హెబ్రీయులకు రాసిన పత్రిక సర్వశ్రేష్ఠుడైన దేవుని కుమారునికి ఒక గొప్ప ప్రశంస అని చెప్పుకోవచ్చు. ఇది ఈ పత్రిక రచయితకు సమకాలికులైన విశ్వాసుల్లో ఎవరైతే హింసలు అనుభవిస్తున్నారో వారికి ఒక ప్రోత్సాహకరమైన గ్రంథం. తన క్రైస్తవ పాఠకులు తమ కష్టాల్లో సహనం వహించడంలో అస్థిరులైయున్నారని ఈ గ్రంథ రచయిత భయపడ్డాడు. ఈ ఉత్తరం రాయడంలో రచయితకు రెండు రకాల ఉద్దేశాలున్నాయి. (1) యేసు క్రీస్తును ‘‘దేవుడు’’, ‘‘మనుష్య కుమారుడు’’ అని పిలవడం ద్వారా దేవునికి, మానవునికి మధ్యవర్తిగా నిలవదగిన ఏకైక వ్యక్తి అయిన యేసు క్రీస్తును హెచ్చించాడు. (2) ‘‘సంపూర్ణుల మగుటకు సాగిపోదము’’ ‘‘విశ్వాసమూలముగా’’ జీవిద్దాం అంటూ తన సాటి క్రైస్తవులను ప్రోత్సహించాడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
రచయిత: హెబ్రీ పత్రికలోని వాక్యభాగాల్లో ఎక్కడా దాని రచయిత ప్రస్తావన లేదు. మనకు తెలిసిందల్లా, రచయిత రెండవ తరం క్రైస్తవుడని మాత్రమే. ఎందుకంటే క్రీస్తును గూర్చి తాను పొందిన సందేశం నేరుగా యేసు నుండి ‘‘వినినవారిచేత’’ (2:3) దృఢపరచబడిరది అని చెప్పాడు. పౌలు తన సువార్తను తనకు ప్రభువే నేరుగా బయలుపరిచాడు అని చెప్పాడు కాబట్టి (1కొరింథీ 15:8; గలతీ 1:12) పౌలు హెబ్రీ పత్రికను రాశాడు అని చెప్పడానికి సంకోచించాల్సి వస్తుంది. రచయితకు తిమోతితో పరిచయం ఉంది కాని అతడు తిమోతిని పౌలు పిలిచినట్టు ‘‘విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు’’ (1తిమోతి 1:2) అని కాక, ‘‘మన సహోదరుడు’’ (13:23) అని పిలిచాడు.
బైబిలు పండితులు ఈ గ్రంథ రచయితలుగా ఈ క్రిందివారిని కూడా ప్రతిపాదించారు: లూకా, రోమావాడైన క్లెమెంతు, బర్నబా, అపొల్లో, తిమోతి, ఫిలిప్పు, పేతురు, సీల, యూదా, ఆరిస్టియన్. అంతిమంగా హెబ్రీ పత్రిక రచయిత ఎవరో తెలియక పోయినా అదేమంత పట్టించుకోవలసిన విషయం కాదు. ఆది క్రైస్తవులు ఈ పత్రికను దైవ ప్రేరేపితమైందిగా, అధికారపూర్వకమైందిగా, క్రైస్తవ శిష్యత్వం విషయంలో దాని విలువ ప్రశ్నించడానికి వీలు లేనిదిగా గుర్తించి స్వీకరించారు.
నేపథ్యం: తన పాఠకులను ‘‘సహోదరులారా’’ (3:12; 7:5; 10:19; 13:22), ‘‘ప్రియులారా’’ (6:9) అని పిలవడాన్ని బట్టి రచయితకు వారు బాగా తెలిసినవారు అని గ్రహించవచ్చు. రచయిత లాగానే క్రీస్తును ముందుగా ఎరిగి ఉన్నవ్యక్తుల (2:3) ద్వారా వారు మారుమనస్సు పొంది ప్రభువును విశ్వసించారు. ఈ పత్రికను మొదటిగా అందుకున్న పాఠకులు బహుశా ప్రధాన సంఘం నుండి విడిపోయిన ఏదైనా ఒక ఇంటనున్న సంఘానికి చెందిన వారై ఉంటారని పండితులు అంచనా వేశారు. వేరొక అభిప్రాయం ప్రకారం దీని పాఠకులు గతంలో యూదు యాజకులుగా ఉండి క్రైస్తవ్యాన్ని స్వీకరించినవారై ఇప్పుడు సాటి యూదులనుండి శ్రమలను తప్పించుకోడానికి మళ్ళీ తిరిగి యూదుమతంలోకి (కనీసం కొన్ని ఆచారవ్యవహారాల విషయంలోనైనా) వెళ్ళాలని చూస్తున్న గుంపు అయి ఉండవచ్చు. మరొక సిద్ధాంతం ఆ గుంపు తప్పకుండా యూదులే అయి ఉండాల్సిన అవసరం లేదనీ, ఎందుకంటే క్రైస్తవులుగా మారిన అన్యజనులు కూడా పా.ని. లేఖనాలను భక్తిపూర్వకంగా గౌరవించేవారనీ వాదించింది.
