యెషయా క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంనాటి ప్రవక్త. మన బైబిల్ లో యెషయా గ్రంథం ప్రవక్తల గ్రంథాల్లో మొదటిది, అయితే హెబ్రీ బైబిల్లో ఇది మలి ప్రవక్తల గ్రంథాల్లో మొదటిది. యెషయా గ్రంథంలోని కవితాత్మక వర్ణన శక్తిమంతమైనది, ప్రవచనాత్మక దర్శనం నిగూఢమైనది, గ్రంథనిర్మాణం జటిలమైనది. దేవుని స్వాభావిక లక్షణాల గురించి మనలో నూతనమైన అవగాహన ఉన్నప్పుడు, ఆయనతో మనకు సరైన సంబంధం ఉన్నప్పుడు మాత్రమే యెషయా గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలం. కొత్త నిబంధన గ్రంథకర్తలు యెషయా గ్రంథాన్ని క్రీస్తు మొదటి రాకడ నేపథ్యంలో పఠించారు, ప్రవక్త చాలా స్పష్టంగా మెస్సీయ ఆగమనాన్ని సూచించాడని వారు అర్థం చేసుకున్నారు. ఈ కారణంగానే యెషయా గ్రంథంనుండి ఉటంకించబడిన లేదా సూచించబడిన వాక్యభాగాలు కొత్త నిబంధనలో చాలా ఎక్కువగా కనబడతాయి, ఇంత ఎక్కువగా పాత నిబంధనలోని ఏ ఇతర ప్రవచనాలు కొత్త నిబంధనలో కనబడవు.
Read More
గ్రంథ రచనాకాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: యెషయా గ్రంథం ఆమోజు కుమారుడైన యెషయా రచించిన గ్రంథం. నలుగురు యూదా రాజుల కాలంలో, అంటే ఉజ్జియా (క్రీ.పూ.783-742 – ఈ రాజు పరిపాలనాకాలంలోని చివరి సంవత్సరంలో దేవుడు యెషయాను ప్రవక్తగా పిలిచాడు; 6:1), యోతాము (క్రీ.పూ.742-735), ఆహాజు (క్రీ.పూ.735-716), హిజ్కియా (క్రీ.పూ.716-686) రాజుల కాలంలో యెషయా ప్రవచన పరిచర్య జరిగింది. ఉజ్జియా (అజర్యా) గురించి 2 రాజులు 15:1-7; 2దిన. 26:1-23 చూడండి. యోతాము గురించి 2రాజులు 15:32-38; 2దిన. 27:1-9 చూడండి. ఆహాజు గురించి 2రాజులు 16:1-20; 2దిన. 28:1-27 చూడండి. హిజ్కియా గురించి 2రాజులు 18:1-20:21; 2దిన. 29:1-32:33 చూడండి. ప్రవక్తగా యెషయా పరిచర్య మినహా, అతని గురించి మిగతా వివరాలు మనకు తెలియవు.
గ్రంథమంతటినీ యెషయా రాసాడనే విషయంలో ఆధునిక కాలంలో పలు భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి. యెషయా గ్రంథంలోని 40-66 అధ్యాయాల్ని యెషయా ప్రవక్త రాసి ఉండకపోవచ్చని అనేకమంది పండితుల అభిప్రాయం. దేవుడు భవిష్యకాలాన్నెరిగిన సర్వజ్ఞుడనీ, ఆయన తన సేవకులకు భవిష్యకాలంలో జరగబోయేవాటి గురించి వెల్లడిచేస్తాడనీ విశ్వసించేవారికి, బబులోను ఒక రాజ్యంగా ఎదగడం, యూదా మీద విజయం సాధించడం, యూదా ప్రజలు బబులోను చెరలోకి వెళ్లడం, చెర నుండి తిరిగి రావడం మొదలైన భవిష్యకాల సంఘటనల్ని దేవుడు యెషయా ద్వారా వెల్లడిచేశాడని నమ్మడం సమస్య కానేకాదు.
