పౌలు పత్రికల్లో గలతీ పత్రిక బహుశా మొదటిది మాత్రమే కాదు, అతి తీవ్రమైన ఉత్తరం కూడా. పాపులు యేసులో విశ్వాసముంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడి, దైవికమైన జీవితాలు జీవించగలరనే సత్యాన్ని గురించిన బలమైన వాదన దీనిలో కనిపిస్తుంది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: దీని రచయిత పేరు పౌలు. అతడు తనను తాను క్రీస్తుకు ఒక ‘‘అపొస్తలుడు’’ అని పిలుచుకున్నాడు (గలతీ 1:1). దీనిలోని స్వీయచరిత్ర వృత్తాంతానికి సంబంధించిన సమాచారం అపొస్తలుడైన పౌలు గురించి అపొస్తలుల కార్యాలు గ్రంథంలో, ఇంకా అతని ఇతరఉత్తరాల్లో ఉన్న సమాచారంతో పూర్తిగా సరిపోలుతుంది. వేదాంతపరంగా చూస్తే గలతీ పత్రికలో రాసిన ప్రతి విషయమూ పౌలు వేరే చోట్ల, మరి ముఖ్యంగా రోమా పత్రికలో వెల్లడిరచిన అభిప్రాయాలతో ఏకీభవిస్తుంది.
నేపథ్యం: గలతీ సంఘాలు ఎక్కడ ఉన్నాయో, ఈ పత్రికను పౌలు ఎప్పుడు రాశాడో నిర్ధారణ కాలేదు. దీనికి కారణం కొ.ని. కాలంలో గలతీయులు అనే పదం జాతిపరంగానూ, రాజకీయంగానూ రెండు రకాలుగా వాడుకలో ఉంది. ‘‘గలతీయులు’’ అనేదాన్ని జాతిపరంగా అర్థం చేసుకుంటే పౌలు గలతీ సంఘాలను స్థాపించడం అనేది కేవలం కొ.ని.లో సూచించబడిన అంశం. పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో ఉత్తర మధ్యాసియా మైనర్ ప్రాంతంలోని (ఆధునిక టర్కీ రాజధాని అంకారా దగ్గర) ‘‘ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా’’ (అపొ.కా.16:6) వెళ్ళాడు. అతడు ఆ ప్రదేశాన్ని మళ్లీ దర్శించిన సందర్భం అపొ.కా.18:23; 19:1 లో గ్రంథస్థం చేయబడి ఉంది. క్రీ.పూ. మూడవ శతాబ్దంలో గాలు (ఆధునిక ప్రాన్స్) నుండి ఒక గుంపు రోమనులపై దండయాత్ర సాగించింది. అందువల్ల ఆ ప్రాంతాన్ని గలతీయ అని పిలిచారు.
గలతీయులు అనే పదాన్ని రాజకీయంగా అర్థం చేసుకుంటే రోమీయుల గలతీయ రాష్ట్రం దక్షిణ ప్రాంతంలో నివసించే వారిని గలతీయులు అని సూచిస్తుండవచ్చు. పౌలు పరిచర్య చేసి సంఘాలు స్థాపించిన పిసిదియ అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర, దెర్బే అనే నగరాలు అన్నీ ఈ ప్రాంతంలో ఉన్నవే. ఈ సమాచారం అపొ.కా.13:14-14:23 లో చూడవచ్చు.
గలతీ పత్రిక గాలు జాతి ప్రజలు నివసించిన ప్రాంతానికి రాయబడిరది అనే అభిప్రాయాన్ని బట్టి దీనిని ‘‘ఉత్తర గలతీయ’’ సిద్ధాంతం అని పిలుస్తారు. ఈ అభిప్రాయం ప్రకారం పౌలు రెండవ మిషనరీ యాత్ర తరువాత రాశాడని భావిస్తే పౌలు ఈ ఉత్తరం క్రీ.శ.52 లేక 53 సంవత్సరంలో గాని,ఈ ఉత్తరంతో వేదాంత పరమైన పోలికలున్న రోమా పత్రిక వ్రాయబడిన క్రీ.శ.56 వ సంవత్సరములో గాని, వ్రాయబడియుండవచ్చు.
