ఆదికాండం గ్రంథం బైబిల్లో ఆరంభాలను గూర్చి చెప్పే గొప్ప పుస్తకం. హెబ్రీ, గ్రీకు భాషలలో దాని పేరుకున్న అర్థం ప్రకారం (హెబ్రీ. ‘బెరెషిత్’, “ఆదియందు”, 1:1 ఆధారంగా; గ్రీకు ‘గెనెసియోస్’, “ఉత్పత్తి”, 2:4 ఆధారంగా), మన అనుదిన ఉనికిని రూపుదిద్దే విశ్వ సృష్టి, భూమి, చెట్లు, జంతువుల ఆరంభం; మానవులు, వివాహం, కుటుంబ వ్యవస్థ, దేశాలు, పరిశ్రమలు, కళాత్మక వ్యక్తీకరణ, మతాచారాలు, ప్రవచనం, పాపం, ధర్మశాస్త్రం, నేరం, వివాదం, శిక్ష, మరణం మొదలైనవి, ఇంకా అనేకానేక సత్యాల ఆరంభాలను మనకు వెల్లడి చేస్తుంది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు గ్రంథకర్త: క్రైస్తవ్యం ఆరంభం కాకముందునుండి, ఆదికాండంతోపాటు పంచకాండములు (తోరా) అనే ఐదు పుస్తకాల రచన మోషేకు ఆపాదించబడిరది. మోషే క్రీ.పూ. రెండవ సహస్రాబ్దిలో జీవించిన సంపన్న ఐగుప్తీయ నేపథ్యంనుండి వచ్చిన అత్యంత ప్రభావవంతమైన ఇశ్రాయేలీయుల నాయకుడు. సాంకేతికంగా ఆదికాండం రాసినది ఎవరో స్పష్టంగా లేకపోయినా, పాత, కొత్త నిబంధనలు మోషేను తోరా రచయితగా ఏకగ్రీవంగా అంగీకరిస్తాయి (యెహో 8:35; 23:6; 1రాజులు 2:3; 8:9; 2రాజులు 14:6; 23:25; 2దిన 23:18; 25:4; 30:16; 34:14; 35:12; ఎజ్రా 3:2; 6:18; నెహెమ్యా 8:1; 9:14; దాని 9:11,13; మలాకీ 4:4; మార్కు 12:19,26; లూకా 2:22; 20:28; 24:44; యోహాను 1:17,45; 7:19; అపొ.కా.13:39; 15:21; 28:23; రోమా 10:5; 1కొరింథీ 9:9; హెబ్రీ 10:28). అదే సమయంలో, ప్రాచీనకాలానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న సంపాదకీయ మార్పులు వాక్యభాగంలోకి చొప్పించబడ్డాయని ఆదికాండంలో ఆధారాలు సూచిస్తాయి. ఉదాహరణకు- న్యాయాధిపతుల కాలంలో (న్యాయాధి 18:29) పేరుపెట్టబడిన “దాను” అనే పట్టణ ప్రస్తావన (14:14), ఇశ్రాయేలులో రాజులున్నారని ఊహించే మాటలు ఉపయోగించడం (ఆది 36:31). నేపథ్యం: తోరా (ధర్మశాస్త్రం అనే మాటకు హెబ్రీ పదం), క్రీ.పూ. రెండవ శతాబ్దం వరకు ఒకే పుస్తకంగా ఉండేది. క్రీస్తు పుట్టుకకు కొంతకాలం ముందు, తోరా ఐదు వేర్వేరు పుస్తకాలుగా విభజించబడి, తరువాతి కాలంలో ‘పంచకాండాలు’ (అక్షరార్థంగా, ఐదు నాళికలు) అని పిలువబడిరది. తోరాలోని మొదటి పుస్తకమైన ఆదికాండం, సార్వత్రిక మానవజాతి చరిత్ర, అలాగే ఇశ్రాయేలీయుల పితరుల చరిత్ర అందిస్తుంది. మొదటి భాగం (అధ్యా.1-11) మానవాళి అంతా ఒకే దంపతుల సంతానమై, పాపులుగా మారారు అని చూపించే సామాన్యంగా “ఆదిమ చరిత్ర” అని పిలిచే సాధారణ చరిత్రగా ఉంది. రెండవ భాగం (అధ్యా.12-50), దేవుడు అబ్రాహాము, అతని సంతానమైన ఇస్సాకు, యాకోబు, అతని 12 మంది కుమారులతో దేవుడు చేసిన నిబంధనపై దృష్టిపెడుతూ, “పితరుల చరిత్ర” అని సామాన్యంగా పిలువబడే మరింత నిర్దిష్టమైన చరిత్రను కలిగి ఉంటుంది. అబ్రాహాము సంతానం ద్వారా మానవాళిని విడిపించి, ఆశీర్వదించే దేవుని ప్రణాళికను ఆదికాండం వివరిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉండడానికి నడిపించబడిన సంఘటనలతో ఆదికాండం