పాత నిబంధనలోని ప్రవక్తల్లోకెల్లా యిర్మీయా గ్రంథానికి, యిర్మీయా ప్రవక్తకు కనీసం రెండు గొప్ప విశిష్టతలున్నాయి: (1) బైబిల్ లోని ప్రవక్తల గ్రంథాల్లో ఇది సుదీర్ఘమైన గ్రంథం (1,364 వచనాలు), (2) గ్రంథంలో యిర్మీయా జీవిత వివరాలు పూర్తిగా వర్ణించబడ్డాయి. గ్రంథకర్తలుగా ఉన్న ఇతర 15 మంది ప్రవక్తల గురించి వారి గ్రంథాల్లో ఇన్ని వివరాలు లభ్యం కావు. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం ద్వితీయార్థంలోను, ఆరవ శతాబ్దం మొదటి పాతిక సంవత్సరాల్లోను దేశం సంక్షోభంలో ఉన్న కాలంలో యిర్మీయా కఠిన హృదయులుగా ఉన్న యూదాప్రజల మధ్య దేవుని వాక్కును ప్రకటించాడు. గ్రంథంలోని విషయాలు ఇంచుమించు క్రీ.పూ. 640-580 మధ్య కాలంలోనివి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: యిర్మీయా అనాతోతు పట్టణానికి చెందిన ఒక యాజకుడు (1:1). యెహోవా ఆజ్ఞానుసారం అతడు అవివాహితుడుగా ఉండిపోయాడు. దీనికి కారణం, దేవుని ప్రజల తరువాతి తరం మీదకు దేవుని తీర్పు రాబోతున్నది. ప్రవక్తగా యిర్మీయా పరిచర్య క్రీ.పూ.626లో ప్రారంభమై క్రీ.పూ.586 తర్వాత ముగిసింది. అతడు హబక్కూకు ప్రవక్తకు బహుశా ఓబద్యా ప్రవక్తకు కూడా సమకాలీనుడుగా ఉన్నాడు.
నేపథ్యం: యిర్మీయా గ్రంథం యూదా రాజ్యం చివరి రోజుల చరిత్రను వివరించింది. రాజైన హిజ్కియా నలభై రెండు సంవత్సరాలు (క్రీ.పూ.729-686) పరిపాలించి, యూదా ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని బాగుచేసి పునరుజ్జీవం కోసం పని ప్రారంభించాడు. అయితే, హిజ్కియా కుమారుడైన మనష్షే సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, విగ్రహారాధన, మూఢాచారాలతో కూడిన అలవాట్లు, ఆచరణలు వెల్లువలా తిరిగి ప్రవేశించాయి. మనష్షే కుమారుడైన ఆమోను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు (క్రీ.పూ.642-640). అతడు యూదా రాజ్యంలో విగ్రహారాధనను అధికారిక మతంగా పున్ణస్థాపించాడు (2దిన 33:22-23). ఆమోను కుమారుడైన యోషీయా ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ బాలుడు పూర్వకాలంలో రాజుగా ఉన్న దావీదు మార్గాల్ని అనుసరించాడు. అతనికి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు (క్రీ.పూ.622), అనేక సంవత్సరాలుగా మరమ్మత్తులకు నోచుకోని దేవాలయాన్ని బాగుచేయ సంకల్పించాడు. ఈ పని జరుగుతున్నప్పుడు, మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. దానిని చదివిన ఆ యౌవనుడైన రాజు, అతని ప్రజలందరు యెహోవాపట్ల నిబంధన విషయంలో తమను తాము పునరంకితం చేసుకొన్నారు. అయితే, యోషీయా ప్రారంభించిన మతసంస్కరణలు మనష్షే, ఆమోనులు ప్రారంభించిన దుష్టక్రియల ప్రభావాల్ని పూర్తిగా తొలగించలేకపోయాయి.
గ్రంథ సందేశం, ఉద్దేశం
యిర్మీయా ‘‘యెహోవా వాక్కు’’ను ప్రకటించిన ప్రవక్త (1:2). ‘‘యెహోవా ఈలాగు సెలవిచ్చెను’’ అనే పదజాలం పాత నిబంధన అంతటిలో 349 సార్లు కనబడితే, ఒక్క యిర్మీయా గ్రంథంలోనే 157 సార్లు కనబడుతుంది. అయితే, యిర్మీయా ప్రవక్త ప్రకటించిన ప్రవచనాత్మక వాక్కు దేవునినుండి ఇశ్రాయేలు జాతికి వచ్చిన వస్తుగత ప్రత్యక్షత మాత్రమే కాదు: దేవుని మాటలు యిర్మీయా ఆత్మకు ఆనందం, ఆహారంగా ఉన్నాయి. ‘‘నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని… నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి’’ అని 15:16 వచనం తెలియజేస్తుంది. అయితే, దేవుని మాటలు కొన్నిసార్లు యిర్మీయాకు భారంగా కూడా ఉన్నాయి. మాట వినని ప్రజలకు దేవునినుండి రాబోతున్న శిక్షగురించి సందేశాలు ప్రకటించడంలో యిర్మీయా కొన్నిసార్లు అలిసి పోయాడు.
