యేసు క్రీస్తు ఆరోహణం అయిన తరువాత జరిగిన మూడు దశాబ్దాల కాలంలో (క్రీ.శ. సుమారు 30-63) ఆదిసంఘం ఏ విధంగా వ్యాపించి వృద్ధి చెందిందో అపొస్తలుల కార్యములు గ్రంథం మనకు వివరిస్తుంది. ఇది అంత సవివరమైన, సమగ్రమైన చరిత్ర కాకపోవచ్చు. కానీ ప్రధానంగా యూదుల మధ్య పరిచర్య చేసిన పేతురు, అన్యుల మధ్య సువార్త ప్రకటించిన పౌలు మొదలైన అపొస్తలులు పోషించిన పాత్రపైన ఈ గ్రంథం దృష్టి సారించింది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: వాస్తవానికి అపొస్తలులు కార్యాలు గ్రంథ రచయిత ఎవరో తెలియదు. అయితే లూకా సువార్తను రాసిన వ్యక్తే ఈ గ్రంథాన్ని కూడా రాసి ఉండవచ్చని, అంటే పౌలుతో కలిసి ప్రయాణించిన వైద్యుడైన లూకా అయి ఉంటాడని (కొలస్సీ 4:14, 2తిమోతి 4:11, ఫిలే 23-24) సాంప్రదాయికంగా వచ్చిన అభిప్రాయం. క్రీ.శ. 2వ శతాబ్దం ప్రారంభానికల్లా ఐరేనియస్ లాంటి సంఘనాయకులు అపొస్తలుల కార్యములు గ్రంథకర్త లూకాయే అని ఖాయపరిచారు. ఐరేనియస్ తన ఈ వాదనకు ఈ గ్రంథంలో కనిపించే ‘‘మేము’’ అనే వాక్యాలను, రచయిత ఐదు చోట్ల ఆయా సంఘటనలను (16:10-17, 20:5-15, 21:1-18, 27:1-29, 28:1-16) వివరిస్తూ ‘‘అతడు/ఆమె’’, ‘‘వారు’’ అనే పదప్రయోగం నుండి ‘‘మేము’’ అనే పదప్రయోగంలోకి మారడాన్ని ఆధారం చేసికొన్నాడు. ఈ వాక్యభాగాలను బట్టి ఐరేనియస్, ఇతర పండితులు ఈ గ్రంథ రచయిత పౌలును ప్రత్యక్షంగా చూసిన సహచరుడై ఉంటాడు అని నిర్ధారించారు. లూకా సువార్త, అపొస్తలుల కార్యములు గ్రంథాల మధ్య ఉన్న పోలికలను బట్టి చూస్తే ఈ స్థానానికి ఇతరులందరికంటే లూకా చక్కగా సరిపోతాడు.
నేపథ్యం: అపొస్తలుల కార్యములు గ్రంథ రచనాకాలం చాలావరకు దీని గ్రంథకర్తృత్వంపై నేరుగా ఆధారపడి ఉంది. చాలామంది పండితులు ఇది 60వ దశకం ప్రారంభంలో రాసి ఉంటారని (పౌలు చెరసాలలో ఉన్న కాలంలో) భావించారు. పౌలు రోమా చెరలో ఉన్న కాలంలో (28:30-31) అపొస్తలుల కార్యములు గ్రంథం ముగిసింది. పౌలు చెరనుండి విడిపించబడిన తరువాత ఈ గ్రంథం రచించబడిరదని భావించడానికి అవకాశం ఉన్నప్పటికీ అతడు ఇంకా చెరసాలలో ఉన్న సమయంలోనే లూకా రాసి ఉండవచ్చనడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పౌలు అప్పటికే విడిపించబడి ఉన్నట్టయితే ఆ విషయాన్ని కూడా లూకా గ్రంథస్థం చేసి ఉండేవాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యేసు క్రీస్తు ప్రభువుకు తమను తాము సమర్పించుకున్న వారి జీవితాల్లో, మరి ముఖ్యంగా అన్యజనులకు సువార్త పరిచర్య కోసం నియమితుడైన పౌలు జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన కార్యాలను అపొస్తలుల కార్యాలు గ్రంథం నొక్కి చెబుతున్నది. తాను ఎన్నుకున్న పాత్రల ద్వారా పనిచేసిన పరిశుద్ధాత్మ అత్యధికమైన శక్తి, ప్రభావాల ద్వారా క్రైస్తవ సంఘం నిర్మితమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే సువార్త యూదులనుండి అన్యజనులకు, యెరూషలేము నుండి యూదయకు, సమరయ నుండి మిగిలిన ప్రపంచానికంతటికీ శీఘ్రంగా వ్యాప్తి చెందడం (1:8). ఆ విధంగా యూదామతంలో ఒక భాగంగా ప్రారంభమైన క్రైస్తవ్యం ఒక ప్రపంచవ్యాప్త భక్తి మార్గంగా పరిణామం చెంది క్రమంగా అన్యమత కేంద్రంగా ఉన్న రోమా సామ్రాజ్యపు రాజధాని నగరమైన రోమాతో సహా ప్రతిచోటా సానుకూలమైన అంగీకారం పొందింది.
