దీని ఇంగ్లీషు శీర్షిక “నిర్గమము” అని అర్థమిచ్చే గ్రీకు మాట నుండి అనువదించబడిరది. అది దేవుని ప్రజలు ఐగుప్తును విడిచి వెళ్ళిన ప్రధాన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ పెట్టిన పేరు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని విమోచించి వారిని ఒక నిబంధనా జనాంగంగా, తనను సేవిస్తూ తనకు ప్రతినిధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్న ఒక రాజ్యంగా చేసిన వృత్తాంతాన్ని గ్రంథస్థం చేయడాన్ని బట్టి నిర్గమకాండాన్ని పాత నిబంధన అంతటికీ కేంద్ర బిందువైన గ్రంథంగా పరిగణించవచ్చు. ఇశ్రాయేలీయుల బానిసత్వం, అణచివేత, మోషే సిద్ధపాటు, అతని పిలుపు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు, ఫరో ప్రాతినిధ్యం వహిస్తున్న ఐగుప్తు దేవతలకు మధ్య జరిగిన పోరాటం, ఇశ్రాయేలీయుల నిర్గమనం, యెహోవాతో ఒక నిబంధనలో వారు ఒక రాజ్యంగా ఏర్పడడం, వారి తిరుగుబాటు, వారు ఆయన కోసం నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో ఆయన సన్నిధి ద్వారా తమ మధ్య సంబంధం కొనసాగడానికి యెహోవా చేసిన ఏర్పాటు, వీటన్నిటి గురించీ నిర్గమకాండం వర్ణించింది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: నిర్గమకాండం గ్రంథ రచయిత ఎవరో ఆ గ్రంథం ప్రస్తావించలేదు. అయితే ఆయా సందర్భాల్లో ఆయా సంఘటనలు ఎలా జరిగాయో, దేవుడు ఏమి చెప్పాడో అనే విషయాలు మోషే రాసి గ్రంథస్థం చేసిన కొన్ని ప్రస్తావనలను ఇది పేర్కొంటున్నది (17:14,24:4,7, 34:27-28). అలాగే ఈ సమాచారాన్ని భద్రంగా నిలిపి ఉంచి దానిని తరువాతి తరాలకు అందించడం గురించిన కొన్ని ప్రస్తావనలు కూడా దీనిలో చూస్తాం. పంచకాండాలు లోని ఇతర నాలుగు గ్రంథాలతో కలిపి దీని రచయిత మోషే అని ప్రాథమికంగా విశ్వసించబడిరది. మోషే ఈ గ్రంథాన్ని 40 సంవత్సరాల కాల పరిథిలో ఎప్పుడైనా రాసి ఉండవచ్చు. అంటే సీనాయి కొండ దగ్గర ప్రత్యక్ష గుడార నిర్మాణం జరిగి, దానిని ప్రతిష్ఠించినప్పుడు, ఐగుప్తును విడిచి వచ్చిన రెండవ సంవత్సరం ప్రారంభంలో (క్రీ.పూ.1445), మోయాబు ప్రాంతంలో తన మరణానికి ముందు (సుమారు క్రీ.పూ. 1406), ఎప్పుడైనా రాసి ఉంటాడు.
నేపథ్యం: ఆదికాండం ముగింపులో క్రీ.పూ. సుమారు 1805 లో యోసేపు మరణం గురించిన వివరణ పూర్తి అయిన తరవాత నుండి నిర్గమకాండం గ్రంథంలోని చరిత్ర ప్రారంభం అయ్యింది. ఆ వెంటనే అది మనల్ని అతి త్వరగా 300 సంవత్సరాలు ముందుకు, అంటే ఐగుప్తులో యాకోబు సంతానం వారి పరిస్థితులు తారుమారైన కాలానికి తీసుకువెళ్తుంది. ఐగుప్తు 18వ రాజవంశ పాలనలో, బహుశా తుట్మోస్, 2వ ఆమెన్హోటెప్ అనే ఫరోల కాలంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా నివసిస్తున్నారు. దేవుని సేవక నాయకుడైన మోషే ద్వారా ఆయన చేతి నుండి ఈ హెబ్రీ బానిసలు ఆశ్చర్యకరంగా విడిపించబడ్డారు. ఇశ్రాయేలు బానిసత్వం క్రీ.పూ.1446 లో ముగిసింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన సంఘటన చుట్టూ ఉన్న వృత్తాంతాలు, అరణ్య ప్రయాణంలో వారి మొదటి సంవత్సరం, ధర్మశాస్త్రం వారికి అనుగ్రహించబడడం, ఇవన్నీ నిర్గమకాండం గ్రంథంలో రాయబడ్డాయి.