ఈ గ్రంథరచనా కాలం విషయంలో అప్పటికి యెరూషలేము పతనం (క్రీ.శ.70) కాలేదు అని స్పష్టమవుతున్నది. దేవాలయ ధ్వంసం అప్పటికే జరిగి ఉంటే ఆ విషయం దీనిలో ప్రస్తావించబడి ఉండేది, ఎందుకంటే అది క్రీస్తు చేసిన బలియాగం దేవాలయ బలియర్పణల వ్యవస్థకు ముగింపు పలికిందని చేసిన వాదనకు బలం చేకూర్చి ఉండేది. 10:32-34 లో ప్రస్తావించిన బహిరంగ నిందలు, హింసలు ఈ గ్రంథ రచనా కాలం విషయంలో ఉన్న రెండు సంభావ్యతల్లో ఒకదానికి ఆధారంగా నిలిచాయి. రోమా చక్రవర్తులైన నీరో, డొమిషియన్ (వరుసగా క్రీ.శ.64-68, 81-82 సంవత్సరాలు)లు క్రైస్తవులను హింసించారని మనకు తెలుసు. ముఖ్యంగా నీరో పాలనలో జరిగిన హింసల కాలంలో దేవాలయం ధ్వంసం చేయబడడానికి కొద్దికాలం ముందు ఈ గ్రంథం రాయబడి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
హెబ్రీ గ్రంథ రచయిత యేసు క్రీస్తును హెచ్చించాలని కోరుకున్నాడు. దీనిలో ‘‘అతి ప్రశస్తమైన’’, ‘‘అధికుడు’’, లేక ‘‘శ్రేష్ఠుడు’’ అని అర్థమిచ్చే గ్రీకు పదం ‘క్రేట్టోన్’ పదే పదే వాడడం దీనిని సూచిస్తున్నది. ఈ పదమే ఈ గ్రంథంలో వేదాంతపరంగా సంక్లిష్టమైన, సున్నితమైన వాదనలను కలిపి కట్టే దారంగా ఉంది. సృష్టి, విమోచనల గురించిన దైవిక ప్రణాళికలోని సమస్తంతో పోల్చి చూసినప్పుడు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠుడుగా ఉన్నాడు. గ్రంథకర్త పాత నిబంధనను మించిన కొత్త నిబంధన శ్రేష్ఠతను ఎందుకు వివరించాడంటే ధర్మశాస్త్రం, పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానాల నెరవేర్పు యేసు క్రీస్తే అని అతడు తన పాఠకులకు గుర్తు చేయాలనుకున్నాడు. ఈ సత్యం వెలుగులో ‘‘దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచు’’ (6:6) విషయంలో పాఠకులు జాగ్రత్తపడాలి. అభివృద్ధి విషయంలో ఆగిపోయి నిశ్చలంగా నిలిచి ఉన్న పరిస్థితి నుండి యేసు క్రీస్తుతో తమ సంబంధం విషయంలో ఒక ఎదుగుదల ప్రక్రియలోకి ఆ విశ్వాసులను ప్రవేశింపజేయాలనేది రచయిత ఆరాటం.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
పా.ని. చరిత్రను, దాని సంప్రదాయాలను యేసు క్రీస్తు జీవితంతో అన్వయించి ఈ పత్రిక చూపినంత క్షుణ్ణంగా కొ.ని.లోని మరే గ్రంథంలోనూ కనిపించదు. పా.ని. తనలో నెరవేరింది అని యేసు క్రీస్తు బోధించినట్టుగా (మత్తయి 5:17-18; లూకా 24:27) పాత నిబంధన కొత్త నిబంధనలో ముగింపుకు వచ్చింది అని హెబ్రీ గ్రంథకర్త వివరించాడు (7:20-8:13). పాత నిబంధన కొత్త నిబంధనలో నెరవేర్చబడిరది కాబట్టి కొత్త నిబంధన నిజంగా ‘‘శ్రేష్ఠమైనది’’ (7:22) అని హెబ్రీ పత్రిక వెల్లడి చేసింది. ఇట్టి కొత్త నిబంధన శ్రేష్ఠత యేసు క్రీస్తు పరిచర్య ద్వారానే సాధ్యమయ్యింది.
గ్రంథ నిర్మాణం
హెబ్రీ గ్రంథాన్ని ముగిస్తూ రచయిత, ‘‘సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను’’ (13:22) అని రాశాడు. హెబ్రీ సాహితీ శైలి సూచిస్తున్నదాని ప్రకారం ఇది వేదాంతపరమైన ఒక లిఖిత ఉపదేశం అని చెప్పవచ్చు. ఒక ఉత్తరానికి ఉండాల్సిన ముగింపు ఈ పత్రిక కలిగి ఉన్నప్పటికీ ఇది పూర్తిగా ఒక ఉత్తరం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రాచీనకాలం నాటి ఉత్తరాల్లో కనిపించే ప్రారంభం దీనిలో కనిపించదు. దానికి బదులుగా హెబ్రీ పత్రిక యేసు క్రీస్తు సర్వశ్రేష్ఠత గురించిన ఒక వ్యాసంతో ప్రారంభమైంది (1:1-4).
అయితే, తన పాఠకుని హృదయాన్ని సంధించే సామర్ధ్యం విషయంలో చూస్తే ఇది ఒక సాహితీ వ్యాసానికి మించిందని గుర్తించవచ్చు. పాఠకుణ్ణి విశ్వాసం, నమ్మకత్వం విషయంలో సవాలు చేయడానికి లేఖనాలను సుదీర్ఘంగా వివరించిన విధానం చూస్తే ఇది ఒక ఉపదేశ స్వభావాన్ని కలిగి ఉన్నదని చెప్పడంలో సందేహం లేదు. ఒక సంక్లిష్టమైన, సంపూర్ణమైన నిబంధనా వేదాంతాన్ని క్రమంగా వృద్ధిపరుస్తూ వెళ్ళిన విధానం గమనిస్తే హెబ్రీ పత్రిక సార్వత్రిక మానవాళి పట్ల దేవుని గంభీరమైన విమోచనా ప్రణాళికను బహిర్గతం చేసే ఒక వేదాంత ఉపదేశం అని గ్రహిస్తాం.