ఈ గ్రంథంలో ప్రధాన పాత్రధారి, ప్రసంగికుడు అయిన వ్యక్తి పేరుతోనే యోబు గ్రంథం పేరు వచ్చింది. ఇది యోబు తన సమస్తాన్నీ కోల్పోయిన తరువాత తన శ్రమలకు కారణం ఏమిటి అనే విషయాల గురించిన చర్చల వృత్తాంతం. దీనిలో అంతిమంగా దేవుని మాటే నిలిచింది, యోబు కోల్పోయిన సమస్తాన్నీ దేవుడు రెండంతలు అధికముగా (42:10) అతనికి తిరిగి సమకూర్చాడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: యోబు గ్రంథ రచయిత ఎవరో తెలియదు. అయితే అతడు చాలా తెలివైన వ్యక్తి, అతని జ్ఞానం ఆకాశాన్నీ (22:12; 38:32-33), భూమినీ (26:7-8; 28:9-11; 37:11,16) చుట్టివచ్చింది. అతని జ్ఞానం దేశ విదేశాలను దాటి (28:16,19), అనేక రకాల వస్తువులను గురించీ (6:19), వివిధ రకాల వృత్తులను గురించీ (7:6; 9:26; 18:8-10; 28:1-11) వివరించింది.
అతనికి వృక్షజాతుల గురించీ (14:7-9), జంతువుల గురించీ (4:10-11; 38:39-39:30; 40:15-41:34) విస్తారమైన పరిచయం ఉంది. అతడు ఒక జ్ఞాని. పారంపర్య జ్ఞానం గురించి తెలిసినవాడు (6:6-7; 17:5; 28:12,28), అన్నిటికీ మించి అతడు ఆధ్యాత్మిక సున్నితత్వం గలిగినవాడు (1:1,5,8; 2:3; 14:14-15; 16:11-21; 19:23-27; 23:10; 34:26-28; 40:1-5; 42:1-6). దేవుని నిబంధనా నామమైన ‘‘యెహోవా’’ అనే పదాన్ని పదే పదే వాడడం బట్టి అతడు తప్పకుండా ఇశ్రాయేలీయుడే అయి ఉంటాడు అని చెప్పవచ్చు.
నేపథ్యం: యోబు చరిత్ర పితరుల కాలం నాటిది. ఆ కాలంలో ఆస్థిని వారు కలిగి ఉన్న పశుసంపదతో, దాసదాసీల సంఖ్యతో కొలిచేవారు. ఇతర పితరుల కుటుంబ పెద్దల్లాగా యోబు కూడా తన కుటుంబం కోసం బలులు అర్పించడంతో సహా యాజకుని బాధ్యతలు నిర్వహించాడు. పితరుల లాగానే యోబు కూడా 100 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం జీవించాడు. భౌగోళికపరంగా ఈ వృత్తాంతం ఉత్తర అరేబియా ద్వీపకల్పంలో, తరచుగా ఎదోము అని పిలవబడిన ఊజు అనే దేశంలో సంభవించింది (1:1). యోబు ముగ్గురు స్నేహితులు, యువకుడైన ఎలీహు కూడా దక్షిణాన ఉన్న ఎదోముతో సంబంధాలు కలిగి ఉన్నారు (2:11; 32:2,3 నోట్సు చూడండి). యోబు నేపథ్యం పితరుల కాలం నాటికి చెందినదైనా దాని రచనాకాలం తెలియలేదు. యూదుల సంప్రదాయం ప్రకారం యోబు గ్రంథం మోషే కాలంలో రాయబడిరదని భావిస్తారు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
జీవితంలోని ప్రతి సందర్భంలో, అత్యంత క్లిష్ట పరిస్థితులతో సహా సార్వభౌముడు, నీతిమంతుడు అయిన దేవుడు చాలినవాడు, నమ్మదగినవాడు అని యోబు గ్రంథం వెల్లడిపరిచింది. ఈ సత్యంతో బాటు యోబు గ్రంథంలో అనేక ఇతర సందేశాలను మనం చూడగలం.
