పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలో స్వభావరీత్యా వ్యక్తిగతమైనది ఫిలేమోను పత్రిక ఒక్కటే. అది ఫిలేమోను అనే తన యజమాని సొత్తును దోచుకొని కొలస్సీ నుండి రోమ్ నగరానికి పారిపోయిన ఒనేసిము అనే బానిస గురించి రాయబడిరది. ఈ ఒనేసిము రోమ్‌లో చెరసాలలో ఉన్న పౌలును కలుసుకున్నాడు. పౌలు ఒనేసిము గురించి ఫిలేమోనుకు రాసిన ఈ ఉత్తరంతో సహా ఒనేసిమును కూడా కొలస్సీ పట్టణానికి పంపించాడు. పౌలు రాసిన ఇతర పత్రికలతో పోలిస్తే ఫిలేమోను పత్రిక ఒక చిన్న పోస్టుకార్డు లాంటిది. అయినప్పటికీ ఇది ఒక అపొస్తలుడు అధికారపూర్వకంగా రాసినట్టు కాక సున్నితమైన హృదయం గల ఒక వ్యక్తి తన స్నేహితునికి రాసిన ఉత్తరంలాగా ఉంటుంది.
Read More
రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: పౌలు రోమ్‌లో రెండు సంవత్సరాలు చెరసాలలో గడిపాడు (అపొ.కా.28:30). ఆ కాలంలో, బహుశా క్రీ.శ. 60-61లో అతడు నాలుగు ‘‘చెరసాల పత్రికలు’’ రాశాడు. వాటిలో ఒకటి ఫిలేమోను పత్రిక (మిగిలిన మూడు కొలస్సీ, ఎఫెసీ, ఫిలిప్పీ పత్రికలు).
నేపథ్యం: ఈ ఉత్తరం రాసిన సమయంలో పౌలు చెరసాలలో ఉన్నాడని దీనిలోని వ.1,8-10,13,23 లు సూచిస్తున్నాయి. పౌలు తన న్యాయ విచారణ (అపొ.కా.28:30) కోసం ఎదురుచూస్తూ తాను అద్దెకు ఉన్న ఇంటిలోనే గృహ నిర్బంధంలో ఉన్నాడు. దీనిని రోమీయులు ‘‘స్వేచ్ఛతో కూడిన నిర్బంధం’’ అని పిలిచేవారు.
పౌలు ఈ ఉత్తరాన్ని అప్ఫియ, అర్ఖిప్పులకు, ఫిలేమోను ఇంటిలో సమావేశమయ్యే సంఘానికి కూడా (వ.1-2) రాసినట్టు ఉన్నప్పటికీ దీనిని ప్రముఖంగా ఫిలేమోనును ఉద్దేశించి రాశాడు. ఎందుకంటే అతడు ‘నీకు’, ‘నీవు’ అని రాసినప్పుడెల్లా (వ.2,4-21,23) ఫిలేమోనును ఉద్దేశించి ఏకవచనంలో సంబోధించాడు. ఫిలేమోను బహుశా చాలా సంపాదన కలిగి కొలస్సియిలో నివసించిన వ్యాపారస్తుడు అయి ఉంటాడు (కొల 4:9). అతనికి చాలా మంది బానిసలు ఉండి అతని ఇల్లు అప్పుడే ప్రారంభమైన సంఘ సమావేశాలకు సరిపడినంత విశాలంగా ఉండేది. అతడు పౌలు పరిచర్యలో, బహుశా పౌలు వల్లనే మారుమనస్సు పొంది ఉంటాడు (వ.10,19). అతడిప్పుడు పౌలుకు ‘‘ప్రియుడును జతపనివాడు’’ (వ.1) గా, సువార్త పరిచర్యలో ‘‘పాలివాని’’ (వ.17) గా మారాడు. ఈ ఉత్తరం ప్రాథమికంగా ఫిలేమోనుకు నేరుగా చేసిన విన్నపం అయినప్పటికీ, ‘‘మీకు’’, ‘‘మీ’’ (వ.3,25) అనే బహువచన సంబోధన వలన ఈ ఉత్తరం సంఘంలో అందరికీ వినిపించడానికి, వారు చదువుకోడానికి వీలైన విధంగా పంపించాడనీ, తద్వారా వారంతా పౌలు విన్నపానికి ఫిలేమోను స్పందన ఏమిటో తెలుసుకోడానికి వీలయ్యిందనీ తెలుస్తుంది.
