ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తులో ఉన్న పాపుల పట్ల దేవుడు చూపిన సార్వభౌమ కృపను గురించి ఒక గీతాలాపన వంటిది. లేఖనమంతటిలో అత్యంత చెడ్డవైన (‘‘మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారు’’), అత్యంత శ్రేష్ఠమైన (‘‘దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను’’) వాస్తవాలు కొన్ని ఈ పత్రికలో కనిపిస్తాయి. ఈ కృపకు సంబంధించి విశ్వాసులు ‘‘ఆయన పిలుపుకు తగినట్టుగా నడుచుకోమని’’ పౌలు మనకు ఉద్బోధిస్తున్నాడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఎఫెసీ పత్రికలో రెండు చోట్ల పౌలు తానే గ్రంథకర్తనని పేర్కొన్నాడు (1:1; 3:1). చాలామంది దీనిని పౌలు రచనలన్నిటిలో మకుటాయమానమైందని పరిగణిస్తారు. అపొస్తలుడైన పౌలుకు సరిపోలని రచనాశైలి, పదజాలం, ఇంకా మరికొన్ని బోధనలు ఈ పుస్తకంలో కనిపిస్తున్నాయని నేటికాలపు వ్యాఖ్యానకర్తలు కొందరు భావిస్తున్నారు. అదే నిజమైతే పౌలు శిష్యుల్లో ఒకరు వేదాంతపరమైన అంతర్దృష్టి, ఆధ్యాత్మిక దృక్పథాల్లో పౌలునే మించిపోయాడని భావించాలి. అయితే అంతటి పాండిత్యం ఉన్న శిష్యుని గురించిన వివరాలు ఆదిసంఘంలో కనిపించవు. అంతేకాక ఒక రచయిత వేరొకని పేరుతో రచనలు చేయడం అనే సంప్రదాయం ప్రారంభ క్రైస్తవుల్లో కనిపించదు. కాబట్టి ఈ పత్రికను పౌలే రాశాడని ఆదిసంఘంలో ఉన్న అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎఫెసీ పత్రిక గ్రంథకర్తృత్వాన్ని పౌలుకు ఆపాదించడాన్ని విభేధించడానికి ఏ కారణమూ కనిపించడం లేదు.
నేపథ్యం: పౌలు ఈ ఉత్తరాన్ని చెరసాలలో నుండి రాశాడు (3:1; 4:3; 6:19). పౌలు ఈ ఉత్తరం రాసిన సమయంలో, అంటే క్రీ.శ.57-59 మధ్య కైసరయ (అపొ.కా.24:23) చెరసాలలో ఉన్నాడా లేక సుమారు క్రీ.శ.60-62 సమయంలో రోమా (అపొ.కా.28:30) చెరసాలలో ఉన్నాడా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. పౌలు కొలస్సీ, ఫిలేమోను, ఫిలిప్పీ వంటి ఇతర పత్రికలను కూడా ఇదే చెరసాల నుండి రాసి ఉండవచ్చు.
సంప్రదాయమైతే పౌలు రోమ్‌లో తన అద్దె ఇంటిలో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు (అపొ.కా.28:30) ఈ పత్రికను క్రీ.శ.60-61 మధ్య రాసి ఉంటాడని చెబుతున్నది. ఎఫెసీ పత్రిక ఎవరిని ఉద్దేశించి రాయబడిరదో మనకు తెలియదు. కొన్ని ప్రాముఖ్యమైన, ప్రారంభ మూల ప్రతులలో ‘‘ఎఫెసులో నున్న’’ (1:1) అనే మాటలు కనిపించవు. ఎఫెసీ 6:21లో, కొలస్సీ 4:7 లో పౌలు ప్రతినిధిగా పేర్కొనబడిన తుకికు ఈ ఉత్తరాన్ని దాని గమ్యస్థానానికి చేర్చాడు. ఎఫెసీ, కొలస్సీ పత్రికలు రెండూ అదే సమయంలో వారికి అందించబడి ఉంటాయి. ఎందుకంటే రెండు పత్రికల్లోనూ తుకికు ఆయా సంఘాలకు పౌలు పరిస్థితులను గురించి వివరిస్తాడు అని పేర్కొనబడిరది.