యూదా ప్రజలు దేవుడు తమను ఏమాత్రం శిక్షించడనే భావనలో ఉన్నారు. అయితే యిర్మీయా పదేపదే ప్రజలు అనుసరిస్తున్న అంతశ్శుద్ధిలేని బాహ్యాడంబర మతాచారాల వ్యర్థత గురించి వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుని నుండి వచ్చిన ప్రవచనాత్మక వాక్కు ప్రజల్ని సిగ్గుపడేలా చేసి, వారు తమ అర్థరహితమైన బాహ్యాడంబర వ్యర్థభక్తిని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఆయనవైపు మళ్లుకొనేలా చేయాలి.
బైబిల్ గ్రంథంలో దీని పాత్ర
యిర్మీయా గ్రంథంలో సుపరిచితమైన వాక్యభాగం కొత్త నిబంధన గురించి ఉన్న 31:31-34 వచనాలు. బైబిల్ లోని కొత్త నిబంధనలో పాత నిబంధన నుండి ఉదహరించిన వచనాల్లో సుదీర్ఘమైన భాగం ఇదే (హెబ్రీ 8:8-12; 10:16-17); అంతే కాదు, దేవుడు హవ్వతో (ఆది 3:15), అబ్రాహాముతో (ఆది 12:1-3), దావీదుతో (2సమూ 7:16-19) చేసిన పూర్వవాగ్దానాల్ని, కొత్త నిబంధనలో దేవుడు క్రీస్తు ద్వారా విశ్వాసులకిచ్చే నూతన హృదయాలకు, రక్షణకు ఆయనతో సహవాసానికి సంబంధించిన నిశ్చయతలకు జోడిరచడంలో ఉదహరించబడిన ఏ ఇతర వాక్యభాగాలు దీనికి సాటి కావు.
గ్రంథ నిర్మాణం
యిర్మీయా గ్రంథమంతటిలో ఒక కాలసూచన ప్రముఖంగా ధ్వనిస్తుంది: ‘‘యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున’’ – ఇది క్రీ.పూ.605 సంవత్సరం. అదే సంవత్సరంలో పశ్చిమాసియాలో రాజకీయ ముఖచిత్రంలో ప్రధానమైన మార్పు చోటుచేసుకొంది. కర్కెమీషు దగ్గర జరిగిన యుద్ధంలో ఐగుప్తు, అష్షూరు రెండు రాజ్యాలు ఓటమి పాలయ్యాయి (46:2-12; 2రాజులు 24:7; 2దిన 35:20).
నెబుకద్నెజరు బబులోను సింహాసనాన్ని అధిష్టించాడు. అదే సంవత్సరం, తన ప్రవచనాల్ని లిఖించి ఉంచాలని దేవుడు యిర్మీయాను ఆదేశించాడు. ఇది దేవుని వాక్కుపట్ల యెహోయాకీము ప్రతిస్పందనకు చరమ పరీక్ష. ‘‘యెహోయాకీము నాలుగవ సంవత్సరమున’’ అనే నిర్దిష్ట కాలసూచన 25:1; 36:1; 45:1 ల దగ్గర కనబడుతూ గ్రంథాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజిస్తుంది: దేవుడు తనకు అప్పగించిన పనిని చేయడంలో ప్రవక్త విశ్వసనీయత (2-24 అధ్యా.), ప్రవక్త పరిచర్య కెదురైన తీవ్రమైన వ్యతిరేకత (25-35 అధ్యా.), యూదా పతనం (36-45 అధ్యా.).
యిర్మీయా గ్రంథంలో పద్యశైలి (ముఖ్యంగా 2-25 అధ్యాయాల్లో), గద్యశైలి (వచనకవిత్వం) రెండూ కనబడు తున్నాయి. సాధారణంగా పండితులు పద్యశైలి యిర్మీయా స్వంతమని, గద్యశైలిలోని భాగాలు అతని స్నేహితుల్లో ఎవరో ఒకరు రాసినవనీ లేదా సంగ్రాహకుడైన ద్వితీయ గ్రంథకర్త రాసి ఉండవచ్చని చెబుతారు (వచనశైలిలోని భాగాలు ద్వితీయోపదేశకాండం గ్రంథశైలిని ప్రతిబింబిస్తున్నందువలన కావచ్చు). అయితే, మనం ఒక ప్రశ్న అడగవచ్చు: యిర్మీయానే రెండు రచనాశైలుల్లో రాసి ఉండవచ్చు గదా? యిర్మీయా ఈ రెండు శైలుల్లో రాయగల శక్తిలేని వాడనడం ఊహకు సైతం కారణం అందని విషయం.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”