నహూము గ్రంథం బాధింపబడుతున్న తన ప్రజలను విడుదల చేయమని దేవుడు అష్షూరుపై వత్తిడి తేవడాన్ని నాటకీయంగా చూపిస్తుంది. ఇశ్రాయేలు శత్రువులకు ఇది ఒక కటువైన సందేశమే కాని యూదా ప్రజలకు మాత్రం ఇది ఒక నిరీక్షణా సందేశం.
Read More
రచనా కాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: రచయితగా భావించే నహూము (1:1) అనే పేరుతో పా.ని. లో ఉన్నవాడు ఇతనొక్కడే. అంతకు ముందు శతాబ్దంలోని యోనాలాగా, నహూము నీనెవెపై తీర్పును ప్రవచించాడు. యోనా కాలంలోని నీనెవె ప్రజలు మారుమనస్సు పొందారు (యోనా 3). కాని నీనెవె నాయకులు ఇప్పుడు మళ్ళీ తమ దుష్ట కార్యాలకు తిరగడం వలన దేవుడు వారిపైకి రాబోతున్న తన తీర్పును పునరుద్ఘాటించడానికి నహూమును పిలిచాడు. విచిత్రం ఏమిటంటే, హెబ్రీ భాషలో నహూము పేరుకు అర్థం ‘‘ఆదరణ’’ – అంటే యూదావారికి ఆదరణ (1:12-15). ఎందుకంటే వారిపై రాజ్యం చేస్తున్న కృారులైన అష్షూరు ‘‘ఆదరించువారు’’ లేకుండా శిక్షించబడుతుంది (3:7). ఎల్కోషు అనే అతని స్వంత పట్టణం పేరు తప్ప (1:1), నహూమును గూర్చి ఇతమిద్దంగా ఏమీ తెలియదు.
నహూము గ్రంథం రాసిన అతి ప్రాచీన, నవీన తేదీలను నిర్ణయించడానికి రెండు సంఘటనలు ఆధారంగా నిలుస్తాయి: క్రీ.పూ. 663లో నోఅమోను (తెబెసు) పట్టబడి పతనం కావడం, క్రీ.పూ. 612లో నీనెవె తప్పక నాశనం కాబోతుందనే ప్రకటనలు (1:1; 2:8; 3:7). ఈ పుస్తకం, ఇటీవల జరిగినట్లున్న నోఅమోను పతనాన్ని నొక్కిచెప్తుంది గనుక దీనిని, క్రీ.పూ. 663 తర్వాత వెంటనే, చెడ్డ రాజుగా ప్రసిద్ధి చెందిన మనష్షే పాలనలో (క్రీ.పూ. 686-642) లేక చెడ్డవాడైన అతని కుమారుడు ఆమోను (క్రీ.పూ. 642-640) కాలంలో రాసివుంటాడు.
నహూము 1:12 అష్షూరు సామ్రాజ్య పతనానికి ముందుకాలం అని (అష్షూరు అప్పటికి ఇంకా ‘‘విస్తార జనము, పూర్ణబలము’’ కలిగి ఉంది) సూచిస్తుంది. ఇది అష్షూరు సామ్రాజ్యపు అత్యున్నత దశలో పాలించిన క్రూరుడైన అషుర్బనిపాల్ (క్రీ.పూ. 668-627) పాలనను సూచిస్తుంది.
నేపథ్యం: ఆధునిక ఇరాక్ రాజధాని బాగ్దాద్కు ఉత్తరంగా సుమారు 220 మైళ్ళదూరంలో అష్షూరు రాజధాని నీనెవె ఉండేది. నహూము కాలానికి వచ్చేసరికి, ఇశ్రాయేలు, యూదయలు చాలాకాలంగా అష్షూరీయుల దీర్ఘమైన, కృంగదీసే శ్రమను అనుభవించాయి. మూడవ షల్మనేసరు (క్రీ.పూ.858-824) వరకు, రాజైన యెహూ అష్షూరీయులకు కప్పం కడుతూ వచ్చాడు. దేవుడు తన ప్రజలను శిక్షించడానికి అష్షూరీయులను తరచుగా తన ‘‘కోపమునకు సాధనమైన దండము’’గా (యెషయా 10:5) వాడుకున్నాడు. ఐదవ షల్మనేసరు (క్రీ.పూ.727-722), అతని వారసుడు రెండవ సర్గోన్ (క్రీ.పూ.722-705) షోమ్రోనును ముట్టడిరచి, దానిని నాశనం చేసి, ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలును చెరగొనిపోయారు (2రాజులు 17:3-6). అదే విధంగా సన్హెరీబు యూదాను పట్టుకొని దానిని ధ్వంసం చేసి క్రీ.పూ.701లో యెరూషలేమును ముట్టడిరచాడు (2రాజులు 18-19; యెషయా 36-37). అషూర్బనిపాల్ (క్రీ.పూ.669-627) పాలననాటికి అష్షూరు పాలకులు తమ క్రూరత్వాన్ని బట్టి ఎంతో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు (3:10,19 నోట్సు చూడండి).