గుణగణాలు: ఈ గ్రంథంలోని చర్చలో ఎక్కువభాగం సరైన నైతిక విలువలను ప్రతిబింబించే నడవడి చుట్టూ పరిభ్రమిస్తుంది . ఒక మంచి నడవడి గలిగిన వ్యక్తిగా యోబు పరిచయం చేయబడ్డాడు (1:1). దేవుడు కూడా అతని స్థిరమైన, నిందారహితమైన వ్యక్తిత్వం గురించి సాక్ష్యమిచ్చాడు (1:8, 2:3). యోబు స్థితి గురించిన చర్చ ప్రారంభంలో ఎలీఫజు మాట్లాడుతూ అతని నిందారహితమైన వ్యక్తిత్వం అతనికి ప్రయోజనకరం కావచ్చు అన్నాడు (4:7). అయితే బిల్దదు ఆ విషయంలో తటపటాయించాడు (8:6,20). ఆ తరవాత ఈ ఇద్దరు వ్యక్తులూ ఏ వ్యక్తీ సంపూర్ణంగా పవిత్రుడుగా ఉండలేడు అని ప్రకటించారు (15:14-15; 25:4-5). యోబు మాత్రం తన నడవడి నిందకు అతీతంగా ఉన్నదని స్థిరమైన అభిప్రాయంతో ఉన్నాడు (27:5; అధ్యా.3 చూడండి). దానిని రుజువు చేసుకోడానికి అతడు దేవుని ముందు నిలబడడానికి సిద్ధపడ్డాడు (23:7). యోబు దృష్టిలో దేవుడు మానవులతో వ్యవహరించేటప్పుడు నిందారహితమైన, పవిత్రమైన జీవితానికి తగిన బహుమానం ఇస్తున్నట్టు కనిపించలేదు (9:23; 10:14).
నీతి: తన పరిస్థితిలో తన నీతి కేంద్రస్థానంలో నిలుస్తుందని యోబు ప్రకటించాడు (6:29). అయితే ఈ విషయంలో తాను దేవుణ్ణి ఏ విధంగా ఒప్పించాలో అతని ఆలోచనకు అందలేదు (9:2,15,20; 10:15). అతని స్నేహితులు ముగ్గురూ యోబు వైఖరిని స్వనీతిగా కొట్టిపారేశారు (32:1). తన నీతిని సరిగా చూసుకుంటూనే ఆవశ్యకమైన దేవుని నీతిని దృష్టించడంలో యోబు విఫలం అయ్యాడని ఎలీహు అభిప్రాయం (32:2; 34:5,17). ఈ విషయంలో దేవుని నుండి నేరుగా యోబు వినాలని ఎలీహు ఎదురుచూశాడు (40:8).
న్యాయం: తన పరిస్థితిలో తనకు న్యాయం జరగాలని యోబు కోరుకున్నాడు (19:7; 23:4). అన్యాయాన్ని అతడు నిరసించి (27:4) ఇతరులతో తన సంబంధాల విషయంలో న్యాయానికి మాదిరిగా నిలిచాడు (29:14; 31:13-15). అయితే దేవుడు తనతో ఎల్లప్పుడూ న్యాయంగానే వ్యవహరించాడని అతడు నమ్మాడు (14:3; 16:10-14; 23:10-16; 27:2-6; 34:5-6; 35:2). దేవుని ముందు తన వ్యాజ్యాన్ని నేరుగా వినిపించాలని యోబు కోరుకున్నాడు (13:18). అయితే అది సాధ్యపడుతుందో లేదో అతనికి తెలియలేదు (9:32). దేవుడు పలికిన మాటల్లో న్యాయం, అన్యాయం గురించి ఏమీ చెప్పలేదు గానీ దాని ముగింపు మాత్రం స్పష్టంగా ఉంది. ఈ భౌతికమైన విశ్వాన్ని, జంతులోకాన్ని, మానవ సంబంధాలను నిర్వహించడంలో దేవుని న్యాయం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నంతటినీ పరిపూర్ణమైన సామరస్యంతో, న్యాయంతో పాలించడానికి కావలసిన జ్ఞానం, శక్తి దేవుడొక్కనికే సాధ్యం. తన స్వంత నీతిమత్వం విషయంలో గర్వించకుండా దేవుడు తన ఆవశ్యకమైన నీతిమత్వంతో ఏ విధంగా ఈ విశ్వాన్ని నిర్వహిస్తున్నాడో (40:7-14) గ్రహించడానికి యోబు ప్రయత్నించాలి. అంతిమంగా యోబు దీనిని అర్థం చేసుకున్నప్పుడు (42:4-6), తాను ఎదురు చూసిన న్యాయాన్ని అతడు అనుభవించి, దేవుడు తనకు చాలినవాడు అని గుర్తించాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
