పాత నిబంధన కాలం ముగింపుకు ముందు దేవుని నుండి వచ్చిన చివరి ప్రవచన సందేశం మలాకీ గ్రంథం (అయితే ప్రవచనాత్మకం కాని ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలు లాంటి గ్రంథాలు దీని తర్వాత రాసి ఉండవచ్చు). ఈ చిన్న గ్రంథంలో పాత నిబంధన సందేశ సారమంతా ఉంది. అది దేవుని స్వభావాన్నీ, ఆయనపట్లా, నిబంధనా సమాజంలోని ఇతరులపట్లా మనం కలిగి ఉన్న సంబంధాన్నీ వెల్లడిపరుస్తుంది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: రచయిత పేరు తప్ప అతని గురించి మరే ఇతర సమాచారం మనకు తెలియదు. ఈ గ్రంథం సందేశకుణ్ణి కాక అతని సందేశాన్ని నొక్కి చెబుతున్నది. దీనిలోని 55 వచనాల్లో సుమారు 47 వచనాలను పలికింది దేవుడే. 3:1 లో దేవుడు తన మందిరానికి వచ్చేలా ఆయనకు ‘‘మార్గము సిద్ధపరచుటకై’’ అని ప్రవచించిన వ్యక్తి హెబ్రీలో మలాకీ అని గుర్తించబడ్డాడు. అంటే ఈ గ్రంథ రచయిత పేరుతో సమానమైన ‘‘నా దూత’’ అని అర్థం.
నేపథ్యం: ఈ గ్రంథంలో ఎవరైనా ఒక రాజుతో లేక ఏదైనా ఒక సంఘటనతో జోడిరచి ఉన్న తేదీ ఏదీ ప్రస్తావించకపోయినా, దీని అంతర్గత రుజువులు, పా.ని. కేనన్లో దీని స్థానం ఇది చెరనుండి తిరిగి వచ్చిన తరవాత రాసి ఉండవచ్చని సూచిస్తున్నది. 1:8 లో కనిపించే అధికారి (గవర్నర్) ప్రస్తావనను బట్టి పర్షియా రాజ్య పాలనాకాలంలో పాలస్తీనా, సిరియా, ఫొనీషియా, కుప్ర, ఇంకా క్రీ.పూ.485 వరకు బబులోను, వీటన్నిటితో కూడి ఉన్న అబర్ నహారా అనే పారశీక సత్రాపు అధీనంలో యూదా ఉన్న కాలంలో రాసి ఉండవచ్చు అని తెలుస్తున్నది. దేవాలయం అప్పటికే పునర్నిర్మాణమై (క్రీ.పూ.515), ఆరాధన తిరిగి స్థాపించబడిరది (1:6-11; 2:1-3; 3:1,10).
కాని హగ్గయి, జెకర్యా ప్రవక్తల పరిచర్య రేకెత్తించిన ఉత్తేజం, ఉత్సాహం అప్పటికి చల్లారిపోయింది. మలాకీ సంబోధించిన సామాజిక, మతసంబంధమైన సమస్యలు ఎజ్రా 9,10 అధ్యా.లు, నెహెమ్యా 5, 13 అధ్యాయాల్లోని పరిస్థితుల్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇది దీని రచనాకాలాన్ని ఎజ్రా యూదాకు తిరిగి రావడానికి కొద్దిగా ముందు (క్రీ.పూ.460) లేక నెహెమ్యా రెండవసారి యూదా అధికారిగా (నెహెమ్యా 13:6-7, క్రీ.పూ.435) వచ్చిన కాలం కావచ్చు అని సూచిస్తుంది. దీని సాహితీ నిర్మాణం చూస్తే అంతకంటే ముందుగానే రాసినట్టు సూచిస్తుంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
నహూము (నహూము 1:1) హబక్కూకు (హబ 1:1) గ్రంథాల్లాగా ఇది కూడా ఒక దేవోక్తి అని చెప్పాలి (మలాకీ 1:1). మస్సా అనే ఈ హెబ్రీ పదం పా.ని.లో 20 సార్లు కనిపిస్తుంది (ఉదా. 2రాజులు 9:26; యెషయా 13:1; జెకర్యా 9:1; 12:1). ఒకప్పుడు ‘‘భారం’’ అని అర్థం చేసుకోబడినా ఇది సామాన్యంగా దేవుని ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఒక దైవిక ప్రకటనను సూచిస్తుంది.
