి ఇక పనిచేయడంలో అర్థం లేదనీ, లేక తాము ఎంతో ‘‘ఆధ్యాత్మికమైన మనస్సు’’ గలవారమని భావించుకొని తాము ఉన్నతమైన సంగతులపై దృష్టిపెడుతున్నాము కాబట్టి ఇతరులు తమ అవసరాలు చూసుకుంటారులే అని భావించడమే. ప్రతి ఒక్కరూ తమ జీవనం కోసం పనిచేయాలని పౌలు వారిని హెచ్చరించాడు (3:12). క్రీస్తు రెండవ రాకడతో సహా ఏ సైద్ధాంతిక ఉద్ఘాటన అయినా క్రైస్తవులను పనినుండి దూరం చేయరాదు. పని చేయగలిగిన వ్యక్తులంతా తమ అనుదినాహారాన్ని తామే సంపాదించుకోవాలి. విశ్వాసులు తమ జీవనం కోసం పనిచేసుకుంటూ మంచి చేయడంలో విసుగుదల లేకుండా ఉండాలి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
2థెస్సలోనికయుల పత్రిక, మొదటి పత్రికలోని హింసలు, పవిత్రీకరణ, క్రీస్తు రెండవరాకడకు ముందు జరిగే అంత్యకాల సంభవాల గురించి మరింత విశదీకరించింది. ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే 2థెస్స పత్రిక అంత్యకాలంలో బహిర్గతమయ్యే ‘‘ధర్మవిరోధి’’ గురించీ, అతడు బయలుపడకుండా అడ్డగిస్తున్న దాని గురించీ వర్ణిస్తున్నది (2:1-12). విశ్వాసులు తమ అవసరాలకు సమకూర్చుకోవడం కోసం ఒక సక్రమమైన పని నియమం కలిగి ఉండాల్సిన అవసరత గురించిన సుదీర్ఘమైన చర్చను కూడా ఈ గ్రంథంలో చూడవచ్చు (3:6-15).
గ్రంథ నిర్మాణం
థెస్సలోనికయులకు రాసిన తన రెండవ ఉత్తరంలోని వాగ్ధోరణి మొదటి ఉత్తరంకంటే గమనించదగిన విధంగా ‘‘శాంతంతో’’ కూడి ఉంది. పౌలు తన మొదటి ఉత్తరంలో సువార్త విషయంలో థెస్సలోనికయులు అభివృద్ధి చెందుతున్న విషయంలో చాలా ఉత్సాహభరితంగా ఉన్నాడు. దానిలో అతడు సమాజ జీవనం గురించి ఒక ప్రశాంతమైన సలహాను వారికి అందించాడు (1థెస్స 5:12-22). ఈ రెండవ ఉత్తరంలో పౌలు థెస్సలోనిక విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితిని గురించి తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాడు. సమాజ జీవనం గురించి అతడు వారిని సూటిగా గద్దించాడు (2థెస్స 3:6-15). అతని ఇతర పత్రికల్లాగానే మొదట సైద్ధాంతిక భాగం దాని వెంబడి ఆచరణాత్మక ప్రబోధం అనే శైలిని మనం దీనిలో కూడా చూస్తాం.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”