పంచకాండాల్లో ఒకటైన ఈ గ్రంథానికి ‘‘ద్వితీయోపదేశము’’ అనే పేరు సెప్టువజింట్ (పాత నిబంధనకు గ్రీకు భాషాంతరం) నుండి వచ్చింది. దీని అర్థం ‘‘రెండవసారి చెప్పబడిన ఆజ్ఞల ఉపదేశం’’ లేదా ‘‘ఆజ్ఞల పునరుక్తి’’. ఈ పదం వాస్తవానికి 17:18 లోని ‘‘ప్రతి’’ లేక నకలు అనే పదానికి తప్పు అనువాదం. అయినా నిర్గమకాండము లేవీయకాండము, సంఖ్యాకాండములలో ఉన్న ఆజ్ఞల ఉపదేశం మళ్లీ ఈ గ్రంథంలో పునరుక్తం కావడాన్ని బట్టి ఈ గ్రంథానికి ఈ పేరు సరిగానే ఉంది.
Read More
గ్రంథ రచనాకాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: పాత నిబంధనలోని తరవాతి గ్రంథాలు (యెహో 1:7-8; 1రాజులు 2:3; ఎజ్రా 3:2), క్రొత్త నిబంధనలోని గ్రంథాలు (మత్తయి 19:7; అ.కా.3:22; రోమా 10:19) తెలియజేస్తున్నట్టుగానే ఈ గ్రంథం కూడా ఈ గ్రంథంలోని విషయాలకు ప్రధానమైన మూలం, గ్రంథకర్త మోషే అని తెలియజేస్తుంది (1:1). ఈ గ్రంథకర్తృత్వాన్ని మోషేకు ఆపాదించడాన్ని పదిహేడవ, పద్దెనిమిదవ శతాబ్దాల్లో ఆధునిక హేతువాదం ప్రవేశించే వరకు ఎవరూ ప్రశ్నించలేదు, అయితే ఈ అభిప్రాయాల్ని వెల్లడిరచినవారి వాదనలు మోషేయే గ్రంథకర్త అని ప్రాచీన కాలంనుండి వస్తున్న పారంపర్యాన్ని విజయవంతంగా త్రిప్పికొట్టలేకపోయాయి. ద్వితీయోపదేశ కాండానికి, క్రీ.పూ. రెండవ సహస్రాబ్దికి చెందిన కొన్ని సమీప ప్రాచ్య ఒప్పంద పత్రాలకు మధ్యనున్న నిర్మాణాత్మక పోలికలు ఈ గ్రంథ సమగ్రతను, ప్రాచీనతను సమర్థిస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండపు ప్రాథమిక గ్రంథకర్త మోషేనే అనడం లేఖన సాక్ష్యాన్ని అంగీకరించే వ్యక్తికి అత్యంత సహేతుకంగా కనిపిస్తుంది.
నేపథ్యం: నిర్గమం బహుశా క్రీ.పూ.1446 లో జరిగి ఉండవచ్చు, నిర్గమం అనంతరం ఇశ్రాయేలీయులు దేవుడు వారికి వాగ్దానంచేసిన స్వాస్థ్యమైన కనానుకు ప్రయాణమయ్యారు. ఇశ్రాయేలీయుల్లోని తిరుగుబాటు స్వభావం కారణంగా వారు నలభై సంవత్సరాలపాటు (2:7) అరణ్యంలో సంచారాలు చేయాల్సి వచ్చింది, చివరికి వారు యెరికోకు అభిముఖంగా ఉన్న (32:49) మోయాబుకు చేరుకున్నారు. ఇక్కడ మోషే ఈ వీడ్కోలు సందేశం ఉన్న గ్రంథాన్ని కూర్పుచేయడం జరిగింది (31:9,24).
