క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దంలోని నలుగురు ప్రవక్తలలో తనతోబాటు పరిచర్య చేసిన హోషేయ, యెషయా, మీకా లలో ఆమోసు మొదటివాడు. ఆమోసు యూదాకు చెందినవాడైనప్పటికీ, హోషేయతోపాటు ఇతడు కూడా ఇశ్రాయేలు రాజ్యంలోనే పరిచర్య చేశాడు. ఇతడు తనను తాను వృత్తిపరంగా ఒక ప్రవక్తగా పరిగణించని ఒక సాధారణ వ్యక్తి (7:14-15). తన కాలంలోని పైపై మెరుగులతో ఉన్న మతవ్యవస్థలకు వ్యతిరేకంగా అతడు మాటలు, దర్శనాల ద్వారా మాట్లాడాడు.
Read More
రచనా కాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఆమోసు యెరూషలేముకు దక్షిణంగా 10 మైళ్ళ దూరంలో ఉన్న తెకోవ అనే గ్రామంలోని ఒక గొర్రెల కాపరి. బహుశా సుమారు క్రీ.పూ. 760లో ఉత్తరానికి వెళ్ళి, షోమ్రోనుకు, ఇశ్రాయేలు రాజ్యానికి విరోధంగా ప్రవచించమనే దేవుని పిలుపు పొంది ఉండవచ్చు. అతడు ఉత్తరదేశంలో ఎంతకాలం ఉన్నాడో మనకు తెలియదు. చాలా తక్కువకాలమే ఉన్నాడని అనిపిస్తుంది. బేతేలులో యాజకుడైన అమజ్యాను అతడు ఎదుర్కొన్న విధానాన్నిబట్టి (7:10-17), అతడు చాలా వ్యతిరేకతను, కోపాన్ని రేపాడని అర్థమౌతుంది. తన ప్రవచనాల సారాంశమైన ఈ పుస్తకాన్ని అతడు యూదయకు తిరిగి వచ్చిన తర్వాత ఒక శాస్త్రి సహాయంతో రాసివుండవచ్చు.
నేపధ్యం: యూదా దేశపు రాజు ఉజ్జియా (క్రీ.పూ. 792-740), ఇశ్రాయేలు రాజు రెండవ యరొబాము (క్రీ.పూ. 793-753)ల పాలనలో ఆమోసు ప్రవచించాడు. వారి చిరకాల శత్రువులందరూ బలహీనమైన స్థితిలో ఉండడం వలన, ఇది ఆ రెండు దేశాలకు గొప్ప అభివృద్ధి, యుద్ధవిజయాల కాలం. ఇశ్రాయేలు రాజధాని పట్టణమైన షోమ్రోను సుఖ సౌఖ్యాలతో, గొప్ప ఐశ్వర్యవంతంగా ఉన్న కాలం. అదే సమయంలో దమస్కుతో దశాబ్ధాలుగా అది చేసిన పోరాటం ప్రజలను అలసటకు గురిచేసింది. అనేకమంది రైతులు పేదరికానికి దిగజారారు. వారి పొరుగువారైన సంపన్నులు, ముఖ్యంగా భూస్వాములు, పేదలు కట్టలేని వడ్డీలతో వారిపైబడి, ఋణగ్రస్తులను బానిసలుగా చేసుకుని, వారి భూములు లాక్కున్నారు. సమాజ నాయకులు తాము భవిష్యత్తును గూర్చి భయపడడానికి కారణమేమీ లేదని నమ్మారు. ఎందుకంటే వారి పట్టణం చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, కట్టుదిట్టమైన దుర్గాలు ఉన్నాయి, వారి సైన్యాలు ఎక్కడికివెళ్ళినా విజయమే. వారు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, తమకు తీర్పు వచ్చే అవకాశమే లేదని వారు భావించారు.
సందేశం, ఉద్దేశం
ముఖ్యమైన అనేక బోధలు ఆమోసులో ఉన్నాయి. 1. దేవునికి పక్షపాతం లేదు, ఆయన యథార్థంగా ప్రతి దేశానికి సరిగ్గా తీర్పు తీరుస్తాడు. యూదుడు గాని, అన్యుడు గాని, ఎవరైనా దైవికతీర్పు నుండి తప్పించుకోలేరు. అన్యజనులు ‘‘మానవాళికి వ్యతిరేకమైన నేరాలు’’ అని నేడు మనం పిలిచే నైతిక దౌర్జన్యాలను బట్టి శిక్షపొందారు, యూదులైతే మోషే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం అనే నేరాన్ని బట్టి తీర్పు పొందారు (1:3-2:3 చూడండి; 2:4-5తో పోల్చండి).
