కొత్త నిబంధన పత్రికల్లో వేదాంతపరంగా, కాపరత్వ పరంగా అత్యున్నతమైన ప్రభావం చూపిన వాటిలో పౌలు రోమాలోని ఇండ్లలో నడుస్తున్న సంఘాలకు వ్రాసిన ఈ పత్రిక ముందు వరుసలో నిలుస్తుంది. విశ్వాసులు తమ జీవితాల్లో యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన రక్షణను కొనసాగించడానికి ఆచరణాత్మకంగా అనుసరించాల్సిన సూత్రాలతో కూడిన రక్షణ సిద్ధాంతంపై ఈ పత్రిక దృష్టిసారించింది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఇందులో పేర్కొనబడిన విధంగా రోమా పత్రిక గ్రంథకర్త అపొస్తలుడైన పౌలు అనే విషయంలో వివాదం లేదు. పౌలు బీదలైన యూదు క్రైస్తవులకు అన్యసంఘాల నుండి కానుకలను పోగుచేసి యెరుషలేముకు తీసుకెళ్తూ దారిలో కొరింథులో ఉండగా, క్రీ.శ.57 సంవత్సరం వసంతకాలంలో ఈ పత్రికను రాశాడని అపొస్తలులు కార్యములు గ్రంథం నుండి, రోమా పత్రికలో కనిపించే కొన్ని వాక్యభాగాల నుండి మనకు తెలుస్తున్నది (అపొ.కా.20:3; రోమా 15:25-29).
నేపథ్యం: పౌలు రాసిన పత్రికలన్నీ అతని మిషనరీ/కాపరి పరిచర్యనుండీ, స్థానికసంఘాల్లో ఎదుర్కొనే సమస్యలు, అవసరాల్లో నుండీ ఉద్భవించినవే. రోమా పత్రిక కూడా ఇలాంటి కోవకు చెందినదే గాని అది ‘‘స్థానికమైనది’’ అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే పౌలు అప్పటికి ఇంకా రోమా నగరానికి వెళ్ళలేదు. ఈ ఉత్తరం శుభసందేశాన్ని, అంటే సువార్త గురించి వివరించి చెప్పడానికి అతనికి ఒక మంచి అవకాశం కలిగించింది. పాపం యొక్క సారాంశం, సిలువలో సాధించబడిన రక్షణ, క్రీస్తుతో విశ్వాసి ఐక్యత, విశ్వాసిలో పరిశుద్ధతను పెంపొందించడానికి పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తాడు, దేవుని ప్రణాళికలో యూదా ప్రజలు, భవిష్యత్ సంఘటనలు, క్రైస్తవ జీవనం, నీతి గురించి అతడు ఈ పత్రికలో చర్చించగలిగాడు. పౌలు రోమా పత్రికను క్రమబద్ధమైన వేదాంతశాస్త్రంగా రాయలేదు గాని అతడు దీనిలో అనుసరించిన క్రమానుగతమైన వివరణ వేదాంతశాస్త్రాభివృద్ధికి ఒక మూలాధారంగా పరిణమించింది.
