మోషే మరణం తర్వాత ఇశ్రాయేలీయులలో తరంలో బహుప్రసిద్ధి చెందిన వ్యక్తి పేరుతో యెహోషువ గ్రంథం ఉంది. యొర్దాను నదిని దాటి, వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించిన తరం చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. వారు చేసిన యుద్ధాలు, వారి నమ్మకత్వం పాత నిబంధనలోని గొప్ప విశ్వాస గాధల్లో స్థానం సంపాదించుకున్నాయి. దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న శత్రువులను ఓడిరచడానికి యెహోషువ ప్రజలను నడిపించాడు. తరువాత దేశాన్ని గోత్రాలవారిగా స్వాస్థంగా పంచడాన్ని పర్యవేక్షించాడు. చివరిగా ప్రజలకు దేవునికి మధ్య నిబంధనను యెహోషువ నూతనపరిచాడు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: యెహోషువ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరో బైబిల్లో గుర్తింపబడలేదు. తన పేరు మీద ఉన్న పుస్తకాన్ని యెహోషువ స్వంతంగా వ్రాయలేదనుకుంటే అతని గురించి తెలిసి అతని శూరకార్యాలను ఎరిగిన వ్యక్తి రాసి వుంటారని ఊహించవచ్చు. యెహోషువ జీవితకాలం తర్వాత ఈ పుస్తకం తుదిరూపం ఇవ్వబడిరదని చెప్పడానికి ఈ పుస్తకమంతటిలో అనేక రిఫరెన్సులు ఉన్నాయి. అవి యెహోషువ మరణం, ‘‘నేటివరకు’’ నిలిచి వున్నాయని చెప్పే మాటలు, జ్ఞాపకార్థ సూచనలు లేక పేర్లు మొదలైనవి (4:9; 5:9; 6:25; 7:26; 8:28-29; 10:27; 13:13; 14:14; 15:63; 16:10; 22:17; 23:8).
నేపధ్యం: యెహోషువ గ్రంథంలోని సంభవాలు, మోషే మరణం వెంటనే ఉన్న కాలంలోనివి. ఇది ఐగుప్తును విడిచిన తరం కాక, కొత్త తరం. ఇశ్రాయేలీయులు, తమ పేరుతో వారు పొందబోతున్న దేశానికి, యొర్దానునదికి పశ్చిమంగా ఉన్నపుడు యెహోషువ కథ ఆరంభమైంది. 1రాజులు 6:1లో సొలొమోను రాజుగా ఉన్న నాలుగవ సంవత్సరానికి (క్రీ.పూ.966) 480 సంవత్సరాల ముందు నిర్గమనం జరిగిందని చెబుతుంది. న్యాయాధి 11:26లో ఇశ్రాయేలీయులు పాలస్తీనా ప్రాంతాలలో 300 ఏండ్లుగా నివసిస్తున్నారని యెఫ్తా అన్నాడు. యెఫ్తా సుమారు క్రీ.పూ.1100 కాలంలో జీవించాడు. అంటే ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణం ముగించి కనాను దేశాన్ని క్రీ.పూ.1400 లో స్వాధీనం చేసుకున్నారు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
కొత్త నాయకుని పని: అధ్యా.1 యెహోషువను దైవనిర్ణయం ద్వారా మోషే వారసుడుగా, ప్రజల నాయకుడుగా స్ధిరపరచింది. దేవుడు నేరుగా యెహోషువతో మాట్లాడి, తాను మోషేకు ప్రమాణం చేసిన దేశాన్ని (ద్వితీ 34:4), తన దైవ సన్నిధిని (యెహో 1:3-5) ఇస్తానని వాగ్దానం చేశాడు. భయపడక, ధైర్యంగా ఉండమనే ఆజ్ఞ (1:6,7,9) యెహోషువ పనిని నిర్వచిస్తున్నాయి. యొర్దాను నదిని ఆశ్చర్యకరంగా దాటించడం, ఇశ్రాయేలీయుల దృష్టిలో యెహోషువను హెచ్చించడానికి దేవుడు వాడుకున్న సాధనం (4:14).
పరిశుద్ధ యుద్ధం: యెహోషువ సేనా నాయకత్వ పటిమ మొదటి 12 అధ్యాయాల్లో పదే పదే కనిపిస్తుంది. ఒక దేశంలోని ప్రజలదరినీ పూర్తిగా నిర్మూలించడం అనేది వేదాంత దృక్కోణంలో ప్రశ్నలు లేవనెత్తుతుంది. ప్రేమగల దేవుడు అలాంటి హత్యాకాండను ఎలా అనుమతిస్తాడు? దానికి బదులుగా దీనిలో దేవుని సార్వభౌమాధికారం గురించీ, ఆయన కోపోద్రేక తీర్పును గురించీ చెప్పవచ్చు. దానికి అనుబంధ వివరణగా ఇశ్రాయేలీయుల దేవునిలో విశ్వాసం ప్రకటించి దైవోగ్రతనుండి తప్పించుకున్న రాహాబు కుటుంబం గురించీ, గిబియోనీయుల గురించీ చెప్పవచ్చు (2:8-13; 9:9-10,24-25).
