హగ్గయి ప్రవక్త నిరాశలో మునిగి ఉన్న యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ వారే విధంగా జీవిస్తున్నారో పరీక్షించుకొని దేవుణ్ణి సంతోష పరిచే విధంగా తమ నూతన ప్రాధాన్యతలను నిర్ణయించుకోమని వారిని సవాలు చేశాడు. దేవుడు వారితో ఉన్నాడని వారు గుర్తుంచుకోవాలి. ఆయనే వారి భవిష్యత్తును నిర్ణయించేవాడు, తన ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అని నేరుగా చెప్పే ప్రస్తావన ఇందులో లేదు. అయితే దీనిలోని మాటలు దేవుడు ప్రవక్త అయిన హగ్గయితో మాట్లాడిన మాటలతో పదే పదే సంబంధం కలిగి ఉన్నాయి (1:1,3,13; 2:1,10,14,20).
నేపథ్యం: క్రీ.పూ. 587 లో నెబుకద్నెజరు మూడవసారి యెరూషలేముపై దండెత్తి, ఈసారి ఆ నగర ప్రాకారాలను, దేవాలయాన్ని, నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు (2రాజులు 25:8-21; యిర్మీయా 39-40). యిర్మీయా, మరికొద్దిమంది యెరూషలేములో నిలిచిపోయినప్పటికీ (యిర్మియా 41-43) ప్రజల్లో అధికసంఖ్యాకులు బబులోనుకు 70 సంవత్సరాలపాటు చెరగా కొనిపోబడ్డారు (యిర్మీయా 25:11-12; 29:10). కోరెషు అనే ఒక బలమైన రాజు (యెషయా 44:24-45:2) బబులోనును, దాని దేవతలను (యెషయా 46-47) ఓడిస్తాడని దేవుడు యెషయా ద్వారా ముందుగానే చెప్పాడు. పర్షియా రాజు కోరెషు బబులోనును ఓడిరచిన తరవాత క్రీ.పూ. 538లో బబులోనుకు చెరకొనిపోబడిన రాజ్యాల ప్రజలు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళడానికి అనుమతిస్తూ ఒక ఆజ్ఞ జారీ చేశాడు (ఎజ్రా 1:1-4; కోరెష్ కిలిందర్). షేష్బజ్జరు (ఎజ్రా 1:8-11) యెరూషలేములో దేవాలయాన్ని పునర్నిర్మించడానికి సుమారు 43,000 మంది యూదా యాత్రికుల్ని యెహుద్ (యూదా) రాజ్యానికి నడిపించాడు (ఎజ్రా 2:64-65). అప్పటినుండి ఏడు నెలలకు అధికారిjైున జెరుబ్బాబెలు, (ప్రధాన యాజకుడు) యెహోషువ కలిసి దేవుని ఆరాధన కోసం ఒక బలిపీఠం నిర్మించడంలో ప్రజలను నడిపించారు (ఎజ్రా 3:1-7). ఆ తరవాత రెండవ సంవత్సరంలో నూతన దేవాలయ నిర్మాణానికి పునాది వేశారు (ఎజ్రా 3:8-10). అయితే యెరూషలేముకు ఉత్తర భూభాగంలో నివసించే సమరయులు సృష్టించిన అడ్డంకుల వలన దేవాలయ నిర్మాణం ఆ తరువాతి 16 సంవత్సరాలపాటు నిలిచిపోయింది. అంతే కాక వారు కొందరు న్యాయవాదులను నియమించుకొని పర్షియా అధికారులు మందిర నిర్మాణం కోసం కావలసిన సహాయం అందించకుండా అడ్డగించడానికి ప్రయత్నించారు (ఎజ్రా 4:1-5). ఇది యూదా ప్రజలను ఎంతగానో నిరాశపరిచింది. యూదులు అనేక ఆశలు పెట్టుకొన్న నెరవేరనందుకు నిస్పృహ చెందారు. నగర ప్రాకారాలు బాగుచేయలేదు. మందిర పునర్నిర్మాణం పూర్తికాలేదు, దీనికి తోడు ఆ ప్రాంతంలో కరువు తాండవించింది (హగ్గయి 2:9-11). యూదాజాతి ఇంకా పర్షియా సామ్రాజ్యం స్వాధీనంలోనే ఉంది. ‘‘యూఫ్రటీసు నది పడమటి ప్రాంతపు అధికారిjైున’’ తత్తెనై, అతని అధికారుల అనుమతి లేకుండా వారు ఏమీ చేయలేకపోయారు (ఎజ్రా 5:3-5). మందిర పునర్మిర్మాణం విషయంలో ముందుకు సాగే మార్గం కనిపించడం లేదు.
