నాలుగు సువార్తల్లో గ్రంథస్తం చేసి ఉన్న యేసు బోధనలకు యాకోబు పత్రిక ఒక అద్భుతమైన జోడు లేక సహకారి అని చెప్పవచ్చు. యేసు తన శిష్యులకు అందించిన నైతిక బోధలతో సరిపోలే విధంగా యాకోబు పుస్తకం గంభీరమైన నైతిక నియమాలను నొక్కి వక్కాణించింది. మతసంబంధమైన వేషధారణకు వ్యతిరేకంగా యేసు పలికిన కఠినమైన తీర్పులను కూడా యాకోబు పత్రిక ప్రతిబింబించింది. యేసు బోధలకు లాగా ఈ పత్రిక కూడా పలు హెచ్చరికలకు, ఆదరణకు, దిద్దుబాటుకు, ప్రోత్సాహానికి గొప్ప ఆధారంగా ఉంది. చివరిగా యాకోబు పత్రిక బహు ఆచరణాత్మకమైంది, అయితే అదే సమయంలో కొ.నిలో కనిపించే గంభీరమైన వేదాంత సత్యాలు దీనిలో కనిపిస్తాయి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: 1:1 లోనే దీని రచయిత యాకోబు అని పేర్కొనబడిరది. కొ.ని.లో అనేకమంది వ్యక్తులు యాకోబు అనే పేరు గలవారున్నారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ఈ గ్రంథం రాయదగినవారుగా భావించవచ్చు. జెబెదయి కుమారుడైన యాకోబు క్రీ.శ.44 లో, అంటే మరీ ముందుగానే మరణించాడు కాబట్టి అతడు ఈ గ్రంథకర్త అని చెప్పేందుకు వీలులేదు. అల్ఫయి కుమారుడైన యాకోబు (మార్కు 3:18) ఈ గ్రంథం రాశాడని ఏ సంప్రదాయంలోనూ సూచనలు లేవు. చివరికి యేసు సహోదరుడైన యాకోబు (మార్కు 6:3; అపొ.కా.1:14; 12:17; 15:13; 21:18; 1కొరింథీ 15:7; గలతీ 2:8-9,11-12) ఒక్కడే దీని రచయిత కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఈ యాకోబును మత్తయి 13:55; మార్కు 6:3; గలతీ 1:19 లో యేసు సహోదరుడు అని గుర్తించారు. యేసు ఈ లోకంలో పరిచర్య చేసిన కాలంలో అతడు క్రీస్తును అనుసరించకపోయినా (యోహాను 7:3-5), ఆయన పునరుత్థానానంతర ప్రత్యక్షత యేసే నిజమైన క్రీస్తని యాకోబును ఒప్పించింది (అపొ.కా.1:14; 1కొరింథీ 15:7). ఆ తరువాతి కాలంలో యాకోబు యెరూషలేము సంఘానికి గొప్ప ప్రభావం, పలుకుబడి కలిగిన నాయకుడుగా ఉన్నాడు (అపొ.కా.1:14; 12:17; 15:13; 21:18; 1కొరింథీ 15:7; గలతీ 2:8-9,11-12).
నేపథ్యం: యాకోబు పత్రిక బహుశా క్రీ.శ.48-52 మధ్య రాసి ఉండవచ్చు. పత్రికలో ఇంతకంటే మరింత దగ్గరైన తేదీకి తగిన సూచనలేవీ కనిపించవు కూడా. యాకోబు క్రీ.శ.62లో గానీ, 66లో గానీ మరణించి ఉంటే ఈ పత్రిక అంతకంటే ముందే రాసి ఉండాలి. సువార్తల సంప్రదాయాలు, పౌలు రచనల్లోని అంశాలతో పోలికలను బట్టి మనం ఈ విషయాన్ని ఊహించవచ్చు. మార్కు గ్రంథం క్రీ.శ.65 సమయంలో రాసి ఉండి, అపొ.కా. గ్రంథంలోని 15, 21 అధ్యాయాల్లో జరిగిన సంఘటనలు పౌలు మొదటి, రెండవ మిషనరీ యాత్రల మధ్యకాలంలో జరిగాయి అనుకుంటే యాకోబు పత్రిక క్రీ.శ. 48 – 52 కు మధ్యకాలంలో రాసి ఉండవచ్చనడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.
