చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒకటైన హబక్కూకు తన శైలిలో విశిష్టమైంది. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడాల్సిన హబక్కూకు, ప్రజల తరుపున దేవునితో మాట్లాడాడు. చరిత్రలో దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి హబక్కూకు తర్జనభర్జన పడ్డాడు. ముఖ్యంగా దేవుడు తన న్యాయాన్ని నెరవేర్చడానికి ఒక నీతిలేని దేశాన్ని వాడుకొనే విషయంలో హబక్కూకు లేవనెత్తిన అభ్యంతరానికి దేవుడిచ్చిన జవాబు, ‘‘నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు’’ (2:4) అని.
Read More
రచనా కాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: బైబిల్లో వేరే ఎక్కడా హబక్కూకు ప్రస్తావన లేదు. ఇతని పేరు హెబ్రీ పదం ‘‘ఖబాక్’’ (అంటే ‘‘హత్తుకొను’’ అని అర్థం) నుండి తీసుకున్నారని భావిస్తారు, కాని దాని మూలం హెబ్రీయేతరంగా కనిపిస్తుంది. ఈ పేరు అక్కాడియన్ అనే సెమిటిక్ భాషాపదమైన ‘హబ్బాఖూఖు’ లో నుండి వచ్చియుండవచ్చు. అది తోటలోని మొక్క, లేక ఒక పండ్ల చెట్టుజాతిని సూచిస్తుంది.
నేపధ్యం: యూదయపై కల్దీయుల దండయాత్రను హబక్కూకు ముందుగానే ప్రవచించాడు (1:6). ‘కల్దీయ’ అనే పదం (హెబ్రీ ‘కస్డిమ్’, అక్కాడియన్ ‘కల్డు’) క్రీ.పూ. 9వ శతాబ్దంలో దక్షిణ బబులోనియాలో ప్రత్యక్షమైన ఒక నిర్దిష్ఠ జాతికి ఈ మాట ఉపయోగించారు. క్రీ.పూ. 8వ శతాబ్దంలో, బబులోనులో కల్దీయులు అధికారంలో ఎదగడం ఆరంభించారు. ఆరంభ కల్దీయ రాజుల్లో రెండవ మెరొదాక్ బలదాన్ (2రాజులు 20:12; యెషయా 39:1), 8వ శతాబ్ధం చివరిలో రెండుసార్లు బబులోను సింహాసనం అధిష్ఠించాడు అలాగే పోగొట్టుకున్నాడు కూడా. కల్దీయుడైన నెబోపోలాసర్ (క్రీ.పూ. 626-605) మాదీయుల సహాయంతో అష్షూరు రాజ్యాన్ని కూలదోయడం ఆరంభించి, నవ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హబక్కూకు కాలానికి, ‘‘బబులోనీయులు’’ అన్న పేరుకు ‘‘కల్దీయులు’’ అనేది పర్యాయపదంగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ సంఘటనలు యూదయపై ప్రభావం చూపాయి. ఐగుప్తు ఫరో నెకో, బబులోనుకు వ్యతిరేకంగా ఉత్తర సిరియాలో మిగిలి ఉన్న అష్షూరీయులను సమర్ధించే ప్రయత్నంలో పాలస్తీనాగుండా వెళ్ళాడు. భక్తిపరుడైన యోషియా రాజు మెగిద్దో ద్గగర అతణ్ణి అడ్డుకొని, క్రీ.పూ.609లో నెకో చేతిలో మరణించాడు. క్రీ.పూ.609-605 వరకు యూదయ ఐగుప్తు అధికారం కిందికి వెళ్ళింది.
