హోషేయ ఇచ్చిన విశిష్ఠమైన సందేశంలో అతని స్వంత వివాహం, కుటుంబం కీలకమైన పాత్రను పోషించాయి. అందువలన ఈ పుస్తకం ప్రవక్తల పుస్తకాలన్నిటిలో ఎక్కువగా స్వీయకథాత్మకమైన గ్రంథం అని చెప్పవచ్చు. దేవుని కృపా వాక్యం, మారుమనస్సుకై ఆయన పిలుపు బహు నాటకీయంగా ప్రదర్శింపబడి, తిరస్కారం పొందినా మానక తన భార్య గోమెరు పట్ల హోషేయ చూపిన ప్రేమ, వారి ముగ్గురు పిల్లల పేర్లతో గుర్తించబడినట్లుగా కనిపిస్తుంది. తన స్వంత కుటుంబం గురించిన ఈ సమాచారానికి మించి, హోషేయను గూర్చి దాదాపుగా మనకు ఏమీ తెలియదు. విచ్చలవిడి లైంగిక జీవితంతో హోషేయకు ఎంతో మనోవేదన కలిగించిన గోమెరుతో దైవాజ్ఞవల్ల జరిగిన వివాహమే అతని సుదీర్ఘ పరిచర్యకు ఆరంభంగా కనిపిస్తుంది. తన వ్యక్తిగత దు:ఖాన్ని దిగమింగి సేవచేయడమే కాకుండా, ఈ సమస్యాత్మకమైన వివాహమే తన పరిచర్యకు పునాదిరాయి అని హోషేయ గ్రహించాడు.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: మొదటి వచనాన్నిబట్టి, హోషేయ ప్రవచన పరిచర్య కనీసం 40 సంవత్సరాలు కొనసాగింది. అది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును క్రీ.పూ. 793నుండి 782 వరకు తన తండ్రి యెహోయాషుతో కలిసి ఆ పిమ్మట స్వయంగా క్రీ.పూ.753 వరకు పాలించిన రెండవ యరొబాము కాలంలో ఆరంభమైంది. క్రీ.పూ. 716 నుండి 686 మధ్యలో యూదాను పాలించిన హిజ్కియా పాలనలో హోషేయ పరిచర్య ముగిసింది.
హోషేయ ప్రవచనంలో దక్షిణ రాజ్యమైన యూదాని కూడా ప్రస్తావించినప్పటికీ (ఉదా. 1:7,11, 6:11; 12:2), అతని సందేశాలు ప్రాథమికంగా, తరచూ ‘‘ఎఫ్రాయిము’’ అని పిలవబడి షోమ్రోను అనే దాని రాజధాని నగరాన్ని సూచిస్తూ (7:1; 8:5-6; 10:5,7; 13:16) ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలును ఉద్ధేశించి ఇవ్వబడ్డాయి (5:3,12-14; 6:4; 7:1). క్రీ.పూ.722లో అష్షూరీయులు సమరయను ఆక్రమించే సమయానికి బహుశా యెరూషలేముకు వెళ్ళిపోయిన హోషేయ, షోమ్రోను చుట్టుపక్కలే నివసించి పరిచర్య చేసివుంటాడు.
నేపధ్యం: ఉత్తర రాజ్యాన్ని ప్రపంచ ప్రమాణాల్లో ఉన్నతస్థాయిలో పరిపాలించిన రెండవ యరొబాము పాలనకాలం గొప్ప అభివృద్ధికి, సైనిక బలానికి, జాతీయ స్థిరత్వానికి గీటురాయిగా ఉంది. ఆర్థికవ్యవస్థ బలంగా ఉంది, భవిష్యత్తు ప్రకాశవంతంగా కనిపించింది, కనీసం ఉన్నతవర్గాల వారికైనా దేశ పరిస్థితులన్నీ ఆశాజనకంగా కనిపిస్తున్నాయి (12:8; ఆమోసు 3:15; 6:4-6). సిరియా ఒక్కటే ఇశ్రాయేలుకు ఒక ఎడతెగని సమస్యగా ఉండేది కాని క్రీ.పూ. 805లో అష్షూరువాడైన మూడవ ఆదద్ నిరారి సిరియా రాజధాని దమస్కు పైకి దండెత్తడంతో ఇశ్రాయేలుకు ఉపశమనం కలిగింది. క్రీ.పూ. 783లో ఆదద్ నిరారి మరణం తరువాత, అష్షూరీయులు బలహీనంగా ఉన్న సమయంలో (యోనా కాలంలో), ఇశ్రాయేలు యూదాలు విస్తరించాయి. కాని క్రీ.పూ. 753లో యరొబాము మరణం తర్వాత, 30 సంవత్సరాలలో ఆరుగురు రాజుల (అందులో జెకర్యా, షల్లూము, పెకహ్యా, పెకహు అనే నలుగురు హత్యగావించబడ్డారు) పాలనలో ఇశ్రాయేలు ఇంచుమించు అరాచకత్వంలోకి కూరుకుపోయింది.