మనం బహుశా ఒక సన్నివేశాన్ని సూచించవచ్చు. పౌలు రోమా చెరసాలలో ఉన్నప్పుడు చిన్న ఆసియా ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్న కొత్త మత సిద్ధాంతాల గురించి అతడు స్పందించాల్సిన అవసరం కలిగింది. లవొదికయ ప్రాంతంలో క్రైస్తవ్యానికి ఎదురైన బెదిరింపులను గురించి తనకు తెలియజేసిన ఎపఫ్రా ద్వారా పౌలు ఈ పత్రికలు రాయడానికి ప్రేరణ పొందాడు. దానికి స్పందనగా పౌలు కొలస్సీ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. సుమారు అదే సమయంలో (దానికి కొంచెం ముందు వెనుకలుగా) అతడు లవొదికయ (కొలస్సీ 4:16 చూడండి), ఎఫెసుతో సహా చిన్న ఆసియా వారికి మరింత విస్తృతమైన సార్వత్రిక ఉత్తరం ఒకటి రాశాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ ఉత్తరం రాయడంలో అనేక ఉద్దేశాలు కనిపిస్తాయి. విశ్వాసులైన యూదులు, అన్యులు ఇద్దరూ క్రీస్తులో ఏకమై ఉన్నారని అపొస్తలుడు బోధించాడు. ఈ ఏకత్వం వారు ఒకరిపట్ల ఒకరు చూపించే ప్రేమద్వారా వెల్లడి పరచబడాలి. ప్రేమ (అగపే) అనే పదాన్ని పౌలు దాని నామవాచకం లేక క్రియాపదం రూపంలో దాదాపు 19 సార్లు వాడాడు (పౌలు రాసిన అన్ని ఉత్తరాల్లో ఆ పదం వాడబడిన మొత్తంలో ఆరవ వంతు). ఎఫెసీ పత్రిక ప్రేమతో మొదలై (1:4-6) ప్రేమతో ముగిసింది (6:23-24).
లవొదికయ ప్రాంతంలో మార్మిక మతాల మూలంగా రేకెత్తిన అనేక విషయాలను పౌలు లోతుగా స్పృశించాడు. ఈ ఉత్తరంలో విమోచన గురించీ (1:7), మానవజాతి విషయంలో దేవుని సంకల్పం గురించీ (1:3-14) చాలా విషయాలు ఉన్నాయి. ఇవే కాక, కృప (1:2), మున్నిర్ణయము (1:4-5), సమాధానపరచ బడడం, క్రీస్తుతో ఏకం కావడం (2:1-21) మొదలైన అంశాలు కూడా దీనిలో కనిపిస్తాయి. మానవజాతిని దేవుడు దేనికోసం ఉద్దేశించాడో ఆ విధంగా దానిని పున:సృష్టించడం ఎఫెసీ పత్రిక సందేశంలోని ప్రధానాంశం. దేవుడు యూదుణ్ణి అంగీకరించి, అన్యుణ్ణి తోసిపుచ్చుతాడు అనే దురభిప్రాయాన్ని ఈ నూతన సృష్టి రూపుమాపింది. ఈ వ్యత్యాసం క్రీస్తు యొక్క త్యాగపూరిత మరణంలో తొలగించబడిరది అని పౌలు చెప్పాడు. ఆ విధంగా సమస్త మానవాళినీ క్రీస్తు శిరస్సుగా గల దేవుని ప్రజగా ఏకం చేయడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి (1:22-23).
