యోహాను సువార్త సమదృక్పథó సువార్తలైన మత్తయి, మార్కు, లూకాలకన్నా భిన్నంగా ఉంటుంది. దీనిలోని సుమారు 90 శాతం కంటే ఎక్కువ విషయాలు విశిష్టమైనవి, మిగిలిన వాటిలో లేనివి. యోహాను సువార్త మిగిలిన సువార్తలలో ప్రముఖంగా ఉండే అద్భుతాల మీద, ఉపమానాల మీద, బహిరంగ ప్రసంగాల మీద దృష్టిపెట్టదు. దాని బదులుగా, యోహాను సువార్త యేసు దేవుని కుమారుడు అనే ఆయన గుర్తింపును నొక్కిచెబుతూ, విశ్వాసులంగా మనం ఆయన బోధలకు ఎలా స్పందించాలో చెబుతుంది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: యోహాను సువార్తను శ్రద్ధగా చదివితే, దాని రచయిత ఒక అపొస్తలుడనీ (1:14ను 2:11; 19:35 తో పోల్చండి), పన్నెండుమందిలో ఒకడనీ (‘‘యేసు ప్రేమించిన శిష్యుడు’’ 13:23; 19:26; 20:2; 21:20 ను 21:24-25 తో పోల్చండి). ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే, జెబెదయి కుమారుడైన యోహాను (యేసు ప్రేమించిన శిష్యునికి పేతురుతో ఉన్న సాన్నిహిత్యాన్ని గమనించండి – 13:23-24; 18:15-16; 20:2-9; 21; లూకా 22:8; అపొ.కా.1:13; 3-4; 8:14-25; గలతీ 2:9-10). సంఘపితరులు కూడా దీన్ని నిర్ధారించారు (ఉదా., ఐరేనియస్). అపొస్తలిక పదవి సంఘచరిత్రలో పునాదివంటిది కాబట్టి (అపొ.కా.2:42; ఎఫెసీ 2:20), యోహాను సువార్త అపొస్తలుడు రాశాడన్నది, కళ్ళారా చూసిన సాక్షికున్న ప్రత్యేక అధికారాన్ని పెట్టుబడిగా కలిగింది (యోహాను 15:27; 1యోహాను 1:1-4).
నేపథ్యం: రాసిన కాలం సుమారు క్రీ.శ. 70 నుండి (యెరూషలేము దేవాలయం నాశనమైన సంవత్సరం) క్రీ.శ.100 (యోహాను జీవితాంతం) మధ్య, బహుశా 80 వ దశకంలో కావచ్చు. 70 తర్వాత అనే తేదీని సూచించడానికి కారణం, తిబెరియ సముద్రం గురించి 6:1; 21:1 లో ప్రస్తావించడం (గలిలయ సముద్రానికి ఆ పేరు మొదటి శతాబ్దం చివరిలోనే విస్తృతంగా వాడబడిరది); యేసును ‘‘నాదేవా, నా ప్రభువా’’ అని 20:28 లో తోమా ఒప్పుకోవడం (డొమిషియన్ కాలంలో చక్రవర్తి ఆరాధనకు విరుద్ధంగా చెప్పిన వ్యాఖ్య కావచ్చు); పేతురు హతసాక్షి అయ్యే విషయాన్ని పేర్కొనడం (అది క్రీ.శ.65 లేక 66 లో జరిగింది; 21:19); సద్దూకయ్యులను గురించిన ప్రస్తావన లేకపోవడం, ఎందుకంటే వారు క్రీ.శ.70 తర్వాత యూదుల మత విభాగంగా లేకుండా పోయారు; యోహాను యేసును దేవునితో సమానంగా సులువుగా పోల్చడం (1:1,14,18; 10:30; 20:28). ఆది సంఘపు సాక్ష్యం కూడా క్రీ.శ. 70 తర్వాతి తేదీని అంగీకరిస్తుంది. అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంతు (యుసేబియస్ రాసిన సంఘ చరిత్రలో పేర్కొనబడ్డాడు) ‘‘చివరిగా, యోహాను బాహ్యపరమైన వాస్తవాలు (అధికారపూర్వకంగా స్వీకరించిన మిగిలిన సువార్తలలో) స్పష్టంగా ఉన్నాయని గ్రహించి… ఒక ఆత్మీయమైన సువార్తను రచించాడు’’ అని వ్యాఖ్యానించాడు. రాసిన ప్రదేశం బహుశా ఎఫెసు కావచ్చు (ఐరేనియస్, యుసేబియస్లు ఈ విషయాన్ని వారి రచనలలో ధృవీకరించారు). ఎఫెసు ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలోని అతిముఖ్యమైన పట్టణ కేంద్రాలలో ఒకటి. అయితే, యోహాను సువార్త ఏదో ఒక పట్టణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాయబడిరది కాదు.
యోహాను తొలి పాఠకులలో ఎక్కువ శాతం మంది, మొదటి శతాబ్దాంతానికి బహుశా గ్రీకు-రోమా ప్రపంచంలోనివారు, దాని బయటివారు కావచ్చు. అందువల్లే యోహాను తరచుగా యూదుల సాంప్రదాయాలను వివరించాడు, పాలస్తీనా భౌగోళిక పరిస్థితిని చెప్పాడు, అరామిక్ మాటలను గ్రీకులోకి అనువదించాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
20:30-31 లోని వ్యాఖ్య ఉద్దేశాన్ని తెలుపుతూ, యోహాను సౌవార్తీకరణ ఉద్దేశంతో, తన సువార్తను చదివే క్రైస్తవ పాఠకుల ద్వారా అవిశ్వాసులను చేరే ఉద్దేశంతో దీన్ని రాసి వుంటాడనిపిస్తుంది. దీని రచనాకాలం యెరూషలేము దేవాలయం నాశనం అయిన కాలం 70 తర్వాత అయితే, పాత పరిశుద్ధ స్థలానికి బదులుగా, దాని స్థానంలో దేవుని ప్రజలు ఆరాధించే కొత్త దేవాలయంగా, ఆరాధనా కేంద్రంగా యేసు ఉన్నాడని చెప్పడానికి యోహాను ప్రయత్నించాడు.