కోరెషు మరణం తరవాత అతని కుమారుడు కేంబిసెస్ రాజయ్యాడు (క్రీ.పూ.530-522). అతడు యూదా ప్రాంతం గుండా కదం తొక్కుతూ వెళ్ళి ఐగుప్తు దేశంలోని చాలా ప్రాంతాలను జయించాడు. కానీ తిరుగు ప్రయాణంలో అతడు మరణించాడు (బహుశా హత్యగావించబడి ఉండొచ్చు). అతని అధికారుల్లో ఉన్నత స్థానంలో ఉన్న దర్యావేషు అనే వ్యక్తి బబులోనుకు తిరుగు ప్రయాణంలో పర్షియా సైన్యానికి నాయకత్వం వహించి బబులోనులో గమాటా అనే సైన్యాధికారి నాయకత్వంలో తిరుగుబాటు చేసిన దళాన్ని ఓడిరచి క్రీ.పూ.522 లో బబులోనుకు రాజయ్యాడు. అతడు అనేక తిరుగుబాటులను అణచివేసిన తరవాత రాజ్యంలో సత్రాపుల పరిపాలనా విధానాన్ని పునరుద్ధరించాడు. దాని ఫలితంగా క్రీ.పూ.520 నాటికి పర్షియా సామ్రాజ్యంలో శాంతి నెలకొంది.
దర్యావేషు పాలన రెండవ సంవత్సరంలో (క్రీ.పూ.520: హగ్గయి 1:1; ఎజ్రా 4:24-5:2) సామ్రాజ్యంలో రాజకీయాధికారం కోసం కలహాలు ముగిసిన తరవాత మందిరాన్ని పునర్నిర్మించడంలో యెరూషలేము నాయకులను ప్రోత్సహించమని దేవుడు హగ్గయిని ఆదేశించాడు. ఈ మందిర పునర్నిర్మాణం విషయం గురించి విన్న పాలనాధికారి తత్తెనై దానికి ప్రభుత్వ అనుమతి ఉన్నదా లేదా అని తెలుసుకోడానికి దర్యావేషుకు లేఖ రాశాడు (ఎజ్రా 5:3-18). దర్యావేషు ఆ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అనుమతించడమే కాక ఎగ్బతానాలోని రాజనగరంలో (ఎజ్రా 6:1-12) లభించిన కోరెషు జారీచేసిన ఉత్తర్వులు నిర్ధారించిన ప్రకారం దానికి కావలసిన ధనసహాయం రాజు ధనాగారం నుండి పంపే ఏర్పాటు చేశాడు. దాని ఫలితంగా నాలుగు సంవత్సరాల కాలంలో మందిర నిర్మాణం పూర్తయ్యింది (ఎజ్రా 6:15).