రోమాలో ఇండ్లలో సంఘాల పుట్టుక గురించి మనకు తెలియదు. పెంతెకొస్తు సమయంలో యెరూషలేముకు (అపొ.కా.2:10) నడిచిన ‘‘రోమానుండి పరవాసులుగా వచ్చిన’’ ‘‘యూదులు, యూదమత ప్రవిష్ఠులు’’ రోమా సంఘ స్థాపనకు మూలకారణం కావచ్చు. ఈ సందర్శకుల్లో అనేకమంది క్రైస్తవులుగా మారారు (అపొ.కా. 2:41). వీరిలో కొంత మంది రోమా నగరం నుండి వచ్చి ఉండవచ్చు. యూదులందరూ నగరాన్ని విడిచి వెళ్ళాలని రోమా చక్రవర్తి క్లౌదియ ఆజ్ఞ జారీ చేసినప్పుడు (క్రీ.శ 49 సం.) రోమా నగరాన్ని విడిచి వచ్చిన అకుల, ప్రిస్కిల్లల గురించి అపొ.కా.18:2 లో లూకా ప్రస్తావించాడు. ‘‘క్రిస్టస్’’ (క్రీస్తు) గురించి యూదుల మధ్య చెలరేగిన కలహం కారణంగా ఈ వలస చోటుచేసుకుంది. రోమా నగరంలో మిగిలి ఉన్న క్రైస్తవులంతా అన్యజనుల నేపథ్యం కలిగి ఉన్నవారే. రోమాలోని యూదులు, అన్యజనుల మధ్య ఉద్రిక్తతలు దీర్ఘమైన చరిత్రను కలిగి ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు ఏదో ఒక రూపంలో ఈ పత్రిక అంతటిలో, మరి ముఖ్యంగా 2,11,14-15 అధ్యాయాల్లో ప్రతిబింబించాయి.
ఈ పత్రిక గమ్యం ప్రధానంగా రోమా నగరం. అయితే కొన్ని వ్రాతప్రతుల్లో ‘‘రోమాలో ఉన్న’’ (1:7) అనే మాటలు లేకపోవడం వలన పౌలు ఈ ఉత్తరాన్ని మరికొంతమంది ఇతరులను కూడా ఉద్దేశించి రాశాడనీ, ఈ పత్రిక ప్రతులు ఇతర సంఘాలకు కూడా పంపబడ్డాయనే వాదనకు బలం చేకూరింది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
రోమా పత్రిక రాయడంలో పౌలు ఉద్దేశాన్ని దీనిలో అతడు నేరుగా చెప్పిన కొన్ని వాక్యాల నుండి, అవి సూచించే అంశాలనుండి గుర్తించవచ్చు. రోమాలో ఉన్న విశ్వాసులకు ఆధ్యాత్మిక శక్తిని అందించాలని తాను ఈ ఉత్తరం రాస్తున్నట్టు అతడు నేరుగా పేర్కొన్నాడు (1:11-12; 16:25-26). తాను చేపట్టిన కష్టసాధ్యమైన పని సఫలం అయ్యేలా, తాను వారి దగ్గరకు వచ్చి వారిని కలుసుకోగలిగేలా (15:30-32) ప్రార్థించమని అతడు వారిని కోరాడు. తాను పశ్చిమంగా సువార్త యాత్రకు వెళ్ళడానికి రోమా సంఘాలు సహకరించేలా వారిని ప్రోత్సహించాలని అతడు ఆశించాడు (15:23-29). ఈ ఉత్తరంలోని సంగతులు సంఘములో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన విశ్వాసుల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని వెల్లడి చేస్తున్నాయి. వారు ఐక్యంగా ఉండాలనీ, తమలో చీలికలకు, అబద్ధ బోధలకు దూరంగా ఉండాలని అతడు కోరాడు (16:17-18). అదే సమయంలో క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైన అంశాలేమిటో, కానివేమిటో కూడా ఈ పత్రిక బయలుపరచింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
సువార్త అంటే ఏమిటి? సువార్త అనే మాటకు ‘‘మంచి వార్త’’ అని అర్థం. అది యేసు గురించిన, ఆయన మనకోసం చేసినదాని గురించిన మంచి వార్త. చాలామంది బైబిలు విద్యార్థులు సువార్త గురించిన స్థూల వివరణ 1కొరింథీ 15:3-5 లో కనిపిస్తున్నదని చెబుతారు. రోమా పత్రిక ఆ వివరణలో నిక్షిప్తమైయున్న సువార్తను పా.ని. వాగ్దానాలు, మోషే ధర్మశాస్త్రం, మంచి క్రియల పాత్ర, దేవుడు వరంగా ఇచ్చిన నీతి అనే విషయాల వెలుగులో విశదీకరించింది.
