పౌలు రాసిన ఉత్తరాల్లోకెల్లా ఫిలిప్పీ పత్రిక అత్యంత వ్యక్తిగతమైన ఉత్తరం. ఫిలిప్పీ నగరంలో ప్రారంభంలో కొన్ని సమస్యలెదుర్కొన్నప్పటికీ (అపొ.కా.16 అధ్యా) ఆ తరువాత పౌలుకు, అక్కడ మారుమనస్సు పొందిన వారికీ మధ్య ఒక లోతైన అనుబంధం ఏర్పడిరది. ఇటీవల అతడు చెరసాలలో ఉండగా ఆ సంఘం తనకు పంపించిన బహుమానం గురించి తన కృతజ్ఞతలు చెప్పడానికీ, తన ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించడానికీ పౌలు ఈ పత్రిక రాశాడు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ చిన్న ఉత్తరాన్ని అపొస్తలుడైన పౌలు రాశాడనే వాస్తవాన్ని ఏ బైబిలు పండితుడూ విభేధించలేదు.
నేపథ్యం: పౌలు ఈ ఉత్తరాన్ని రోమాలో తన మొదటి నిర్బంధం సమయంలో (క్రీ.శ.60-62) రాశాడని సాంప్రదాయికంగా అంగీకరించారు. ఈ కాలనిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.
పౌలు తన ‘‘మాసిదోనియ దర్శనము’’కు స్పందనగా (అపొ.కా.16:9-10) తన రెండవ మిషనరీ యాత్రలో (క్రీ.శ.51) ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించాడు. ఇది ఐరోపాలోని మొట్టమొదటి సంఘం (అపొ.కా.16 అధ్యా.). ఈ ఉత్తరంలో పౌలు రాసిన విషయాలు ఫిలిప్పీ సంఘం యొక్క అనేక లక్షణాలను తెలియజేస్తాయి. మొదటిది, అది అన్యులు అధికంగా ఉన్న సంఘం. ఫిలిప్పీలో యూదుల జనాభా అతి స్వల్పం. సంఘంలో కూడా కొద్దిమంది ఉన్నట్టు తెలుస్తుంది. రెండవది, ఆ సంఘంలో స్త్రీలు చెప్పుకోదగిన పాత్రను పోషించారు (అపొ.కా.16:11-15, ఫిలిప్పీ 4:1-2). మూడవది, ఆ సంఘం ఎంతో ఉదారత కలిగిన సంఘం. నాల్గవది, వారు పౌలు పట్ల లోతైన నమ్మకత్వాన్ని కనపరిచారు.
క్రెనిడెస్ అనే ప్రాచీన నగరమైన ఫిలిప్పీ చెప్పుకోదగిన సైనిక ప్రాబల్యం కలిగి ఉండేది. అది మహా అలెగ్జాండర్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. మాసిదోనియా వాడైన తన తండ్రి ఫిలిప్ జ్ఞాపకార్థంగా అతడు దానికి ఫిలిప్పీ అని నామకరణం చేశాడు. అది గ్రీకు సామ్రాజ్యానికి రాజధానిగా మారింది (క్రీ.పూ.332). రోమీయులు గ్రీస్ని ఆక్రమించుకొని జూలియస్ సీజర్ మరణించిన తరువాత (క్రీ.పూ.44) చెలరేగిన అంతర్యుద్ధంలో ఆంటోనీ, ఆక్టేవియస్లు తాము ఓడిరచిన సైన్యాలను (బ్రూటస్, కేసియస్) ఫిలిప్పీలో నివసింపజేయడం ద్వారా దానిని జనావాసంతో నింపారు. రోమాకు 800 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఫిలిప్పీ నగరాన్ని వారు ఒక రోమీయ ప్రవాసంగా ప్రకటించారు. ఆ నగరం తన గత చరిత్రను గురించి గర్విస్తూ, రోమా రాజకీయాలు, సామాజిక జీవనంలో కొనసాగుతూ అభివృద్ధి చెందింది. ఫిలిప్పీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు వివిధ సైనిక, రాజకీయ రూపాలను సంఘానికి రూపకాలంకారాలుగా ఉపయోగించాడు.
వారు పంపిన ఆర్థిక సహాయం నిమిత్తం పౌలు సంఘానికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాడు (4:10-20). వారిలోని
అనైక్యత, తప్పుడు బోధల వలని ప్రమాదం గురించి కూడా అతడు ప్రస్తావించాడు. వారి మధ్య రేగిన వ్యక్తిగత కలహాలు (4:2), వేదాంతపరమైన విభేదాలు (3:1-16) సంఘానికి ప్రమాదకరంగా మారాయి. సనాతన యూదు బోధకుల మూలంగా వారిలో తప్పుడు బోధలు వ్యాపించాయి. పౌలు ఈ రెండు విషయాల గురించీ వ్యక్తిగతంగా, స్నేహపూర్వకంగా ఈ ఉత్తరంలో చర్చించాడు.