గలతీయులకు వ్రాసిన పత్రిక, రోమా పరిపాలనలోనున్న గలతీయరాష్ట్రపు దక్షిణ భాగములోని సంఘాలకు పంపబడిరది అనే అభిప్రాయాన్ని ‘‘దక్షిణ గలతీయ’’ సిద్ధాంతం అని పిలుస్తారు. క్రీ.శ.48 లేక 49 సంవత్సరంలో, అంటే క్రీ.శ.49 ప్రాంతంలో జరిగిన యెరూషలేము సభకు ముందు రాసి ఉండవచ్చు అని అంటారు. ఇక్కడ చెప్పినవాటిలో ముందటి తేదీలు సరైనవైతే, కొ.ని.లో గ్రంథాలన్నిటిలో గలతీ పత్రిక మొట్టమొదట రాసినట్టు అవుతుంది. మనం పరిశీలించదగిన మరొక కీలకమైన అంశం ఏమిటంటే గలతీ పత్రికలో ఉన్న వాదనకు మూలాన్నీ, యెరూషలేము సభలో చర్చించిన అంశాన్నీ పోల్చి చూడడం. గలతీ పత్రికలో చర్చించిన సమస్య ఏమిటంటే మోషే ‘‘ధర్మశాస్త్ర సంబంధ క్రియలు’’ (2:16-17; 3:2; 5:4తో పోల్చండి) మరి ముఖ్యంగా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడానికి సున్నతి (5:2; 6:12-13) అవసరమా కాదా అని కొందరు బోధకులు చేర్చారని భావిస్తున్నారు. యెరూషలేము సభ సమావేశం కావడానికి కారణం సరిగ్గా ఇదే అని అపొస్తలుల కార్యాలు గ్రంథస్తం చేసింది (అపొ.కా.15:1,5). గలతీ సంఘంలో ఉన్న సమస్య యెరూషలేము సభ సమావేశం కావడానికి ఒక కారణం అయ్యిందని ఈ వాదన సమర్ధిస్తున్నది.
గలతీ పత్రిక యెరూషలేము సభ ముగిసిన తరువాత రాయబడి ఉంటే పౌలు ఆ సభ తీసుకున్న నిర్ణయాలను తన ఉత్తరంలో ప్రస్తావించకపోవడాన్ని మనం ఊహించలేము. ఎందుకంటే అవి తాను బోధించే సువార్తలోని క్రియారహిత దృక్పథాన్ని సమర్ధించాయి. ఇది పౌలు గలతీ పత్రికను రాసినప్పటికి యెరూషలేము సభ జరిగి ఉండకపోవచ్చు అని బలంగా సూచిస్తున్నది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
అబద్ధ సువార్త ప్రకటనకు వ్యతిరేకంగా ‘‘సువార్త సత్యాన్ని’’ (2:5, 16) స్పష్టపరచి, సమర్ధించుకోడానికి గలతీ పత్రిక రాయబడిరది. ఈ పనిని పౌలు (1) తన సందేశాన్ని, అపొస్తలుడుగా తన అధికారాన్ని సమర్ధించుకోవడం ద్వారా, (2) సువార్త సందేశానికి పా.ని. ఆధారాలను చర్చించడం ద్వారా (3) పౌలు బోధించిన సువార్త సందేశం అనుదిన క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఆచరణాత్మకంగా పనిచేసిందో నిరూపించడం ద్వారా చేశాడు. సువార్తకు సంబంధించి వారి విశ్వాసం, ఆచరణల విషయంలో గలతీయులను సరిదిద్దడానికి పౌలు ఈ పద్ధతిని ఎంచుకున్నాడు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
అపొస్తలుడైన పౌలు జీవితం, అతని కార్యకలాపాల గురించి ఎంతో సమాచారం గలతీ 1:13-2-14 నుండి కనుగొనగలం (4:13-14 లోని వ్యక్తిగతమైన సమాచారం దీనికి అదనం). వీటిలో పౌలు ‘‘అరేబియా’’ దేశానికి వెళ్ళిన సంగతి (1:17), యెరూషలేముకు చేసిన రెండు ప్రయాణాల వర్ణనలు (1:18-19; 2:1-10) ఉన్నాయి. పేతురును తాను ఎదిరించిన సంగతిని పౌలు వివరించడం (2:11-14) కొ.ని.లో మరెక్కడా పేర్కొనబడలేదు.
