సామెత అంటే ఏమిటి? లౌకికంగా చూస్తే సామెత అనేది ఒక సాధారణ సత్యాన్ని (పరమ సత్యం కాకపోవచ్చు), అంటే ఉదాహరణకు, ‘‘ఒక బుద్ధిహీనుడు, అతని డబ్బు త్వరలోనే విడిపోతారు’’ లాంటి సత్యాన్ని వెల్లడిరచడానికి ప్రయత్నిస్తుంది. అది క్లుప్తమైన మాటల్లో ఉన్నప్పటికీ సారగర్భితంగా భావంలో ఉన్నతంగా ఉంటుంది. ఉదా. ‘‘కష్టపడకుండా ప్రతిఫలం రాదు’’ అనే సామెత ఆచరణాత్మకమైంది. అవి వాస్తవ లోకంలో నిజంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దానిని మనం అన్వయించుకోవాలి. ఆ సామెత వెలుగులో పాఠకుడు తన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ‘‘దాతృత్వం ఇంటి దగ్గరే ప్రారంభం అవుతుంది.’’
Read More
జీవితంలో కొన్ని విషయాలు ఎలా జరుగుతాయి అనేదాని సునిశితమైన పరిశీలన నుండి ఒక సామెత పుడుతుంది. ఒక సామెతను పుట్టించిన వ్యక్తి అత్యంత తెలివైనవాడుగా, గ్రాహ్యశక్తి గలవాడుగా ఉంటాడు. సాధారణమైన ఒక సత్యాన్ని పరిశీలించి దానిలో నుండి కొన్ని అనుసరించదగిన సూత్రాలు రూపకల్పన చేయగలిగి ఉంటాడు; ‘‘కత్తి కంటే కలం గొప్పది.’’
వీటన్నిటికీ తోడుగా సామెతలు గ్రంథం లోని సామెతలు దైవావేశంతో కూడినవి. అవి దేవుని నుండి వచ్చాయి కాబట్టి అవి సత్యమైనవనీ, అవి మనకు ప్రయోజనకరమనీ మనకు తెలుసు; ‘‘ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు’’ (సామెత 16:20). బైబిలు సామెతలు ఈ లోకానికి సంబంధించి మాత్రమే కాక నిత్యత్వానికి కూడా సరిపడిన ఆచరణాత్మక సలహాలనిస్తాయి; ‘‘క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును’’ (15:24).
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: సామెతలు గ్రంథం 1-29 అధ్యాయాల రచయిత సొలొమోను అని విదితమౌతుంది (1:1; 10:1). సొలొమోను మహా జ్ఞాని అనీ, జ్ఞానోక్తులను సేకరించేవాడనీ చెప్పడానికి బైబిల్లో రుజువులున్నాయి (1రాజులు 3:5-14; 4:29-34; 5:7,12; 10:2-3,23-24; 11:41). 1-24 అధ్యాయాలు అతడు క్రీ.పూ.970-931లో రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలోనే రాసి ఉంటాడు. 25-29 అధ్యాయాల్లోని సామెతలు సొలొమోను రాసినవే అయినా వాటిని తరువాత క్రీ.పూ.716-687 మధ్య కాలంలో పరిపాలించిన హిజ్కియా రాజు సేకరించాడు (25:1). చివరి రెండు అధ్యాయాలు ఆగూరు, లెమూయేలులు రాశారు (30:1; 31:1). వీరి గురించి మనకు ఏమీ తెలియదు. సొలొమోను, ఆగూరు, లెమూయేలులు రాసిన సామెతలను సంకలనం చేసి ఇప్పుడున్నట్టుగా ఒక గ్రంథంగా మనకు అందించడానికి ఎవరో ఒక సంపాదకుడు పూనుకొని ఉంటాడు.
