కీర్తనలు అనే పదానికి హెబ్రీలో సమాంతర పదం టెహిలిమ్. అంటే ‘‘స్తుతి’’ అని అర్థం. ఆంగ్లభాషలో ఈ పుస్తకానికి ఇవ్వబడిన పేరు (Psalms సామ్స్) గ్రీక్ పా.ని (LXX) లోని ‘‘సామోయ్’’ అనే పదం నుండి వ్యుత్పన్నమైంది. దీని అర్థం ‘‘స్తుతి కీర్తనలు’’. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి చెల్లించడంలో కీర్తనలు ప్రధానమైనవని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కొందరు కీర్తనలు గ్రంథాన్ని ఇశ్రాయేలు స్తుతిగీతాల పుస్తకంగా సూచించారు. ఇది పాక్షికంగా సత్యమేయైనా, ఈ పుస్తకంలోని అంశాలన్నిటినీ సమగ్రంగా చూస్తే ఆ పేరు ఈ పుస్తకానికి సరిపోదు. ఈ గ్రంథం లోని కీర్తనల్లో మూడవ భాగానికి పైగా ప్రార్థనల రూపంలో ఉన్నాయి. కాబట్టి, ఇశ్రాయేలు దైవారాధనలో కీర్తనలు గ్రంథాన్ని గీతాలాపనలోను, ప్రార్థనలలోను ఉపయోగించేవారని చెప్పవచ్చు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: కీర్తనలు గ్రంథం సుదీర్ఘకాలానికి చెందిన వేర్వేరు కీర్తనల సమాహారం కాబట్టి ఈ కీర్తనల రచయిత ఒక్కరు మాత్రమే కాదు. కీర్తనల శీర్షికల్లో ప్రధానంగా మనకు దావీదు పేరు కనబడుతుంది కాబట్టి, వీటిని దావీదు రచించాడని అనడం పరిపాటి. సౌలు ఆస్థానంలో సంగీతకారునిగా (1సమూ 16:14-23), గొఱ్ఱెల కాపరిగా, యుద్ధవీరునిగా, రాజుగా దావీదు కెదురైన పలు అనుభవాలు అతడు ఈ కీర్తనల్ని రచించేలా చేశాయి.
కీర్తనల శీర్షికల్లో దావీదు పేరు ప్రస్తావన హెబ్రీ భాషలో ఒకింత అస్పష్టంగా ఉండడం సమస్యాత్మకమైంది. ఇది కేవలం ‘‘దావీదు కీర్తన’’ అని మాత్రమే ఉండడంవల్ల అది ‘‘దావీదు రచించిన’’ అని గానీ, ‘‘దావీదుకు చెందిన’’ అని గానీ ‘‘దావీదు కొరకు’’ అని గానీ, ‘‘దావీదు గురించి’’ అని గానీ అర్థమిచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన ప్రస్తావన ఆ పేరున్న కీర్తనలన్నిటిని దావీదుకు ఆపాదించడానికి తప్ప ఆ కీర్తనలను దావీదే రచించాడని కచ్చితంగా చెప్పడానికి అవసరమైన ఆధారంగా లేదు. కీర్తనకు దావీదుకు ఉన్న సంబంధం గురించి నిర్దిష్టమైన వివరాలున్నట్లయితే, ఈ అస్పష్టత ఉండేదే కాదు.
ఇతర కీర్తనల శీర్షికల్లో సొలొమోను (కీర్తన-72; కీర్తన-172), ఆసాపు (కీర్తన 5; కీర్తనలు 70-83), కోరహు కుమారులు (కీర్తన 42; కీర్తనలు 44-49); ఏతాను (కీర్తన 89), కోరహు కుమారుడైన హేమాను (కీర్తన 88), మోషే (కీర్తన 90) మొదలైన పేర్లున్నాయి. హెబ్రీ శీర్షికల్లో దావీదు పేరున్నట్టుగానే వీరి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి గ్రంథకర్తృత్వం విషయంలో అదే అస్పష్టత ఇక్కడ కూడా తటస్థిస్తుంది. ఆసాపు విషయంలో, అతడు దావీదు దగ్గరున్న ప్రధాన గాయకుల్లో ఒకడు కాబట్టి (1దిన 6:39), గాయక బృందమంతటికీ సైతం ఆసాపు పేరునే వర్తించినట్టుంది (ఎజ్రా 2:40-41; కీర్తన 50 శీర్షిక దగ్గర వివరణ చూడండి). చెర అనంతర కాలానికి చెందిన ఒక కీర్తనకు సైతం (కీర్తన 74) ఆసాపు పేరు ఎందుకున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