గ్రంథ సందేశం, ఉద్దేశం
తీర్పు: ఈ పుస్తకం ముఖ్యాంశం, దేవుడు నీనెవె పైకి త్వరలో పంపబోయే తీర్పు (1:1,8; 2:8-13; 3:7-19). దాని ద్వారా ఆయన తన ప్రజలను విడిపిస్తాడు (1:12-15; 7-8 వచనాలతో పోల్చండి). నీనెవెవారు, అష్షూరీయులు తమ శత్రువులతో ఏ విధంగా అవమానకరంగా వ్యవహరించారో అదే విధంగా యెహోవా వారితో వ్యవహరించబోతున్నాడు. వారి ఖైదీలను మరణపు కవాతులనే క్రూరమైన రీతిలో చెదరగొట్టినట్లే, దేవుడు, వారి క్రూరత్వానికి ప్రతీకారంగా అష్షూరీయులను చెదరగొట్టడానికి (3:18-19; 3:10తో పోల్చండి) చెదరగొట్టేవానిని (2:1) పంపుతున్నాడు. రక్తం చిందించడానికి, తమ శత్రువుల శవాలను పోగులు వేయడానికి అష్షూరీయులు ఎంతో ఇష్టపడేవారు కాబట్టి, దేవుడు నీనెవెను కూడా రక్తసిక్తం చేసి, వారి స్వజనుల శవాలు వారి పట్టణంలో కుప్పలు కుప్పలుగా పడేలా చేస్తాడు (3:1-3).
సమరయ పట్టణాన్ని పండిపోయిన మొదటి అంజూరంలాగా మింగివేయడానికి (యెషయా 28:4 నెరవేర్పుగా) అష్షూరీయులు కోసిన దానికి ప్రతిగా దేవుడు వారి రాజధాని నీనెవె, ఇంకా ఇతర దుర్గాలను, వారి శత్రువుల ఆకలి నోట పడేలా చేస్తాడు. (నహూము 3:12). దాని సైనికబలగాన్ని బట్టి (3:8), మిత్రరాజ్యాలను బట్టి (3:9) నీనెవె (నోఅమోనులాగా) దుర్భేధ్యమైనదిగా కనిపించినా, ఐగుప్తీయులను వారు చెరగొనిపోయినట్లుగా, అష్షూరీయులు కూడా చెరలోనికి పోతారు (3:10).
దేవుడు, కాచి సంరక్షించే యోధుడు: మహాబలం గలిగిన, సంరక్షించే ఒక యోధుడుగా (1:2-7) దేవుని స్వభావం చిత్రీకరించబడిరది. నీనెవె మీదికి తీర్పు రావడానికి కారణం ఆ లక్షణమే. తన ప్రజలపట్ల దేవుని రోషం, తన శత్రువుల మీద ఆయన ఉగ్రత (1:2-3)లు ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం అనే స్వభావాలతో సంతులనమై (1:3; నిర్గమ 34:6-7), ఆయన మహాబలం (నహూము 1:3), మంచితనం (1:7) మీద ఆనుకొని ఉన్నాయి. మహా యోధుడైన యెహోవా తన శత్రువుల మీద పగతీర్చుకుంటాడు (1:2,3-6). తన సేవకుల రక్తం నిమిత్తమై పగతీర్చుకుంటానన్న ఆయన వాగ్దానం ప్రకారం (ద్వితీ 32:35-36,42-43), ఉగ్రుడైన దేవుడుగా ఆయన చిత్రం సరిపోలుతుంది. అంతేకాక, దేవుని మంచితనం, కరుణలు ఏదో గారాబం చేసే లేక శక్తిహీనుడైన తాతప్రేమలాంటివి కావు (2పేతురు 3:9-10,12). తనను ఆశ్రయించేవారికి (1:7) ఆయన ‘‘ఉత్తముడు’’ (లేక దయాళుడు), కాని, నీనెవెతో సహా మారుమనస్సు పొందని తన శత్రువులపైకి ఆయన నాశనాన్ని తెస్తాడు (1:8).
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
నహూము గ్రంథం తృణీకరించబడిన, అణగారిన ప్రజలకు నిరీక్షణను ఇచ్చే బలవంతుడు, న్యాయవంతుడు, తన సంపూర్ణ నైతిక విలువలను కనపరిచే ఉన్నతమైన దేవునిగా చిత్రీకరించింది. దేవునిపై నమ్మకముంచమని నహూము మనకు బోధిస్తున్నాడు. ఏ సహాయం విషయంలో మనం నిరాశపడినా, తనవారి పక్షంగా దేవుడు నిలబడతాడని మనము తెలుసుకోవచ్చు.
