చిన్న ప్రవక్తలలో ఐదవదైన యోనా గ్రంథం, దాని నిర్మాణంలో, సారాంశంలో చరిత్ర గ్రంథాల్లో కనిపించే ప్రవక్తల కథల్లాగానే ఉంటుంది. ఈ పుస్తకంలో ‘‘తప్పుదారి ప్రవక్త’’గా, దేవుని నుండి పారిపోయి ఒక చేప మింగిన యోనా జీవితాన్ని గూర్చిన క్లుప్త అవలోకనం కనిపిస్తుంది. మనుషులందరి పట్ల దేవుని కృప, ప్రేమలకు ఋజువులు మనం ఈ పుస్తకమంతటా చూస్తాం.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఈ పుస్తకం యోనాను గూర్చిన ఒక అజ్ఞాత గాధ.
నేపధ్యం: ఉత్తర ఇశ్రాయేలులోని జెబూలూను సరిహద్దుల్లో ఉన్న గత్హెపేరునుండి వచ్చిన ప్రవక్తగా 2రాజులు 14:25లో యోనా కనిపిస్తాడు. ఇతడు క్రీ.పూ. 8వ శతాబ్దం మొదటి సగభాగంలో పరిచర్య చేశాడు. ఉత్తర రాజ్య సరిహద్దులు తిరిగి సమకూర్చబడతాయని ఇతడు ప్రవచించాడు. ఇది రెండవ యరొబాము కాలంలో జరిగింది (క్రీ.పూ. 793-753). యోనాను గూర్చిన ఈ పుస్తకం, ఎనిమిదవ శతాబ్దం నుండి పా.ని.కాలం చివరి వరకు ఉన్న మధ్య కాలంలో ఎప్పుడైనా రాసి ఉండొచ్చు. యోనా నీవెవె పట్టణానికి ప్రకటించాడు. నీనెవె క్రూరమైన, యుద్ధప్రియులైన, ఇశ్రాయేలు బద్ధ శత్రువులైన అష్షూరీయుల ముఖ్యపట్టణం. చంపడం, అంగచ్ఛేదన చేయడం, ఖైదీల చర్మాన్ని వొలవడం, తల నరకడం వంటి యుద్ధ సంబంధమైన కార్యాలు మొదలైన చిత్రాలతో అష్షూరీయుల కళాకృతులు చెక్కబడి ఉంటాయి. ఇలాంటి చెడ్డపేరున్న నీనెవె పట్టణానికి ప్రకటన చేయడానికి వెళ్ళేందుకు యోనా విముఖత చూపడాన్ని ఇది వివరిస్తుంది. యోనా గ్రంథాన్నిగూర్చి ముఖ్యమైన చర్చ, దాని రచనాశైలి గురించింది. యోనా గ్రంథం చరిత్రా లేక ఉపమానమా? ఇది అన్యజనుల పట్ల దేవుని వైఖరిని తెలియజేసే ఒక వేదాంత అంశంతో తయారైన కల్పితగాధ లేక కట్టుకథ అని ఉపమాన దృక్కోణంతో చూసేవారి వాదన. ఈ వాదన చేసేవారు, పుస్తకంలో ఉన్న విచిత్రమైన, అద్భుతమైన సంఘటనలు (ఉదా., యోనా చేప కడుపులో జీవించి, ప్రార్థించడం వంటివి), రచయిత పాఠకుని ఆసక్తి చూరగొనేందుకు రాసిన సంఘటనలే గానీ, అది నిజంగా జరిగిన చరిత్ర కాదు అని వాదిస్తారు. ఈ కల్పనాదృక్కోణం పరిష్కరించే కొన్ని చారిత్రక అడ్డంకులు: నీనెవె పరిమాణాన్ని హెచ్చించి చెప్పడం (3:3), ఆ పట్టణం ఏనాడైనా మారుమనస్సు పొందిందని లేఖనాలకు బాహ్యంగా గానీ, అష్షూరీయుల గురించి చారిత్రికంగా గానీ ఆధారాలు లేకపోవడం.