రోమాలో ఉన్న పౌలుకు సహాయం చేయడానికి ఫిలిప్పీ సంఘం ఎపఫ్రొదితును పంపించింది. అక్కడ ఉండగా అతడు అనారోగ్యం పాలయ్యాడు (2:25-28). ఆ సంగతి సంఘానికి తెలియడంతో పౌలు అతని విషయంలో వారి ఆందోళనను తొలగించడానికి ప్రయత్నించాడు. బహుశా కొంతమంది అతడు తన పని విషయంలో విఫలమయ్యాడని ఎపఫ్రొదితును విమర్శించి ఉండవచ్చు. అయితే పౌలు అతణ్ణి ప్రశంసించి, ఇంటికి తిరిగి పంపాడు. బహుశా ఈ ఉత్తరాన్ని ఎపఫ్రొదితు తనతో తీసుకొని వెళ్ళి ఉంటాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ ఉత్తరం రాయడంలో పౌలుకున్న ఒక ఉద్దేశం రోమాలో తన పరిస్థితిని వివరించడం (1:12-26). అక్కడి క్రైస్తవ సమాజంలోని చీలికను బట్టి అతడు కలత చెందినా క్రీస్తు మహిమపరచబడుతున్నాడన్న వార్తను బట్టి అతడు బలం పొందాడు. పౌలు జీవన వేదాంతమే అతనిలోని ఆశావహ దృక్పథానికి పునాదిగా నిలిచింది.
తాను జీవించినా లేక మరణించినా, ఇతరులకు సేవచేయడం కొనసాగించినా లేక క్రీస్తు సన్నిధికి వెళ్ళిపోయినా, తనను ఇతరులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, క్రీస్తు మహిమపరచబడాలన్నదే పౌలు కోరిక. ఈ వివరణలో అనేక సందేశాలు ఇమిడి ఉన్నాయి.
ఏకత్వం: ఏకత్వం కలిగి ఉండాలని పౌలు సంఘాన్ని హెచ్చరించాడు (1:27-2:18). దాని విషయంలో రెండు అంశాలు అతనికి ప్రేరణగా నిలిచాయి. రోమాలో ఉన్న సంఘం చీలిపోయింది. ఆ అనైక్యత యొక్క ఫలితాలను అతడు అనుదినం గమనిస్తూ గడిపాడు. ప్రముఖులైన ఇద్దరు స్త్రీల మధ్య అభిప్రాయభేదాలు చెలరేగడం ద్వారా అలాంటి అనైక్యత ఫిలిప్పీ సంఘానికి ప్రమాదకరంగా మారింది. రోమాలోనూ, ఫిలిప్పీలోనూ ఉన్న సమస్యలకు మూలకారణం స్వార్ధమే. అందుకే పౌలు యేసు యొక్క దీనత్వాన్ని ఆ విశ్వాసులకు గుర్తు చేశాడు. వారు గనుక తమ జీవితాలను నడిపించడానికి క్రీస్తు వైఖరిని అనుమతిస్తే వారిమధ్య సామరస్యం పునరుద్ధరించబడుతుంది. క్రీస్తు గురించిన గీతం (2:5-11) ఈ పత్రిక అంతటికీ కీలకమైనది.
వ్యక్తులు క్రీస్తు మనస్సును తమలో వృద్ధి చేసుకున్నప్పుడు ఫలితంగా క్రైస్తవ ఏకత్వం నెలకొంటుంది. అనేక సమస్యాత్మక పరిస్థితుల్లో సంఘం సమిష్ఠిగా తమ నాయకుల పర్యవేక్షణలో ఆ సమస్యలను పరిష్కరించుకోగలిగింది (4:2-3). తాను వ్యవహరించవలసిన విధంగా నడిచే సంఘంలో సామరస్యం, ఆనందం, సమాధానాలు వెల్లివిరుస్తాయి.
ఆచారపరాయణత్వం నుండి స్వేచ్ఛ: యూదు ధర్మశాస్త్ర వాదుల విషయంలో జాగ్రత్త వహించమని పౌలు సంఘాన్ని హెచ్చరించాడు (3:2-21). ఆచారపరాయణులైన యూదు బోధకులు బాహ్యసంబంధ మతవిషయాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునివ్వడం ద్వారా సంఘం యొక్క జీవశక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. విశ్వాసం ద్వారా నీతిమత్వం గురించిన శక్తివంతమైన బోధ ద్వారా పౌలు వారిని ఎదిరించాడు. తన బోధను తన వ్యక్తిగత అనుభవం ద్వారా కనపరచడానికి నిర్ణయించాడు. అతడు ఒకప్పుడు వారి బోధలను అనుసరించి జీవించాడు గానీ అది లోపభూయిష్టమని తరవాత తెలుసుకున్నాడు.