గలతీ మూడవ అధ్యాయం మధ్యభాగంలో సువార్త యొక్క పా.ని. నేపథ్యం ప్రత్యేకమైన రీతిలో వివరించబడిరది. వాటిలో గమనించదగినవి: (1) ద్వితీ 21:23 లో చెప్పినట్టు యేసు సిలువవేయ బడడం గురించిన శాపం (గలతీ 3:13), (2) అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన ఏక ‘‘సంతానము’’ గురించిన ప్రవచన నెరవేర్పు (3:16; ఆది 22:18 చూడండి), (3) క్రీస్తు పుట్టుక వరకూ ఒక చెరసాలగా (3:22-23), బాలశిక్షకుడుగా (3:24-25) ధర్మశాస్త్రం పోషించిన పాత్ర, (4) అలంకార రూపకముగా చెప్పబడిన అబ్రాహాముకు దాసివలన పుట్టినవాడు, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు అనే వివరణ (4:21-31).
క్రైస్తవ జీవితానికి సంబంధించి పరిశుద్ధాత్మ చేసే పరిచర్య గురించి గలతీ పత్రిక వివరంగా బోధించింది. దత్త పుత్రత్వం (4:5-6) కలిగించే పరిశుద్ధాత్మ పరిచర్య తరువాత, విశ్వాసులు ‘‘ఆత్మానుసారముగా నడుచుకోవాలని’’ (5:16), ‘‘ఆత్మచేత నడిపించ బడాలని’’ (5:18), ‘‘ఆత్మననుసరించి జీవించాలని’’ (5:25) మాత్రమే కాక, నిత్యజీవపు పంటను ‘‘ఆత్మను బట్టి విత్తి’’ ‘‘ఆత్మనుండి కోయాలని’’ కూడా ఆజ్ఞాపించబడ్డాము (6:8). పరిశుద్ధాత్మ పరిచర్య విషయంలో అనుక్షణం అలాంటి సూక్ష్మగ్రాహ్యతను కలిగి ఉన్నప్పుడు కలిగే ఫలితమే ‘‘ఆత్మఫలము’’ అని పిలవబడుతుంది (5:22-23).
గ్రంథ నిర్మాణం
గలతీ పత్రిక మొదటి శతాబ్దంలో రాసే ఏ ఉత్తరమైనా అనుసరించే పద్ధతినే పాటించింది. ఒక్క కృతజ్ఞతలు చెల్లించే విషయంలోనే మినహాయింపు కనిపించింది: అభివాదం (1:1-5), ప్రధాన విభాగం (1:6-6:15), ఒక వీడుకోలు (6:16-18). ఈ ఉత్తరంలో ఒక దానితో మరొకటి విభేధించే అంశాలు ప్రముఖంగా కనిపిస్తాయి: దైవిక ప్రత్యక్షత-మానవుని పరిజ్ఞానం, కృప-ధర్మశాస్త్రం, నీతీకరణ-శిక్షావిధి, యెరూషలేము-సీనాయి కొండ, కుమారత్వము-బానిసత్వము, ఆత్మఫలము-శరీర కార్యములు, స్వాతంత్య్రము-దాసత్వము.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”