నెబోపోలాసర్ కుమారుడు రెండవ నెబుకద్నెజరు, అలెప్పోకు ఈశాన్యంగా యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషు యుద్ధంలో (మే/జూన్, క్రీ.పూ.605) నెకోను ఓడిరచినప్పుడు యూదా భాగ్యం మళ్ళీ మారింది. అదే సంవత్సరం సెప్టెంబరులో రెండవ నెబుకద్నెజరు తన తండ్రి స్థానంలో బబులోనులో సింహాసనం అధిష్ఠించాడు. బబులోను సైన్యం నెకోను ఐగుప్తు వరకు వెంటాడిరది. ఇది క్రీ.పూ.604 సంవత్సరానికి యూదా బబులోనీయుల ఆధిపత్యం కిందికి వెళ్ళడానికి కారణమయ్యింది. కల్దీయులు యూదయను నాశనం చేస్తారని హబక్కూకు ప్రవచించాడు (1:5-11), కాని క్రీ.పూ.604లో రక్తపాతం ఏమీ లేకుండానే బబులోనీయులు యూదాను ఆక్రమించుకున్న నేపథ్యంలో అది నెరవేరినట్లు కనిపించదు. కాని క్రీ.పూ. 609లో నెకో యూదయ సింహాసనం మీద కూర్చోబెట్టిన యెహోయాకీము సుమారు క్రీ.పూ. 600లో బబులోనుపై తిరుగుబాటు చేశాడు. తరువాత నెబుకద్నెజరు యూదయ దేశంపై దండెత్తి క్రీ.పూ. 598 నుండి 597 వరకు యెరూషలేమును ముట్టడిరచాడు. ఇది క్రీ.పూ.598లో యెహోయాకీము పదవీచ్యుతుడై, మరణంను గురయ్యాడు. అతని కుమారుడైన యెహోయాకీను క్రీ.పూ. 597లో చెరలోకి వెళ్ళాడు. యూదయకు చివరి రాజైన సిద్కియా, క్రీ.పూ. 588లో బబులోనీయులపై తిరుగుబాటు చేసి యూదయ పైకి మరింత నాశనాన్ని కొనితెచ్చాడు. క్రీ.పూ. 587 లేక 586 ఆగష్టులో యూదయ బబులోనీయుల చేతిలో చిక్కింది. నెబుకద్నెజరు యెరూషలేమును కూల్చివేసి, దేవాలయాన్ని నాశనం చేశాడు. కాని హబక్కూకు ప్రవచించినట్లు (2:6-20), బబులోనుకు కూడా అలాంటి రోజు క్రీ.పూ. 539లో రానేవచ్చింది. ఎలాగంటే, పర్షియావాడైన కోరెషు దాన్ని జయించి ఆక్రమించాడు.
ఈ చారిత్రాత్మక సంఘటనలు, హబక్కూకు గ్రంధానికి ఒక తేదీని ఖరారు చేయడానికి సహాయం చేస్తాయి. క్రీ.పూ.609లో యూదయ రాజైన యోషియా మరణం తర్వాత వచ్చిన ఇబ్బంది కాలంలో, క్రీ.పూ. 598/597కు, క్రీ.పూ. 587/586లో కల్దీయులు యూదయను నాశనం చేయకముందే, బహుశా హబక్కూకు తన ప్రవచనాన్ని రాసివుంటాడు. దానిని బట్టి యెహోయాకీము పాలనలో (క్రీ.పూ. 609-599), బహుశ యూదయను బబులోను ఆక్రమించుకోవడానికి ముందు (క్రీ.పూ. 609-605), ఐగుప్తీయుల ఆధిపత్యంలో ఉన్న సమయంలోనే వ్రాసిన ప్రవచనంగా చూడవచ్చు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యోబు గ్రంథంలాగా, దేవుని మార్గాలను గ్రహించడం అనే సమస్యతో హబక్కూకు సమతమతమయ్యాడు: దేవుడు ఎందుకు అన్యాయాన్ని ఏలనిస్తాడు? (1:3) దేవుడు ఎక్కువ దుష్టులైన బబులోనీయులను, తక్కువ దుష్టులైన యూదావారిని శిక్షించడానికి వాడుకోవడం
ఏమిటి? (1:13) దుష్టులు లోకాన్ని పాలించడానికి దేవుడు ఎంతకాలం అనుమతిస్తాడు (1:17)? హబక్కూకు లేవనెత్తిన ప్రశ్నలకు దేవుడు స్పష్టమైన జవాబులు ఇవ్వలేదు. దానికి బదులు, భక్తిపరులను విశ్వాసం కలిగి ఉండమని పిలుపునిచ్చాడు (2:4). పరిస్థితులతో నిమిత్తం లేకుండా దేవునిలో ఆనందిస్తానని ప్రకటించిన హబక్కూకు ఈ సందేశాన్ని అంగీకరించడమే కాక తన జీవితానికి అన్వయించుకొని చూపాడు(3:17-19).
దేవుని సార్వభౌమ ఘనత: హబక్కూకు దేవుని ఘనతను వెల్లడి చేశాడు. ఆయన మృతమైన చెక్క, రాతి విగ్రహాల్లాగా కాక (2:18-19) నిత్యమూ సజీవుడు (1:12). ఆయన ప్రవచనాలు నెరవేరతాయి (2:3). తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన రాజ్యాలను లేపగలడు (1:6), లోకాన్ని తెగులుతో, యుద్ధంతో కుదిపివేస్తాడు (3:2-15).