దోషారోపణ: మలాకీ ఎక్కువభాగం యూదా ప్రజలు పలికిన మాటలను పేర్కొంటూ, వారి ఆలోచనలను తిరిగి పలుకుతూ, వారి స్వంత వైఖరులను వర్ణిస్తూ వారు చేసిన పాపాలను ఎత్తిచూపాడు (1:2,6-7,12-13; 2:14,17; 3:7-8,13-15). దేవునికి భయపడే విషయంలో, కష్టసమయాల్లో ప్రజలకు నమ్మకంగా సేవచేసే విషయంలో యాజకుల వైఫల్యాన్ని మలాకీ ఎదుర్కొన్నాడు. ఆ వైఫల్యం దేవునిపట్ల యూదావారి నిర్లిప్తతకు దారితీసింది. తమ ఆర్థిక, సామాజిక కష్టాలకు దేవుని అపనమ్మకత్వమే కారణమని ఆరోపిస్తూ ప్రజలు ఒకరిపట్ల ఒకరు అపనమ్మకంగా ప్రవర్తిస్తూ (మరి ముఖ్యంగా తమ భార్యల విషయంలో) అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నారు. వారు తమ దశమభాగాలను ఇవ్వడం కూడా ఆపివేశారు.
ఉపదేశం: నిజాయితీతో కూడిన విశ్వాసం, దీనత్వంతో కూడిన యథార్థమైన ఆరాధనను దేవుడు కోరాడు. పవిత్రమైన అర్పణలు అర్పించడం, మానవసంబంధమైన, మరి ముఖ్యంగా వివాహసంబంధమైన ఒప్పందాల్లో నమ్మకంగా ఉండడం, తాము పొందిన ప్రతిదానిలో నుండి దశమభాగాలను ఎప్పటికప్పుడు చెల్లించడం ద్వారా యెహోవాను తమ దేవుడుగా, రాజుగా గుర్తించడం అనేవి దీనిలో ఇమిడి ఉన్నాయి.
తీర్పు: యాజకులు గనుక తమ ప్రవర్తనను మార్చుకోకపోతే దేవుడు వారిని శపించి తన సేవనుండి వారిని తొలగిస్తాడు. ‘‘న్యాయకర్తయగు దేవుడు’’ వచ్చి దుర్మార్గులకు తీర్పుతీర్చి తన ప్రజలను శుద్ధి చేసే ఒక రోజును గురించి కూడా మలాకీ ప్రకటించాడు (మత్తయి 3:12; 13:24-30).
నిరీక్షణ: వారి విధేయతకు కలిగే బహుమానాలుగా మలాకీ (1) ఇశ్రాయేలుపట్ల దేవుడు కనపరచిన ప్రేమను (1:2), (2) దేవునితో, సాటివారితో ఆధ్యాత్మికమైన, నిబంధనా సంబంధమైన ఐక్యత (2:10), (3) ఆయనకు భయపడేవారికి రక్షణ, ఆశీర్వాదాలు కలిగే ఒక రోజును (3:1-16; 3:16-4:3) గురించీ పేర్కొన్నాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
మలాకీ పా.ని. కాలం ముగింపుకు ముందు దేవునినుండి వచ్చిన చివరి ప్రవచనాత్మక సందేశం. ఈ గ్రంథం పా.ని.కి సరైన ముగింపుగా, కొ.ని. లోని రాజ్యసువార్త ప్రకటనను అర్థం చేసుకోడానికి ఒక మంచి వారధిగా ఉంది. మలాకీ సమస్యల్లో ఉన్న ప్రజల హృదయాలను స్పందింపజేసేలా మాట్లాడాడు. ఆనాటి ఆర్థిక అభద్రత, మతసంబంధ సంశయవాదం, వ్యక్తిగత నిరాశా నిస్పృహలతో ఉన్న పరిస్థితులు ఈ నాటి దేవుని ప్రజలకు కూడా తరచుగా అనుభవమే.