గ్రంథ నిర్మాణం
దేవుని శత్రువులకు విరోధంగా తీర్పుగీతాలు (1:9-11,14తో 2:13; 3:5-7 పోల్చండి), లేక ఒక శ్రమను గూర్చిన దేవోక్తి లేక వ్యంగ్య విలాపం (3:1-7) వంటి ప్రవచన చరణాలతో, తన ప్రజలైన యూదావారి రక్షణ దేవోక్తుల (1:12-15) ప్రవచనాలను, దైవయోధుడైన యెహోవాకు ఒక విజయ గీతాన్ని (1:2-8తో నిర్గమ 15; కీర్తన 98 పోల్చండి), సమీపమైన శత్రువు దాడినిగూర్చిన ఒక వ్యంగ్య ‘‘వాగ్దర్శనాన్ని’’ (2:1-10తో 3:2-3 పోల్చండి) కలిపి ఒక అల్లికలా చేశాడు నహూము. ఈ సాహితీ జలతారు తెరలకు, త్వరలో నీనెవెకు రానున్న తలక్రిందుల పాత్రను వెక్కిరించే వ్యంగ్య ‘‘ఆక్షేపణ గీతాల’’తో రంగులద్దాడు (2:11-12; 3:8-19తో 2:1-2; 3:4-5 పోల్చండి). ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టే నీనెవె అలవాటును ఎగతాళి చేస్తూ, దేవుడు పంపే ‘‘లయకర్త’’ (చెదరగొట్టేవాడు, 2:1-2; 3:18-19) వారికి అలాగే చేస్తాడని ప్రకటించాడు. దోపుడు సొమ్ముతో నిండిన సింహపు గుహ త్వరలోనే దోపిడీకి గురౌతుందని అతడు వారిని ఎత్తిపొడిచాడు (2:11-13). ఆమెను చిల్లంగిపెట్టే వేశ్య అని ఎగతాళిచేసి, దిగంబరత్వం, అవమానంతో సరైన శిక్షకు గురికాబోతుందని ఎత్తిపొడిచాడు (3:4-7).
మానసిక యుద్ధం చేస్తూ (యూదావారిపై అష్షూరీయులు చేసినట్లుగానే), వారి మిత్రరాజ్యాలపై, మిగిలిన భద్రతావ్యవస్థలపై నీనెవె ఆధారపడడాన్ని (3:8-10తో యెషయా 36:4-20 పోల్చండి) నహుము గేళిచేశాడు. అషుర్బనిపాల్ తండ్రి అయిన ఏసర్హద్దోన్, క్రీ.పూ. 672లో యూదారాజైన మనష్షేను బెదిరించి, వారు తిరగబడితే తమ దేవతల ఒప్పంద శాపాలు కలుగుతాయని జడిపించాడు. జి. జాన్స్టన్ అనే వ్యాఖ్యాత వాదించినట్లు, అదే ఒప్పందాల భాషను యెహోవా మార్చి యూదాపై శాపాన్ని తిప్పివేయడానికి ఉపయోగించాడు. స్త్రీలలాగా కాపాడుకోలేనంత బలహీనమయ్యేది, అష్షూరు సైన్యంలోని పురుషులే గాని యూదావారు కాదు (నహూము 3:13). దేశాన్ని నాశనం చేసే అష్షూరీయుల సైన్యాలను వర్ణించడానికి ఉపయోగించిన మిడతల పోలికను మరల తీసుకొని, దానికి మార్పు చేసి నీనెవె వ్యాపారులను, సైన్యాధిపతులను గోడ మీద ఉండే హానికరం కాని, తేలికగా జడుసుకునే, చెదరిపోయిన (నహూము 3:15-18) మిడతలతో పోలుస్తూ ఎగతాళి చేశాడు. వారి దేవతలనుండి వస్తుందని భయపెట్టిన కుదరని వ్యాధి, తిరిగి అష్షూరీయులకే తగులబోతుంది (3:19).
యూదావారిని రక్షించడానికి తన శత్రువుల మీద, ముఖ్యంగా నీనెవె మీద పగతీర్చుకునే పరాక్రమం కలిగి, శ్రద్ధచూపించే యోధుడుగా యెహోవాను చూపడం, నహూము ఉద్దేశపూర్వక వ్యాఖ్యకు మాత్రమే కాక, ఈ గ్రంథ సాహితీ నిర్మాణానికి వెన్నెముకలాంటిది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”