పుస్తకం ఆరంభంలో ‘‘యెహోవావంటి వాడెవడు?’’ (1:1; మీకాయా అనేదానికి పొట్టి పేరు. యిర్మీయా 26:18తో పోల్చండి) అని అర్థమిచ్చే మీకా పేరు, పుస్తకం చివరిలో మీకా అడిగిన ‘‘నీతో సముడైన దేవుడున్నాడా?’’ (మీకా 7:18) అనే ప్రశ్న, ఈ గ్రంథ పూర్తి సందేశాన్ని సంక్షిప్తంగా చెబుతాయి. మానవులు సాటిలేని ‘‘సర్వలోకనాధుని’’ (4:13) వ్యక్తిత్వాన్నీ, కార్యాలనూ, గుణలక్షణాలనూ తలపోయాలనేదే ఆ సందేశం. పరిశుద్ధతలో, శక్తిలో, ప్రేమలో ఆయన సాటిలేనివాడు. ఈ సార్వభౌముడైన దేవునికి, వారి ఆరాధన విషయంలో, వారి జీవితాల విషయంలో మానవులంతా జవాబు చెప్పాల్సి ఉంది. తిరుగుబాటు చేసేవారు, పాపులు ఆయన తీర్పును ఎదుర్కొంటారు (1:5). కాని ఆయన కోసం కనిపెట్టి, ఎదురు చూసేవారు తమ ప్రార్థనలకు జవాబు పొందుతారు (7:7).
Read More
రచనా కాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: యూదయ లోతట్టు ప్రాంతంలో, యెరూషలేముకు 25 మైళ్ళు ఆగ్నేయంగా ఉన్న మోరెషెత్గతు మీకా స్వంత ఊరు (1:1,14). తన స్వంత ఊరి పేరు పేర్కొన్నాడంటే, అతడు యెరూషలేముతో పాటు, వేరొక ప్రాంతంలో కూడా పరిచర్య చేసివుంటాడు. అతని వంశావళి గురించిన సమాచారం లేదు కాబట్టి అతని కుటుంబం అంత ప్రసిద్ధి చెందినది కాకపోవచ్చు. పల్లెటూరి నుండి వచ్చినప్పటికీ, మీకా అమాయకుడేమీ కాదు. నైపుణ్యం గల వక్త, తెలివైన అలంకారాలతో కూడిన పదప్రయోగాలతో, అద్భుతమైన చిత్రీకరణాశక్తి గలవాడు. ఇతనిలా భవిష్యత్తును స్పష్టంగా చూసిన ప్రవక్తలు అతి తక్కువమంది. షోమ్రోను పతనం గూర్చీ (1:5-9), యెరూషలేము విధ్వంసం గూర్చీ (1:1-16; 3:12), బబులోను చెర, చెరనుండి తిరిగిరావడం (4:6-10) గూర్చీ, భవిష్యత్తులో దేవుడు పంపే దావీదు పాలకుడు బెత్లెహేములో జన్మించడం గూర్చీ (5:2) మీకా ప్రవచించాడు. మీకా పరిచర్య యోతాము పాలన చివరి భాగంలో ఆరంభమై, హిజ్కియా పాలన ఆరంభంలో, అంటే క్రీ.పూ. 730-690 మధ్యకాలంలో ముగిసింది. షోమ్రోనుకు రాబోతున్న శిక్షను గూర్చి చెప్పడం (1:6), అతని పరిచర్య క్రీ.పూ. 722 ముందటే జరిగిందని వెల్లడి చేస్తుంది. మీకా, యెషయా పరిచర్యలు ఒకే సమయంలో జరిగాయి. యిర్మీయా కాలంలోని పెద్దలు, హిజ్కియాను మతసంస్కరణకు ప్రేరేపించిన మీకా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు (యిర్మీయా 26:17-19).