యోనా గ్రంథం నిజమైన చరిత్ర అని చెప్పడానికి ఐదు విషయాలను పరిగణించాలి. మొదటిగా, యోనా ఒక నిజమైన చారిత్రక వ్యక్తి, 2రాజులు 14:25లో ప్రవక్తగా పిలవబడ్డాడు. యోనా గ్రంథం లోపాలతో కూడిన స్వభావం ఉన్నవాడుగా యోనాను చూపుతుంది. యోనా గ్రంథం కల్పితకథ అయితే, ఒకచోట మంచిగా చెప్పబడిన ఒక నిజమైన వ్యక్తినిగూర్చి మరొకచోట అసత్యంగా, చెడుగా, అగౌరవపరచేలా నిందవేసినట్లు అవుతుంది. రెండవది, యోనా గ్రంథం 12మంది చిన్న ప్రవక్తల గ్రంధ సంకలనంలో ఒక భాగం. ఈ సంకలనంలోని మిగతా పుస్తకాలన్నీ, యథార్థమైన, చారిత్రక ప్రవక్తల ప్రవచనాలను తెలియజేస్తున్నాయి. యోనాను వీటిమధ్యలో పెట్టడం అనేది, చిన్నప్రవక్తలను సంకలనం చేసిన వ్యక్తి అది ఒక నిజమైన చారిత్రక వృత్తాంతం అని భావించడం వల్లనే జరిగింది. మూడవది, యోనా గ్రంథంలో జరిగిన అద్భుతాలు బైబిల్లోని దేవునికి అసాధ్యమైనవేమీ కాదు. వేరేవిధంగా ఊహించుకుంటూ, కొందరు వ్యాఖ్యాతలు సహజాతీత వ్యతిరేక వాదాన్నిబట్టి దీనిని ఒక ఉపమానమని భావిస్తారు. నాల్గవది, మత్తయి 12:39-41; లూకా 11:29-32లో యేసు యోనానుగూర్చి, అతడు చేప కడుపులో ఉన్నాడనీ, నీనెవెకు ప్రకటించాడనీ ప్రస్తావిస్తూ వాటిని నిజమైన సంఘటనలుగా చెప్పాడు. ప్రత్యేకంగా ‘‘నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శదినమున నీనెవె వారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు…’’ (మత్తయి 12:41; లూకా 11:32) అనే యేసు ప్రకటన యోనా ప్రసంగించడాన్నిబట్టి నీనెవెవారు మారుమనస్సు పొందకపోతే అసంబద్ధంగా ఉంటుంది. యేసు తప్పు మాట్లాడాడు అని అనడానికి ఇష్టపడితే తప్ప, యోనా చారిత్రక గ్రంథమనడమే ఉత్తమం. చివరిగా యోనాలోని చారిత్రక సంఘటనల గురించిన చిక్కులు అధికభాగం పరిష్కారమయ్యాయి.
సందేశం, ఉద్దేశం
అన్యజనుల పట్ల దేవుని అనుకూల వైఖరి: అధ్యాయం 1లో, అన్యజాతికి చెందిన నావికులు, ఇశ్రాయేలు దేవునికి భయపడి, ఆరాధించడం నేర్చుకొన్నారు. యోనాను వారు సముద్రంలో పడవేయడానికి యిష్టపడకపోవడం, దేవుని నైతిక విలువలను అనుసరించి నిర్దోషిjైున మానవుని చంపడంగూర్చి వారు సంశయించారని తెలియజేస్తున్నది. అధ్యాయం 3లో నీనెవె వారు మారుమనస్సు పొందడం, అన్యజనులు కూడా రక్షణపొందగలరు అని చూపుతుంది. దేవుడు మానవులందరి విషయంలో ఆసక్తికలిగి వున్నాడు అనే కొ.ని. మిషనరీ దృక్పథానికి పాఠకులను ఈ పుస్తకం సిద్ధపరుస్తుంది.
దేవుని కృప: దేవుడు నీనెవె పట్ల ‘‘కటాక్షమును, జాలియును, బహు శాంతమును అత్యంత కృపయుగల’’వాడు (4:2), కాబట్టి పా.ని. దేవుడు కృపగలవాడు అని కనపరస్తుంది.
