న్యాయాధిపతులు గ్రంథం పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాల్లో రెండవది (యెహోషువ-ఎస్తేరు). హెబ్రీ బైబిల్లో, ఈ పుస్తకాలను తొలి ప్రవక్తలు అని పిలిచేవారు. పంచకాండాలలో కనిపించే వేదాంత, ఆధ్యాత్మిక విషయాలు, ప్రవక్తల రచనలు కేవలం చారిత్రక సత్యాలను లిఖించడం కంటే మించినవి. ఈ గ్రంథంలోని ముఖ్య పాత్రలైన న్యాయాధిపతులు, హెబ్రీ. షోఫెటిం (2:18) నుండి దీనికా పేరు వచ్చింది. వారినే ‘‘గవర్నర్లు’’ లేక ‘‘అధిపతులు’’ అని కూడా అనువదించవచ్చు. ఈ న్యాయాధిపతులు దేవుని విమోచనా ప్రతినిధులు. యెహోవాయే న్యాయాధిపతులు గ్రంథానికి ప్రధాన పాత్రధారి, కథానాయకుడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: న్యాయాధిపతులు గ్రంథ రచయిత ఎవరో తెలియదు. కనీసం రచయిత లేక రచయితలు ఎవరైవుంటారు అనే సూచన కూడా కనిపించదు. ఈ పుస్తకంలోని మూడు భాగాలు, అవి తీసుకోబడిన మూలాలు భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. చారిత్రక పరిచయం ఒక విధంగా సాంప్రదాయ రూపంగా, యెహోషువ గ్రంథంలోని ఆక్రమణ వృత్తాంతాలకు సమాంతరంగా ఉంటుంది. పుస్తకంలోని ప్రధానభాగం, అంటే న్యాయాధిపతుల గురించిన వృత్తాంతాలు స్థానిక పరిశీలకుడు మౌఖికంగా లేక గ్రంథరూపంలో అందించిన దానిమీద ఆధారపడినట్లు కనిపిస్తుంది.
నేపథ్యం: ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల కాలం, యెహోషువ నేతృత్వంలో వాగ్దాన దేశాన్ని జయించడానికి, సౌలు, దావీదులతో రాచరికం ఆరంభం కావడానికి మధ్యలో జరిగింది. కాబట్టి ఇందులో జరిగిన సంఘటనలు క్రీ.పూ. 15 శతాబ్దం ముగింపు నుండి క్రీ.పూ. 11 శతాబ్దపు చివరి భాగానికి, అంటే సుమారు 300 సంవత్సరాల కాలానికి చెందినవి. ఇది సామాజికంగా, మతపరంగా అస్థవ్యస్థంగా ఉన్న కాలం. ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (17:6; 18:1; 19:1; 21:25) అనే మాటలు పదే పదే ప్రతిధ్వనిస్తూ ఆనాటి పరిస్థితిని వివరిస్తున్నాయి.
న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు సంకలనం చేశారో ఇదమిద్ధంగా చెప్పలేము. 18:30లోని దాను గోత్రికుల గతిని గూర్చి ‘‘ఆ దేశము చెరపట్టబడు వరకు’’ అని చెప్పిన మాటలు, సుమారు క్రీ.పూ. 722లో ఉత్తర రాజ్యం అష్షూరు చేత చెరపట్టబడిన కాలంలో దీని కూర్పు ముగిసి ఉంటుందని సూచిస్తున్నాయి. అయితే, ఓఫ్రాలో గిద్యోను బలిపీఠం ఉన్న స్థలమును పాఠకులు ఇప్పటికీ చూడవచ్చని 6:24లోని సూచన, దక్షిణరాజ్యమైన యూదయ క్రీ.పూ. 586లో చెరపట్టబడడానికి ముందున్న కాలాన్నిసూచిస్తుంది. దీని సందేశం ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేకసార్లు బలంగా ప్రతిధ్వనించి, మనష్షే (క్రీ.పూ.686-642; 2రాజులు 21:1-18) చీకటికాలానికి సరిపోయేదిగా ఉన్నదనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ న్యాయాధిపతుల గ్రంథం రాసిన కాలాన్ని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
న్యాయాధిపతులు గ్రంథం, ఆరంభంలో ఆధ్యాత్మికంగా, నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్న ఇశ్రాయేలు, క్రమ క్రమంగా పతనమై, అధ్యా.17-21లో అధో:స్థాయికి దిగజారడాన్ని నమోదు చేసింది. న్యాయాధిపతులనే విమోచకులను దేవుడు వరుసగా లేవనెత్తినా, ఈ పోకడను వాళ్ళు సరిదిద్దలేదు గదా, వారిలో కొందరు ఆ సమస్యలో భాగంగా మారారు. పుస్తకం చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు వారు వెళ్ళగొట్టిన కనానీయులకన్నా దారుణమైన అపవిత్రతలోకి పడిపోయి, వారికన్నా భ్రష్టులుగా మారిపోయారు. ఇదే కొనసాగి ఉంటే, కాలక్రమేణా ఆ దేశం వారికి ముందున్న కనానీయులను కక్కివేసినట్టే వీరిని కూడ కక్కివేసేది (లేవీ 18:28).
మానవ భ్రష్టత్వం: ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేస్తే, దేవుని ప్రజలకు ఏమౌతుందో న్యాయాధిపతులు గ్రంథం చూపిస్తుంది. ఇశ్రాయేలీయులు గాని, లేక క్రైస్తవులు గాని దేవుని కృపను తేలిగ్గా తీసుకోకూడదని అది చూపుతుంది. ఆయన ఆజ్ఞలను విడిచి, మన స్వంతంగా ఊహించుకున్న విగ్రహాలను వెంబడిస్తే దాని ఫలితం నైతిక, ఆధ్యాత్మిక గందరగోళమే. దేవుడు మన ఇష్టానికి మనల్ని విడిచిపెడితే మన గతి ఇలాగే ఉంటుంది.