నీతిమంతులూ, అనీతిమంతులూ, అందరికి శ్రమలు రావచ్చని యోబు గ్రంథం బోధిస్తుంది. విశ్వాస పరీక్షలో భాగంగా నీతిమంతుల జీవితంలో శ్రమలు, ప్రమాదాలను దేవుడు కొన్ని సార్లు అనుమతించవచ్చు. అయితే, అంతిమంగా సాతాను శక్తిని పరిమితం చేయడంతో సహా, జీవితంలోని ప్రతి పరిస్థితినీ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. దేవుని ఆదరణ, ఆయన శక్తి ఆయన్ని నమ్మే వారికి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. యోబు గ్రంథం శ్రమలు అనే అంశం గురించి చర్చించినా దానికి మించి సార్వభౌముడు, పరిశుద్ధుడు అయిన దేవుని ముందు మానవుని నడవడి యొక్క స్వభావంపై అది ఎక్కువగా దృష్టి సారించింది. ఇతర లేఖనాలతో ఏకీభవిస్తూ ఈ గ్రంథం దేవునితో ఒక యథార్థమైన హృదయానుబంధం లేకుండా ఎంతటి నిష్ఠాగరిష్టమైన మతాచారాలు కలిగి ఉన్నా అవి ఏమాత్రం సరిపోవు అని బోధిస్తుంది (ద్వితీ 6:4-6; కీర్తన 86:11-12; మత్తయి 22:37). తన సమస్త ఉనికిలోను, చర్యల్లోను పరిపూర్ణుడైన దేవుని పట్ల సరైన భక్తిభావం కలిగి ఉండడంలోనే మన జీవిత సమస్యలకు, లక్ష్యాలకు జవాబు దాగి ఉంది. మానవుడు కేవలం దేవుణ్ణి అంగీకరించడం మాత్రం కాదు, తన సమస్తాన్నీ ఆయనకు లోబరచాలి. తన జీవితంలోని ప్రతి రంగంలోనూ నిజంగా ఆయన్ని దేవుడుగా కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆయన్ని చాలినవాడుగా కనుగొంటాడు.
గ్రంథ నిర్మాణం
ఈ గ్రంథ రచయిత తన కథనాన్ని వివరించడంలో బహు నైపుణ్యం కనపరిచాడు. ఈ కథలోని నాయకుడు (యోబు), ప్రతినాయకుడు (సాతాను), కథనాన్ని భగ్నం చేయజూసే ఇతర పాత్రలు (ముగ్గురు స్నేహితులు, ఎలీహు), వీటన్నిటినీ కళాత్మకంగా రూపొందించి వాటి మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా విడమరచాడు. దీనిలోని స్వభావచిత్రణ అంతిమంగా ఈ కథలో దేవుడే కథానాయకుడని (లేక ‘హీరో’) వెల్లడిపరుస్తుంది. సాతాను యోబు భక్తిని ఎంతగా సవాలు చేశాడో అంతగా దేవుణ్ణి కూడా సవాలు చేశాడు. యోబు స్నేహితులు అని చెప్పిన ముగ్గురు ‘‘ఆదరణకర్తలు’’ యోబు పరిస్థితికి పారంపర్య జ్ఞానాన్ని అన్వయించి మాట్లాడినా, దానిని ఒక్కొక్కరూ ఒక్కొక్క రీతిలో అన్వయించారు. హేతువాది అయిన ఎలీఫజు యోబుతో వాదనకు దిగాడు (15:17-18), సమర్ధనావాది అయిన బిల్దదు దేవుణ్ణి సమర్థించడానికి ప్రయత్నించాడు (25:1-6), జోఫరు అయితే ఒక న్యాయవాదిలాగా వ్యవహరించాడు (11:1-6). యువకుడైన ఎలీహు ఒక మధ్యవర్తిలాగా వ్యవహరించడానికి ప్రయత్నించడం ద్వారా ఆ తరువాత వచ్చే దేవుని మాటలకు మార్గం సిద్ధపరిచాడు (33:23-26). రచయిత ఒక నాటకీయమైన సంభాషణ చుట్టూ ఒక పరిపూర్ణమైన కథనాన్ని నిర్మించాడు. యోబు ఎదుర్కొన్న పరీక్షను ఒక కథారూపంలో వివరించడం బట్టి యోబు వాస్తవమైన వ్యక్తి కాదనీ, అతడు వాస్తవంగా నిజమైన పరీక్షను ఎదుర్కోలేదనీ మనం భావించకూడదు.