సంఖ్యాకాండము (ఇంగ్లీష్‌లో “నంబర్స్”) అనే పేరును సెప్టువజింట్ లోని “అరిత్మొయ్” అనే పేరు నుండి తీసుకున్నారు. దీనికి ఆధారం 1-26 అధ్యాయాల్లో రెండుసార్లు జరిగిన సైన్యగణన. “అరణ్య మందలి” అనే అర్థాన్నిచ్చే బెమిద్బార్ అనే హెబ్రీ పేరు ఈ గ్రంథంలోని అధిక భాగపు భౌగోళిక నేపథ్యాన్ని వర్ణిస్తుంది: సీనాయి అరణ్య ప్రదేశంనుండి మోయాబు మైదానాల వరకు, యొర్దాను ఆవల నుండి యెరికో వరకు.
Read More
గ్రంథ రచనాకాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: సంఖ్యాకాండముతో సహా పంచకాండముల గ్రంథకర్త మోషే అని క్రైస్తవ పండితుల సాంప్రదాయక అభిప్రాయం. పంచకాండములు లోని ఇతర పుస్తకాల్లాగానే సంఖ్యాకాండములో కూడా రచయిత పేరు ప్రస్తావన లేదు, అయితే ఈ పుస్తకం ఆద్యంతమూ ప్రధాన పాత్ర మోషేదే. మోషే ఇశ్రాయేలీయుల ప్రయాణాల వివరాల్ని ఈ గ్రంథంలో నమోదు చేశాడు (33:2). “యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను” అనే పదజాలం గ్రంథంలో 31సార్లు కనబడుతుంది. లేఖికులు అనంతర కాలంలో కొన్ని భాగాల్ని ఈ గ్రంథానికి చేర్చి ఉండే సాధ్యత లేకపోలేదు. ఉదాహరణకు మోషే సాత్వికము (12:3), “యెహోవా యుద్ధముల గ్రంథము” ప్రస్తావన (21:14-15). ఏదేమైనా, మోషేనే ప్రధాన గ్రంథకర్త.
నేపథ్యం: నిర్గమకాండములో ప్రారంభమైన చారిత్రక వర్ణననే సంఖ్యాకాండము కొనసాగిస్తుంది. నిర్గమకాండము ముగింపు తర్వాత రెండవ నెల మొదటి తేదీనుండి సంఖ్యాకాండము వర్ణన ప్రారంభమవుతుంది (నిర్గమ 40:2; సంఖ్యా 1:1). అప్పటికి ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయలుదేరి ఒక సంవత్సరం గడిచింది. ఇశ్రాయేలీయుల అరణ్యప్రయాణాల్లోని తక్కిన 39 సంవత్సరాల కాలాన్ని, అంటే సీనాయి నుండి కాదేషు వరకు, చివరకు యొర్దాను నదికి తూర్పున ఉన్న మైదానాల వరకు సంఖ్యాకాండము వివరిస్తుంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
దేవుని సార్వభౌమాధికారం: సంఖ్యాకాండములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే ప్రధాన పాత్రధారి. భూమ్మీద ఉన్న మానవజాతుల్లోని సకల ప్రజలందరి మీదా ఆయనే సర్వాధికారి. దేవుని మార్గాలకు వ్యతిరేకంగా ఉన్న సోదెగాడైన బిలాము సైతం చివరకు దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చే సాధనంగా మారిపోయాడు. దేవుని ప్రజలు అవిధేయతతో తిరుగుబాటు చేస్తున్నప్పటికీ దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. వారు అవిధేయతతో వాగ్దానదేశాన్ని తిరస్కరించినప్పటికీ (13-14 అధ్యా.), దేవుడు ఇశ్రాయేలీయుల్లోని మలి తరాన్ని వాగ్దానదేశానికి చేర్చి తాను అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు.
దేవుని సన్నిధి: రాత్రివేళ అగ్నిస్తంభం, పగటివేళ మేఘస్తంభం, మనుషుల మధ్య ఆయన సన్నిధి సింహాసనానికి ప్రాతినిధ్యం వహించే నిబంధన మందసం, ఎక్కడికైనా తీసుకొని వెళ్లడానికి అనువుగా ఉన్న ప్రత్యక్షగుడారాలు దేవుని సన్నిధిని నిరూపించిన సోదాహరణలుగా ఉండి, ఇశ్రాయేలు దేవుడు ఏదో ఒక ప్రదేశానికి, ప్రాంతానికి, పట్టణానికి లేదా ఏదో ఒక పుణ్యస్థలానికి మాత్రమే పరిమితమైనవాడు కాడని సత్యప్రమాణంగా నిరూపించాయి.