దేవుని కృప: న్యాయాధిపతులు గ్రంథం దేవుని కృపను గూర్చి గంభీరమైన వ్యాఖ్యానాన్ని మనకందించింది. వారి మట్టుకు వారిని వదిలేస్తే ఇశ్రాయేలీయులు తమను తాము నాశనం చేసుకుని ఉండేవారు. దేవుడు పదే పదే కృపతో జోక్యం చేసుకోవడంవల్లే వారు రాచరిక వ్యవస్థకు ముందున్న అంధకార స్థితి నుండి, చుట్టూ ఉన్న అన్యజనుల మధ్యనుండి ఒక విస్పష్టమైన జీవిత విధానం, విశ్వాసం గల జనాంగంగా, దేశంగా ఆవిష్కృతమయ్యారు.
దేవుని నాయకత్వ ఆవశ్యకత: ‘‘ఇశ్రాయేలులో రాజు లేడు’’ (17:6; 18:1; 19:1; 21:25) అనే పల్లవి, రాచరిక వ్యవస్థను కోరుకుంటున్న చిత్రాన్ని కనపరుస్తున్నా దానిని తమ రాజైన దేవుని దగ్గరకు తిరిగిరమ్మని పిలిచే పిలుపుగా చూడడం మేలు. ఈ కాలంలో వచ్చిన గందరగోళానికి పరిష్కారంగా రాజులను ఎత్తి చూపడానికి బదులు, ‘‘ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (17:6; 21:25) అనేది తరువాతి సంవత్సరాల్లో ప్రజలను ఇశ్రాయేలు రాజుల నైతిక, ఆధ్యాత్మిక స్థాయిని తగ్గించేసింది. మరొకమాటలో చెప్పాలంటే-దేవునిపట్ల తిరుగుబాటు, ఒక ప్రజాస్వామ్య వైఖరిగా మారిపోయింది. ఇశ్రాయేలును పాపంలోనికి నడిపించడానికి ఒక రాజుతో అవసరం లేకపోయింది; వారంతట వారే దుర్నీతిలో పడిపోగలిగారు. ఇశ్రాయేలీయులు తమతో నిబంధన చేసిన దేవుణ్ణి విడిచి దేశంలోని సంతానోత్పత్తి దేవతలను అనుసరించారు. ఈ సమస్యను ఎత్తి చూపిస్తూ గ్రంథకర్త తన తరమువారిని మేల్కొల్ప ప్రయత్నించాడు. ఈ గ్రంథం సమస్త అన్యాచారాలను విడిచిపెట్టి యెహోవావైపు తిరగమని నిబంధన జనులకు ఇచ్చిన ఒక పిలుపు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ఇశ్రాయేలు దేశం న్యాయాధిపతుల చీకటికాలంలో కేవలం దేవుని కృపచేతనే నిలిచివుండ గలిగింది అని న్యాయాధిపతులు గ్రంథం కనపరుస్తుంది. దేవుడు తన దయతో వారి తిరుగుబాటును వారికి గుర్తుచేస్తూ వారి పైకి శత్రువులను పంపించాడు. అదే దయతో వారి మొఱ్ఱలకు ఆయన స్పందించి, విమోచకులను లేవనెత్తాడు. మానవ హృదయంలోని ప్రాధమిక సమస్యను కూడా న్యాయాధిపతులు గ్రంథం ఉదహరిస్తుంది. దేవుని ప్రజలు ఆయన రక్షణ కార్యాలను మర్చిపోయినపుడు ఇతర దేవతలవైపు తిరుగుతారు. ఆత్మీయ సమర్పణకు, నైతిక ప్రవర్తనకు మధ్య ఉన్న బంధాన్ని న్యాయాధిపతులు గ్రంథం చూపిస్తుంది. చివరిలో న్యాయాధిపతులు గ్రంథం ఒక నిత్య సత్యాన్ని చూపుతుంది: మన పాపం, మన తిరుగుబాటులతో సంబంధం లేకుండా దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తాడు.
గ్రంథ నిర్మాణం
ఈ పుస్తకం మూడు భాగాలుగా ఉంది. కనానును స్వాధీనం చేసుకోవడం కొనసాగించడంలో రెండవతరం విఫలం కావడం గురించి ఉపోద్ఘాతం వివరించింది (1:1-3:6). దీని వెంటనే పుస్తకంలో ప్రధానాంశంగా ఆరుసార్లు వారు పాపంలో పడడం, దేవుడు వారిని రక్షించడం (3:7-16:31) చూస్తాం. చివరిగా, ప్రజల పైకి వచ్చిన పూర్తి భ్రష్టత్వ ప్రభావం గురించి వివరించిన ఒక అనుబంధం (అధ్యా. 17-21). ఈ నిర్మాణం కేవలం పాపం, దానిపై వచ్చిన తీర్పు పునరావృతం కావడమే కాక, వారి తిరోగమనాన్ని కూడా ప్రత్యక్షంగా చూపుతుంది. ఈ వృత్తాంతంలో ఒక కేంద్ర బిందువుగా గిద్యోను, అబీమెలెకుల ఉదంతంలో సమాంతరంగా కనిపించే రాచరికం అనే అంశం ప్రత్యేకంగా చూపబడిరది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”