గ్రంథ సందేశం, దాని ఉద్దేశం
హగ్గయి తన సందేశాలతో మందిరాన్ని పునర్నిర్మించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచమని తన శ్రోతలను ప్రోత్సహించాడు. అతడు (ఎ) ఎవరూ తమ స్వంత అవసరాలపైనే దృష్టి ఉంచకూడదనీ (1:4), (బి) ఇప్పుడు నిర్మించిన మందిరం సొలొమోను దేవాలయం వంటి మహిమ గలదిగా లేనందుకు నిరుత్సాహపడవద్దనీ (2:3), (సి) అశుద్ధంగా, అపవిత్రంగా ఉండకూడదనీ (2:10-14), (డి) తాము నిరుపయోగమైనవాడిని, శక్తిహీనుడిని అని ఎవరూ భావించకూడదనీ (2:20-23) వారికి బోధించాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలనే పిలుపు, హెచ్చరిక మనకు బైబిలు అంతటిలో పదే పదే కనిపిస్తుంది, దానికి చెరనుండి తిరిగి వచ్చిన తరువాతి కాలం మినహాయింపేమీ కాదు. హగ్గయి చెరనుండి తిరిగి వచ్చి యెరూషలేములో నివసించే యూదులతో మాట్లాడుతూ వారు కేవలం తమ స్వంత సౌకర్యాల విషయం ఎక్కువగా ఆలోచించకుండా దేవుణ్ణి ఘనపరచడంపై దృష్టి సారించాలి అని వారిని సవాలు చేశాడు. దీనిలో వారి నిబద్ధత మందిర నిర్మాణం విషయంలో వారు చేసే పనిలో ప్రతిబింబించాలి. హగ్గయి పలికిన ఈ మాటలు ఆ తరవాతి కాలంలో యేసు పలికిన మాటల్లో ప్రతిబింబించాయి, ‘‘కాబట్టి మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును’’ (మత్తయి 6:33). ప్రజలు తమ ప్రాధ్యాతలను సరిచేసుకొని ముందుగా దేవుని మందిర పునర్నిర్మాణం చేపట్టడం ద్వారా దేవునికి ప్రధమ స్థానం ఇవ్వడం అనే విషయం చాలా ప్రాముఖ్యమైందని హగ్గయి ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రజలు ఈ పనికి తిరిగి పూనుకోవడం వారు తమ ప్రాధాన్యతలను సరిచేసుకోడానికి ఒక సూచనగా ఉంటుంది. దేవుడు తన శేష ప్రజల మధ్య ఉన్నాడనీ, వారి పునరుద్ధరణ గురించి ఆయన చేసిన వాగ్దానాల నెరవేర్పు మొదలైందనీ దీని అర్థం. ఈ విషయంలో వారు చూపే విధేయత దేవునికి మహిమ తెచ్చి ఆయనకు సంతోషం కలిగిస్తుంది. దేవుని నామానికి అవమానం కలిగేలా జరిగిన దేవాలయ విధ్వంసం విషయంలో అది దేవుని స్పందనను ధృవీకరించింది. చివరిగా హగ్గయి బోధకు వారు చూపిన విధేయత ఒక కొత్త నిబంధనకూ మెస్సీయ యుగానికీ ప్రతీకగా మారింది. దేవాలయ పునర్నిర్మాణం దేవుడు లేవీతో, దావీదుతో తన నిబంధన నుండి ఎన్నడూ తొలగిపోలేదన్న దానికి గుర్తుగా ఉంది. దేవుడు ఒక మహిమాన్వితమైన మందిరాన్ని, ఒక మెస్సీయ పరిపాలకుని ద్వారా శుద్ధీకరణనూ, పునరుద్ధరణనూ వారికి అనుగ్రహిస్తాడు.
నిర్మాణం
హగ్గయి గ్రంథంలో కాలక్రమంలో వరుసగా రాసిన నాలుగు ప్రతిఘటనాత్మక క్లుప్త సందేశాలు ఉన్నాయి. యెరూషలేములోని నాయకులు, ప్రజలు తమ వేదాంతపరమైన ఆలోచనా విధానంలో, తమ ప్రవర్తనలో ఏ విధమైన మార్పులు చేసుకోవాలో అవి సూచిస్తున్నాయి. దీని నిర్మాణంలో ఒక తర్కబద్ధమైన పురోగతిని చూడవచ్చు. ప్రజలు దేవుణ్ణి మహిమపరచి తీరాలి (1:1-15), దేవుని ప్రణాళికలకు బద్ధులై ఉండాలి (2:1-9), పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుణ్ణి సంతోషపరచాలి (2:10-19), ఆయన్ని నమ్మకంగా సేవించాలి (2:20-23).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”