కొలస్సీయులకు రాసిన పత్రిక పౌలు రాసిన చెరసాల పత్రికల్లో ఒకటి (ఎఫెసీ, ఫిలిప్పీ, ఫిలేమోను పత్రికలతో కలిసి). ఈ ఉత్తరం రాయడంలో పౌలు ఉద్దేశం కొలస్సీ సంఘంలో వ్యాపిస్తున్న అబద్ధ బోధలను సరిదిద్దడమే. ఆ ప్రక్రియలో యేసు క్రీస్తును ఈ విశ్వానికే సర్వాధికారిగా, సంఘానికి శిరస్సుగా, క్షమాపణ ఇవ్వగలిగే ఒకే ఒక్క వ్యక్తిగా స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించాడు.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ పత్రిక రచయితను తానే అని పౌలు చెప్పుకొన్న ఇతర పత్రికల జాబితాలో కొలస్సీ పత్రిక కూడా చేరింది (1:2; 4:18). సంఘ పితరులు ఈ గ్రంథ రచయిత పౌలు అని నిర్ద్వంద్వంగా రూఢపిరిచారు (ఇరేనియస్, తెర్తులియన్, అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్, జస్టిన్). కొలస్సీ పత్రికను సునిశితంగా చదివినవారికి భావంలో, వ్యాకరణంలో, వేదాంతపరంగా పౌలు రాసిన ఇతర పత్రికలతో స్వామ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది (1:9-12,25-26; 2:11-15,16,20-22; 3:1,3,5-17). ఇదే కాక, పౌలు రాసినది అని విస్తృతంగా చెప్పబడిన ఫిలేమోను పత్రికతో దీనికున్న సాన్నిహిత్యం ఇది పౌలు రాసిన పత్రిక అని చెప్పడానికి మరింత సాధికారతను కలిగించింది.
నేపథ్యం: పౌలు ఎఫెసులో పరిచర్య చేస్తున్న సమయంలో (అపొ.కా.19:10) ఎపఫ్రాను లైకస్ లోయలో సువార్తను ప్రచురించడానికి పంపించాడు. తత్ఫలితంగా ఎపఫ్రా కొలస్సయిలో సంఘాన్ని స్థాపించాడు (1:7; 4:12-13). ఆ నగర జనాభాలో ఎక్కువగా ఫ్రుగియనులు, గ్రీకులు ఉన్నప్పటికీ చెప్పుకోదగినంత మంది యూదులు కూడా అక్కడ ఉన్నారు. అదే విధంగా సంఘంలో ఎక్కువమంది అన్యులు ఉన్నప్పటికీ కొద్దిమంది యూదులు కూడా ఉన్నారు (2:11,16,18-19,20-22; 3:11). అక్కడ వ్యాపించిన కొన్ని అబద్ధ బోధల గురించి ఎపఫ్రా పౌలుకు చెప్పినప్పుడు దానికి ఒక వేదాంతపరమైన పరిష్కారంగా పౌలు కొలస్సీయులకు ఈ పత్రికను రాశాడు.
రోమ్‌లో అతడు మొదటిసారి, అంటే క్రీ.శ.60 ప్రారంభంలో చెరసాలలో వేయబడినప్పుడు పౌలు కొలస్సీ పత్రికను రాశాడు (4:3,10,18; అపొ.కా.28:30-31తో పోల్చండి; యూసేబియస్). ఫిలేమోను, ఫిలిప్పీ, ఎఫెసీ పత్రికలతో కలిపి కొలస్సీ పత్రిక కూడా ‘‘చెరసాల పత్రిక’’ అని వర్గీకరించబడిరది. ఈ నాలుగు పత్రికల్లోనూ అనేకమైన వ్యక్తిగతమైన ప్రస్తావనలు ఉండడం ఈ నిర్ణయానికి దారితీసింది (కొలస్సీ 1:7; 4:7-9,17; ఎఫెసీ 6:21-22; ఫిలే 2,12,23-24).
