పాత నిబంధనలోని అతి చిన్నపుస్తకాల్లో యోవేలు ఒకటి. మొదటి భాగం (1:1-2:17) భయంకరమైన మిడతల తెగులును వర్ణించి, పాపాలు ఒప్పుకోమనే విన్నపంతో ముగుస్తుంది. రెండవ భాగం (2:18-3:21) పశ్చాత్తాపం పొందినవారికి నిరీక్షణతో పాటు, వారి శత్రువులపై వచ్చే తీర్పును ప్రకటిస్తుంది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: పెతూయేలు కుమారుడు అని చెప్పబడిన యోవేలు (‘‘యెహోవాయే దేవుడు’’). లేఖనాల్లోని మిగిలిన యోవేలులతో ఇతణ్ణి అంత తేలికగా పోల్చలేం (1సమూ 8:2; 1దిన 4:35; 6:33; 11:38; 15:7; ఎజ్రా 10:43; నెహెమ్యా 11:9). అతడు రాసిన ఈ పుస్తకం ద్వారా మాత్రమే అతణ్ణీ, అతని పిలుపునూ, అతని పరిచర్యనూ మనం తెలుసుకోగలం. ఈ పుస్తకంలో అతని తండ్రి పేరు తప్ప అతని జీవితం గురించి ఎలాంటి సమాచారమూ లేదు.
నేపధ్యం: యోవేలు గ్రంథం వ్రాయబడిన కాలాన్ని గుర్తించడం చాలా కష్టం. రాజరికం ఆరంభం కావడం ముందు నుండి, చెర తర్వాతి కాలం వరకు మధ్యకాలంలో జరిగి ఉండవచ్చని అభిప్రాయపడతారు. హెల్లెనీయుల కాలంలో జరిగిందని మరొక అభిప్రాయం ఉంది. మరొక అభిప్రాయం ప్రకారం, ఈ పుస్తకం క్రీ.పూ.835-796 మధ్యకాలంలో వ్రాయబడియుండవచ్చు.
సందేశం, ఉద్దేశం
యోవేలు గ్రంథం గురించి చెప్పాల్సిందేమిటంటే, ఇందులో ప్రజల అపరాధాల పట్టికను ఇవ్వడం తప్ప నేరారోపణలేమీ చేయలేదు. ఏ పాపాలను బట్టి ప్రవక్త సందేశం ఇవ్వాల్సివచ్చిందో 2:12-13లోని ఒకే ఒక్క సూచన ‘‘…మన:పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి’’, ‘‘…మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని…’’ అనే మాటల్లో మాత్రమే కనిపిస్తుంది. మిగతా ప్రవక్తల పుస్తకాలన్నిటిలో (ప్రవక్త శైలిని వాడని యోనాలో తప్ప), కనీసం ఏ విధమైన ప్రవర్తనను మార్చుకోవాలి అనే కొన్ని స్పష్టమైన సూచనలున్నాయి. యోవేలు కేవలం ప్రజలను ప్రేరేపించాలనే దృష్టితో, తీర్పు, నిరీక్షణగూర్చిన సందేశాలతో రాశాడు.
ఈ పుస్తకంలో అనేక హెచ్చరికలున్నాయి, కాని అవన్నీ నైతికతకు, సత్ప్రవర్తనకు సంబంధించినవి కాకుండా లాంఛనప్రాయమైనవిగా ఉన్నాయి. పాఠకులను వినమనీ (1:2-3), యుద్ధం చేయమనీ (2:1; 3:9-13), విలపించమనీ (1:5,8,11,13-14; 2:15-17; వీటిని కొందరు వ్యాఖ్యాతలు పశ్చాత్తాపంకైన పరోక్షపిలుపులుగా భావించినా), వేడుక జరుపుకోమని (2:21-23) పిలుపునిస్తున్నాడు యోవేలు. యోవేలు గ్రంధంలోని ఏకైక నిజమైన దిద్దుబాటు సందేశం పశ్చాత్తాపానికైన పిలుపును గురించి 2:12,13లో కనబడుతుంది. డి.ఏ. గ్యారెట్ అనే వ్యాఖ్యాత చెప్పినట్లు ‘‘ఒక్క సంఘటన అదే సమయంలో అనేక సంఘటనలుగా’’, ‘‘ఇశ్రాయేలు కోసం తన ప్రణాళికలను ఒక నిర్ణయాత్మక ముగింపుకు తీసుకురావాలనే యెహోవా కార్యాన్ని సూచిస్తున్న’’, యెహోవా దినమును ప్రకటించి, పశ్చాత్తాపాన్ని ప్రేరేపించడం అనే ప్రాధమిక ఉద్దేశంతో యోవేలు సందేశం ఉంది. మిడతల తెగులు దేవునినుండి వచ్చే తీర్పుగా, ప్రభువు దినానికి ముందు నడిచే దూతగా అర్థం చేసుకోవాలి (1:2-20, ముఖ్యంగా వ.15). తరువాత ఇంకా భయంకరమైన తీర్పు ఒక మానవ సైన్యం ద్వారా వస్తుంది అని యోవేలు ప్రకటించాడు (2:1-11). దీనిని కూడా యెహోవా దినం అనే పిలిచాడు (2:1,11).
