పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలో 2కొరింథీ పత్రికలాగా అతని హృదయాన్ని ఇంత లోతుగా వెల్లడిపరచిన మరొక ఉత్తరం లేదు. అదే సమయంలో కొ.ని.ఉత్తరాల్లోకెల్లా ఇది అత్యంత సమర్థనాపూర్వకమైన రీతిలో రాయబడిరది. దీనిలో పౌలు తన అధికారం, పరిచర్య విషయంలో తనను తాను సమర్థించుకుంటూ గొప్ప వాదన (సానుకూల సమర్ధనావాదం) చేశాడు. ఈ ఉత్తరంలో అనేక ప్రముఖమైన సిద్ధాంతాలు బోధించబడ్డాయి. అయితే అన్ని కాలాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సువార్తికుని హృదయాన్ని, స్ఫూర్తిని వెల్లడిరచడంలోనే ఈ పత్రిక నిజమైన విలువ అంతా దాగి ఉంది. ఎదురయ్యే వ్యతిరేకతల నుండి కాపాడుకుంటూనే అతని యథార్థమైన పరిచర్య కోసం అతనిని నియమించింది క్రీస్తే అనీ, దానిని బలపరచింది పరిశుద్ధాత్మ అనీ ఈ పత్రిక మనకు రూఢపిరచింది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: బైబిలు పండితులందరూ ఈ ఉత్తరం రాసింది పౌలు అని అంగీకరించారు (1:1; 10:1). మిగిలిన అన్ని పత్రికల్లో కంటే దీనిలో అతని గురించిన వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉంది. దీనిలోని గ్రీకు శైలి అతడు రాసిన రోమా, 1కొరింథీ పత్రికలను పోలి ఉంది. పౌలు జీవితం, పరిచర్య గురించిన కాలక్రమ వివరాల్లో చాలా వ్యత్యాసాలు కనిపించినా, 2కొరింథీ పత్రిక సుమారు క్రీ.శ.56 లో రాసి ఉంటాడని అంగీకరించబడిరది (పౌలు మూడవ మిషనరీ యాత్రలో ఎఫెసు నుండి).
నేపథ్యం: 2కొరింథీ పత్రిక రాయడానికి నడిపించిన సంఘటనల వరుస క్రమం విషయంలో బైబిలు పండితుల్లో భేదాభిప్రాయాలున్నప్పటికీ ఈ కింది వరుస సరైనదనిపిస్తుంది.
1. అతడు రాసిన 1కొరింథీ పత్రికను కొరింథు సంఘంలోని విశ్వాసులు అంత సంతోషంగా అంగీకరించలేదు. తిమోతి ఎఫెసులో ఉన్న పౌలు దగ్గరకు తిరిగి వచ్చాడు (1కొరింథీ 4:17; 16:10). ఆ సంఘం ఇంకా కలవరపూరితంగానే ఉందని అతడు తన నివేదికలో పేర్కొన్నాడు. అప్పటికే కొరింథుకు చేరుకున్న ‘‘దొంగ అపొస్తలులు’’ (2కొరింథీ 11:13-15) ఆ పరిస్థితికి కొంతవరకు కారణం. బహుశా వారు అన్య నేపథ్యం నుండి వచ్చిన కొరింథు విశ్వాసులు మోషే నియమాలను పాటించాలని ఒత్తిడి చేస్తున్న యూదు మతవాదులు అయి ఉంటారు (గలతీ 2:14).
2. మొదటిసారి సంఘ స్థాపన సమయంలో దర్శించింది కాకుండా పౌలు కొరింథును రెండవసారి దర్శించాడు. దానిని అతడు బాధాకరమైన లేక ‘‘దు:ఖముతో’’ కూడిన కలయిక (2:1; 13:2) అని వర్ణించాడు. బహుశా దొంగ అపొస్తలులు పౌలును చేర్చుకోవద్దని కొరింథీయుల్ని రెచ్చగొట్టి ఉంటారనిపిస్తుంది. అపొ.కా.19 అధ్యా.లో ప్రస్తావించని ఈ రెండవ సందర్శనం బహుశా పౌలు ఎఫెసులో ఉండి జరిగించిన సుదీర్ఘమైన పరిచర్య సమయంలో జరిగి ఉంటుంది.