యేసు దైవత్వం
తన సువార్త ఆరంభం నుండే యోహాను యేసు దైవత్వాన్ని నొక్కి చెబుతూ వచ్చాడు. యేసు దేవునివద్ద ఉన్న, దేవుడైయున్న నిత్యవాక్కు (గ్రీకు. లోగోస్) అని ఉపోద్ఘాతం నిర్ధారిస్తుంది. యేసు ‘‘నేనే’’ అనే ప్రత్యేకమైన మాటను యోహాను సువార్తలో ఏడుసార్లు ఉపయోగించి, దేవుని వ్యక్తిగత నామాన్ని తనదిగానే పలికాడు. యోహాను సువార్తలో యేసు అన్నిటిపై అధికారం గలవాడుగా, తరువాత ఏమి జరుగబోతోంది అనేది ముందే తెలిసినవాడుగా కనిపిస్తాడు.
ఎరుగుట, నమ్ముట: దేవుణ్ణి, యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం (17:3). దేవుని గురించిన మరింత జ్ఞానం యేసును నమ్మి, ఆయనను ఎరగడం ద్వారానే వస్తుంది. ‘‘ఎరుగుట’’, ‘‘నమ్ముట’’ అనేవి యోహానులోని మూల పదాలు. ఇవి రెండూ సుమారు 90 సార్లు ఈ సువార్తలో కనిపిస్తాయి. అన్నిసార్లూ వాటిని క్రియాపదాలుగానే వాడాడు. దేవున్ని ఎరగడం, యేసునందు విశ్వాసముంచడం అనేవి ఆచరణాత్మకంగా చూపవలసినవని ఈ సువార్తలోని యేసు బోధ మనకు గుర్తుచేస్తుంది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
సువార్తలన్నిటిలో, కొ.ని. పుస్తకాలన్నిటిలో యోహాను సువార్త యేసు క్రీస్తు దైవత్వాన్నీ, ఆయన సృష్టికి ముందే ఉన్నాడనీ స్పష్టంగా బోధిస్తుంది (1:1-2,18; 8:58; 17:5,24; 20:28). మత్తయి సువార్తతో పాటు, యేసును క్రీస్తుగా చూపించే అత్యంత శక్తివంతమైన ఆధారాలను ఇది ఇస్తుంది. ఏడు మెస్సీయ సూచకక్రియలను చెప్పడంద్వారా దానిని నిరూపిస్తుంది (2:11 నోట్సు చూడండి). ఏడుసార్లు ‘‘నేనే’’ అనే యేసు వ్యాఖ్యలతో (6:35,48 నోట్సు చూడండి), నిర్దిష్టంగా నెరవేరిన లేఖనాలను పేర్కొనడంతో, (ముఖ్యంగా యేసు శ్రమనుగురించి), అలాగే యూదుల పండుగలు, వ్యవస్థలలోని వివిధ సాదృశ్యాలను యేసు ఎలా నెరవేర్చాడో చూపాడు. యేసు మెస్సీయగా పరిచర్య చేయడం, తండ్రిjైున దేవునితో ఆరంభమవ్వడాన్ని (7:16,18,28,33; 8:26,29; 15:21), తన ఆత్మశక్తితో, తన కొత్త మెస్సీయ సమాజాన్ని ఆయన పనికి నియమించడంతో ముగుస్తుంది (20:21-22). యోహాను కొ.ని. అంతటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన – తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు – త్రియేక దైవత్వాన్ని చిత్రీకరిస్తూ, ఆది త్రిత్వవాదులకు మరింత పరిణతి చెందిన ఆలోచనలు, సంఘ చరిత్రలో క్రీస్తునుగూర్చిన సూత్రాలను అందించాడు.
గ్రంథ నిర్మాణం
యోహాను రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించబడిరది. మొదటి భాగం (అధ్యా.2-11)లో దృష్టి అంతా యేసు లోకానికి చేసిన పరిచర్య మీద, ఆయన చేసిన సూచకక్రియల పైన ఉంటుంది. వివిధ స్పందనలకు దారితీసిన ఏడు సూచకక్రియలను యేసు చేశాడు. రెండవ అతి ముఖ్యభాగం (అధ్యా.12-21) యేసు తన శిష్యులకు చేసిన బోధలను, ఆయన విజయవంతమైన ‘సిలువ శ్రమ’ కాలాన్ని వివరించింది. యేసు శ్రమ కాల వర్ణనలో జరిగిన సంభవాలన్నీ ఏ విధంగా యేసు స్వాధీనంలో ఉన్నాయో వివరించడంలో యోహాను దృష్టి సారించాడు. తన శత్రువులు తనను ఎలా బంధించాలో ఆయనే సూచించాడు (18:4-8). ఆయన విషయంలో నిర్ణయం తీసుకోవడానికి పిలాతు ఎంతో తడబడ్డాడు, కాని ఏమి జరుగబోతోందో యేసుకు తెలుసు. యేసు ఒక గొఱ్ఱెపిల్లలాగా మరణించాడు. పస్కా పండుగ కోసం గొఱ్ఱెపిల్లలు వధించబడిన సమయంలోనే ఆయన బలిగా మారాడు (19:14).