“లేవీయులకు సంబంధించినది” అని అర్థమిచ్చే ఈ పుస్తకం పేరు సెప్టువజింట్ (పాత నిబంధనకు గ్రీకు అనువాదం) నుండి వచ్చింది. పంచకాండాలలో మూడవదైన ఈ పుస్తకం ప్రధానంగా యాజకుల విధులు, ప్రత్యక్షగుడారంలో సేవల గురించి తెలియజేస్తుంది. అయితే దీనిలో ఇతర కట్టడలు కూడా ఉన్నాయి. లేవీయకాండము మనకు ఆరాధనా నియమాలు, ఆచార సంబంధిత శుద్ధీకరణ కట్టడలు, నైతిక విధులు, పరిశుద్ధ దినాల గురించిన నియమాలు తెలియజేస్తుంది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: లేవీయకాండము అనే ఈ పుస్తకం గ్రంథకర్త ఎవరో సాంకేతికంగా తెలియదు. అయితే బైబిలు రుజువులు, యూదు, క్రైస్తవ సాంప్రదాయాలు దీనిని ధర్మశాస్త్రమునిచ్చిన మోషేకు ఆపాదించాయి (18:5; రోమా 10:5 తో పోల్చండి). లేవీయకాండములో దేవుని వాక్కు ప్రధానంగా అందుకున్నవాడు మోషే (1:1; 4:1). మరొకచోట తాను పొందిన ప్రత్యక్షతను మోషే గ్రంథస్తం చేశాడని పేర్కొన్నారు (నిర్గమ 24:4; 34:28; మార్కు 10:4-5; 12:19; యోహాను 1:45; 5:46). లేవీయకాండము గ్రంథకర్తకు ఈ గ్రంథంలో జరిగిన సంఘటనల గురించి బాగా తెలుసు. అతడికి సీనాయి అరణ్యం గురించి కూడా తెలుసు. అందువలన గ్రంథకర్త ఈ సంఘటనలకు ప్రధానసాక్షిగా ఉన్నాడు.
నేపథ్యం: ఇశ్రాయేలీయులు సీనాయి ప్రాంతానికి వచ్చి అక్కడనుంచి బయలుదేరే సమయానికి ఒక సంవత్సరకాలం గడిచింది (నిర్గమ 19:1; సంఖ్యా 10:11). ఆ సమయంలో, మోషే దేవునినుంచి నిబంధన పొందాడు, ప్రత్యక్షగుడారం నిర్మించాడు (నిర్గమ 40:17), లేవీయకాండము, సంఖ్యాకాండపు ప్రారంభ అధ్యాయాలలో గల అన్ని సూచనలను అందుకున్నాడు. నిర్గమకాండము 19 అధ్యాయం నుంచి లేవీయకాండము, సంఖ్యాకాండము 10:11 వరకు వివరించిన విషయాలన్నీ దీర్ఘమైన ఒకే వృత్తాంతం. ఈ సంఘటనలు కేవలం ఒక సంవత్సరంలోనే జరిగినా, నిర్గమకాండము నుంచి ద్వితీయోపదేశకాండము వరకు అధికభాగం ఈ సంఘటనలే నమోదు చేయడం గమనిస్తే మోషే పంచకాండాలు రాయడంలో సీనాయి ప్రత్యక్షతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చినట్లు అర్థమవుతుంది. లేవీయకాండము అంతటిలో ‘‘దేవుడు మోషేకు సెలవిచ్చినదేమనగా” అని పలుమార్లు పునరావృతమైన వ్యక్తీకరణ గమనిస్తే, ఇందలి సూచనలు దేవునినుండి నేరుగా వచ్చాయనీ, ఇవి మోషే తనకు తానుగా అల్లినవి కాదనీ నిస్సందేహంగా చెప్పవచ్చు (లేవీ 1:1; 27:1).
గంథ సందేశం, ఉద్దేశం
ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విడుదల పొందటం (నిర్గమ 12), ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన (నిర్గమ 20-24), సమావేశ మందిరం లేదా ప్రత్యక్షగుడారం నిర్మించిన (నిర్గమ 25-40) నేపథ్యంలో లేవీయకాండపు సందేశం, ఉద్దేశాలను అధ్యయనం చేయాలి. పాళెంలో గోత్రాలు విడిదిచేసిన అమరిక నడుమ దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య సూచనప్రాయంగా ప్రత్యక్షగుడారంలో నివసించాడు.