ఈ కాలంలోనే అష్షూరు కూడా తిరిగి బలం పుంజుకోవడంతో, ఇశ్రాయేలు నాశనమయ్యింది. అయితే హోషేయ, ఆమోసులు స్పష్టం చేసినట్లు, ప్రజల పాపాలకై దేవుడు శిక్ష విధించాలని నిర్ణయించుకోవడమే ఇశ్రాయేలు కూలిపోవడానికి నిజమైన కారణం. హోషేయ సందేశాల్లో ఎక్కువశాతం ఇశ్రాయేలు రాజ్యం చివరి 30 సంవత్సరాలలోనే ఇవ్వబడ్డాయి.
సందేశం, ఉద్దేశం
నేరారోపణ: హోషేయ మాటలనుబట్టి, ఇశ్రాయేలు నాలుగువిధాలుగా పాపం చేసింది. మొదటిది, దేవుని జ్ఞానాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తూ, నిబంధనకు ఆధారమైన నమ్మకత్వాన్ని, దయాళుత్వాన్ని అది భంగపరిచింది. వారు దేవుని కృపను మర్చిపోయి, తమను బట్టి తామే తృప్తి పొందుచూ, గర్విష్టులైపోయారు. వారు ఆయనకు విరోధంగా తిరస్కారభావంతో మాట్లాడారు కూడా. రెండవది, వారు విగ్రహారాధనతో, వేశ్యరికంతో లేక దుర్మత వ్యభిచారక్రియలతో నిండిపోయారు. మూడవది, వారు దేవునిబట్టి కాక, మానవ సంబంధమైన బలంలో (రాజులు, రాజకుమారులు, యుద్ధవీరులు, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు) నమ్మకముంచారు. చివరిగా, వారు హత్య, దొంగతనాలు, అబద్ధాలు, బలహీనులను దోచుకోవడంవంటి అన్యాయాలు, హింసవిషయమై దోషులయ్యారు.
ఉపదేశం: తమ వ్యభిచారాన్ని, విగ్రహారాధనను అతిక్రమాన్ని విడిచి, ధర్మశాస్త్ర నిబంధన విషయమై దీనత్వం, విశ్వాస్యతతో తన దగ్గరకు తిరిగి రమ్మని యెహోవా హోషేయ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాడు.
తీర్పు: వారి ప్రస్తుత శ్రమకు కారణం దేవుడు వారిని విడిచిపెట్టడమే అని హోషేయ ఇశ్రాయేలుకు ప్రకటించాడు. ఇంక వారిపైకి శిక్ష రాబోతున్నది. అది విదేశీ దురాక్రమణ, చెర, నాశనం, సంహారం, మరణాలతో కూడి ఉంటుంది.