ఒకప్పుడు క్రైస్తవ్యానికి బద్ధ వ్యతిరేకిగా ఉండి తరవాత క్రైస్తవ్యాన్ని బలంగా సమర్ధించినవాడుగా మారిన పౌలు చేసిన పరిచర్య క్రైస్తవ ఉద్యమానికి మూల స్తంభంగా నిలిచింది. స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపే సమయం (స్తెఫను చేసిన క్రైస్తవ బోధకు శిక్షగా అతనికి విధించిన మరణశిక్షకు అంగీకారం తెలిపిన సందర్భం) మొదలుకొని రోమాలోని తన స్వంత అద్దె ఇంటిలో నిర్బంధంలో (మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ కూడా సువార్తను ప్రకటిస్తూ) ఉన్న అతని అంతిమ ప్రస్తావన వరకు అతడు ‘‘అన్యజనుల యెదుటను, రాజుల యెదుటను, ఇశ్రాయేలీయుల యెదుటను’’ (9:15) సువార్తను ప్రకటిస్తూ వచ్చిన ప్రతి సందర్భంలోనూ పౌలు సువార్త పక్షంగా చేసిన పని ప్రస్ఫుటంగా వెల్లడైంది.
కొద్దిమంది ఆది అపొస్తలులు సువార్తను మొదట యెరూషలేములో, ఆ తరవాత మిగిలిన ప్రపంచమంతటిలో ప్రకటిస్తుండగా వారి జీవిత విశేషాలను అపొస్తలులు కార్యములు గ్రంథం మనకు తెలియజేస్తుంది. పేతురు, ఫిలిప్పు, ఇంకా యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో సువార్త విస్తరణకు కారకులయ్యారు. మిగిలిన ప్రపంచమంతటిలో అధిక భాగానికి సువార్త వ్యాప్తి చెందడానికి పౌలు కారకుడయ్యాడు.