ముగుస్తుంది. గ్రంథ సందేశము, ఉద్దేశము సృష్టి: దేవుడు సర్వాధికారియైన ప్రభువు, సర్వసృష్టికి కర్త. దేవుడు శూన్యమునుండి సమస్తమును సృజించాడు. అంతకు మునుపు పదార్థమేదీ లేదు. ఆయన సృష్టికర్తయే గానీ, హస్తకళాకారుడు కాదు. ఆయనకు అనంతమైన శక్తి ఉన్నదనీ, సమస్తంపై సంపూర్ణ అధికారం ఉందనీ ఇది సూచిస్తుంది. సృష్టిక్రమం నుండి ఆయన వేరుగా ఉన్నాడు, అందువల్ల సృష్టించబడిన దానిలోని ఏదీ దేవునికి కొనసాగింపు కాదు. దేవుడు సృష్టించినదంతా మంచిది, ఎందుకంటే ఆయన మంచివాడు, ఘనమైనవాడు. దేవుడు ప్రభువైయుండి, తన సృష్టిలో జోక్యం చేసుకుంటూ సర్వాధికారిగా ఉన్నాడు. మానవ చరిత్ర ఎంత సంపూర్ణంగా దేవుని స్వాధీనంలో ఉన్నదంటే, మనుష్యుని అత్యంత దౌర్భాగ్యమైన క్రియలను కూడా ఆయన తన మేలుకరమైన ఉద్దేశాలుగా మార్చగలడు (50:20). మానవ జీవితం: ఆదాము, హవ్వలు, మిగిలిన సృష్టికి భిన్నంగా, దేవునితో సహవాసం కలిగివుండటానికి, ఆయన పోలికలో సృజింపబడ్డారు. మానవులు విరుద్ధ స్వభావం గలవారు. ఒక పక్క వారు దేవుని సృష్టికి తలమానికం లాగా దేవుని స్వరూపమందు సృజించబడి (1:26-27) తమ పరిధిలో ఉన్న సృష్టిక్రమమంతటి మీద దేవునివంటి అధికారం కలిగి వున్నారు (1:28-29; 9:1-3). మరొకపక్క, దేవునిద్వారా తమకు అనుగ్రహింపబడిన వనరులు, సామర్థ్యాలను ఆయన నియమాలను ఉల్లంఘించే విధానాలలో వాడి (2:17; 3:6), ఇతర మనుష్యులను బాధించే పాపులుగా కూడా ఉన్నారు (3:8-11; 6:5,11-12). అయినప్పటికీ, తమ జీవితకాలంలో మనుష్యులు తన నియమాలు అనుసరించాలని దేవుడు ఆశిస్తూ (4:7), తన మార్గాలను అనుసరించి జీవించేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు (6:8-9; 39:2,21). ప్రతి మానవ జీవితాన్ని ఆశీర్వదించడానికి దేవుడు వ్యక్తుల ద్వారా పనిచేయాలని ఆశిస్తున్నాడు (18:18; 22:18; 26:4). ఏది ఏమైనా, పాపాన్ని బట్టి మనుష్యులందరూ మరణిస్తారని ఆదికాండం బోధిస్తుంది (2:17; 3:19; 5:5,8,11). మానవులందరు దేవుని స్వరూపంలో సృజించబడినందున, ఏ వ్యక్తి గాని, ఏ జాతిగాని ఇతరులకంటే ఉన్నతులు కాదు. మానవులు సమాజముగా జీవించడానికి సృజించబడ్డారు. సమాజజీవితంలో అత్యంత ప్రాథమికమైనది కుటుంబం: ఒక భర్త (పురుషుడు), ఒక భార్య (స్త్రీ), వారి పిల్లలు. పాపం: చెడు, పాపం దేవునినుండి వచ్చినవి కావు. ఆదాము హవ్వలు నిష్కల్మషులుగా, ఎంచుకొనే సామర్థ్యం గలవారిగా సృజించబడ్డారు. చరిత్రలోని ఒక నిర్దిష్టమైన చోట, ఒక నిర్దిష్ట సమయంలో పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఆదాము, హవ్వలు దేవునికి అవిధేయత చూపడానికి స్వేచ్ఛగా ఎంచుకుని, నిర్దోషత్వంనుండి పడిపోయి, తమ స్వేచ్ఛను కోల్పోయారు. వారి పాపస్వభావం ప్రతి మనుష్యునికీ ప్రాకింది. పాప ఫలితం, భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా మరణానికి కారణమైంది. పాపం లోకాన్ని వేదనకు, పోరాటానికి నడిపించింది. నిబంధన: ఆదికాండం సంబంధాల వృత్తాంతం, ముఖ్యంగా దేవునితో నిబంధనలలో స్థాపించబడిన సంబంధాల