దేవుని ప్రజలకున్న ఒకే ఒక్క నిరీక్షణ పశ్చాత్తాపం ద్వారా మాత్రమేనని యోవేలు నొక్కి చెప్పాడు (2:12-17). పశ్చాత్తాప పడితే ప్రభువుదినం వలన (2:31) వచ్చే భౌతిక (2:18-27), ఆధ్యాత్మిక (2:28-32) పునరుద్ధరణ ఒక బహుమానంగా వస్తుందని అతడు యూదాకు హామీ ఇచ్చాడు. దేవుని, ఆయన ప్రజలను వ్యతిరేకిస్తున్న రాజ్యాలకు విరోధంగా తీర్పు జరిగే యెహోవా దినాన్ని గూర్చి వాగ్దానం చేస్తూ అతడు ముగించాడు (3:14).
మిడుతలు: యోవేలు గ్రంథంలో ‘‘మిడతల’’ను సూచించే నాలుగు మాటలున్నాయి. మిడుతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడపురుగులు. ఈ మిడతలకు, యోవేలులో ఆ తరువాత పేర్కొన్న సైన్యానికి ఏమి సంబంధం అనే ప్రశ్నలు వ్యాఖ్యాతలు చాలాకాలం నుండి ఎదుర్కొంటున్నారు. అవి రెండూ వేరువేరా? లేక ఒకదానిని సూచించే సాదృశ్యం మరొకటా? లేక ఇశ్రాయేలుకు, మిగిలిన రాజ్యాలకు విరోధంగా వచ్చే రెండు వేర్వేరు సంగతులా? మిడతలు నిజమైనవా, ఉపమానరూపమా, లేక సాదృశ్యమా? దాడిచేసిన మిడతలు, విదేశీ సైన్యం, రెండూ దేవుని తీర్పులుగానే వచ్చాయని గమనించడం ప్రాముఖ్యం. అలాగే మిడతలను దురాక్రమణ కోసం వస్తున్న సైన్యంగా కూడా చెప్పవచ్చు, ఒక సైన్యాన్ని నాశనంచేసే మిడతల తెగులుతో పోల్చడం కూడా సమంజసమే.