ఒనేసిము తన యజమాని సొమ్మునో లేక వస్తువులనో దొంగిలించి అతని ఇంటినుండి పారిపోయి ఉంటాడు (వ.15,18). బహుశా అక్కడికి రోమ్ నగరం బహుదూరంగా ఉండడం, అది బహు విశాలమైన నగరం కావడం వలన అది తనకు మంచి మరుగుస్థలంగా ఉంటుందని భావించడం అతడు స్వేచ్ఛా జీవితం గడపడానికి రోమ్ నగరానికి ప్రయాణించేలా చేసింది. అతడు ఆ మార్గంలో పౌలును కలుసుకున్నాడు, క్రైస్తవుడుగా మారిపోయాడు (వ.10,16), పౌలుకు ప్రయోజనకరమైన సహాయకుడు అయ్యాడు (వ.11).
మరొక అభిప్రాయం ఒనేసిము అసలు స్వేచ్ఛను కోరి తప్పించుకొని పారిపోయాడు అనే ఆలోచనను తోసిపుచ్చింది. దాని ప్రకారం అతడు ఫిలేమోను బహుశా తన వలన ఎదుర్కొన్న ఒక గొప్ప నష్టం విషయంలో పౌలును తన పక్షంగా వాదించమని కోరడానికి ఫిలేమోనును విడిచిపెట్టి పౌలును వెదకుతూ బయలుదేరాడు. ఎప్పటికైనా తన యజమాని అయిన ఫిలేమోను దగ్గరకు తిరిగి వెళ్ళాలన్నదే అతని ఉద్దేశం. కాబట్టి ఈ అభిప్రాయం ప్రకారం తప్పించుకొని పారిపోయిన ఒక బానిసను చేరదీసిన అపరాధం పౌలు భరించనక్కరలేదు. అయితే ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే పౌలు తన ఉత్తరంలో ఒనేసిము అతని దగ్గరకు తిరిగి రావాలనే ఉద్దేశంతో ఉన్నాడని ఫిలేమోనుకు చెప్పి ఉండేవాడు.
ఈ గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ ఉత్తరం బానిసత్వ నిర్మూలనకు ఒక ప్రేరణగా నిలిచింది. ఒనేసిమును తన దగ్గరే ఉంచుకోవడం పౌలు ప్రధమ ప్రాధాన్యత అయినప్పటికీ (వ.13) ఫిలేమోను అతని చట్టబద్ధమైన యజమాని అని గుర్తించి అతన్ని ఫిలేమోను దగ్గరకే తిరిగి పంపించడానికి నిర్ణయించుకున్నాడు (వ.12). ఆ విధంగా ఇప్పుడు ఒక క్రైస్తవ సహోదరునిగా (వ.15-16) మారిన ఒనేసిమును తన బానిసగా తిరిగి పనిలోకి తీసుకోడానికి గానీ లేక అతనికి స్వేచ్ఛను ప్రసాదించి పౌలుకు సేవ చేయడానికి (వ.13, 20-21) రోమ్కు తిరిగి పంపించడానికి గానీ ఫిలేమోనుకు వెసులుబాటు కలిగింది. తన మాటకు ఫిలేమోను విధేయత (వ.21) చూపుతాడనే నమ్మకం పౌలుకు ఉన్నదని ఎరిగి ఒనేసిము ఈ ఉత్తరం తీసుకొని తన యజమాని దగ్గరకు పయనమయ్యాడు. అదే సమయంలో తన యజమాని నుండి క్షమాపణకు గానీ, తిరిగి పనిలోకి చేరడానికి అనుమతి గానీ, బానిసత్వం నుండి స్వేచ్చ గురించి గానీ కచ్చితమైన భరోసా ఏమీ లేదని అతనికి తెలుసు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
పౌలు రాసిన ఉత్తరాల్లో అతి చిన్నది, అత్యంత వ్యక్తిగతమైనదీ అయిన ఫిలేమోను పత్రికను కొత్త నిబంధనలో చేర్చడానికి అనేక కారణాలు ఉన్నాయి.
