బాధాకరమైన నిజాలు లేక కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోడానికి బైబిలు ఎన్నడూ సంకోచించదు. ఈ లోకంలో సమస్తం వ్యర్ధం అనిపించేలా ఉన్న పరిస్థితిలో జీవితం యొక్క అర్థాన్ని ఏ విధంగా కనుక్కోగలం అనే ప్రశ్నను ప్రసంగి గ్రంథం చర్చించింది. ఆ ప్రశ్నకు ఏవో పైపై జవాబులతో సరిపెట్టుకోడానికి పాఠకుణ్ణి అది అనుమతించదు. శూన్య నినాదాలతో మనల్ని ఆదరించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నించదు. దానికి విరుద్ధంగా, ‘‘సమస్తము వ్యర్థం’’ అనేదే దాని ధర్మసూత్రం. అయితే ఈ గ్రంథం మనల్ని మానవ ఉనికిలోని వ్యర్థత్వమును ఎదుర్కొనేలా వత్తిడి చేసి శూన్య ఉద్దేశాలు, కపట తీర్పు లేని జీవితానికి నడిపిస్తుంది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: 1:1; 1:12 ప్రకారం దీని రచయిత దావీదు కుమారుడు, యెరూషలేము నుండి పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజు. 12:9 ఈ రచయిత సామెతలు గ్రంథం రాసిన వ్యక్తి అని చెబుతున్నది. కాబట్టి ఆ రచయిత సొలొమోను అయి ఉంటాడనిపిస్తుంది. ఇదే నిజమైతే చాలామంది పండితులు భావిస్తున్నట్టు ఈ గ్రంథం రచించిన తేదీలను ఇశ్రాయేలు చరిత్రలో చాలా ఆలస్యంగా, అంటే సొలొమోను కాలానికి కనీసం 500 సంవత్సరాల తరవాత (క్రీ.పూ.450 తరవాత) అని భావించారు. అయితే ఈ గ్రంథం సొలొమోను కాలం నాటిదే అని బలమైన రుజువులు సాక్ష్యమిస్తున్నాయి. ఉదాహరణకు, మెసపటేమియా, ఐగుప్తు ప్రాంతాల ప్రారంభ సాహిత్యం గురించిన గొప్ప అవగాహన దీనిలో కనిపిస్తుంది.
సొలొమోను కాలంకంటే ఎంతో ముందునుంచీ ఉన్న ‘‘వైణికుని గీతాలు’’ అనే ఐగుప్తు కవిత్వం గురించిన అవగాహన దీనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రసంగి 9:7-9 అలాంటి సాహిత్యానికి దగ్గరగా ఉండి మెసపటేమియాలో ప్రసిద్ధిగాంచిన గిల్గామెషు ఇతిహాసంలోని ఒక భాగాన్ని పోలి ఉంది. ఐగుప్తుతో సన్నిహిత సంబంధాలు కలిగి, తన రాజ్యాన్ని యూఫ్రటీను నదివరకు విస్తరింపజేసిన సొలొమోను ఆయా రచనల గురించి చదివే ఉంటాడనుకోడానికి అవకాశం ఉంది. 500 సంవత్సరాల తరవాత ఐగుప్తు, మెసపటేమియా ప్రాభవం అంతా గతించిపోయిన కాలంలో, యూదా ఏదో ప్రాముఖ్యత లేని రాజ్యంగా మిగిలిపోయిన కాలంలో ఒక అనామక యూదునికి ఈ రచనలు అందుబాటులో ఉండి అతడు వీటిని చదివి అర్థం చేసుకుని ఉంటాడనుకోవడం సందేహాస్పదమే. పైగా, ప్రసంగి గ్రంథంలో క్రీ.పూ. 5వ శతాబ్దంలో, ఆ తరవాత విలసిల్లిన గీకు తత్వశాస్త్రంతో ప్రసంగి గ్రంథంలో ఎలాంటి పోలికలు కనిపించడం లేదు. ఈ కారణాలన్నిటిని బట్టి సొలొమోనే ఈ గ్రంథ రచయిత అని సాంప్రదాయకంగా ఉన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.