గ్రంథ సందేశం, ఉద్దేశం
యెహోవాకు ఇశ్రాయేలీయులకు మధ్య తొలి నిబంధన సీనాయి దగ్గర జరిగినప్పటికీ, ఈ నిబంధన జరిగిన తర్వాత ఈ తొలితరంలో అనేకులు తరువాతి ముప్పయి ఎనిమిది సంవత్సరాల్లో మరణించారు. ఇప్పుడు యువతరం నిబంధన పట్ల తమ నిబద్ధతను రూఢగాి తెలియజేయవలసిన అవసరం ఏర్పడిరది (4:1-8). పైగా, అరణ్య ప్రయాణాల కాలంలోని సంచారజీవనశైలి నుండి కనానులో స్థిరనివాస జీవనశైలికి మార్పు చెందడాన్ని బట్టి నిబంధన పునర్విమర్శ చేయడం, నూతన పరిస్థితులకు ఈ నిబంధన వర్తించేలా దాన్ని విశదీకరించవలసిన అవసరం కలిగింది. నిబంధన పట్ల నిబద్ధత చూపించవలసిన ఈ నూతన సమాజం దేవునియెదుట విధేయతతో జీవించడం కోసం, తమపట్ల దేవునికున్న ఉద్దేశాల్ని నెరవేర్చడం కోసం వారికి నిర్దేశం చేయడమే ద్వితీయోపదేశకాండము ఉద్దేశం. ద్వితీయోపదేశకాండము ఆద్యంతమూ పలు అంశాలు కనబడతాయి.
దేవుని స్వభావ లక్షణాలు: దేవునిలోని ముఖ్యలక్షణం ఆయన పరిశుద్ధత. షెమాతో బాటుగా (6:4), ఇశ్రాయేలు విశ్వాసప్రకటన దేవుని పరిశుద్ధతను, ఆయన నిరుపమానతను నొక్కి చెబుతున్నది. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నీతి, పరిశుద్ధతలు ఆయన ధర్మశాస్త్రపు నైతిక స్వభావమంతటిలో ప్రతిబింబిస్తున్నాయి. ఆయన అద్వితీయుడైన దేవుడు కాబట్టి, ఆయన సంపూర్ణమైన సర్వాధికారం కూడా గలవాడు. మరీ ముఖ్యంగా దేవుని సర్వాధికారం నిబంధనాపూర్వకమైన సంబంధాల్లో మరింత స్పష్టంగా కనబడుతుంది. యెహోవాయే ఇశ్రాయేలుకు సర్వాధికారిjైున ప్రభువు, ఆయన తన సర్వాధికారాన్ని మనిషికి గానీ, కల్పిత దైవానికి గానీ చెందనివ్వడు.
దేవుని స్వభావంలో మరొక ముఖ్యలక్షణం ప్రేమ. దేవునికి తన ప్రజలపట్ల ఉన్న ప్రేమను తెలియజేసే ఆయన అద్భుతకార్యాల్ని ద్వితీయోపదేశకాండము మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంది. దేవునికి తన ప్రజలపట్ల ఒక ఉద్దేశముంది, దేవుని ప్రేమకార్యాలు ఆయన ప్రజలు ఆయన ఉద్దేశాలకనుగుణంగా జీవించేలా చేస్తున్నాయి. ఆయన స్వభావంలోని మరొక లక్షణమైన కృప ఆయనలోని ప్రేమను పోలి ఉంటుంది. దేవునికి ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకొనవలసిన అవసరం లేదు. వారు సణిగినప్పుడు లేదా అవిధేయులైనప్పుడు వారు పాత్రులు కాకపోయినా గానీ దేవుడు వారిపట్ల కృప చూపించాడు.
నిబంధనాపూర్వకమైన సంబంధం: దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధనా పూర్వకమైన సంబంధంలోకి ప్రవే శించడానికి కారణం ఆయన ప్రేమ (7:8). దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీయులు తమ పొరుగున ఉన్న దేశాల మధ్య దేవుని నైతికస్వభావాన్ని ప్రతిబింబించడం ద్వారా ఆయనతో తమ సంబంధాన్ని ప్రతిబింబించాలి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకొనడం, వారికి వాగ్దానదేశాన్నివ్వడం నిబంధనలో దేవుని పక్షాన ఉన్న అంశాలు కాగా విధేయతతో దేవుణ్ణి సేవించడం నిబంధనలో ఇశ్రాయేలీయులవైపునున్న అంశం. నిబంధన ప్రకారం జీవించినప్పుడు కలిగే దీవెనల గురించి ద్వితీయోపదేశకాండము దృఢంగా చెబుతుంది.