స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి: అధ్యా.13-21లో యెహోషువ భూమిని పంచడం, యొర్దానుకు ఆవల మోషేతో మొదలైన ప్రక్రియను కొనసాగించింది. ఇంతవరకు దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఒక స్వాస్థ్యంగా ఇవ్వడం, దానిని గోత్రాలవారీగా పంచడం నిబంధన స్వభావాన్ని చూపుతుంది. ఈ భూమి ఇశ్రాయేలీయుల కుటుంబాలకు భౌతిక ఆస్తిగా దక్కింది.
దేవునికి, ఇశ్రాయేలుకు మధ్య ఉన్న నిబంధన: యెహోషువ నేతృత్వంలో నిబంధన అమలు ఈ పుస్తకంలో ఒక ప్రధానాంశం. అది 8:30-35; 24:1-28లో స్పష్టంగా వివరించాడు. ఈ రెండు భాగాలలో యెహోషువ నాయకత్వం ఇశ్రాయేలును దేవునితో అనుబంధంలో సన్నిహితంగా స్థిరపరచింది. దేవుని కృప వారిని దేశాన్ని ఆక్రమించుకోవడానికి శక్తినిచ్చింది కాబట్టి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అధ్యా.5లో సున్నతి, పస్కా ఆచరించడం, దేవుని నుండి ఇశ్రాయేలు పొందిన నిబంధన స్వాస్థ్యంగా గోత్రాలకు దేశం పంచిపెట్టడంలో వేదాంత పాత్ర, నిబంధన నెరవేర్పును సమగ్రంగా చూడవచ్చు.
పరిశుద్ధుడు, విమోచకుడు అయిన దేవుడు: పుస్తకమంతటా దేవుని స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన పరిశుద్ధత, ఆయన రక్షణ కార్యాల ద్వారా. దేవుడు ఇశ్రాయేలీయులను ఇతర దేశాల నుండి వేరుచేసిన ఆచారాలలో దైవిక పరిశుద్ధత కనిపిస్తుంది (4:19-24; 5:1-3,13-15; 22:26-27; 24:26-27). ప్రజల సైనిక విజయాలలో దేవుని రక్షణ కార్యాలు స్పష్టంగా కనిపించాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
మోషే మరణం వెంటనే యెహోషువ నాయకత్వం ఆరంభమైనట్లే, ద్వితీయోపదేశకాండం చరిత్రను యెహోషువ గ్రంథం కొనసాగించి, పూర్తి చేస్తుంది. ద్వితీయోపదేశకాండం కొత్తతరం ఇశ్రాయేలీయులు దేవునితో తమ నిబంధనను ఎలా నూతనపరచుకున్నారో చూపుతుంది. ఆ నిబంధనలో దేవుడు తనవంతు పాత్రను ఎలా నెరవేర్చాడో కూడా యెహోషువ గ్రంథం వివరించింది. దేవుడు వారికి విజయాలను ఇచ్చాడు, కాని ప్రతి విజయం ఒక విశ్వాసపు అడుగును నిర్దేశించింది. వారి నాయకుడు, మార్గదర్శకుడు తన తరువాతి తరాలకు ఇశ్రాయేలుకు దైవ చిత్తానుసారమైన నాయకత్వం గురించి సాక్షమిచ్చినట్లుగా, వారికి దేశాన్ని బహుమానంగా ఇచ్చిన ఆయన కృప ప్రజలు నిబంధనను నమ్మకంగా నెరవేరిస్తే కలిగే విస్తారమైన ఆశీర్వాదాలను పేర్కొన్నది.
గ్రంథ నిర్మాణం
యెహోషువ గ్రంథాన్ని ప్రాచీన తూర్పు సమీప ప్రాంతాలలో జరిగే అధికారపూర్వకమైన భూపంపకాల నిబంధనలను అనుసరించి జరిగిన భూమి పంపకాల గ్రంథంలాగా చూడాలి. ఇక్కడ అధిపతి అయిన ఇశ్రాయేలీయుల దేవుడు తన ప్రజలకు తాను ఇవ్వనుద్దేశించిన భూమిని పంచి ఇచ్చాడు. భూమి పంపకం చేయడంలో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది భూమిని బహుమతిగా ఇవ్వడానికి నడిపించిన చరిత్ర, ఆయా సంఘటనల సమీక్ష. ఇది అధ్యా.1లో కనిపించి, యెహోషువ అక్కడి వరకు రావడానికి కారణమైన మోషే మరణం గురించి చర్చిస్తుంది. అధ్యా. 2-5లో వారికి బహుమతిగా ఇవ్వబడిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి జరిగిన సిద్ధపాటు వివరించబడిరది. అధ్యా. 6-12 లో ఆ భూమిని పొందడానికి వారు చేసిన యుద్ధాల నేపథ్యం వివరించబడిరది. రెండవ భాగం ఇశ్రాయేలు గోత్రాలకు, కుటుంబాలకు వంతులు పంచడం గూర్చి చెబుతుంది. ఇందులోని నిర్దిష్టమైన పట్టణాలు, పేర్లు, ఇచ్చే బహుమతి నిర్దిష్టమైందని, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రమాణం అధికారపూర్వకంగా నెరవేరిందని స్థిరపరస్తుంది. మూడవ భాగం నిబంధనను నూతనపరచడం. ఇక్కడ ముఖ్యాంశాలలో దేవునికి మాత్రమే నమ్మకంగా ఉండాలనే నిబంధన ఒప్పందాలు (24:14-15), ఈ షరతులు అంగీకరిస్తున్నట్లు ప్రజల స్పందన ఒక భాగం.