ప్రకృతిపై దేవుని సార్వభౌమాధికారం: ప్రకృతిసంబంధమైన లోకం మీద దేవుని సర్వాధికారాన్ని యోనా గ్రంథం మనకు వెల్లడి చేసింది. దేవుడు ప్రజలపైకి తుపానును పంపగలడు (1:4), ఒక మొక్కను అద్భుతమైన రీతిలో వేగంగా ఎదిగేలా జేయగలడు, అంతే వేగంగా దాన్ని చంపడానికి ఒక పురుగును కూడా పంపగలడు (4:6-7), యోనాను మింగడానికీ కాపాడడానికీ గొప్ప చేపను వాడుకోగలడు (1:17). ఇదంతా ప్రకృతిపై దేవుని అధికారాన్ని కనపరచింది.
దేవునినుండి పారిపోవడం అనే వ్యర్థత: దేవుని పిలుపునుండి పారిపోవడం ద్వారా యోనా ఎదుర్కొన్న చిక్కులు దేవుని నుండి పారిపోవాలని చూడడం వ్యర్ధమని, అది అనవసరమైన కష్టాలను ఆహ్వానించడమేనని పాఠకులకు హెచ్చరికగా ఉన్నాయి.
బైబిలులో ఈ గ్రంథం పాత్ర
యోనా గ్రంథం సర్వలోకం మీదా దేవుని కృపాభరిత శ్రద్ధ, ప్రకృతిపై ఆయనకున్న అధికారం, ఆయన నుండి పారిపోవడంలోని వ్యర్థత అనే విషయాలను మనకు చూపిస్తుంది. దానితోపాటు యేసు సమాధి, పునరుత్థానాలకు ఒక ముంగుర్తుగా నిలిచింది. మత్తయి 12:38-45; లూకా 11:24-32 వాక్యభాగాలు యేసు పరిచర్యను యోనా పరిచర్యతో పోల్చి, యేసును యోనాకంటే గొప్పవాడుగా చూపిస్తాయి. రెండు భాగాల్లోనూ, గొప్ప చేపను యేసు సమాధిచేయబడడానికి ముంగుర్తుగా చూపి, యోనాను క్రీస్తుకు ‘‘సాదృశ్యం’’గా చేస్తున్నాయి. యోనాను చేప మింగినపుడు అతడు నిజంగా మరణించి ఉన్నట్లయితే (యోనా 2:2 నోట్సు చూడండి), అతడు తిరిగి లేపబడటం యేసు పునరుత్థానానికి మరింత బలమైన సాదృశ్యమవుతుంది.
గ్రంథ నిర్మాణం
యోనా గ్రంథం చాలా ఉన్నతమైన హెబ్రీ భాషాశ్రేష్ఠతను కనుపరస్తుంది. దాని శైలి సంపన్నమైంది, భిన్నమైంది. పదప్రయోగ చతురతకు ఇది బహుశ్రేష్టమైన నమూనా అని అనేకులు భావిస్తారు. దీనిలో సమరూపత, సమతుల్యత ఉన్నాయి. దీన్ని రెండేసి అధ్యాయాలను ఒక భాగంగా, రెండు భాగాలు చేయవచ్చు. మొదటి భాగం కవితాశైలిలో ఉండి, గద్యభాగానికన్నా అధిక ప్రాధాన్యత కనపరచేదిగా ఉంది. రెండవ భాగంలోని అంతిమ ఘట్టం దేవునికి యోనాకు మధ్య జరిగిన సంభాషణ ప్రాణంపోసింది. దేవుడు, యోనాల పేర్లు మాత్రమే రాసి ఉండడం వలన వారే ఈ కథలో ముఖ్య పాత్రలు; మిగిలిన పాత్రలన్నీ అనామకమైనవి. ప్రకృతి కూడా రెండు భాగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది: మొదటి భాగంలో – గాలి, తుపాను, సముద్రం, నేల, చేప; రెండవ భాగంలో పశువులు, మందలు, మొక్క, పురుగు, సూర్యుడు, గాలి. ప్రక్కప్రక్కనే పెట్టి చూస్తే, 1,3 అధ్యాయాలు, 2,4 అధ్యాయాలు ఒకదానికొకటి సమాంతరంగా కనిపిస్తాయి. చివరిగా, 1,3 అధ్యాయాలు యోనాను నీనెవెకు వెళ్ళమనే దేవుని పిలుపుతో ఆరంభమౌతాయి.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”