మొదటిది, అది క్రైస్తవుల మధ్య ఏర్పడిన సామాజిక, సాంస్కృతిక అడ్డుగోడలు కూలదోయబడడాన్ని వర్ణిస్తుంది (గలతీ 3:28 చూడండి). విద్యాధికుడు, రోమా పౌరుడు అయిన పౌలు దొంగతనం, తప్పించుకొని పారిపోవడం అనే నేరాలను బట్టి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్న ఒక బీద బానిస గురించి వకాల్తా పుచ్చుకున్నాడు. క్రైస్తవ సహవాసంలో సామాజిక, సాంస్కృతిక అడ్డుగోడలు కూలదోయబడ్డాయి.
రెండవది, ఇది బానిసత్వం విషయంలో ఆది క్రైస్తవుల వైఖరికి అద్దంపట్టింది. పౌలు బానిసత్వాన్ని ఉనికిలో ఉన్న ఒక సామాజిక పరిస్థితిగా, ఒక చట్టబద్ధమైన వాస్తవంగా అంగీకరించినప్పటికీ (కాని దానిని ప్రోత్సహించ లేదు) అతడు ఒక క్రైస్తవ సోదరునిగా ఒనేసిము యొక్క ఉన్నతమైన గుర్తింపును నొక్కిచెబుతూ యజమాని, బానిసల మధ్య సంబంధానికి ఒక నూతన నిర్వచనం ఇచ్చాడు (వ.16). తద్వారా అంతిమంగా అతడు బానిసత్వ వ్యవస్థను కూలదోశాడు. ఇది ఆనాటి ప్రాచీన లోకాన్ని శాసించే అభిప్రాయాలకు విరుద్ధమైంది. ఉదాహరణకు, అరిస్టోటిల్ ఒక బానిసను నిర్వచిస్తూ, ‘‘ఒక వస్తువు ఎలా కదలిక లేని బానిసగా ఉంటుందో అదేవిధంగా బానిస ఒక జీవించే వస్తువు’’ అన్నాడు.
మూడవది, అది తన పనిని శ్రద్ధగా చేసే ఒక నైపుణ్యం గల కాపరిని మనకు కనపరుస్తున్నది. ఒక అపొస్తలుడుగా ఆజ్ఞాపించ గలిగే తన హక్కును పౌలు వదులుకున్నాడు (8-9), ఫిలేమోను కలిగి ఉన్న అధికారాన్ని బట్టి (వ.10,14) అతడు తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరచాలో తన క్రైస్తవ మనస్సాక్షి ప్రకారం నిర్ణయించుకోమని (వ.4,7) అతన్ని వేడుకోడానికే పౌలు మొగ్గు చూపాడు. తన ఆధ్యాత్మిక కుమారుడైన ఒనేసిమును ‘‘నా ప్రాణమువంటి వాడు’’ (వ.12) అని పిలవడం ద్వారా అతనితో తనను తాను ఏకం చేసుకున్నాడు, అతని ఋణమంతటినీ తానే తీరుస్తానని భరోసా ఇస్తూ (వ.18-19), ఆ స్థానిక సంఘం అంతటి వినికిడిలో చదివే విధంగా (వ.1-3, 22-25) తన విన్నపాలు ఫిలేమోనుకు పంపించాడు.
నాలుగవది, ఇది సువార్త హృదయాన్ని చిత్రీకరించింది (వ.16-19). మనం పశ్చాత్తాపంతో, విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు ఒక నూతన హోదాను కల్పించి, మనం క్రీస్తు అన్నట్టుగానే భావించి ఆహ్వానిస్తాడు. మనం దేవునికి ఏదైతే అచ్చి ఉన్నామో ఆయన దానిని క్రీస్తు ఖాతాలో ఖర్చు రాసుకున్నాడు. మనం దేవునికి చెల్లించాల్సిన ఋణం అంతటినీ తీర్చేసే వ్యక్తిగత బాధ్యతను క్రీస్తు తనపై వేసుకున్నాడు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”