‘‘చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి’’ (1:1) అనే ప్రస్తావనను బట్టి చూస్తే ఈ పత్రిక పాలస్తీనా చుట్టుపక్కల నివసిస్తున్న యూదు క్రైస్తవులకు రాసి ఉండవచ్చు. యాకోబు యెరూషలేము సంఘంలో నాయకుడుగా ఉన్నాడు కాబట్టి అతని పాఠకులు ఆ ప్రాంతంలోనే నివసించి ఉండవచ్చు (అంతియొకయతో కలిపి). 2:2లో సమాజ మందిరము యొక్క ప్రస్తావన అతని పాఠకులు యూదు క్రైస్తవులు అని సూచిస్తుంది. వారున్న పరిస్థితుల గురించిన వర్ణన (ఉదా. ధనికులైన భూస్వాములచే అణచివేత; 5:1-6) రోమా సామ్రాజ్యంలో ఎక్కడ ఉన్న సమాజాలనైనా సూచిస్తుండ వచ్చు. ఏదేమైనా దీనిలో వాడిన హెబ్రీ పదాల క్రమం, సెప్టువజింట్ నుండి తీసుకున్న మాటలు, మొత్తంగా ఈ పత్రిక యూదు జ్ఞాన సంప్రదాయం మీద ఆధారపడిన విధానం చూస్తే ఇది ప్రత్యేకంగా యూదు క్రైస్తవులకు రాయబడిరదని స్పష్టమవుతుంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఒక సాధారణ పత్రికగా యాకోబు పత్రిక ఒక ప్రత్యేకమైన గుంపుకు కాక (ఉదా. ఎఫెసులోని క్రైస్తవులకు మాత్రమే) విశాల పరిథి గలిగిన పాఠకులకు రాయబడిరది (యూదు క్రైస్తవులు). యూదు క్రైస్తవ సమాజాలు ఎదుర్కొంటున్న అంతర్గత, బాహ్యపరమైన సమస్యలను చర్చించాలన్న ఆతృత దీనిలో కనిపిస్తున్నది. బాహ్యంగా వారు పరీక్షల నెదుర్కొంటున్నారు (1:2), ప్రధానంగా ధనికులైన భూస్వాముల ద్వారా జరుగుతున్న వివిధ రకాలైన అణచివేతలను అనుభవిస్తున్నారు. అయితే ఆ అణచివేత స్వాభావికంగా మతసంబంధమైందిగా కనిపించడంలేదు. అంతర్గతంగా స్వీయ నియంత్రణ లేకపోవడం (1:13-17), తొందరపాటు మాటలు, నిజమైన భక్తిని అపార్థం చేసుకొనేలా నడిపించిన అబద్ధ బోధలు (1:19-27; 2:1-4; 3:1-8), ధనవంతుల పట్ల పక్షపాతం (2:1-13), హత్యకు, విమర్శలకు దారితీసిన స్వార్ధపు దురాశల (4:1-12) వలన వారిలో చీలికలు వచ్చినట్టు కనిపిస్తున్నది. పా.ని. జ్ఞాన సాంప్రదాయం నిర్దేశించిన సూత్రాలను అన్వయించడం ద్వారా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి యాకోబు ప్రయత్నించాడు. అతడు సూచించిన పరిష్కారాలు తనను అడిగే ప్రతివారికి ఉదారంగా జ్ఞానాన్ని అనుగ్రహించే ‘‘జ్యోతిర్మయుడగు తండ్రి’’ (1:17) ద్వారా పైనుండి కలిగే జ్ఞానాన్ని ప్రతిబింబించాయి. మన ఆరాధనల్లో సరైన రీతిలో బోధించడానికీ, ఎవరు బోధించాలో నిర్ణయించడానికీ జ్ఞానం అవసరం (1:19-27; 3:1-8). సమాజాల్లో చీలికలు సృష్టించే అంతర్గత కలహాలను తప్పించడానికి కూడా జ్ఞానం అవసరం (3:13-18; 4:1-12).