నేపథ్యం: క్రీ.పూ.8వ శతాబ్దపు చివరిభాగంలో, ఇశ్రాయేలు, యూదయ దేశాలు రెండూ సమృద్ధినీ, భౌతిక అభివృద్ధినీ అనుభవించాయి. దక్షిణ దేశంలో రాజైన ఉజ్జీయా సాధించిన సైనిక విజయాలు కొందరికి ఐశ్వర్యాన్ని తెచ్చాయి. ఒక ధనిక వ్యాపార వర్గం పెంపొందింది. అనేకమంది పేద రైతులు, ఈ ప్రభుత్వం సమర్థించే వ్యాపారవేత్తల దయమీద ఆధారపడాల్సివచ్చింది. వ్యాపార లావాదేవీలు అవినీతిమయమయ్యే కొద్దీ, అక్రమంగా సంపాదించిన ఐశ్వర్యం, దానితోపాటు ప్రబలిన దైవరాహిత్యానికి వ్యతిరేకంగా దేవుని ప్రవక్తలు మాట్లాడసాగారు. ఆమోసు, హోషేయలు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచిస్తే, యెషయా, మీకాలు దక్షిణరాజ్యమైన యూదయకు ప్రవచించారు. దేవుని నిబంధనా నియమాలను పక్కకు నెట్టి వాటి స్థానాన్ని యూదా వ్యాపార, లౌకిక సంస్కృతులు ఆక్రమించాయి. పేదల కడుపుకొట్టి ధనవంతులు ఐశ్వర్యవంతులయ్యారు. మీకా దీనిని కుళ్ళిపోతున్న సమాజానికీ, కృంగిపోతున్న దేశపునాదులకూ సూచనగా దృష్టించాడు. దేవుని ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా భిన్నంగా ఉండాలి. దేవుడు తమలో ఒక్కొక్క కుటుంబానికి కేటాయించిన (యెహో 13-19) భూమికి గృహనిర్వాహకులు (లేవీ 25:23). దేవుని ధర్మశాస్త్రం కుటుంబ ఆస్తి హక్కులను సంరక్షిస్తుంది (లేవీ 25:1-55), పేదవారినీ, అభాగ్యులనూ పోషిస్తుంది (ద్వితీ 14:28-29; 15:7-11). కాని మీకా రోజుల్లో పెరుగుతున్న సంపద, బలహీనుల విషయంలో నిర్దయతో వ్యవహరించడానికి కారణమై (మీకా 2:1-2), దేవుని మౌలిక నియమాలను అగౌరవపరచేదిగా తయారైంది (6:10-12). న్యాయాధిపతులు, శాసనకర్తలు కుట్ర, లంచగొండితనం, ఇతర అవినీతి కార్యాల్లో (3:1-3,9-11; 7:3) మునిగిపోయారు. మత నాయకులు దేవుని వాక్యాన్ని బోధించడంకంటే, ధనసంపాదనపై ఎక్కువ శ్రద్ధ చూపించారు (3:11). ధనవంతులు తమ భక్తిని అనుదిన చర్యల నుండి వేరుచేయడం మొదలుపెట్టారు. ఈ కాలంలో ప్రాచీన సమీప ప్రాచ్యంలో అంతర్జాతీయంగా అధికారమార్పులు జరిగాయి. నాటికాలంలో అష్షూరు ఎదుగుతూ అత్యంత దుష్టమైనదిగా, రక్తపిపాసిగా, బలాత్కారం చేసేదిగా, అహంకారంతో నిండిన సామ్రాజ్యంగా తయారైంది. మీకా పరిచర్య సమయంలో నలుగురు అష్షూరు రాజులు తమ సైన్యాలతో పాలస్తీనాలోకి చొచ్చుకు వచ్చారు. వారు క్రీ.పూ. 722లో సమరయను ఆక్రమించి, ఇశ్రాయేలును అష్షూరుకు సామంతరాజ్యంగా చేశారు. క్రీ.పూ. 701లో సన్హెరీబు, 46 యూదయ పట్టణాలను, గ్రామాలను ఆక్రమించి, యెరూషలేమును ముట్టడిరచాడు. హిజ్కియా రాజు అష్షూరుకు విరోధంగా బబులోను, ఐగుప్తులతో స్నేహం చేశాడు. దాని విషయమై మీకా, యెషయాలు ఇద్దరూ అతణ్ణి పశ్చాత్తాపపడమని హెచ్చరించారు. దేవుడు అద్భుతంగా యెరూషలేమును కాపాడాడు (2రాజులు 19:35-36; 2దిన 32:22-23; యెషయా 37:36-37). మీకా చెప్పినట్లుగా యెరూషలేము ముట్టడి దేవుని తీర్పు, అలాగే దేవుని విడుదలకు ఒక అవకాశం కూడా.