వృత్తాంతం. ఈ నిబంధనలు లేఖనాలన్నిటిని అర్థం చేసుకోవడానికి ఐక్యపరచే సూత్రాన్ని ఇస్తూ, దేవునికి, మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తాయి. ఆ సంబంధానికి కేంద్రనం “వారు నా ప్రజలై యుందురు నేను వారికి దేవుడనై యుందును” అనే మాటల్లో కనిపిస్తుంది (యిర్మీయా 32:38తో ఆది 17:7-8; నిర్గమ 6:6-7; లేవీ 26:12; ద్వితీ 4:20; యిర్మీయా 11:4; యెహె 11:20). అబ్రాహాముతో దేవుని నిబంధన ఆదికాండంలోను, మొత్తం బైబిలంతటిలోను ఒక పెద్ద సంఘటన. దేవుడు అబ్రాహామును ఊరునుండి పిలిచి కనానుకు వెళ్ళమన్నాడు. అతనిని గొప్పజనముగా చేస్తానని, చివరికి వారిద్వారానే సమస్త జనమును ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు (ఆది 12:1-3). ఆది 22:18లో దేవుడు తన వాగ్దానాన్ని మరలా చెబుతూ, అబ్రాహాము సంతానం (హెబ్రీ. జెరా) ద్వారానే ఒకానొకరోజున సమస్తజనులు ఆశీర్వాదం పొందుతారని అదనంగా చేర్చాడు. “సంతానము” అనే ఏకవచనాన్ని పౌలు క్రీస్తుకు ఆపాదించాడు (గలతీ 3:16). అబ్రాహాము ప్రవచనాత్మక సంతానమైన క్రీస్తుద్వారా, అబ్రాహాము నిబంధనా ఆశీర్వాదాలు ప్రతి జనాంగమునకు లభిస్తాయి. బైబిల్లో ఈ గ్రంథం పాత్ర లేఖనంలో మనం చదివే, అనుభవించే సమస్తానికి ఆదికాండం పునాది వేస్తుంది. మనం ఎక్కడనుండి వచ్చామో, మనమిప్పుడు ఉన్న పతనమైన స్థితిలోనికి ఎలా చేరామో, మన పక్షంగా దేవుని కృపాకార్యం ఎలా ఆరంభమైందో మనం ఆదికాండం ద్వారానే అర్థం చేసుకుంటాం. మానవాళి కోసమైన అసలైన ఉద్దేశాన్ని ఆదికాండం మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా ఇశ్రాయేలుతో స్థాపించబడిన దైవ నిబంధనను మనం అర్థం చేసుకోవడానికి ఆదికాండం పునాది వేస్తుంది. మానవాళి, పాపం, దేవునితో నిబంధనా సంబంధం మొదలగువాటి ఆరంభాల వృత్తాంతాలు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకోవడానికి ఇశ్రాయేలీయుల సమాజానికి సహాయపడ్డాయి. గ్రంథ నిర్మాణం ఆదికాండం ముఖ్యంగా వివరణాత్మకమైన ఒక వృత్తాంతం. వృత్తాంతపు దృక్కోణంనుండి చూస్తే, దేవుడు ఒక్కడే బైబిల్లో నిజమైన కథానాయకుడు. ఆదికాండం ఆయనను పరిచయం చేసే ప్రత్యేక భాగ్యాన్ని పొందింది. దేవుడే ఈ పుస్తకంలోని మొదటి క్రియాపదానికి నామవాచకం. ఈ గ్రంథంలో బైబిల్లోని మరి ఏ వ్యక్తికన్నా ఎక్కువసార్లు ఆయన పేరే పేర్కొనబడిరది. మొదటి 11 అధ్యాయాలలోని విషయం, పితరుల కథలతో కూడిన అధ్యా.12-50 లోని విషయానికి భిన్నమైంది. ప్రాథమిక భాషా ప్రయోగంగా “వారి వంశావళి ఇదే” అనే సులువైన మాటలు వాడబడ్డాయి. ఆ మాటలకు కేవలం “వంశం” అని మాత్రమే అర్థం కాదు గాని, చెబుతున్న వృత్తాంతానికన్నా ఎక్కువ విశాలమైన అర్థం ఉంది. ప్రాచీన సమీప మధ్యప్రాచ్య రచనలలో ఇది సామాన్యమైన అలవాటు. ఈ మాటలు ముందున్న వృత్తాంతంలోని ముఖ్యమైన వ్యక్తికి, తరువాతి వృత్తాంతంలో రాబోయే ముఖ్యమైన వ్యక్తికి మధ్య బంధంలా పనిచేసేది. ఆదికాండం చారిత్రాత్మక వంశావళి అని వర్ణించవచ్చు. అది సృష్టిని, మానవ చరిత్రను అవిచ్ఛిన్నంగా కలిపివుంచింది.