నేపథ్యం: కీర్తనలు గ్రంథంలోని కీర్తనల్ని, ప్రార్థనల్ని వేర్వేరు వ్యక్తులు రచించినప్పటికీ, సమాజమంతా వీటి నుపయోగించే వారు. శీర్షికల్లో ఉన్న పేర్లనే రచయితల పేర్లుగా తీసుకున్నట్లయితే, కీర్తనల రచనా కాలం మోషే (క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దం) నుండి చెర అనంతర కాలం వరకు (క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం, ఆ తర్వాత కూడా) అని చెప్పాలి. కొన్ని కీర్తనల శీర్షికల్లో చారిత్రక వివరాలుండడం వలన ఆ కీర్తన చారిత్రక నేపథ్యం తెలుస్తున్నప్పటికీ, రచనాకాలం అస్పష్టంగానే ఉంది. శీర్షికల్లోని వివరాలు రచనాకాలాన్ని కాక, కీర్తనకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని సూచిస్తుండవచ్చు. ఎందుకంటే సంఘటన అనంతరం చాలా కాలం తర్వాత కీర్తనను రచించి ఉండవచ్చు. కొన్ని కీర్తనల విషయంలో ఇదే జరిగి ఉంటుంది. ఎందుకంటే ప్రాణానికి పెనుముప్పు వాటిల్లిన సందర్భంలో దానిగురించి అప్పటికప్పుడు కీర్తన వ్రాయడంలో ఔచిత్యం లేకపోవచ్చు. అనేక కీర్తనల విషయంలో, ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతి కీర్తనల విషయంలో, ప్రార్థనలకు జవాబులు వచ్చిన తర్వాత వాటి రచన జరిగి ఉండవచ్చు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
గ్రంథంలోని 150 కీర్తనల్లో అనేక సందేశాలు చెల్లాచెదురుగా కనబడతాయి, అయితే స్థూలంగా చూసినప్పుడు ఇవి దైవారాధనలో, ప్రార్థనలో దేవుని ప్రజల స్పందనల్ని తెలియజేస్తున్నాయి, మన జీవితంలోను ఇటువంటి పలు సందర్భాలు ఎదురైనప్పుడు మనమెలా దేవుణ్ణి ఆశ్రయించాలో తెలియజేస్తూ ఉపదేశాత్మకంగా ఉన్నాయి. ఇంకా ఈ కీర్తనలు దేవుని ప్రజలమీద ఆయన సర్వాధిపత్యాన్ని, ఆయన దయాళుత్వాన్ని వెల్లడిచేస్తూ, ఆయనను ఆశ్రయించేవారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
దేవుని ప్రజల జీవితాల్లో ఆయన కార్యాలకు, వాటిపట్ల వారి స్పందనలకు ఉన్న సంబంధం ఈ గ్రంథంలో ముఖ్యమైన సమాచారం. బైబిల్లోని ఇతర వృత్తాంతాల్లోను ప్రవచన సందేశాల్లోను ఉన్నట్టుగా ఏ కీర్తనలోను దేవుడు సూటిగా మాట్లాడినట్టు కనబడదు. కాబట్టి, కీర్తనల్ని వ్రాసినవారు వారి జీవితాల్లో వారికెదురైన పలు సంఘటనల నేపథ్యంలో మానవదృక్పథం నుండి వీటిని వ్రాయడం జరిగింది. దేవుని గుణలక్షణాల్ని అర్థం చేసుకోవడంలో సంఘర్షణ ననుభవించడం, ముఖ్యంగా ఆయన సర్వాధిపత్యాన్ని ఆయన దయాళుత్వాన్ని జీవితానికి వర్తించుకోవడంలో సంఘర్షణలకు గురికావడం ఈ సంకలనం లోని ప్రధానాంశం. జీవితంలో కొన్నిసార్లు శోధనలకు గురైనా, దేవునిలో తమ విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తుల మాటలివి (కీర్తన 73). వ్యక్తిగతంగా, సమాజపరంగా దేవుడు తమతో ఎలా వ్యవహరిస్తున్నాడో తెలుసుకొనడంలో వీరు అనుభవించిన సంఘర్షణ కీర్తనల్లో కనబడుతుంది.
గ్రంథ నిర్మాణం
కీర్తనలు గ్రంథం మొదటినుండి చివరివరకు పద్యశైలిలోనే ఉంది. హెబ్రీ పద్యంలో ప్రాసనియమం గానీ ఛందోబద్ధత గానీ ఉండవు. అయితే, పద్యరచనలో రెండు లేదా మూడుపంక్తులు అనురూపసామ్యంలోను సంపూర్ణమైన భావ సమన్వయంలోను ఉంటాయి. అనురూపసామ్యంలో సమానార్థక వివరణ ఉంటుంది, అంటే రెండవ పంక్తి కూడా మొదటి పంక్తిలోని భావాన్నే ప్రతిధ్వనిస్తుంది. వ్యతిరేక సామ్యంలో పంక్తులు భావవైరుధ్యంలో ఉండి, ఒకదానికొకటి భిన్నభావాన్ని సూచిస్తాయి. సంక్లిష్ట సామ్యంలో మొదటి పంక్తి లేదా మొదటి విభాగం లోని భావాన్ని రెండవ పంక్తి లేదా రెండవ విభాగం పూరిస్తాయి. కీర్తనల్ని వివిధ తరగతులుగా వర్గీకరించవచ్చు: స్తుతి కీర్తనలు (145-150), కృతజ్ఞతా కీర్తనలు (30-32), ఆపద వాటిల్లిన సందర్భాల్లో శోకంలో మునిగిపోయి దేవునికి మొఱపెడుతూ చేసిన ప్రార్థనలు (38-39), ఇశ్రాయేలును పరిపాలించే రాజుకు సంబంధించిన కీర్తనలు (2; 110), రాజు సింహాసనాన్ని అధిష్టించిన సందర్భంలో యెహోవా ఏలుబడిని ఘనపర్చే కీర్తనలు (96; 98), నలిగిన హృదయంతో పశ్చాత్తాపాన్ని తెలియజేసే దుఃఖపూరిత కీర్తనలు (32; 38; 51), సామెతల్ని పోలిన జ్ఞానబోధకమైన లేదా ఉపదేశాత్మకమైన కీర్తనలు (19; 119).