దాగి ఉన్న దేవుని న్యాయం: హబక్కూకు దృష్టిలో దేవుడు పరిశుద్ధుడు(1:12). ఆయన అన్యాయాన్ని అరికట్టాలని ప్రవక్త ఆశించాడు (1:2-4,13), అయితే మానవ చరిత్రలోని సంఘటనల్లో దేవుని న్యాయం పనిచేయడం కొన్నిసార్లు కనిపించకపోయినా (1:13), దేవుడు అన్యాయాన్ని అరికట్టాలని ప్రవక్త కోరుకున్నాడు. మనుషుల దుష్టక్రియలను దేవుడు తన మంచి ఉద్దేశాల నెరవేర్పుకు వాడుకుని, కొంతకాలం చెడును అనుమతించినా, చివరికి దుష్టులు తమ నేరాలకు వెల చెల్లించాల్సిందే (2:6-14). దేవుడు తన ప్రజలను రక్షించడానికి వచ్చి, దుష్టులను అణగదొక్కుతాడు (3:13-15).
విశ్వాసం: హబక్కూకు మూలవచనం 2:4: ‘‘నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.’’ మానవునితో దేవుని విధానాలను అర్ధం చేసుకోవడం కష్టంగా మనకనిపించినా, హబక్కూకు నేర్చుకున్నట్లు, మన అసంపూర్ణ అవగాహనను పక్కనపెట్టి, మనం దేవుని దయలో నమ్మకముంచి ఉత్సహించడం నేర్చుకోవాలి (3:16-19).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
తరచుగా ప్రజలు ఎదుర్కొనే ఒక విషయాన్ని హబక్కూకు గ్రంథం చర్చించింది: ఈ లోకంలో దేవుని ఉద్దేశాలను వివేచించడానికి ప్రయత్నించడం. ఈ లోకంపట్ల దేవుని చిత్తాన్ని గ్రహించడం ఈ పుస్తకమంతటిలో కనిపిస్తుంది. ఈ సత్యం లేఖనమంతటా కనిపిస్తుంది: దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు, మనం సమృద్ధిజీవం కలిగి వుండాలన్న దేవుని కోరిక, మానవ సమాజం అంతా సంతోషంగా, సురక్షితంగా, నీతివంతంగా ఉండాలనే దేవుని చిత్తం. అంతిమంగా విశ్వాసం ద్వారానే మనమీ లోకంలో విజయవంతంగా, సమృద్ధిజీవంతో బ్రతుకుతాం. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడనే హబక్కూకు సందేశం, కొ.ని.లో ఈ సత్యాన్ని మరింత గొప్పగా అర్థం చేసుకోవడానికి మార్గం ఏర్పరచింది. అది క్రీస్తులో విశ్వాసం ద్వారా కలిగే రక్షణను నొక్కిచెబుతుంది (రోమా 1:17; గలతి 3:11; హెబ్రీ 10:38-39).
గ్రంథ నిర్మాణం
మొదటి రెండు అధ్యాయాలు, ప్రవక్తకు, దేవునికి మధ్య సంభాషణలుగా ఉంది. యూదయలో అన్యాయాన్నిగూర్చి హబక్కూకు మొదటిగా ఫిర్యాదు చేశాడు (1:2-4). యూదాను శిక్షించడానికి కల్దీయులను పంపిస్తున్నానని దేవుడు జవాబిచ్చాడు (1:5-11). ఇప్పుడు దేవుడిచ్చిన జవాబు గూర్చి హబక్కూకు ఫిర్యాదు చేశాడు. ఎక్కువ దుర్మార్గులైన బబులోనీయులను వాడుకుని, వారికంటే తక్కువ దుర్మార్గులైన యూదావారిని దేవుడు శిక్షించడం అన్యాయమని వాదించాడు (1:12-2:1). బబులోనీయులు అహంకారులన్నది నిజమేననీ, చివరికి వారు కూడా శిక్షపొందుతారనీ, అయితే తాను నిర్ణయించుకున్న విధంగానే తాను బబులోనీయులను వాడుకుంటానని దేవుడు జవాబిచ్చాడు (2:2-20). దేవునితో జరిగిన ఈ సంభాషణను గూర్చి తలపోస్తూ హబక్కూకు రాసిన కీర్తన చివరి అధ్యాయంలో ఉంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”