నిర్గమకాండం రచనాకాలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే బైబిలు రుజువుల ప్రకారం అది క్రీ.పూ.1446లో రాసి ఉండవచ్చు. 1రాజులు 6:1 లో సొలొమోను రాజుగా నాలుగు సంవత్సరాలు గడిచిన సమయానికి 480 సంవత్సరాల క్రితం నిర్గమము జరిగింది అని పేర్కొనబడిరది. ఈ విషయం అదే సమయంలో లభించిన అష్షూరు కాలక్రమంతో సరిపోల్చబడి క్రీ.పూ.966 అని నిర్ణయించబడిరది. న్యాయాధిపతులు 11:26 లో యెఫ్తా మాట్లాడుతూ ఇశ్రాయేలీయులు కనాను ప్రాంతాల్లో మూడు వందల సంవత్సరాలుగా నివసిస్తున్నారు అని చెప్పడం చూస్తాం. యెఫ్తా సుమారు క్రీ.పూ. 1100 ప్రాంతంలో జీవించాడు. దానివలన ఇశ్రాయేలీయుల అరణ్యప్రయాణం క్రీ.పూ.1400 ప్రాంతంలో ముగిసి ఉంటుందని తెలుస్తుంది.
గ్రంథ సందేశం, దాని ఉద్దేశం
తాను ఎవరి మధ్యనైతే నివసిస్తున్నాడని చెప్పబడిరదో ఆ ప్రజలతో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలనే ఆశతో దేవుడు పనిచేయడాన్ని నిర్గమకాండం గ్రంథం వివరించింది. తనను తాను వెల్లడిపరచుకోవడం కోసం దేవుడు ఇశ్రాయేలీయుల్ని విమోచించాడు. అది కేవలం తన మహా శక్తిని ఉపయోగించడం ద్వారా మాత్రమే కాదు, సహనం, కృప, క్షమాపణ అనే తన లక్షణాలతో నిండిన సామర్థ్యంపై ఆధారపడిన ఎడతెగని నిబంధనా సంబంధం ద్వారా కూడా జరిగింది. ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన కార్యాలు గ్రంథస్తం చేయబడడం వలన వారు ఆయన్ని తమ దేవునిగా, తమ సంపూర్ణమైన నమ్మకత్వానికి, విధేయతకు పాత్రునిగా గుర్తించడానికి దారితీశాయి. ఈ గ్రంథ వృత్తాంతం ఇశ్రాయేలీయులకు తాము దేవుని ప్రజలమనే గుర్తింపును స్పష్టం చేయడంతోబాటు, వారికి ఆయన మహిమాన్వితమైన గుర్తింపును కనపరచడం కొనసాగించింది.
నిర్గమకాండములో నాలుగు బలమైన సందేశాలు ఉన్నాయి: 1. దేవుడైన యెహోవా: మోషేకు, ఇశ్రాయేలీయులకు దేవుడు తనను తాను యెహోవాగా, అంటే “ఉన్నవాడను అనువాడను” అని వెల్లడి చేసుకున్నాడు. దేవుని ఈ నిబంధనా నామం గంభీరమైన భావం కలిగి ఉండి, దేవుని శక్తినీ, అధికారాన్నీ, నిత్య స్వభావాన్నీ రూఢపిరుస్తున్నది.
2. విమోచన: ఇశ్రాయేలీయులు విడుదల కోసం మొర పెట్టినప్పుడు దేవుడు స్పందించాడు. ఆయన తన సేవక నాయకుడైన మోషే ద్వారా పనిచేసినా దానిని దేవుడే స్వయంగా చేస్తున్నాడు అని ప్రస్ఫుటమయ్యేలా ఆశ్చర్యకరమైన రీతిలో జరిగించాడు. ఇశ్రాయేలీయులు తమను తాము రక్షించుకోలేకపోయారు. వారి విడుదల అంతా దేవుని కార్యమే. వారి పక్షంగా దేవుడు చేసిన ఆ కార్యానికి ఒక వార్షిక జ్ఞాపకసూచనగా పస్కా పండుగ స్థాపించబడిరది.