నేపథ్యం: ప్రసంగి గ్రంథం జ్ఞానసాహిత్యానికి చెందింది. అంటే మానవ జీవితానికి సంబంధించిన ఆచరణాత్మకమైన, తాత్విక విషయాలను ఎదుర్కోడానికి పాఠకులకు సహాయపడడానికి ఉద్దేశించిన ప్రత్యేకమైన బైబిలు విభాగానికి చెందింది. దీని మూలాలు ఐగుప్తు, బబులోను జ్ఞానసాహిత్యంలో కనిపిస్తాయి. సత్యం కోసం వెదుకులాటకు బైబిలు అందించే జవాబే సామెతలు, ప్రసంగిలాంటి గ్రంథాలు. సామెతలు గ్రంథం పాఠకునికి ప్రాథమిక జీవిత నియమాలను నిర్దేశించే మౌలిక జ్ఞానం. దానికి భిన్నంగా ప్రసంగి గ్రంథం మరింత పరిణతి చెందిన పాఠకునికి ప్రయోజనకరం. మరణం అనేది జీవితం యొక్క పూర్తి ఉద్దేశాన్ని, అర్థాన్ని కొట్టివేస్తుందా అన్న ప్రశ్నకు జవాబులు ఇది వెదుకుతుంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
మనమూ, మన పనులూ వ్యర్థం కాబట్టి, అంటే నశించిపోయేవే కాబట్టి అంతిమంగా నిరర్థకమై పోయే వెదుకులాటలతో కూడిన మన ఉనికిని సమర్థించుకోడానికి ప్రయత్నిస్తూ మన జీవితాలను వ్యర్థం చేసుకోకూడదు. ప్రసంగి గ్రంథం జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రయత్నాలను మరణం అనే వాస్తవం దృష్టిలో పరిశీలిస్తుంది. జీవితంలో వివిధ రకాల గమ్యాల వెంటబడి పోవడాన్ని గూర్చి ఈ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది.
1. మేధోసంబంధ సాఫల్యతలు. జీవితంతో నెట్టుకురావడానికి జ్ఞానం మనకు సహాయకరంగా ఉంటుంది గానీ, తెలివిని సంపాదించుకోవడం మాత్రం అర్థరహితం అని ప్రసంగి గ్రంథం రూఢపిరుస్తుంది. అంతిమంగా తెలివైనవాడు, అతని పనులు కూడా బుద్ధిహీనుడు, అతని పనులలాగానే నశించిపోతాయి.
2. సంపద, భోగాలు. జీవితానికి ఒక ప్రయోజనాన్ని కలిగించలేవు. దానికంటే మించి సంపదల వెంటబడి వెళ్ళేవారు తమ జీవితాలను కఠినత్వంతో, చింతతో, కష్టంతో వ్యర్థం చేసుకుంటారు. డబ్బు అవసరమే, ప్రసంగి గ్రంథం కూడా ఒక సాధారణ స్థాయిలో సౌభాగ్యాన్ని కలిగి ఉండడానికి ఒక వ్యూహం కలిగి ఉండాలని బోధిస్తుంది. కానీ సంపద అనేది నిజమైన సంతృప్తికి ఒక మోసపూరితమైన ప్రత్యామ్నాయం.
3. రాజకీయాలు. రాజకీయాధికారం స్వతహాగా అవినీతిమయం. ఈ లోకంలో అత్యంత దుర్మార్గమైన కార్యాలు కృారులైన లేక అసమర్ధులైన వ్యక్తులు అధికారంలోనుండి జరిగించినవే. అదే సమయంలో ప్రభుత్వం అనేది అవసరమే. రాజకీయ పోటీతో నిండిన ఈ లోకంలో ఏ విధంగా నెగ్గుకురావాలో, ఏ విధంగా ఒక నిలకడైన, శాంతితో నిండిన జీవితం కలిగి ఉండాలో ప్రసంగి గ్రంథం తన పాఠకులకు నేర్పిస్తుంది.