3. అప్పుడు పౌలు వారికి ఎఫెసు నుండి మరొక తీవ్రమైన గద్దింపుతో కూడిన ఉత్తరం (ఇది మనకు లభించలేదు) రాశాడు (2:3-4,9). ఈ ఉత్తరాన్ని అతడు తీతు ద్వారా కొరింథుకు పంపించాడు.
4. తీతు పౌలు దగ్గరకు తిరిగి వచ్చి కొరింథు సంఘంలో అధికసంఖ్యాకులు పశ్చాత్తాపం చెందారన్న వార్తను తీసుకొచ్చాడు. వారిప్పుడు పౌలు అధికారాన్ని అంగీకరించారు (7:5-7).
5. తనకు కలిగిన నెమ్మది గురించి సంతోషం వ్యక్తపరుస్తూ కొరింథీయులకు మరొక ఉత్తరం రాయాలనీ, అదే సమయంలో ఇంకా పశ్చాత్తాపం చెందని మిగిలిన కొద్దిమందిని వేడుకోవాలనీ పౌలు నిర్ణయించుకున్నాడు. తాను కొరింథుకు మూడవసారి వస్తానని వారికి వాగ్దానం చేశాడు (12:14; 13:1). పౌలు ఆయా సంఘాల నుండి యెరూషలేముకు ఆర్ధిక సహాయాన్ని తీసుకెళ్ళే సమయంలో అతడు కొరింథును దర్శించడం ద్వారా ఈ వాగ్దానం నెరవేర్చుకున్నాడు (అపొ.కా.20:2,3).
గ్రంథ సందేశం, ఉద్దేశం
కొరింథు విశ్వాసులు తనను అంగీకరించినదాన్ని బట్టి తన సంతోషాన్ని వ్యక్తపరచడానికీ, యెరూషలేములోని బీదలైన విశ్వాసుల నిమిత్తం వారినుండి కానుకలను సేకరించడానికీ, అక్కడ ఇంకా ఒక అపొస్తలుడుగా తన పరిచర్యను అంగీకరించని, పశ్చాత్తాపం లేని కొద్దిమంది కొరింథీయుల ముందు తనను సమర్ధించుకోడానికీ పౌలు ఈ ఉత్తరం రాశాడు. అక్కడి అధిక సంఖ్యాకులను ప్రోత్సహిస్తూ తన అపొస్తలిక పరిచర్య విషయంలో ఇంకా తనను అంగీకరించని కొద్దిమంది తమ మనసు మార్చుకొనేలా నడిపించాలని అతడు ఆశించాడు.
అపొస్తలిక అధికారం, పరిచర్యల స్వభావం, నూతన నిబంధన, మధ్యంతర స్థితి (విశ్వాసుల శరీర మరణం, వారి పునరుత్థానాల మధ్య వారి స్థితి), త్యాగపూరితంగా ఇవ్వడం అనేవి 2కొరింథీ పత్రికలో పౌలు చర్చించిన ముఖ్య అంశాలు. యథార్థమైన పరిచర్య స్వభావం అనేది అన్నిటినీ అధిగమించిన అంశం. అంశాల్లో ఇంతటి వైవిధ్యానికి కారణం అప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులే. క్రైస్తవ గృహనిర్వాహకత్వం గురించి కొ.ని.లో విస్తృతంగా బోధించబడిన త్యాగపూరితమైన దాతృత్వం 8-9 అధ్యాయాల్లోని ప్రధానాంశం. తాను స్థాపించిన ఆయా సంఘాలవారిని యెరూషలేములోని బీద విశ్వాసుల నిమిత్తం ఉదారంగా కానుకలు పంపించమని పౌలు కోరాడు. అతని మూడవ మిషనరీ యాత్రలోని చివరి భాగంలో అతడు ఎక్కువ సమయం, శక్తిని కేటాయించిన అంశం ఇదే. దీనిని అతడు తాను రాసిన అత్యంత నిడివైన మూడు ఉత్తరాల్లోను ప్రస్తావించాడు (రోమా 15:28; 1కొరింథీ 16:1-4; 2కొరింథీ 8-9 అధ్యా.).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
పరిచర్య అంటే ఏమిటో అర్థం చేసుకోడానికి 2కొరింథీ పత్రిక మనకు దోహదపడుతుంది. ఈ అంశం గురించి మనం నాలుగు కీలక సత్యాలను నేర్చుకుంటాం (1) దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు, (2) క్రీస్తు నామంలో చేసే నిజమైన పరిచర్యలో శ్రమలు, విజయం, రెండూ ఇమిడి ఉన్నాయి, (3) క్రీస్తును సేవించడం అంటే ఆయన నామంలో ప్రజల ప్రతి అవసరతనూ తీర్చడానికి ప్రయత్నించడం, (4) నాయకులకు తాము ఎవరికి పరిచర్య చేస్తున్నారో వారి సహకారం ఎంతైనా అవసరం.