రక్షణ: మరణము మట్టుకు విధేయత చూపిన క్రీస్తు ద్వారా రక్షణ అనుగ్రహించబడిరది. సువార్తను ముందుకు తీసుకెళ్ళాలనే తాపత్రయం గలిగిన అనేకమంది బోధకులు దీనిని ప్రకటించారు. విశ్వాసుల జీవితాలు శక్తివంతమైన సాక్ష్యాలుగా మారడం కోసం అవి మంచివైనా, చెడ్డవైనా, జీవితంలో వివిధ పరిస్థితుల మధ్య, ఈ సువార్త ప్రచురం చేయబడిరది. చివరిగా, రక్షణ క్రైస్తవులను, సంఘాలను ఆధ్యాత్మిక జీవితానికి మాదిరులుగా రూపొందిస్తుంది.
గృహనిర్వాహకత్వం: ఫిలిప్పీయులు పంపిన ఆర్ధిక సహాయం నిమిత్తం పౌలు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సంఘం పౌలుకు కొంత సొమ్మును, అతనికి పరిచర్య చేయడానికి ఎపఫ్రొదితు అనే ఒక నమ్మకమైన సేవకుణ్ణి పంపించింది. వారి ఔదార్యం పౌలును అతని వ్యక్తిగత అవసరతలో ప్రోత్సహించింది. దీనితో అతడు ఇచ్చుటలో ఉన్న బహుమానాలను వివరించడానికీ, క్రైస్తవ జీవనం గురించి బోధించడానికీ దానిని అవకాశంగా తీసుకున్నాడు.
వస్తు సంబంధమైన ఆస్తుల విషయంలో ఫిలిప్పీ సంఘం ఒక పరిణతి చెందిన స్థితిని చేరుకుంది. పేదరికంలో కూడా ఏ విధంగా ఇవ్వగలమో అని అది నేర్చుకుంది. సువార్తకూ, దానిని ప్రకటించేవారికీ సహాయం చేయడంలోని విలువను అది గ్రహించింది. దేవుడు తమ అవసరతలు తీర్చగలడని కూడా అది తెలుసుకుంది. పౌలు వస్తుసంబంధమైన విషయాల పట్ల తన వైఖరిని కూడా వ్యక్తపరిచాడు. అటూ ఇటూ ఊగిసలాడే ఆర్ధిక పరిస్థితుల మధ్య అతడు ఆధ్యాత్మిక సమతుల్యతను చూపించగలిగాడు. క్రీస్తే అతని జీవం, క్రీస్తు సమకూర్చేవే అతనికి అవసరమైనవి. ప్రతి విషయంలోనూ తన ద్వారా క్రీస్తు మహిమపరచబడ్డాడు అన్నదే పౌలు ఆనందం.
పోలి నడుచుకోవడం: అనుకరించడానికి క్రైస్తవ మాదిరులనేకం ఈ పత్రికలో కనిపిస్తాయి. అన్నిటినీ మించి సంఘం యేసును పోలి నడుచుకోవాలి. అయితే ఇతర క్రైస్తవులు కూడా ప్రశంసకు పాత్రులే. పౌలు, తిమోతి, ఎపఫ్రొదితు లాంటివారు దేవుడు తన ప్రజల్లో కోరుకొనే నిస్వార్ధ లక్షణాలను కలిగి ఉన్నారు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
యథార్థమైన క్రైస్తవ్యం గురించి ఫిలిప్పీ పత్రిక మనకెంతో బోధిస్తుంది. దీనిలోని అంశాల్లో చాలావరకు ఇతర పత్రికల్లో మనకు కనిపించవచ్చు గానీ ఆ అంశాలు, సందేశాలు జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వివరించడం ఈ పత్రికలోనే చూస్తాం. కొత్త నిబంధనకు సంబంధించినంత వరకు క్రైస్తవ నిబద్ధత గురించీ, క్రీస్తును పోలి ఉండడం గురించీ ఫిలిప్పీ పత్రిక మనకు మంచి అవగాహన కల్పిస్తుంది.
గ్రంథ నిర్మాణం
ఫిలిప్పీ పత్రికను నాలుగు ప్రాథమిక భాగాలుగా చేయవచ్చు. పౌలు కొన్ని విస్పష్టమైన సమస్యలు వారి ముందు ప్రస్తావించాలనుకున్నాడు. సంఘానికి ప్రమాదంగా పరిణమించిన కపట బోధకుల గురించి వారిని హెచ్చరించడానికి ఈ పత్రికను రాశాడు. చాలామట్టుకు పౌలు పత్రికలన్నీ బోధన, ఆచరణ అనే రెండు విభాగాలు కలిగి ఉంటాయి. కాని ఫిలిప్పీ పత్రికలో ఆ నమూనా కనిపించదు. పౌలు వేదాంతపరమైన బోధ ఈ లోతైన వ్యక్తిగత ఉత్తరం అంతటా అల్లుకొని ఉండడం మనం చూస్తాం.