నిరీక్షణ: ఇశ్రాయేలును ఒక జనాంగంగా చేయడానికి యెహోవా చూపిన కృప, ప్రేమలను, గతంలో వారి అవసరాలను సమృద్ధిగా తీర్చి, వారిపట్ల శ్రద్ధతో ఓపిక వహించి, దీవించడాన్ని హోషేయ వారికి గుర్తుచేశాడు. ఆయన ఒక్కడే వారికున్న నిరీక్షణ, ఆయన మార్గాలే సరైనవి. వారు పశ్చాత్తాపపడి. విశ్వసిస్తే, దేవుడు మళ్ళీ వారిపై జాలిపడి, విడిపిస్తాననీ వారి అవినీతిని తొలగించి నిబంధనను పునరుద్ధరించి, వారికి తన నీతినీ, దైవిక జ్ఞానాన్నీ ఆపాదిస్తాననీ, ఇశ్రాయేలును తిరిగి కట్టి దాని పూర్వవైభవాన్ని పునరుద్ధరిస్తానని భరోసానిస్తున్నాడు.
నిర్మాణం
పుస్తకంలోని మొదటి మూడు అధ్యాయాలు యెహోవాకు, హోషేయకు మధ్య ఉన్న సమాంతర పోలికను వెల్లడిచేస్తున్నాయి. ఇద్దరూ విశ్వాసఘాతకులైన భార్యలపై ప్రేమచూపిన భర్తలు. ఇశ్రాయేలుకు సందేశంగా ఉన్న హోషేయ ముగ్గురు పిల్లలు, పుస్తకంలోని రెండవ భాగంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇందులో నేరారోపణలు, మారుమనస్సు పొంది తిరిగి రావాలనే మూడంచెల పిలుపు ఉంది. మొదటి అధ్యాయం హోషేయ కుటుంబాన్నిగూర్చి తృతీయపురుష వృత్తాంతంగా ఉండి, మూడవ అధ్యాయం స్వీయవృత్తాంతంగా ఉండి సమంగా చేస్తుంది. కాబట్టి చివరి ముఖ్యమైన భాగం తన సందేశాన్ని ప్రకటిస్తున్న దేవుడు, దానిని మనకు నివేదిస్తున్న ప్రవక్తగా ఒకరి తర్వాత ఒకరు చెబుతున్నట్లు ఉంటుంది.
బైబిల్లో ఈ పుస్తకం పాత్ర
ఆధ్యాత్మిక, వైవాహిక విశ్వాసఘాతకానికి సమాంతర రేఖ గీస్తూ, దేవునికి, ఆయన ప్రజలకు మధ్య ఉండే అనుబంధాన్ని, భార్యభర్తల మధ్య ఉన్న బంధంగా హోషేయ గ్రంథం పోల్చి చెబుతున్నది. ‘‘వైవాహిక బంధం పరిధిలో మాత్రమే లైంగికకార్యం (సెక్స్) జరగడం న్యాయం అనే నైతిక విలువల విషయంలో బైబిల్ చాలా స్పష్టంగా వ్యవహరిస్తుంది. కాబట్టి వివాహం, సెక్స్ అనేవి పూర్తిగా విడదీయలేని, ఇతరులెవరికీ తావులేని అనుబంధం. అదే దేవునికి ఆయన ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని చిత్రీకరిస్తుంది’’. అయినా దేవునికి తన నిబంధనా ప్రజలపై ఉన్న ప్రేమను ఏదీ ఆర్పజాలదు. వివాహ భాగస్వామిలాగా, దేవుడు మన జీవితాలతో గాఢంగా పెనవేసుకుని, మనం ఆయనకు వేరై మన ఇష్టమైన మార్గానికి తొలగిపోయినప్పుడు వేదన చెందుతాడు. తన స్వంతవారి నుండి దేవుడు నమ్మకత్వాన్ని, ప్రేమను ఆశిస్తున్నాడు. దేవునిపట్ల హృదయపూర్వక ప్రేమను చూపించడంలో ఆయన ప్రజలు పదేపదే విఫలమయ్యారు, కాని ఆయన పశ్చాత్తాప పడి తనవైపుకు తిరిగేవారిని క్షమించి, సమకూర్చడానికి సిద్ధంగా వున్నాడు. గోమెరును విడిపించడానికి వెల చెల్లించడంలో, తన సంఘ వధువుకు తన ప్రాణాన్ని వెలగా ఇచ్చి విడిపించిన క్రీస్తునందు పరిపూర్ణంగా ప్రకటించబడిన దేవుని ప్రేమను హోషేయ ఎత్తి చూపుతున్నాడు.