గ్రంథ సందేశం, ఉద్దేశం
యేసు క్రీస్తు సువార్తకు ఒక తిరస్కారంగా భావించిన ‘‘కొలస్సీ అబద్ధబోధ’’ ను ఎదిరించడానికి పౌలు ఈ పత్రికను రాశాడు. ఈ అబద్ధ బోధ ఒక ‘‘తత్త్వజ్ఞానం’’ (2:8) గా గుర్తించబడిరది. బహుశా అది ‘‘సర్వసంపూర్ణత’’ (1:19-20), ‘‘లోకసంబంధమైన మూలపాఠములు’’ (గ్రీకు. స్టోయికేయియా; 2:8,20-22), ‘‘జ్ఞానము’’ (2:3,23), ‘‘స్వేచ్ఛారాధన’’ (2:23) అని చెప్పిన మాటలు సూచించిన విధంగా అది కొన్ని హెల్లేనీయుల సంప్రదాయాల నుండి తీసుకోబడినట్టు తెలుస్తుంది. ఇది గాక, ఈ అబద్ధ బోధలో సున్నతి (2:11; 3:11) లాంటి యూదుల ఆచారాలు, ‘‘మనుషుల పారంపార్యాచారములు’’ (2:8), సబ్బాతును పాటించడం, అన్నపానములు, పండుగల ఆచరణ (2:16), ‘‘చూచినవాటి యందు ఉప్పొంగటం’’ తో కూడిన ‘‘దేవదూతారాధన’’ (2:18), మనుష్యుల ఆజ్ఞలు, పద్ధతులు (2:21-23) అనేవి ఇమిడి ఉన్నాయి. యేసు క్రీస్తు సువార్త యొక్క సరైన అవగాహనను నొక్కి చెబుతూ, క్రైస్తవ నడవడిలోని అంతర్భావాన్ని వివరిస్తూ పౌలు ఈ సమ్మిళిత తత్త్వాన్ని ఎదిరించాడు.
ఆ అబద్ధ బోధ ఏమిటో గుర్తించలేము గానీ దాని అనేక లక్షణాలు అవగతం చేసుకోగలం. (1) క్రీస్తును కించపరిచే వైఖరి 1:15-20 లో ఖండిరచబడిరది. క్రీస్తు తత్త్వం గురించిన ఈ భాగాన్ని బట్టి చూస్తే అబద్ధ బోధకులు యేసును పూర్తి దైవస్వరూపంగా పరిగణించలేదు లేక ఆయనే విమోచనకు ఏకైక మార్గం అని అంగీకరించలేదు అని తెలుస్తున్నది (2) క్రీస్తు మీద నిర్మితం కాని ‘‘తత్వ జ్ఞానాల’’ విషయంలో జాగ్రత్త వహించమని కొలస్సీయులు హెచ్చరించబడ్డారు.
(3) ఆ అబద్ధ బోధలో ‘‘ఆచారాల’’ను నిష్టతో అనుసరించడం, సున్నతి, వివిధ రకాల ఆహారం, పండుగల గురించిన నియమాలు కలిసి ఉన్నాయి (2:8,11,16,21; 3:11).
(4) దేవదూతల, ఇంకా ఇతర తక్కువస్థాయి ఆత్మల ఆరాధనను ఈ అబద్ధ బోధకులు ప్రోత్సహించారు (2:8,18).
(5) దేహశిక్ష అంటే ఒకని ‘‘దుష్ట’’ మాంసయుక్త దేహాన్ని శిక్షించుకోవడం వంటివి ప్రోత్సహించబడ్డాయి (2:20-23).
(6) చివరిగా, ఈ అబద్ధ బోధకులు తమకు ప్రత్యేకమైన అంతర్దృష్టి (బహుశా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు) కలిగి ఉన్నామనీ, తద్వారా తామే సత్యానికి అంతిమ ఆధారమనీ (అపొస్తలులు, లేఖనాలను మించి) చెప్పుకున్నారు (2:18-19).
ఈ అబద్ధ బోధకులు ఎవరో బైబిలు పండితుల్లో ఏకాభిప్రాయం లేదు. పైన చెప్పిన కొన్ని లక్షణాలు యూదులకు, మరికొన్ని జ్ఞోస్థిక (ూR) బోధలకు సంబంధించినవిగా ఉన్నాయి. కొంతమందైతే దీనిలో గ్రీకు మార్మిక మతానికి చెందిన బోధలు కనిపిస్తున్నాయి అంటారు.
1, 2 అధ్యాయాల్లోని బోధ వెంబడే 3,4 అధ్యాయాల్లో క్రైస్తవ జీవితానికి సంబంధించిన హెచ్చరికలు ఉన్నాయి. ‘‘చంపివేయుడి’’ (3:5), ‘‘ఇప్పుడైతే… వీటన్నిటిని విసర్జించుడి’’ (3:8), దేవుని ఉగ్రతను మనమీదికి తెచ్చే విషయాలు (3:5-11) అనే వాటన్నిటినీ దేవునిచేత ఎన్నుకోబడిన ప్రజల (3:12-17) లక్షణాలను ‘‘ధరించుకోవడం’’ (3:12) ద్వారా అధిగమించాలి. అయితే జరిగే మార్పులు బహిరంగంగా కనిపించేవి కావు. అవి ఒక క్రైస్తవుని నూతన స్వభావం నుండీ, జీవితంలో ప్రతి రంగంలోనూ క్రీస్తు పరిపాలనకు విధేయత చూపడం నుండీ ఉద్భవిస్తాయి (3:9-10,15-17).