3. ధర్మశాస్త్రము: దేవుని ధర్మశాస్త్రం ఆధ్యాత్మికంగా, నైతికంగా దేవుడు నిర్దేశించిన ఖండితమైన నియమాలైన పది ఆజ్ఞలలో నిక్షిప్తమై ఉంది. ధర్మశాస్త్రం రెండు విభాగాలు చేయబడిరది: ఒకటి పౌరచట్టం – సామాజిక జీవనాన్ని పాలించే నియమాలు, రెండవది ఆచారసంబంధమైన చట్టం – ఆరాధనా పద్ధతులు, ప్రత్యక్షగుడార నిర్మాణ నమూనా.
4. ప్రత్యక్ష గుడారం: తన ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో దేవుడు ఇశ్రాయేలీయులకు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. దాని ప్రత్యేకత అది దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉండే చోటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది అనే సత్యంలో ఉంది. ప్రత్యేకంగా ఆయన ఒక సాధారణ ఇశ్రాయేలీయుడు సమీపించడానికి సాధ్యం కాని అతి పరిశుద్ధ స్థలంలో నివాసం ఉంటాడని చెప్పబడిరది. భవిష్యత్తులో క్రీస్తు అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న మధ్యతెరను తొలగించి విశ్వాసులందరికీ దేవుని సన్నిధిలోకి ప్రవేశం ఏర్పరచిన సంఘటనను ఇది మనకు చూపిస్తుంది. కొ.ని.లో విశ్వాసులే ప్రత్యక్షగుడారంగా మారారు. ఎందుకంటే దేవుడు నివసించేది తన ప్రజల మధ్యలో కాదు, ఆయన వారిలో నివసిస్తాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
పా.ని.లో విమోచనా చరిత్రలో అత్యున్నత స్థాయిని నిర్గమకాండం గ్రంథం మనకందిస్తుంది. ఈ గ్రంథంలోని అనేక పోలికలు, విషయాంశాలు ఆయా లేఖనాలన్నిటిలో ధ్యానం చేయబడి, వృద్ధి చెంది, నెరవేర్పుకు రావడం చూస్తాం. మరి ముఖ్యంగా ప్రభువైన యేసు యొక్క భూత, వర్తమాన, భవిష్యత్కాల పనిని దీనిలో చూస్తాం. వీటిలో అణచివేత నుండి విడుదల, మన పోషణకై ఏర్పాటు, తన వాగ్దానాల విషయంలో దేవుని నమ్మకత్వం, దేవుని స్వీయ ప్రత్యక్షత, ఆయన కార్యాల ద్వారా మనకు కలిగిన దేవుని జ్ఞానం, దేవుని సన్నిధి, ఆయన మహిమను జ్ఞానాన్ని పదిలపరచడానికి అవసరమైన ప్రయత్నాలు, దేవుని క్రియల ఆధారంగా ప్రజలకు లభించిన నూతన గుర్తింపు, ఆరాధనకు ఏర్పాటు, సామాజిక జీవనంలో అవసరమైన ఏర్పాట్లు, ఒక ప్రజా గుంపుతో దేవుని సహవాసానికి, ఆయన ఘనతకు మధ్య ఉన్న సంబంధం, విధేయత, తిరుగుబాటు, విజ్ఞాపన, కృపాభరితమైన క్షమాపణ, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.
గ్రంథ నిర్మాణం
నిర్గమకాండాన్ని ధర్మశాస్త్రంలో ఒక భాగంగా పరిగణిస్తారు కానీ అది ధర్మశాస్త్రాన్ని మించి ఒక చారిత్రక కథనం. ఈ గ్రంథం మోషే జీవితం, అతని ప్రయాణాలతో నిర్మితమైంది. 1-18 అధ్యా., 32-40 అధ్యాయాల మధ్య ఉన్న వృత్తాంతమంతా నిబంధనా స్థాపనకూ (అధ్యా. 19-24), ప్రత్యక్ష గుడారానికీ, యాజకత్వానికీ సంబంధించిన నియమాల వివరణ.