యెహోవా దినం: ‘‘యెహోవా దినం’’ అనే మాట యోవేలు గ్రంథంలో ప్రముఖంగా కనబడుతుంది. ఇది దేవుని తీర్పు దినాన్ని వర్ణిస్తుంది. ఈ తీర్పు ఇశ్రాయేలుకు, ఇతర ‘‘జనములకు’’, ఇద్దరికీ విరోధమైంది కావచ్చు. యెహోవా దినం అనే పదం పా.ని.లో యెషయా 13:6,9; యెహె 13:5; యోవేలు 1:15; 2:1,11; 3:14; ఆమోసు 5:18,20; ఓబద్యా 15; జెఫన్యా 1:7,14; మలాకీ 3:2లో కనిపిస్తుంది. ఇదే భావన యిర్మీయా 46:10లో, ఇంకా అనేక వాక్యభాగాల్లో మనకు కనిపిస్తుంది. ‘‘యెహోవా దినం’’ అనే మాటకు అనేక విశేషణాలు జోడిరచబడ్డాయి: ‘‘అది వెలుగు కాదు, అంధకారం’’ (ఆమోసు 5:18,20), ‘‘నియమించిన భయంకరమైన ఆ మహాదినం’’ (మలాకీ 4:5 అపొ.కా. 2:20). దానితోబాటు విశ్వంలో విపత్తులు; సూర్యుడు నల్లగా మారిపోవడం, చంద్రుడు రక్తవర్ణంలోనికి మారిపోవడం (అపొ.కా. 2:20; ప్రక 6:12) ఉన్నాయని చూస్తాం. యెహోవా దినంగూర్చిన మరిన్ని వివరణలు యెషయా 13, 34; యెహె 7; యోవేలు 2 లో చూడవచ్చు. యెహె 7 ప్రకారం ప్రభువు ఇశ్రాయేలు దేశానికి విరోధంగా తన ఉగ్రతను పంపి, దాని మార్గముల ప్రకారం దానికి తీర్పు తీరుస్తాడని మనం గమనిస్తాం. దాని హేయమైన పనులన్నిటి బట్టి ఆయన దాన్ని శిక్షిస్తాడు. ఒకదాని తర్వాత ఒకటిగా విపత్తులు రాబోతున్నాయి. తన తీర్పులద్వారా దేవుడు తనను తాను కనపరచుకునే రోజు సమీపంగా ఉంది అనే ఆలోచనతో, తీర్పు అంశం యోవేలులో ప్రధానంగా కనిపిస్తుంది. హెబ్రీయులను ఆశ్చర్యచకితుల్ని చేసే ఒక సంభవంతో, దేవుడు మానవజాతుల్లో అత్యంత దుర్మార్గమైనవి యూదాను ఇశ్రాయేలును ఆక్రమించుకునేలా చేసాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
విశ్వమంతటికీ సృష్టికర్త, విమోచకుడైన దేవుడు, ప్రకృతి అంతటి మీద పూర్తి స్వాధీనంతో ఉన్నాడు అని యోవేలు గ్రంథం మనకు చూపిస్తుంది. తీర్పు తీర్చే ఈ దేవుడే, జాలిగలవాడు అనీ, పశ్చాత్తాప పడి తన ప్రజలు తనముందుకు వస్తే వారిని విమోచించి సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడనీ యోవేలు స్పష్టం చేశాడు. దేవుని ఆత్మ అందరి మీదా ఉండే ఒక కాలాన్ని యోవేలు సూచిస్తున్నాడు. పెంతెకోస్తు దినాన పేతురు, యోవేలు ప్రవచించిన ఆత్మనింపుదలతో కూడిన శిష్యత్వం అనే నూతనదినం వచ్చిందని ప్రకటించాడు (అపొ.కా. 2:17-21).
నిర్మాణం
యోవేలు మళ్ళీ మళ్ళీ వాడిన మాటలు ఈ పుస్తకాన్ని ఒకదానిలో మరొకటి ఇమిడి ఉన్న తలుపులుగా చూపిస్తుంది. గారెట్ చెప్పినట్టు దీని నిర్మాణం అంతా దేవుడు మిడుతల తెగులు ద్వారా తీర్చిన తీర్పు (1:1-20), ఒక భాగంలో రాజ్యం భౌతికంగా తిరిగి సమకూర్చబడడం (2:21-27). దండెత్తి వస్తున్న సైన్యం (2:1-11), దాని నాశనం (2:20) గూర్చి ప్రవచనంతో సమతుల్యంగా ఉంది. వీటన్నిటి మధ్యలో పశ్చాత్తాప పడమని ఇచ్చిన గొప్ప పిలుపు, వారి నవీకరణ గురించిన వాగ్దానం (2:12-19) ఉన్నాయి. కాని ఈ సమతుల్యమైన నిర్మాణం ఒకదాని మీద ఒకటి పడుతున్నట్లుగా ఉంది. దండెత్తి వచ్చిన సైన్యం నాశనమయ్యే ప్రవచనం (2:20), సమస్త రాజ్యాల మీదా యెహోవా ప్రతీకారం తీర్చుకోనున్నాడనే చివరి ప్రవచనంతో సమతుల్యంగా ఉంది (3:1-21). చివరిగా వర్షం ద్వారా భౌతికంగా తిరిగి పూర్వస్థితిని సంక్రమించుకుంటుందనే భరోసాని (2:21-27), దేవుని ఆత్మ కుమ్మరింపు ద్వారా ప్రజల ఆధ్యాత్మిక పునరుద్ధరణ గూర్చిన వాగ్దానంతో సంతులనం చేశాడు (2:28-32).