క్రియాపూర్వకమైన విశ్వాసం అనే అంశం కూడా దీనిలో ప్రాముఖ్యమైన అంశం (1:19-27; 2:14-26). క్రియల ద్వారా వెల్లడి కాని విశ్వాసం నిరర్థకం అని యాకోబు రుజువు చేశాడు. ఈ పత్రికలోని మరొక ప్రాముఖ్యమైన అంశం నైతికత, ప్రత్యేకంగా సామాజిక న్యాయం (2:1-13; 4:1-12; 5:1-12).
బైబిలు గ్రంథంలో దీని పాత్ర
దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపడం గురించి యాకోబు ఈ పత్రికలో పదే పదే పిలుపునిచ్చాడు. అయితే అతడు ఆచార సంబంధమైన ధర్మశాస్త్రం గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు గానీ నైతిక ధర్మశాస్త్రం గురించి పేర్కొన్నాడు. ధర్మశాస్త్రానికి క్రైస్తవుని సంబంధం విషయంలో యాకోబు పౌలుల మధ్య తీవ్రమైన విభేధాలు ఉన్నాయని కొంతమంది భావిస్తారు. వాస్తవానికి ఇద్దరూ కలిసి పా.ని. ధర్మశాస్త్రం విషయంలో మనకు ఒక లోతైన బోధననూ, గ్రహింపునూ అందించారు. ధర్మశాస్త్రం కోరిన షరతులను నెరవేర్చడం ద్వారా క్రీస్తు మనకు రక్షణను సంపాదించాడని పౌలు బోధించాడు. దేవుని నైతిక ప్రమాణాలకు విశ్వాసులు చూపే విధేయత ఒక సజీవమైన విశ్వాసానికి రుజువనీ, అది ధర్మశాస్త్రపు షరతులను నెరవేర్చిన వాని అడుగులకు అనుగుణంగా నడిచే జీవితమనీ యాకోబు స్పష్టం చేశాడు. కొంతమంది పా.ని., కొ.ని. ల మధ్య ఉన్న వ్యత్యాసాలను మరీ తేలికగా చేసి పా.ని. పునాదులు క్రియల పైనా, కొ.ని. పునాదులు విశ్వాసం పైనా నిర్మితమయ్యాయని వాదిస్తారు. అయితే యాకోబు రెండు నిబంధనలనూ ఒకచోట చేర్చి విశ్వాసం, క్రియలు రెండు నిబంధనల్లోనూ సమగ్రంగా ఇమిడి ఉన్నాయని స్పష్టం చేశాడు.
గ్రంథ నిర్మాణం
యాకోబు గ్రంథం ఒక ఉత్తరం (పత్రిక). దీనిలోని అభివాదం మాత్రం పౌలు పత్రికల్లో (ముఖ్యంగా గలతీ పత్రికలో) కనిపించే శ్రేష్టమైన ప్రాచీన గ్రీకు రీతిని కనిపిస్తుంది. ఈ అభివాదం పత్రిక రచయిత యాకోబు అని గుర్తిస్తూ, దీనిని రాయడంలో అతని అధికారానికి మూలమేమిటో తెలియపరిచే మాటలతో బాటు (‘‘దేవుని యొక్కయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన’’) గ్రహీతలు ఎవరో తెలియపరుస్తూ (‘‘చెదరియున్న పండ్రెండు గోత్రములవారు’’) ‘‘శుభము’’ (1:1) అందిస్తుంది. సాధారణంగా పత్రికలు వాటిని పంపేవారి అధికారపూర్వకమైన మాట, నడిపింపులను ఆధారం చేసికొని వాటిని అందుకొనే పాఠకుల నడవడి, నమ్మకాలలో మార్పును తెచ్చేలా వారిని రేకెత్తించడానికి తరచుగా ఉపయోగపడతాయి. యాకోబు పత్రిక పా.ని. జ్ఞానసాహిత్యంతో పోలిక కలిగి ఉంది. ఈ లోకజ్ఞానాన్ని దేవుని నుండి వచ్చే జ్ఞానంతో పోల్చి చెప్పడం వంటి జ్ఞానసంబంధమైన అంశాలు యాకోబు పత్రికలో కనిపించడం మాత్రమే కాక, జ్ఞానసాహిత్యంలో కనిపించని కొన్ని హెచ్చరికలు, ప్రవచనాత్మకమైన అంశాలు యాకోబు పత్రికలో కనిపిస్తాయి.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”