నేపథ్యం: ఇశ్రాయేలు రాజ్యానికి సొలొమోను పరిపాలన సర్వ సమృద్ధితో కూడిన ఒక స్వర్ణయుగం. ఆ కాలంలో రాజ్యం బహు గొప్పగా విస్తరించింది. శాంతి సమాధానాలు, అంతర్జాతీయ వాణిజ్యం పరిఢవిల్లాయి (1రాజులు 4:20-25; 10:21-29). ప్రాచీనమైన ఐగుప్తు జ్ఞాన సంప్రదాయాలు సొలొమోనుకు బాగా తెలిసి ఉంటాయి (1రాజులు 3:1). కానీ దేవుడిచ్చిన తలాంతులు, దైవావేశం ద్వారా అతడు అంతకంటే మరింత శ్రేష్ఠమైన జ్ఞానసూక్తులను రచించాడు (1రాజులు 3:12; 10:6-7,23). సొలొమోను తన ఈ బోధలను తన కుమారుని లేక కుమారులను ఉద్దేశించి చెప్పినా దైవావేశం వలన కలిగిన ఈ సామెతలు మానవులందరికీ అన్వయిస్తాయి. మిగిలిన బైబిలు గ్రంథాల్లాగా సామెతలు గ్రంథం కూడా కథలు, బోధనలు, ఉదాహరణలతో నిండి ఉంది. ప్రజలు ఈ సత్యాలను తమ స్వంత పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలి.
గ్రంథ సందేశం, ఉద్దేశం
ఈ సామెతలు బైబిలు గ్రంథంలోని భాగం కాబట్టి అవి కేవలం మనకు వినోదాన్నివ్వడమే కాదు, మనల్ని హెచ్చరిస్తాయి, ప్రోత్సహిస్తాయి, మనకు నిరీక్షణ కలిగిస్తాయి. బుద్ధిహీనతను కాకుండా జ్ఞానాన్ని వెంబడిరచమని సొలొమోను తన పాఠకులకు, మరి ముఖ్యంగా యౌవనస్తులకు పిలుపునిచ్చాడు. అతడు అనుభవజ్ఞులైన వారిని అపహాసకులుగా కాక జ్ఞానవంతులుగా ఉండమనీ, సరిదిద్దలేనివారుగా కాక బోధింపదగినవారుగా ఉండమనీ, మరణాన్ని కాక జీవాన్ని కోరుకోమనీ ప్రోత్సహించాడు. జ్ఞానాన్ని అన్వేషించినవారు తమ జీవితంలో సాధారణంగా విజయాన్నీ, సంతోషాన్నీ కనుగొంటారని అతడు ముందుగానే తెలియజేశాడు. అయితే మరింత నిశ్చయంగా నిత్యత్వంలో వారు దీవించబడతారని అతడు వాగ్దానం చేశాడు. జ్ఞానానికీ, దేవునికీ మధ్య సన్నిహితమైన సంబంధం ఉంది. ఉదాహరణకు, ఇద్దరూ విధేయతను, నైతికతను ప్రోత్సహిస్తారు, ఇద్దరూ విజయాన్నీ, నిత్యజీవాన్నీ వాగ్దానం చేశారు. యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలం కాబట్టి ఈ రెండిరటికీ సంబంధం ఉంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన, దైవికమైన ఈ సలహాకు మూలం దేవుడే. జ్ఞానం వేటినైతే వాగ్దానం చేసిందో వాటికి భరోసా ఇచ్చేవాడు దేవుడే. జ్ఞానం వల్లా, దేవుని వల్లా కలిగే ప్రయోజనాలు ఒక్కటే. జ్ఞానం దేన్నైతే వాగ్దానం చేసిందో దానిని దేవుడు అనుగ్రహిస్తాడు (4:4-8).
బైబిలులో ఈ గ్రంథం యొక్క పాత్ర
ఆత్మీయ సమాజంలో జీవించడమెలాగో ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు బోధిస్తాయి. ఆచరణాత్మకంగా, ఒకరి పట్ల ఒకరు మర్యాద పూర్వకంగా ఎలా జీవించాలో జ్ఞానసాహిత్యం బోధిస్తుంది. యోబు గ్రంథం ఒక ప్రధాన ఆలోచనను వివరిస్తుంది: శ్రమకు సంబంధించి దేవుని సార్వభౌమాధికారం. క్షణభంగురమైన ఈ జీవిత తాత్పర్యాన్ని గురించి ప్రసంగి పుస్తకం ధ్యానిస్తుంది. సొలొమోను పరమగీతము ప్రణయానురాగాల్ని స్పృశిస్తుంది. ఇక వ్యాపారాన్ని యుక్తిగానూ, అదే సమయంలో యథార్థంగానూ ఎలా నడిపించాలి అనే విషయం దగ్గరనుండి వైవాహిక వ్యవస్థలో ఎలా సంతోషంగా జీవించాలి అనే విషయం వరకు జ్ఞానాంశాల్లో మిగిలిన వాటినన్నిటిని సామెతలు పుస్తకం బోధిస్తుంది.