యూదయ ఎన్నడూ దాని పాఠం నేర్చుకోలేదు. ప్రజలు విశ్వాసానికి, భ్రష్టత్వానికి మధ్య ఊగిసలాడుతూ, అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు. రాజు, రాజ్యాధికారులు, న్యాయాధిపతులు, మతనాయకులతో సహా, నిబంధనపట్ల యథార్థతకు దూరమైన ప్రజలకు మీకా ప్రకటించాడు. పాలకులు విశ్వాస్యతను కోల్పోతున్న కొద్దీ, యూదయ నాశనం, బబులోనీయుల చేతిలో చెరలోకి వెళ్ళడం గురించి మీకా ప్రవచించాడు (క్రీ.పూ.586). అయితే దానిని మించి, శేషించిన ప్రజలకు భవిష్యత్తులో జరగబోయే పునరుద్ధరణను కూడా అతడు దర్శించాడు (క్రీ.పూ.539).
గ్రంథ సందేశం, ఉద్దేశం
‘‘యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై’’ మీకా ఆశించాడు (3:8). దేవుని ప్రజలను పశ్చాత్తాపపడమనే పిలుపుతో కూడిన దేవుని తీర్పును అతడు ప్రవచించాడు. అన్యాయం ప్రబలిపోయింది (2:1-2; 3:1-3, 9-11; 6:10-11), కాబట్టి వారు నాశనం, చెర (1:10-16), దేవునినుండి నిశ్శబ్దం (3:6-7), నిరాశ అనుభవిస్తారు (6:13-16). అయితే మీకా తన ప్రవచనంలో దేవుని తీర్పు నుండి తప్పించబడే శేషము, వారి మహిమాన్వితమైన భవిష్యత్తు పునరుద్ధరణలను గూర్చిన నిరీక్షణ కూడా చొప్పించి సమతుల్యత పాటించాడు (2:12-13; 4:1-5; 5:5-9; 7:8-20).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
మీకా దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు. సమస్త ప్రజలనుండి ఆయన పరిశుద్ధతను, న్యాయాన్ని కోరుతున్నాడు. ఆయనకు కావలసిన ‘‘ఉత్తమమైనది’’ ఇదే (6:8). యథార్థమైన ఆధ్యాత్మికతను విడిచిపెట్టి మతాచారాలను పాటిస్తూ ప్రజలు సంతృప్తిపడిపోతున్నారు. మత నాయకులు కూడా తమ జీవనస్థాయిని పోషించుకోడానికి అధికసంఖ్యాకులకు సంతృప్తి కలిగించే ప్రసంగాలు చేస్తున్నారు. దేవునికి సంధించబడిన హృదయం నుండే నిజమైన భక్తి పుడుతుందనీ, అది భక్తిపూర్వక జీవితానికి దారితీస్తుందనీ మీకా ప్రకటించాడు. అంటే మతము, నైతికతలు విడదీయరానివి. పశ్చాత్తాపం చెందడానికి తిరస్కరించేవారు ఆయన తీర్పును ఎదుర్కొంటారు. కాని, నమ్మకస్తులు ఆయన రక్షణను కనుగొని, ఆయన శాంతి సమాధానాలు, సమృద్ధిలో దేవుని రాజుచేత నడిపించబడతారు.
గ్రంథ నిర్మాణం
అంశాలవారిగా, అంతర్ముఖ సమతుల్యంగా నిర్మించబడిన ఒక నిర్మాణంగా ఈ పుస్తకం మధ్య, చివరి భాగాలను ప్రముఖంగా ఎత్తి చూపుతుంది. జతపరచబడిన ప్రతి భాగం వేరొకదానిని ప్రతిబింబిస్తుంది. ఈ సాహితీ నిర్మాణం, మీకా ముఖ్యాంశాలైన యూదా ప్రజల సామాజిక పాపాలు, వారి నాయకుల నైతిక పతనం, దేశంలో దేవుని రాజ్య స్థాపనను నొక్కి చెబుతుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”