దేవుని నైతిక నిర్మలత్వం, పరిశుద్ధత: దేవుడు నిర్మలుడు, పరిశుద్ధుడు. ఎవరు దేవునికి చెందినవారమని చెప్పుకుంటారో వారిలో కూడా ఆయన అదే నైర్మల్యాన్ని, పవిత్రతను కోరుకుంటున్నాడు. పంచకాండములలో, అందులోని సంఖ్యాకాండములో కూడా ఇదే ప్రధాన అంశం.
దేవుడు, దైవప్రత్యక్షత: దైవప్రత్యక్షతను సూచించే ‘‘యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను’’ అనే మాటలు గ్రంథనిర్మాణానికి ఊతంగా నిలిచిన చట్రం. దైవప్రత్యక్షతలో ప్రధాన మానవ పాత్రధారి మోషే. దేవుడు తాను వెల్లడి చేయాలనుకున్న ఉద్దేశాన్ని ఏ విధంగానైనా వెల్లడి చేసే శక్తి గలవాడనీ, చివరకు గాడిద చేతనైనా లేదా సోదెగాడి చేతనైనా దానిని సాధించగల శక్తిమంతుడని సంఖ్యాకాండము తెలియజేస్తుంది.
వాగ్దానం, నెరవేర్పు: అబ్రాహామునుండి గొప్ప జనాన్ని పుట్టిస్తాననీ (ఆది 12:2), కనానీయులు అమోరీయులు నివసించే దేశాన్ని అతని సంతానానికి ఇస్తాననీ (ఆది 15:1, 8-21; 17:8) దేవుడతనితో వాగ్దానం చేశాడు. సంఖ్యాకాండములోని ఈ రెండు జనగణనలు దేవుని వాగ్దానాల్లో మొదటిదాని నెరవేర్పును తెలియజేస్తున్నాయి. యొర్దాను నది కవతల ఉన్న ప్రాంతాన్ని రెండున్నర గోత్రాలకు పంచి ఇవ్వడంలో దేశం గురించిన వాగ్దాన నెరవేర్పు మొదలు కావడం కనబడుతోంది. దేవుడు ఇశ్రాయేలీయుల్లోని మలి తరాన్ని వాగ్దానదేశంలోకి రప్పించి తన రెండవ వాగ్దానం విషయంలో తన విశ్వాస్యతను నిరూపించుకున్నాడు (సంఖ్యా 15:1-21; 27:1-23; 36:1-12).
దేవుని విశిష్టత, ఆయన సాటిలేనితనం: ఇశ్రాయేలు దేవుడు ఏకైక సత్యదేవుడు, కాబట్టి మనుషుల భయభక్తులు ఆయనకు మాత్రమే చెందాలి. ఇతర దైవాల్ని, విశ్వంలోని భౌతిక మూలకాల్ని, ప్రకృతిశక్తుల్ని ఆరాధించడాన్ని ఆయన సహించడు. ఆయన మానవజ్ఞానానికి అందనివాడు, ఆయనకూ మానవనైజానికి పోలిక లేనే లేదు (23:19). దేవుడనుమతించని చోట ఆయనను ఆరాధించే స్థలాలు, ఇశ్రాయేలీయేతర మతకర్మకాండలు వాటికి సంబంధించిన వస్తువులు రూపాలు, కొన్ని ఆరాధనా పద్ధతులు సహా దేవునికి ఏ ప్రతిరూపాన్నైనా చేసుకొనడం ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారం నిషిద్ధం. ఇశ్రాయేలు ప్రజలు అతిక్రమంలోకి జారిపోయి శిక్షార్హులయ్యే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండునట్లు విగ్రహారాధనకు సంబంధించిన ఇటువంటివన్నీ ఇశ్రాయేలు దేశంలో నుండి తొలగించబడాల్సి ఉంది.