బైబిల్లో మరెక్కడా కనిపించని రీతిలో నీతిమత్వం, నీతిమంతులుగా తీర్చబడడం అనే విషయాలను పౌలు ఈ పత్రికలో అత్యంత లోతుగా, వివరంగా నొక్కి చెప్పాడు. ఆదాముతో మనం కలిగి ఉన్న ఏకత్వంలోనే పాపపు మూలం ఉన్నదని, ఆ మూల పాపం మనకు ఆపాదించబడిరదని దీనిలో చెప్పాడు. విశ్వాసుల్లోనూ, అవిశ్వాసుల్లోనూ పాప వ్యాప్తి, దాని పరిణామాలను కూడా పౌలు వివరించాడు. కొ.ని.లో ప్రాముఖ్యమైన వేదాంత వివరణ కలిగిన మూడు ముఖ్యమైన వాక్యభాగాలు (గ్రీకు భాషలో ఒక్కొక్కటీ సుదీర్ఘమైన ఏకవాక్యం) చూడవచ్చు: యోహాను 1:14లో దేవుడు శరీరధారి అవ్వడం, ఎఫెసీ 1:3-14లో త్రిత్వ దేవుని సంకల్పం, ఆయన మహిమ, రోమా 3:21-26లో నీతిమంతులుగా తీర్చబడడం, విమోచన, ప్రాయశ్చిత్తం. ఒక క్రైస్తవుడు ఈ మూడు వాక్య భాగాలను సరిగా గ్రహించగలిగితే అతడు విశ్వాసం విషయంలో స్థిరమైన పునాది కలిగి ఉన్నట్టు లెక్క.
రోమా 6-8 అధ్యాయాల్లో పౌలు క్రీస్తులో మన ఐక్యత, మనలో పరిశుద్ధాత్మ కార్యం అనే అంశాన్ని గురించి వివరించాడు. రోమా 9-11 అధ్యాయాలు (దేవుని ప్రణాళికలో ఇశ్రాయేలు పాత్ర గురించి) బైబిలును అర్థం చేసుకోడానికి కీలకమైన వాక్యభాగాలు అని చెప్పబడ్డాయి. రోమా 13 అధ్యాయం క్రైస్తవుడు ప్రభుత్వంతో కలిగి ఉన్న సంబంధం, దానిపట్ల అతని బాధ్యతలకు ఒక అద్భుతమైన వివరణనిస్తుంది. రోమా 14-15 అధ్యాయాలు క్రైస్తవులు అంతగా ప్రాధాన్యత లేని విశ్వాస విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు కలిగి ఉండీ, ఒకరితో ఒకరు ఏ విధంగా సంబంధాలు నెరపవచ్చో వివరించాయి.
గ్రంథ నిర్మాణం
కొ.ని.లోని 21 పత్రికల్లో అధిక శాతం పౌలు రాసినవే. నాలుగు సువార్తలు, అపొస్తలుల కార్యములు, ప్రకటన గ్రంథం పత్రికల విభాగానికి చెందినవి కావు. పౌలు రాసిన ఉత్తరాల్లో రోమా పత్రిక అత్యంత సుదీర్ఘమైంది. దీనిలో ఆ కాలపు ఉత్తరంలో ఉండవలసిన ప్రామాణిక అంశాలన్నీ కనిపిస్తాయి: అభివాదం (1:1-7), కృతజ్ఞతలు (1:8-17), ప్రధాన విభాగం (1:18-16:18), వీడ్కోలు (16:19-24). కొందరు పండితులు రోమా పత్రికను ఒక వివరణాత్మక వ్యాసం అని పిలుస్తారు. అయితే దీనిలో ఒక ఉత్తరానికి కావలసిన అంశాలన్నీ ఉండి ఇది ఒక రమ్యమైన సాహితీ కావ్యంగా గోచరిస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”