కుటుంబానికి సంబంధించిన నియమాలు 3:18-4:1 లో కనిపిస్తాయి. మొదటి శతాబ్దానికి చెందిన ఒక సాధారణమైన కుటుంబాన్ని ఊహించుకోవచ్చు. ఆ విధంగా ఈ భాగంలో భార్యలు, భర్తలు, తండ్రులు, పిల్లలు, యజమానులు, దాసులు గురించి వివరించబడిరది. సామాజిక నిర్మాణం లేక వ్యవస్థ యొక్క తప్పొప్పులను గురించి పౌలు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఉన్నవాటిని ఉన్నట్టుగా అతడు స్వీకరించాడు. అప్పుడు ఉనికిలో ఉన్న సామాజిక వ్యవస్థ క్రైస్తవ సూత్రాల ఆధీనంలో పనిచేయాలి అన్నదే పౌలు అభిప్రాయం. ప్రజలు ఒకరితో ఒకరు వ్యవహరించే పద్ధతులను ప్రభువుకు వారు లోబడడం (3:18,20,22; 4:1), క్రైస్తవ ప్రేమ (3:19), దేవుని తీర్పు గురించిన ఎదురు చూపులు (3:24-4:1) అనే అంశాలే నిర్ధారించాలి గాని వారి సామాజిక స్థాయి కాదు. ఈ క్రైస్తవ ప్రేరణే ఈ కుటుంబ నియమాలను యూదుల, అన్యుల మూలాల్లో కనిపించే నియమాలకంటే ప్రత్యేకపరచింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
బైబిల్లో క్రీస్తు దైవత్వం గురించీ, ఆయన సర్వాధిపత్యం గురించీ సంపూర్ణమైన రీతిలో వెల్లడి చేసిన వాక్యాలు కొలస్సీ పత్రికలో కనిపిస్తాయి. క్రీస్తును అదృశ్యుడైన దేవుని స్వరూపమనీ, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు, దానిని నడిపించేవాడనీ, సంఘం అనే తన శరీరానికి శిరస్సు అనీ వర్ణించిన మనోహరమైన స్తుతిగీతం (1:15-20)లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. క్రీస్తులోనే ‘‘బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు’’ (2:3) గుప్తమై ఉన్నాయి. ఎందుకంటే ‘‘దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా’’ (2:9) ఆయనలో నివసిస్తున్నది. క్రీస్తు యొక్క సర్వాధికారంలోనే విశ్వాసుల రక్షణ (2:10,13,20-22; 3:1,11-12,17), వారి నడవడి (3:5-4:6) ఇమిడి ఉన్నాయి. కొలస్సీ పత్రిక అతి శ్రేష్ఠమైన క్రీస్తు శాస్త్రాన్ని లేఖనాలకు అందించడమే కాక ఒక విశ్వాసి నడవడి విషయంలో దాని అధికారాన్ని వివరించింది.
గ్రంథ నిర్మాణం
కొలస్సీ పత్రికను రెండు ప్రధానభాగాలుగా చేయవచ్చు. మొదటిది (1:3-2:23) అబద్ధ బోధలకు వ్యతిరేకంగా ఒక ప్రతివాదం. రెండవది (3:1-4:17) సరైన క్రైస్తవ జీవితం కోసమైన కొన్ని హెచ్చరికలు. ఇది పౌలు సాధారణంగా అనుసరించే విధానం- మొదట వేదాంత అంశాన్ని బోధించడం, దానిపై ఆధారపడి ఆచరణాత్మక కార్యాచరణను సూచించడం. దీని పరిచయం (1:1-2) ఒక హెల్లేనీయుల, వ్యక్తిగతమైన ఉత్తరంలాగా ఉంది.
ఈ పత్రిక చివరి భాగంలో ఒనేసిము (4:9) పేరు ప్రస్తావించడం గమనించదగిన విషయం. అది ఈ ఉత్తరాన్ని ఫిలేమోనుకు రాసిన పత్రికతో జతపరుస్తుంది. లవొదికయ వారికి రాసి పంపిన పత్రిక (4:16) అంటే ఎఫెసీ పత్రిక కావచ్చు. ముగింపులో పౌలు సంతకం గురించిన ప్రస్తావన ఈ ఉత్తరాన్ని ఒక లేఖికుడు (కార్యదర్శి; 4:18 చూడండి) సిద్ధపరచి ఉండవచ్చని తెలుపుతుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”