దైవారాధనలోని ఆచార వేడుకలు: సంఖ్యాకాండములోని తొలి అధ్యాయాల్లో (1-7) దైవారాధన, దానికి సంబంధించిన ఆచార వేడుకల చిత్రీకరణ కనబడుతుంది. ఇవి యెహోవాకు ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సామరస్యాన్ని తెలియజేస్తున్నాయి. యెహోవా పట్ల వీరి భయభక్తులు దేశంలో పాడిపంటల సమృద్ధికి కారణమవుతాయనే వాగ్దానాన్ని కొనసాగిస్తూ, వీరు దేశాన్ని స్వాధీనపర్చుకొని తమ గోత్రస్వాస్థ్యాల్లో స్థిరపడినప్పుడు దేవునికి అర్పించే బలులు, అర్పణలు ఆ వాగ్దానానికి ప్రతిఫలమవుతాయి (15:1-21; 28:1-29:40). ‘‘మేఘ కీర్తన’’ (9:17-23), ‘‘మందసం యెదుట యుద్ధగీతం’’ (10:35-36)లతో సహా గ్రంథమంతటా పలుచోట్ల అనేక గీతాలున్నాయి. యాత్రికులైన ఇశ్రాయేలీయుల భక్తిపూర్వక ఆరాధనలోని నియమిత అంశాల గురించి కూడా చిత్రీకరణ కనబడుతుంది – అయితే ఇది పలుచోట్ల వారు ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించని ప్రతికూల సందర్భాల్లో, పస్కాను (9:13) విశ్రాంతిదినాన్ని (15:32-41) ఆచరించడంలో విఫలమైన సందర్భాల్లో (9:13), భక్తి లోపించిన యాజకుల మీదికీ, వారికి మద్దతుగా నిలిచినవారి మీదికీ శిక్ష వచ్చిన సందర్భంలో (16-17 అధ్యా.) మనం చూడగలం. దేవుణ్ణి ఆరాధించడం, ఆచార వేడుకలను పాటించడం కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైనవి కాదు. ఇశ్రాయేలీయులకు, పరదేశులకు ఒకే ఆజ్ఞ వర్తిస్తుందని తెలియజేసే పలు వాక్యభాగాలున్నాయి. పరదేశులు ఏకైక నిజదేవుని ఆరాధనలో ఇశ్రాయేలీయులతో కలిసి పాల్గొనవచ్చు. అయితే ఇందుకు వారు ఆయన ఆజ్ఞలకు కట్టడలకు విధేయత చూపించడం అవశ్యం (9:14).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ఇశ్రాయేలీయుల అవిశ్వాసం పట్ల దేవుడెలా ప్రతిస్పందించాడో సంఖ్యాకాండము మనకు తెలియజేస్తుంది. మన అవిధేయతకు కూడా పర్యవసానాలుంటాయి, అయితే దేవుని కృప నిలిచి ఉంటుంది, ఆయన విమోచనా ప్రణాళికలో, మనపట్ల ఆయన ఉద్దేశాల్లో ఏ మార్పూ ఉండదు. క్రైస్తవజీవితంలో విధేయతకున్న ప్రాముఖ్యతను సంఖ్యాకాండము మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. దేవుడు గతంలో జరిగించిన చర్యల నుండి మనం నేర్చుకొనవలసి ఉన్నామని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు (రోమా 15:4; 1కొరింథీ 10:6,11).
గ్రంథ నిర్మాణం
సవాలుకరంగా నిలిచే విశ్వాస్యత గురించిన సందేశాల్ని సంఖ్యాకాండము ప్రతిబింబిస్తోంది. గ్రంథంలో పదే పదే కనిపించే ఏడు ఆవృతాలున్నాయి, ఇవి: (1) చారిత్రక నేపథ్యం, (2) ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు వారి నాయకుల వివరాలు, (3) యాజకులకు, లేవీయులకు సంబంధించిన విషయాలు, (4) విశ్వాస సమాజం యొక్క నైతికస్వభావాన్ని నిర్వచించే ఆజ్ఞలు.
సాహిత్య విన్యాసాల్లోకి చలనాత్మకంగా అల్లిన వాస్తవ సంఘటనల్ని ధర్మశాస్త్రంలోని ఈ గ్రంథం ప్రధానంగా వర్ణిస్తోంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”