తాను దర్శించిన ప్రతి నగరంలో సాధారణంగా సునగోగు (సమాజ మందిరం) వంటి తనకు పరిచయమైన స్థలానికి వెళ్ళి మొదట అక్కడి యూదులకు సువార్తను ప్రకటించడం పౌలు యొక్క సౌవార్తిక వ్యూహం. అతడు తన దృష్టిని ఆ సమాజ మందిరాల బయట ఉండే అన్యజనుల వైపుకు ఎంత త్వరగా మళ్ళించగలుగుతాడు అనేది అక్కడి యూదులు అతని సువార్తను ఏ విధంగా అంగీకరించారు అనేదానిపై ఆధారపడి ఉండేది. ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళేలోపుగా వారు ఒక సంఘం ప్రారంభించేలా పౌలు అక్కడి యూదులను, అన్యులను ఏకం చేసేవాడు. వివిధ రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య సువార్తను ప్రకటించడానికి ఆది అపొస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడి, శక్తివంతులుగా ప్రత్యేకమైన రీతిలో కనిపించేవారు. ఆ ఇబ్బందులు వేదాంతపరమైనవి, రాజకీయపరమైనవీ, శారీరకమైన దాడులు లేక ఇవి అన్నీ కలిసి ఉండవచ్చు. ఫలితంగా వారు తృణీకరించబడి, చెరసాలలో వేయబడి, రాళ్ళతో కొట్టబడేవారు. ఏదేమైనా, వారు పరిశుద్ధాత్మతో నింపబడి, పాత నిబంధనలో రాబోయే ఒక రక్షకుని గురించి చెప్పబడిన ప్రవచనం నజరేయుడైన యేసు వ్యక్తిత్వంలో, ఆయన కార్యాల్లో నెరవేరింది అనే సందేశాన్ని చెప్పడం మానడానికి మాత్రం నిరాకరించారు. దాని ఫలితంగా యెరూషలేములో, ఇతర ప్రాంతాల్లో వేలాది మంది తమ పాపాల నుండి రక్షణ పొందడానికి తమకున్న ఏకైక నిరీక్షణ అయిన యేసు క్రీస్తు అనే మెస్సీయలో విశ్వాసముంచారు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
అపొస్తలుల కార్యములు గ్రంథం కొ.ని.లోని ఇతర గ్రంథాలన్నిటినీ ఒక చోటకు చేర్చి కలిపి ఉంచుతుంది. అది మొదటగా సువార్తల అనంతర కథనాన్ని మనకు అందించడం ద్వారా ఆ పని చేసింది. యేసు పునరుత్థానం తరవాత నలభై రోజులకు ఆయన ఆరోహణం కావడంతో సువార్త, దేవుని రాజ్యసందేశం ముగిసిపోలేదు. అది యేసును వెంబడిరచే వారి జీవితాల్లో ముందుకు కొనసాగింది. యేసు చేసిన వాగ్దానాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపొస్తలులు, ఇతర విశ్వాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారో అపొస్తలుల కార్యములు గ్రంథం వివరిస్తుంది. రెండవదిగా కొ.ని. లోని మిగిలిన గ్రంథాలన్నిటికీ, మరి ముఖ్యంగా పౌలు తన మిషనరీ యాత్రల్లో స్థాపించిన సంఘాలకు రాసిన పత్రికలకు తగిన సందర్భాన్ని అపొస్తలుల కార్యములు గ్రంథం మనకందిస్తుంది.
గ్రంథ నిర్మాణం
దీని సాహితీ శైలికి సంబంధించినంత వరకు అపొస్తలుల కార్యములు గ్రంథం దీనిలోని అనేక ప్రాముఖ్యమైన పాత్రలు, ముఖ్యంగా పేతురు, పౌలుల ప్రాచీనకాలపు జీవిత చరిత్ర అని చెప్పుకోవచ్చు. ప్రాచీన జీవిత చరిత్రలు కేవలం ఆయా పాత్రల జీవితగాథను మాత్రమే కాక ఆయా పాత్రల గుణలక్షణాలను, మరి ముఖ్యంగా వారి నైతిక నడవడిని వెల్లడి చేస్తుంటాయి. ఇంకా వంశక్రమాలు, సందేశాలు వంటి ఆలంకారిక అంశాలు కూడా దీనిలో ప్రముఖంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రాచీనకాలపు జీవితగాథలు తమ సమాచారాన్ని గ్రంథస్థమైన మూలాలనుండి మాత్రమే కాక మౌఖికమైన మూలాలనుండి కూడా సంగ్రహిస్తాయి.
అపొ.కా.1:8 ఈ గ్రంథానికి ఒక ఉపోద్ఘాతాన్ని, ఒక రేఖాచిత్రాన్ని అందిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా శక్తిచేత నింపబడిన వెంటనే శిష్యులు యెరూషలేములో ధైర్యంగా సువార్తను బోధించారు. ఈ గ్రంథం ముందుకు సాగే కొద్దీ సువార్త ఇంకా యూదయ, సమరయలోనికి, అంతిమంగా పౌలు మిషనరీ యాత్రల ద్వారా అప్పటికి ఎరిగి ఉన్న ప్రపంచానికంతటికీ వ్యాపించింది.