దేవుడు ఇశ్రాయేలీయులతో కలసి నివసించటానికి, ప్రజలు పరిశుద్ధమైన స్వభావం, నీతివంతమైన ప్రవర్తన కలిగి ఉండాలన్నది ఒక తప్పనిసరి ఆజ్ఞ (లేవీ 11:44-45; 19:2; ద్వితీ 23:14; 1పేతురు 1:15-16). లేవీయకాండములో ఇచ్చిన ఆజ్ఞలు ప్రాయశ్చిత్తం, శుద్ధీకరణాచారం ద్వారా ఈ పవిత్ర సంబంధం నిలబెట్టుకోవాలని ప్రజలకు సూచించాయి. బల్యర్పణలు, యాజకుల అభిషేకం, శుద్ధీకరణ కట్టడలు, పరిశుద్ధ జీవనానికి ఇచ్చిన నియమాల వంటివి, పాప క్షమాపణ, శుద్ధీకరణాచారాల ద్వారా దేవుని కనికరాన్ని ప్రజలకు వాస్తవ రూపంలో అనుగ్రహించాయి. దేవుడు వారి మధ్య నివసించి వారిని ఆశీర్వదించేటట్లు ఇశ్రాయేలీయులకు పరిశుద్ధతను నేర్పించడమే లేవీయకాండం ఉద్దేశం. ఈ గ్రంథ సందేశాన్ని ఐదు ముఖ్య పదాలు సంగ్రహంగా తెలియజేస్తాయి.
పరిశుద్ధత: లేవీయకాండములో ప్రధానాంశం దేవుని పరిశుద్ధత. యాజకులు “ప్రతిష్ఠింపబడిన దానినుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానినుండి పవిత్రమైనదానిని వేరుచేయడం” ప్రజలకు నేర్పించాలి (10:10). “పరిశుద్ధమైనది” అనేమాట దేవుని పరిశుద్ధ సన్నిధి కలిగిన లేదా అందు కోసం ప్రత్యేకించబడిన వ్యక్తులు (యాజకులు), ప్రదేశాలు (గుడారాలు) లేదా వస్తువుల (అర్పణలు) గురించి వివరిస్తుంది. ఆ విధంగా ప్రతి వస్తువు లేదా ప్రతివ్యక్తి కలిగి ఉండే పవిత్రత స్వాభావికంగా పవిత్రుడైన పరిశుద్ధ దేవునిపై ఆధారపడివుంటుంది. ప్రత్యేకమైన ఈ సంబంధం విషయంలో రాజీపడే ఏవిధానమైనా ఆ వ్యక్తిని లేదా వస్తువును అపవిత్ర పరుస్తుంది (లౌకికమైనదిగా పరిగణిస్తుంది). ప్రత్యేకంగా ఉంటూ (పరిశుద్ధత కోసం; 22:16) మానవులను “పరిశుద్ధపరచు” దేవున్ని అది నొప్పిస్తుంది.
శుద్ధత: “శుద్ధత”, “అశుద్ధత” అనేవి భౌతిక విషయాలకు సంబంధించిన ఆచరణా పదాలు. సాధారణస్థితి నుండి తొలగిపోయే ఏ వస్తువైనా అపవిత్రమైనదే. ఇందులో కొన్ని రకాల ఆహార పదార్థాలు, చర్మ వ్యాధులు, శారీరక స్రావాలు, కాలుష్యాలు ఉన్నాయి. పర్యవసానంగా, ప్రక్షాళన (“శుద్ధీకరణ”) ఆచారాలు దైనందిన జీవితంలో భాగంగా మారాయి. దేవుని దయలేకుండా దేవునితో తమ సంబంధం కొనసాగించలేని ప్రజల అపరిపూర్ణతను ఇవి నిత్యం జ్ఞాపకం చేస్తాయి.
బల్యర్పణలు: బల్యర్పణలు దేవునికి సమర్పించే పరిశుద్ధ బహుమతులు. అవి ప్రాయశ్చిత్తం కలిగించాయి. సహభోజనాలకు వెసులుబాటు, యాజకులకు ఆదాయం కలిగించాయి. దహనబల్యర్పణలు, నైవేద్యార్పణలు, సమాధాన బల్యర్పణలు అనేవి మూడురకాల స్వేచ్ఛార్పణలు. పాపపరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు తప్పనిసరి అర్పణలు. ప్రత్యేక సందర్భాలకు అన్వయించే బల్యర్పణల గురించి ప్రత్యేకమైన, అదనపు సూచనలు ఉన్నాయి.