గ్రంథ నిర్మాణం
సామెతలు గ్రంథం బైబిల్లోని జ్ఞానసాహిత్య విభాగం లోనిది. ఈ లోకం గురించీ, దానిలోని మానవుల గురించీ జ్ఞానయుక్తంగా పరిశీలించి రాసిన రచనలే జ్ఞానసాహిత్యం. అయితే యోబు, ప్రసంగి గ్రంథాల్లో కొన్ని భాగాలు బోధించినట్టు ఒక దైవావేశంతో కూడిన దైవిక దృక్పథం లేకపోతే ఈ లోకం నిరాశతో, నిరీక్షణ లేనిదిగా మిగిలిపోతుంది. అంతిమంగా వాక్యానుసారమైన జ్ఞానం దేవునియందలి విశ్వాసం ద్వారా ఏర్పడి స్థిరపరచబడుతుంది. పరిశీలన, విచారణ, ప్రేరేపణల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో సామెతలు 24:30-34 లో చూడవచ్చు. ఒక ‘‘సోమరివాని చేను’’, ‘‘తెలివిలేని వాని ద్రాక్షతోట’’ ల దుస్థితిని పరిశీలించిన తరవాత సొలొమోను ఈ విధమైన అభిప్రాయానికి వచ్చాడు: ‘‘నేను దాని చూచి యోచన చేసికొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని’’ (24:32). ఈ పరిస్థితికి తగినట్టుగా అతడు ఒక కొత్త సామెతను రచించడమో లేక అప్పటికే అతడు ఎరిగి ఉన్న సామెతను దానికి అన్వయించడమో చేశాడు: ‘‘ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునికిపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును’’ (24:33,34).
సామెతలు గ్రంథం హెబ్రీ కవిత్వంగా రాయబడిరది. హెబ్రీ కవిత్వం సుందరమైంది, సంక్షిప్తమైంది. దానిలో అధికభాగం సాదృశ్యాత్మకంగా ఉండి, సాధారణంగా రెండవ పంక్తి మొదటిదానిని సమర్ధించడమో, వ్యతిరేకించడమో జరుగుతుంది. ఒక సామెతలో రెండవ పంక్తి ఏ విధంగా మొదటి పంక్తితో సంబంధం కలిగి ఉన్నదో అని పరిశీలిస్తే అది ఆ సామెతను అర్థం చేసుకోడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
1-9 అధ్యాయాల్లో సొలొమోను జ్ఞాన ప్రశస్తతను, దుష్టత్వపు ప్రలోభాన్ని గురించి కొన్ని సాదృశ్యాత్మక చిత్రీకరణలు, స్థిరమైన వాదనల ద్వారా బోధించాడు. 22:17-24:34 లో అనేక వచనాలతో కూడిన కొన్ని సామెతలు, 30,31 అధ్యాయాలలో ఆదర్శవంతమైన భార్యను గురించి సంఖ్యాత్మకమైన, అక్షరక్రమంతో కూడిన మరిన్ని సామెతలు ఉన్నాయి. సామెతలు గ్రంథం మిగిలిన భాగమంతా ఒక్కొక్క సామెత సాధారణంగా ఒక్కొక్క వచనంగా ఉంటుంది. విడివిడిగా ఉన్న ఈ సామెతలలో కొన్నింటిని జాగ్రత్తగా కలిపి ఒక్కొక్క విభాగంగా ఏర్పాటు చేసారనీ, వాటిని ఆ విభాగం నేపథ్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలనీ మరి కొందరు పండితులు వాదించారు. మరి కొందరు పండితులు ఈ సంకలనాల్లో ఒక క్రమం అంటూ లేదనీ వాటిని అక్కడి సందర్భానికి అనుగుణంగా వ్యాఖ్యానించవలసిన అవసరం లేదనీ వాదించారు. ఏ వాదన ప్రకారమైనా, ప్రతి ఒక్క సామెతను, మొత్తం సామెతలు గ్రంథాన్ని, బైబిలు మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, 21:14 వచనం లంచగొండితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ సామెతలు గ్రంథం అంతా దానికి వ్యతిరేకంగా ఉంటుంది (15:27). బైబిల్లోని మిగిలిన లేఖనాలన్నీ కూడా లంచాన్ని వ్యతిరేకిస్తున్నాయి (నిర్గమ 23:8; ప్రసంగి 7:7).