నేపథ్యం: యూదా రాజైన ఉజ్జియా పరిపాలనా కాలంలోని చివరి సంవత్సరంలో (సుమారుగా క్రీ.పూ.742) ప్రవక్తగా యెషయాకు పిలుపు వచ్చిందని 6:1 వచనం తెలియజేస్తుంది. ఉజ్జియా పరిపాలనాకాలం యూదా చరిత్రలోనే సుసంపన్నమైన కాలం, అయితే గాలివానను తెచ్చే కారుమబ్బులు దిగంతాల్లో కనబడుతున్నాయి. తిగ్లత్పిలేసెరు (క్రీ.పూ.745-727) నాయకత్వంలో అష్షూరు ప్రబలమైన శక్తిగా ఎదిగింది. ఈ అష్షూరు రాజు సిరియాకు ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలుకు పెనుముప్పుగా మారాడు. తిగ్లత్పిలేసెరు మరణం తర్వాత అతని వారసులైన షల్మనేసెరు, సర్గోను అనేవారు క్రీ.పూ.722లో ఉత్తరరాజ్యాన్ని ఓడిరచి, ప్రజల్ని అష్షూరు చెరలోకి తీసుకొని వెళ్లారు. ఇది యూదా సైతం అష్షూరుకు భయపడేలా చేసింది. సన్హెరీబు మరణం వరకు (క్రీ.పూ. 681) యెషయా ప్రవక్త జీవించే ఉన్నాడని యెషయా 37:38 వచనం సూచిస్తుంది. యెషయా ప్రవచనం ఎనిమిదవ శతాబ్దానికి ఆవల ఉన్నవాటిని, అంటే తరువాతి పాత నిబంధన కాలాన్నంతా, ఆ తర్వాత కాలాన్ని కూడా సూచిస్తుంది. యేసు క్రీస్తుకు సంబంధించి ఆయనే మెస్సీయగా, శ్రమనొందే సేవకునిగా అనేక సంఘటనలు నెరవేరడం గురించి కొత్త నిబంధన గ్రంథకర్తలు తరచూ యెషయా గ్రంథాన్నే ఉదహరించడం జరిగింది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యెషయా సందేశం చాలా సరళమైనది. మొదటగా, దేవుని ప్రజలు పాపం చేస్తున్నారని యెషయా ఆరోపించాడు: వారి సృష్టికర్తకు, గతంలో వారిని విడిపించిన విమోచకునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు. రెండవదిగా, వారు తమ మార్గాల్ని విడిచిపెట్టి దేవునిపట్ల విధేయత చూపాలని బోధించాడు. చివరగా, దేవుడు భవిష్యకాలంలో వారినెలా పునరుద్ధరించబోతున్నాడో యెషయా ద్వారా వెల్లడిరచాడు, తీర్పు తర్వాత బ్రతికి బయటపడే శేషజనం గురించి తెలియజేశాడు. దేవుడు తన ప్రజల్ని పునరుద్ధరించడంలో భాగంగా ఆయనెలా అన్యజనాంగాల మీదకు తీర్పును రప్పించబోతున్నాడో (13-23 అధ్యాయాలు), అనంతరం అన్యజనులే విధంగా దేవునివైపు మళ్లుతారో (2:1-4) యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథంలోని తొలి భాగం (1-39 అధ్యాయాలు) పాపం గురించి, పశ్చాత్తాపం గురించి, తీర్పు గురించి, మలి భాగం (40-66 అధ్యాయాలు) పునరుద్ధరణ పట్ల నిరీక్షణ గురించి విస్పష్టంగా తెలియజేస్తున్నాయి.
గ్రంథంలో గమనార్హమైన ఇతర ముఖ్యాంశాలు:
ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడు. గ్రంథం ప్రారంభం నుండి చివరి వరకు దేవుడు ‘‘ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు’’గా కనబడుతున్నాడు. దేవుడు యెషయాను ప్రవక్తగా పిలిచినప్పుడు సెరాపులు ఆయనను ‘‘సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు’’ అని కీర్తించారు (6:3). దేవుడు పరిశుద్ధుడు, పాపానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం, నైతికతలో ఆయన పరిపూర్ణుడు. దేవుని ప్రజలు పరిశుద్ధుడైన ఆయనను ప్రతిబింబించాలి, ఇందుకు వారికి ధర్మశాస్త్రమే ప్రమాణం (లేవీ 11:44-45; 19:2; 20:7), అయితే వారు విఫలమయ్యారు. దేవుడు యెషయాకు అప్పగించిన పని ఆయన ఉన్నతప్రమాణాల్ని వారికి గుర్తుచేయడం.