దేవుణ్ణీ ఆయన రాజ్యాన్నీ పొంది ఇతరులను కూడా అలాంటి అనుభవానికి నడిపించాలనే కోరిక ఉన్నవారు పట్టించుకోకుండా దాటిపోలేని ఒక సందేశం ఈ గ్రంథంలో ఉంది. తన ప్రజల విషయంలో మహిమాన్వితమైన ఉద్దేశాలు కలిగి, ఎన్నడూ మారని ఒక గొప్ప, ప్రేమగల పరిశుద్ధుడైన దేవుడు మనకున్నాడు. ఆయన మనల్ని స్వచ్ఛమైన ఆరాధనకు, తనపైనా, ఒకరినొకరిపైనా నమ్మకత్వానికి పిలిచాడు. ఆయన ఏం చేస్తున్నాడో, ఈ లోకంలో తన ప్రజలకోసం ఏం చేస్తానని చెప్పాడో దాని విషయంలో మనం ఎదురుచూపులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ అత్యున్నతమైంది. ఈ లోక రాజ్యాలన్నిటిలో ఆయన ఇశ్రాయేలును ఎన్నుకోవడం, దానిని కాపాడడం అనేవి మలాకీ గ్రంథంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మార్పులేని తన ప్రేమతో ఆయన యూదా విషయంలో వ్యవహరించాడు కాబట్టి, యూదా కూడా తన బాధ్యతల విషయంలో విధేయత, నమ్మకత్వం, యథార్థమైన ఆరాధన కనపరుస్తూ జీవించాలి.
దేవునికీ యూదాకూ మధ్య ఉన్న ఈ ప్రేమ సంబంధం విమోచింపబడిన మన సమాజంలో ఇతర సభ్యులతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో ఒక నమూనాగా ఉంది. ఒకరితో ఒకరి సంబంధాలన్నిటిలో వారు విశ్వాసపాత్రంగా జీవించాలి. దేవునికి సమర్పించుకొన్న సమాజంగా ఆయన ప్రజలు ఆయన భద్రతను, పోషణను అనుభవిస్తారు. అయితే దేవుని పట్లా, ఇతరుల పట్లా సరైన విధంగా జీవించడంలో విఫలమైతే అది దేవుని తీర్పును తీసుకొస్తుంది. దేవుని పట్లా, ఇతరుల పట్లా తమ బాధ్యతల విషయంలో ఎడతెగక విఫలమయ్యేవారు ఆయన దీవెనలు అనుభవించే ఆనందాన్ని కోల్పోతారు. దేవుడు యూదాను తన తీర్పు అనే త్రాసులో సరిచూసే ముందు పశ్చాత్తాపం చెందడానికి ఆయన వారికి ఒక చివరి అవకాశం అనుగ్రహిస్తాడు. భయంకరమైన యెహోవా దినముకు ముందు ఒక వార్తాహరుడు వచ్చి ఈ భూమిపై దేవుని రాజ్య ఆగమనం గురించి ప్రకటిస్తాడు.
గ్రంథ నిర్మాణం
ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న మూడు ప్రకటనలతో మలాకీ సందేశం వ్యక్తం చేయబడిరది. ఒక్కొక్క ప్రకటనలో ఒక కేంద్ర విభాగం చుట్టూ అల్లుకున్న అద్దంలాటి నిర్మాణాలతో కూడిన ఐదు విభాగాలు ఉన్నాయి (ఎ-బి-సి-బి-ఎ). మొదటి రెండు ప్రకటనలు సానుకూల ప్రేరణ లేక నిరీక్షణ (1:2-5; 2:10)తో ప్రారంభమై ఒక వ్యతిరేకమైన ప్రేరణ లేక తీర్పుతో ముగుస్తాయి (2:1-9; 3:1-6). మధ్యభాగంలో దేవుని ఆజ్ఞలతో (1:10; 2:15-16) కూడిన దోషారోపణ (1:6-9; 1:11-14; 2:10-15; 2:17) చూస్తాం. చివరి, ముగింపు ప్రకటన పశ్చాత్తాపం చెందమనే ఆజ్ఞలతో ప్రారంభమై అదే విధంగా ముగుస్తుంది (3:7-10; 4;4-6). మధ్య మధ్యలో దోషారోపణ (3:13-15), దాని చుట్టూ అల్లుకొని ఉన్న ప్రేరణ విభాగాలు (3:10-12; 3:16-4:3) చూస్తాం.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”