2. మానవుడు అహంకారంతో, ముఖ్యంగా తన సైన్యబలాన్ని, ధనాన్ని చూసుకొని ఇతరులను చులకనగా చూసినప్పుడు దేవుడు దాన్ని తృణీకరిస్తాడు (6:1-8).
3. పేదలను దూషించేవారితో లేక వారిని మోసం చేసేవారితో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు (8:4-6).
4. ప్రజలు మారుమనస్సు పొందని హృదయాలతో, సంగీతం, ఉత్సాహంతో ఆరాధన చేసే కార్యక్రమాలను బట్టి దేవుడు సంతోషించడు (4:4-5; 5:21-24).
5. దేవుని యథార్థమైన పనిని ఎదిరించే మతనాయకులకు ప్రత్యేక తీర్పు ఉంటుంది (7:10-17).
6. దేవునిలో తమకు ప్రత్యేకమైన స్థానం ఉందనే నమ్మకంతో అంధులై, దైవ తీర్పు విషయంలో భయపడాల్సిన కారణం లేదని భావించేవారు పూర్తిగా దారితప్పినట్టే (5:18-20).
7. ఒక దేశంలో సమస్యలు పెరిగిపోతూ ఉంటే, వాటిని దేవుని దగ్గర నుండి వచ్చిన హెచ్చరికలుగా గ్రహించి, మరీ ఆలస్యం కాకముందే ప్రజలు మారుమనస్సు పొందాలి (4:6-12).
8. తీర్పు తర్వాత కూడా, ఇక నిరీక్షణ పూర్తిగా కోల్పోయినట్లు అనిపించినపుడు (9:1-4) కూడా మనల్ని రక్షించి విమోచించడానికి దేవుడు సమర్థుడు (9:13-15).
9. ఇశ్రాయేలు నిరీక్షణ (మానవాళి నిరీక్షణ కూడా) తన రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు లేవనెత్తబోయే దావీదు వంశం మీద ఉంది (9:11-12). ఈ నిరీక్షణ దావీదు సంతానమైన యేసు క్రీస్తులో నెరవేరిందని మనకు ఇప్పుడు తెలుసు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
తన ప్రజల కోసం జోక్యం చేసుకోవడంలో దేవుని సార్వభౌమత్వాన్ని ఆమోసు మనకు జ్ఞాపకం చేశాడు. అంతిమంగా నెరవేరిన ఆయన తీర్పును దేవుడు రప్పిస్తాడు. యెహోవా దినం గూర్చి ఆమోసు నొక్కి వక్కాణించిన మాటలు అతని సమకాలీకులకు వర్తించాయి. అదే సమయంలో ఆ మాటలు కొ.ని.లో పదే పదే చెప్పిన క్రీస్తు రాకడ దినాన్ని గురించి నేటి పాఠకులకు కూడా వర్తిస్తాయి.
నిర్మాణం
ఉపోద్ఘాతం దాటి ముందుకు వెళ్తే (1:1), ఆమోసు పుస్తకం ఏడు భాగాలుగా విభజించబడిరది. మొదటి భాగం ఒక్కవచనంలోని పరిచయం (1:2). దీని వెంట ఆరు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి: 1:3-2:16; 3:1-15; 4:1-13; 5:1-6:14; 7:1-8:3; 8:4-9:15. దేవుని వాక్య సంకేతాలు (‘‘యెహోవా సెలవిచ్చునదేమనగా’’, ‘‘యెహోవా ప్రకటించాడు’’ ‘‘ఇదే యెహోవా వాక్కు’’ వంటి మాటలు) ఈ విభాగాలలో సమానంగా విస్తరించి ఉన్నాయి. ఆమోసు 1:3-2:16 లో ఇలాంటివి 14 ఉన్నాయి, మిగిలిన విభాగాల్లో ఏడేసి చొప్పున మొత్తం 49 ఉన్నాయి. ప్రతి భాగంలోని ప్రాథమిక నిర్మాణం, సారాంశం నోట్సులో వివరించాం.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”