నమ్మడం, ఆధారపడడం: దేవుని ప్రజలు ఆయన మీదనే ఆధారపడాలని యెషయా వారికి గుర్తుచేశాడు, వారు ఆయన నాశ్రయించక పోయినప్పుడు అతడు వారిని ఖండిరచాడు. వారు దేవునికే భయపడాలి గాని, మనుషులకు కాదు. చాలాసార్లు ఇశ్రాయేలీయులు అన్యరాజుల్నీ, వారి దేవతలనూ నమ్మి, నిజదేవున్ని తిరస్కరించారు.
దేవుడు/విగ్రహాలు: దేవుని ప్రజలు కల్పిత దైవాల్ని నమ్ముతున్నందున, నిజదేవునికీ అన్యజనులు పూజించే విగ్రహాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను యెషయా ప్రవచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మానవచరిత్రలో దేవుని కార్యాలున్నాయి, విగ్రహాలు చేసిన కార్యాల్లేవు. దేవుడు భవిష్యత్తును వెల్లడిచేస్తున్నాడు, విగ్రహాలు చేయలేవు. దేవుడు నిత్యమైనవాడు, విగ్రహాలు మానవనిర్మితాలు కాబట్టి అవి శూన్యమైనవి.
మెస్సీయ, శ్రమసేవకుడు: ఇతర ప్రవక్తల గ్రంథాల్లో కంటె మిన్నగా యెషయా గ్రంథంలో రాబోయే కాలంలోని అభిషిక్తుడైన రాజు గురించి (మెస్సీయ, 9:1-7; 11:1-9), శ్రమనొందే సేవకుని గురించి (42:1-9; 49:1-6; 50:4-6; 52:12-53:12) తెలియజేసే వాక్యభాగాలున్నాయి. క్రైస్తవులు ప్రధానంగా వీటి మీద ఆసక్తి చూపించారు. శ్రమనొందే సేవకుని గురించి, భవిష్య రాజు గురించి యెషయా ప్రవచనాల అంతిమ నెరవేర్పు యేసు క్రీస్తు మాత్రమే అని కొత్త నిబంధన కాలం నుండి క్రైస్తవుల అవగాహనగా ఉంది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
యెషయా గ్రంథం లేకుండా కొ.ని. రాయబడి ఉండేది కాదని వాదించవచ్చు. పాపాన్ని మోసుకొని పోయే సేవకుని(క్రీస్తు)గా దావీదు వంశస్తుడైన రాజు ఒక కొత్త నిర్గమాన్ని జరిగించడానికి, భూమిపై దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ పుస్తకంలో రంగం సిద్ధపరచబడి ఆ సందేశం ప్రకటించబడినంతగా పా.ని.లో ఇంకెక్కడా కనిపించదు.
గ్రంథనిర్మాణం
యెషయా గ్రంథం గద్యంలోను పద్యంలోను ఉంది. గద్యం ప్రధానంగా రెండు విభాగాల మధ్య వారధిగా ఉన్న 36-39 అధ్యాయాల్లో ఉంది (గ్రంథసందేశం, ఉద్దేశం చూడండి). యెషయాలోని పద్యరచన వివిధాలంకృత రీతుల్లో కనబడుతుంది, కీర్తనలున్నాయి, జ్ఞానసాహిత్యశైలిలో పద్యాలున్నాయి, ప్రేమగీతాన్ని పోలిన కావ్య గీతం కూడా ఉంది (5:1-7). రచనాశిల్పంలోని సుసంపన్నత పదజాలంలో స్పష్టంగా కనబడుతుంది. యెషయా హెబ్రీ భాషలోని 2200 వేర్వేరు పదాలనుపయోగించాడు, పాత నిబంధనలోని ఏ ఇతర గ్రంథంలోను ఇన్ని విస్తృతమైన పదాలు కనబడవు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”