దేవుని ప్రజలు విశ్వాసంతో స్పందించడం: వ్యక్తిగత జీవితాల్లోను జాతిగా జీవించడంలోను దేవునిపట్ల సంపూర్ణ మైన సమర్పణ కలిగి ఉండడమే ఆయనతో గల నిబంధనా పూర్వకమైన సంబంధం పట్ల ఇశ్రాయేలీయులు చూప వలసిన స్పందన. దేవుని సర్వాధికారం క్రిందకు రానిదేదీ మానవజీవితంలో లేదు. భక్తికి, లౌకిక జీవితానికి మధ్య వ్యత్యాసమంటూ ఏదీ ఉండదు, దేవుడు తన ప్రజల్లో ఉన్నతమైన నైతికప్రవర్తనను కోరుకుంటున్నాడు. దేవుని ప్రజల్లో నైతికత ఎలా ప్రతిబింబిస్తున్నదనే విషయం ఆయన ఆజ్ఞలపట్ల వారి విధేయతలో వ్యక్తమవు తుంది. ధర్మశాస్త్రసారమంతా ఒకే ఒక ఆజ్ఞలో సంగ్రహంగా కనబడుతుంది: ‘‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను’’ (6:5). దేవుని ప్రజలు ఆయన పట్ల చూపవలసిన ప్రతిస్పందనలో ప్రేమపూర్వకమైన విధేయత ఉండాలి గానీ జడుపుతో నిండిన భయం కాదు. ‘‘మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు’’ (యోహాను 14:15). దేవుడు వారిపట్ల చూపించిన ప్రేమే ప్రేమించాలనే ఆజ్ఞకు మూలం, కాబట్టి ప్రేమామయుడైన దేవునిపట్ల ప్రేమపూర్వకమైన విధేయతయే సహజమైన ప్రతిస్పందన: ‘‘ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము’’ (1యోహాను 4:19).
పాపం, దాని పర్యవసానాలు: ద్వితీయోపదేశకాండములో, పాపం గురించి నిబంధన నేపథ్యంలో తెలియజేయడం జరిగింది. దేవుని ఆజ్ఞల్ని పాటించడంలో విఫలం చెందడం నిబంధనా పూర్వకమైన సంబంధాన్ని భంగపరుస్తుంది, నిబంధనలోని పవిత్రత, ఐక్యత, సాక్ష్యాల మీద ఈ వైఫల్యపు ప్రభావం ఉంటుంది. నిబంధనలో తమ వంతు కర్తవ్యాన్ని ఇశ్రాయేలీయులు చేయకపోయినట్లయితే ఏం జరుగుతుందో ద్వితీయోపదేశకాండము 27-28 అధ్యాయాలు తీవ్రమైన పదాలతో తెలియజేస్తున్నాయి. ఈ పర్యవసానాల్లో వాగ్దానదేశాన్ని పోగొట్టుకొనడం కూడా ఉండబోతుంది. విగ్రహపూజలు మరణానికి దారితీస్తాయి. అవిధేయత, మతభ్రష్టతల కారణంగా దేశం యావత్తూ కష్టాలపాలవుతుంది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఏ విషయంలో హెచ్చరించాడో ఆ విషయంలో వారు సరైన ప్రతిస్పందన చూపనప్పుడు ఎదురైన తీవ్రమైన పరిణామాల్ని వారి చరిత్ర తెలియజేస్తుంది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
కీర్తనలు, యెషయా గ్రంథాల తర్వాత పాత నిబంధనలోని ఇతర గ్రంథాలకంటె ఎక్కువగా ద్వితీయోపదేశ కాండము గ్రంథాన్నే కొత్త నిబంధన ఉదహరించింది. సంఖ్యాపరంగా మాత్రమే కాక, దైవజ్ఞాన సంబంధమైన సత్యం గురించి వచ్చిన ప్రస్తావనల్లోను ఈ గ్రంథంలోని వాక్యభాగాలు ఉపయోగించ బడ్డాయి. దేవుని గురించి, ఆయన ఎన్నుకున్న ప్రజలపట్ల దేవుని కార్యాల గురించి, సకల మానవుల గురించిన తమ బోధల్లో యేసు, అపొస్తలులు ద్వితీయోపదేశకాండము గ్రంథానికి ప్రాముఖ్యత నిచ్చారు. యేసు శోధించబడినప్పుడు సాతాను నెదిరించడానికి ద్వితీయోపదేశకాండము గ్రంథం నుండి మూడుసార్లు ప్రస్తావించాడు (మత్తయి 4:4-10).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”