4. మతం. మతం విషయంలో ఆసక్తి కలిగి ఉండడం కూడా ప్రసంగి గ్రంథంలో విమర్శకు గురైంది. ఈ విషయంలో అది ఇచ్చే రెండు హెచ్చరికలేమిటంటే మనం దేవుణ్ణి మెప్పించడానికి ప్రయత్నించకూడదు, మితిమీరిన హేతురాహిత్యంతో మనల్ని మనం తరిగిపోయేలా చేసుకోకూడదు.
సానుకూలమైన రీతిలో ఆలోచిస్తే మన జీవితకాలపు సంక్షిప్తత వెలుగులో రెండు పనులు చేయాలని ప్రసంగి మనల్ని ప్రోత్సహిస్తుంది.
1. జీవితాన్ని ఆనందించు. ఇదేదో తిను, తాగు, సుఖించు అనే తత్వం కాదు. అదే సమయంలో అది మన ఇతర బాధ్యతలను నిర్లక్ష్యం చేయమని కాదు. ఎందుకంటే సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉంది. అయితే సుఖసంతోషాలు లేని జీవితం అసలు జీవితమే కాదు.
2. దేవునికి భయపడు. ఇది దేవుని ముందు మన బలహీనతలను, పాపాన్ని గురించిన అవగాహన వలన పుట్టిన ఒక యథార్థమైన తగ్గింపు. దీనిలో మనం దేవునిపై ఆధారపడి ఉన్నామనీ, ఆయన మన న్యాయాధిపతి అనీ ఒక గుర్తింపు ఇమిడి ఉన్నాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ప్రసంగి గ్రంధాన్ని బహు జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే దానిలోని కొన్ని వచనాలను సందర్భానుసారంగా కాకుండా బయటికి తీసి చదివితే అవి మిగిలిన బైబిలు బోధలతో విభేధిస్తున్నట్టు కనిపిస్తుంది. అది మరణానంతర జీవాన్ని తిరస్కరించినట్టు (3:18-22), అతిగా నీతిమంతులుగా ఉండకూడదని హెచ్చరించినట్టు (7:16), జీవితంలో సుఖానుభవాన్ని ప్రోత్సహించినట్టు (10:19) కనిపిస్తుంది. కానీ మనం మన మరణాన్ని తీవ్రంగా పరిగణించి మనం ఏ విధంగా జీవించాలో జాగ్రత్తగా ఆలోచించాలన్నదే ప్రసంగి గ్రంథం నిజమైన ఉద్దేశం. ఈ కోణంలో చూస్తే మన తీవ్రమైన మతాసక్తి కాక కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని రక్షిస్తుందన్న కొత్త నిబంధన బోధకు ఈ గ్రంథం బాటలు వేసింది.
గ్రంథ నిర్మాణం
బైబిల్లోని గ్రంథాల్లో మనం సాధారణంగా ఎదురుచూసే నిర్మాణం ప్రసంగి గ్రంథంలో కనిపించదు. మొట్టమొదటి చూపులోనే అది వివిధ రకాల అంశాల మధ్య ఒకదాని నుండి మరొకదానికి కదులుతూ అసంబద్ధంగా కనిపిస్తుంది. దీనికి సాధారణంగా కనిపించే ఒక క్రమమైన విభజన లేకుండా తరచుగా ఒక అంశంలో నుండి మరొక అంశంలోకి వేగంగా దూకుతూ వెళ్తుంది. అయితే దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకదాని తరవాత మరొకటి వచ్చే రెండు దృక్పథాల మధ్య దీని నిర్మాణం ప్రస్ఫుటమవుతుంది: దేవుడు లేకుండా మానవుని ఉనికి, దేవుని ముందు ఉనికి కలిగి జీవించడం. ప్రసంగి గ్రంథం సంగీతం అయి ఉంటే అది ఒకరి వెంబడి ఇంకొకరు పాడినట్లు అనిపిస్తుంది. అంతిమంగా ప్రసంగి గ్రంథం అంతటిలో వ్యాపించిన సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ‘‘దేవునియందు భయభక్తులు కలిగి యుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను’’ (12:13) అనే ప్రకటనలో కనిపిస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”