ప్రాయశ్చిత్తం: “ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం చేయటం” (హెబ్రీ. కిప్పర్) అంటే “విడిపోయిన రెండు వర్గాల మధ్య సంధిచేయడం” అని అర్థం. వేదాంతపరంగా, దేవుడు నొప్పించబడ్డాడు గనుక అపరాధం చేసినవాడే ఆయనను శాంతపరచాలి (26:14-45). అపరాధం పరిష్కరించుకొని, క్షమాపణ పొందడానికి దేవుడే మార్గం ఏర్పరచాడు (4:20; 19:22). కేవలం ఆచారపరమైన విధానాలు కాక, నిజంగా పాపం గురించి పశ్చాత్తాపం, ఒప్పుకోలు అవసరం (5:5; 16:21; 26:40-42, హోషేయ 6:6; మీకా 6:8; మత్తయి 9:13).
యాజకులు: దేవుడు తన మందిరంలో సేవచేయడానికి అహరోను, అతని కుమారులను మాత్రమే యాజకులుగా నియమించాడు (8:30; నిర్గమ 28:1,41). ప్రత్యక్ష గుడారపు బాధ్యతను నిర్వహించే విషయంలో లేవీయులు యాజకులకు సహాయకులుగా ఉంటారు (సంఖ్యా 8:13,19,22). అపరాధియైన వ్యక్తి పక్షంగా (లేవీ 4:20), తన పక్షంగా (16:6,24) యాజకుడే ప్రాయశ్చిత్తం చేస్తాడు. దేవుని పరిశుద్ధత, మందిర పవిత్రత నిలబెట్టడానికి, ఇంకా ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి వారికి గల బాధ్యతను ‘‘చచ్చినవారికిని బ్రతికియున్నవారికిని మధ్యను నిలువబడి’’ అహరోను చేసిన విజ్ఞాపన కార్యం చక్కగా తెలియజేస్తుంది (సంఖ్యా 16:48).
బైబిలు గ్రంథంలో దీని పాత్ర
క్రైస్తవులు లేవీయకాండము సందేశం, ఉద్దేశం అపార్థం చేసుకున్నారు గనుక తరచు ఇది నిర్లక్ష్యం చేయబడిరది. అయితే యేసు అలా చేయలేదు. “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము” (19:18) అనే ఆజ్ఞను ఆయన రెండవ గొప్ప ఆజ్ఞగా నియమించాడు (మత్తయి 22:39). ఈ మాటలు మోషే ఇచ్చిన ఆజ్ఞల సారాంశమని అపొస్తలుడైన పౌలు భావించాడు (రోమా 13:9; గలతీ 5:14; యాకోబు 2:8 పోల్చండి). యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని, రక్షణ కార్యంలో ఆయన పాత్రను వర్ణించడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త లేవీయకాండపు లేఖనాలపైనే ఆధారపడ్డాడు. లేవీయకాండము అధ్యయనాల ద్వారా యేసుక్రీస్తు పట్ల గాఢమైన భక్తి, దేవుని ఎడల బలమైన ఆరాధన, అనుదిన క్రైస్తవ జీవనం గురించి మంచి అవగాహన కలుగుతాయి.
గ్రంథ నిర్మాణం
లేవీయకాండము ప్రాథమికంగా కొంత చారిత్రక కథనాలతో పాటు వివరించిన న్యాయవిధుల సమకూర్పు. లేవీయకాండములో న్యాయవిధులను రెండుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఆజ్ఞలు లేదా స్పష్టంగా స్థిరపడిన ధర్మశాస్త్రం. ఇందులో “నీవు చేయవలసినదేమనగా…” అనే అనుకూల ఆజ్ఞలు, “నీవు చేయకూడదు…” అనే ప్రతికూల ఆజ్ఞలు ఉన్నాయి. రెండవది సాధారణ ధర్మవిధులు. ఇవి ఫలానా ఫలానా విధంగా జరిగితే (“ఎవడైనా ఒకడు”) ఏం చేయాలి అని ఉదాహరణలతో వివరాలు తెలియజేసే ధర్మవిధులు. ఈ ధర్మసూత్రాలను పౌరన్యాయ సూత్రాలు, నైతిక సూత్రాలు, శుద్ధీకరణ ఆచరణ విధులుగా వర్గీకరించడానికి కొందరు పండితులు ప్రయత్నించారు, కానీ ఇశ్రాయేలీయులు ఇలాంటి వర్గీకరణ చేశారనే ఋజువు లేదు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”