సంఘం అనే నూతన శరీరం కొత్త జీవితాలు గడపడానికీ (1:3-2:10) దాని నూతన ప్రమాణాలను ఆచరించడానికీ (4:1-6:9) పరిశుద్ధాత్మ శక్తి చేత బలోపేతం చేయబడిరది. మొత్తం మీద పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తులో సంఘంలోని ఏకత్వం గురించి నొక్కి చెప్పడమే ఎఫెసీ పత్రిక సారాంశం అని మనం చెప్పవచ్చు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ఎఫెసీ పత్రిక ప్రాథమికంగా ఎఫెసులో ఉన్న సంఘానికి ఉద్దేశించబడి, ఇంకా ఇతర సంఘాల్లో కూడా పంపిణీ చేయబడడానికి ఉద్దేశించబడి ఉంటుంది. ఆసియా రాష్ట్ర రాజధాని అయిన ఎఫెసు నగరంలో పౌలు దాదాపు మూడు సంవత్సరాలు నివసించాడు (అపొ.కా.20:31 చూడండి). అది అన్ని సంఘాల్లో చెలామణీ కోసం ఉద్దేశించ బడిరది అనే వాస్తవం దృష్టిలో దానిలో ఎఫెసు సంఘ విశ్వాసుల పేర్లు ప్రస్తావించబడక పోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ప్రారంభం నుండీ కేవలం ఎఫెసులో మాత్రమే కాక మరింత విస్తృతమైన పాఠకలోకం కోసం ఈ పత్రికను పౌలు సిద్ధపరిచాడు. దీనిని ఎఫెసీయులు చదివిన తరువాత దానిని కొలస్సీ, లవొదికయ ఇంకా ఆ ప్రాంతంలోని ఇతర సంఘాలకు కూడా పంపించి ఉంటారు. అపొస్తలుడైన పౌలు రాసినది అని పిలవబడిన ఈ ఉత్తరం దానిని అందుకున్న వారందరి చేతా పరిశుద్ధ లేఖనం అని అంగీకరించబడిరది.
గ్రంథ నిర్మాణం
ఎఫెసీ పత్రికలోని అభివాదం, దాని నిర్మాణం సరిగ్గా కొలస్సీ పత్రికను పోలి ఉంది. చాలా అంశాలు ఈ రెండు పత్రికల్లోనూ చర్చించబడ్డాయి. వీటిలోని సందేశంలో కూడా శక్తివంతమైన పోలికలున్నాయి. ఎఫెసీ పత్రికలోని 155 వచనాల్లో సగానికి మించి కొలస్సీ పత్రికలో కనిపించే భావవ్యక్తీకరణలు కనిపిస్తాయి. అయితే కొలస్సీ పత్రిక అప్పటికప్పుడు రాసినట్టుగా, ఒక వాదనలాగా, సంక్షిప్తీకరించినట్టుగా కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక అయితే ధ్యానపూర్వకమైన, సూచనాత్మకమైన, వివరణాత్మకమైన రీతిలో ఒక విస్తృతమైన, సంపూర్ణమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.
ఎఫెసీ, కొలస్సీ పత్రికల మధ్య అనేకమైన పోలికలు కనిపించినా ఎఫెసీ పత్రికలోని ప్రత్యేకతను గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఎఫెసీ పత్రికలో కొలస్సీ పత్రికలో కనిపించే విషయాన్ని తీసివేసి చూస్తే ఒక్క ఎఫెసీ పత్రికకే ప్రత్యేకం అనిపించే ఏడు విభాగాల సమాచారం మనం చూడవచ్చు.
1:3-14 విస్తరించి రాసిన ఆశీర్వచనం
2:1-10 నూతన జీవం గురించిన ఒక అంగీకారపత్రం
3:14-21 క్రీస్తు మర్మాన్ని అర్థం చేసుకోడానికి ఒక ప్రార్థన
4:1-16 క్రైస్తవ ఐక్యత గురించి ప్రోత్సాహకరమైన ఒక విస్తృత హెచ్చరిక
5:8-14 వెలుగులో నడవడం గురించిన భాగం
5:23-32 కుటుంబ వ్యవస్థలోని పాత్రల గురించి వేదాంతపరమైన వివరణ
6:10-17 క్రైస్తవుని ఆధ్యాత్మిక యుద్ధం గురించిన ఒక విశిష్టమైన చిత్రం
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”