గ్రంథ నిర్మాణం
పౌలు పేరుమీద ఉన్న ఇతర పత్రికలలో కనిపించే ప్రామాణికమైన రూపం దీనిలో కూడా కనిపిస్తుంది. ప్రారంభంలో అభివాదం (1:1-2) కృతజ్ఞతలు (1:3-11) ఆ తరువాత ఈ పత్రిక యొక్క ప్రధాన విభాగం (1:12-13:10) వస్తుంది. ముగింపులో చివరి శుభాకాంక్షలు ఉన్నాయి (13:11-13). 2కొరింథీ పత్రిక నిర్మాణం పౌలు ఉత్తరాల్లో ఎక్కువగా అతుకుల బొంతలాగా కనిపిస్తుంది. అధ్యా.1-9 (ఆదరణ, ప్రోత్సాహంతో నిండిన) లలో కనిపించే వాగ్ధోరణి నుండి 10-13 అధ్యాయాల్లోని (తీవ్రమైన, బెదిరించినట్టుగా) వాగ్ధోరణిలోకి మార్పు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ పత్రికలోని మౌలిక ఐక్యత గురించి ఎవరు ఏమని భావించినప్పటికీ 2కొరింథీ పత్రికలోని ప్రధానమైన మలుపు 10:1 లో చూడవచ్చు. మొదటి భాగంలో నుండి రెండవ భాగంలోకి ప్రవేశించేటప్పుడు పౌలు మాటల ధోరణిలో కనిపించే మార్పు కారణంగా చాలామంది 2కొరింథీ పత్రిక మౌలికమైన ఉద్దేశాన్ని వేరుగా అర్థం చేసుకున్నారు. మనం 2కొరింథీ పత్రిక అని పిలిచే ఉత్తరాన్ని రెండు వేర్వేరు ఉత్తరాల కలయికగా వారు ప్రతిపాదించారు. నిజానికి 10-13 అధ్యాయాలు ఇంతకు ముందు 1కొరింథీ పత్రిక తరువాత 2కొరింథీ పత్రిక 1 నుండి 9 అధ్యాయాలకు ముందు రాసింది, మనకు లభించకుండా పోయింది, అని మనం చెప్పుకున్న ముందటి ఉత్తరం అయి ఉండవచ్చు. ఈ వాదన సరైనదైతే ఈ అధ్యాయాల మధ్య పౌలు వాగ్ధోరణిలో వచ్చిన మార్పు దానికి ఒక ఆధారంగా ఉంది.
ఏదేమైనా, ఈ పత్రిక ప్రారంభం నుండీ ఇప్పుడున్న స్థితిలోనే ఉంది అని చెప్పడం మరింత ఆమోదయోగ్యంగా ఉంది అనిపిస్తుంది. ప్రాచీన క్రైస్తవ రచయితలందరికీ ఈ పత్రిక ఈ విధంగానే, అంటే ఏకీకృతమైన ఒక్కటే ఉత్తరంగా పరిచయం అయ్యింది. ఒక్క ఉత్తరంలోనే రెండు రకాలైన అంశాలను చర్చించడానికీ (అధిక సంఖ్యాకులు, అల్ప సంఖ్యాకులకు చెందినవి), తన భావాల వ్యక్తీకరణలో రెండు రకాల ధోరణులను (ప్రోత్సాహం, బెదరింపు) అవలంబించడానికీ ఒక రచయితకు స్వేచ్ఛ ఉండడం సమంజసమే.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”