ఈ గ్రంథంలో ప్రధానమైన ఒక పాత్ర, దావీదుకు, యేసుకు పూర్వీకురాలైన రూతు అనే మోయాబీయురాలి పేరు మీద ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది. న్యాయాధిపతులు గ్రంథంలో అంధకారమయమైన, నిస్పృహతో నిండిన ఇశ్రాయేలు చరిత్రను చదివిన పాఠకులకు రూతు వృత్తాంతం ఎంతో ఊరటనిస్తుంది. ఈ గ్రంథం చిన్నదైనప్పటికీ ఇది దయ, విశ్వాసం, సహనం అనే మాదిరికరమైన లక్షణాలతో సుసంపన్నమై ఉంది. యూదుల పండుగల్లో, ముఖ్యంగా వారముల పండుగ సమయంలో చదవాల్సిన ఐదు గ్రంథపు చుట్టలలో ఇది ఒకటి.
Read More
గ్రంథరచనా కాలం నాటి పరిస్థితులు
రచయిత: తాల్ముద్ ప్రకారం ఈ గ్రంథ రచయిత సమూయేలు. అయితే ఈ గ్రంథంలో మాత్రం రచయిత గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించదు. రూతు గ్రంథాన్ని ఎవరు రాశారో మనం కేవలం ఊహించగలం. దీని మూలరచన గానీ, రచనాకాలాన్ని గానీ దానిలోని అంతర్గత రుజువుల నుండి, అంటే దాని భాష, శైలి, చారిత్రిక జాడలు, అంశాల నుండి రాబట్టవలసిందే. దీని చివరలో ఉన్న వంశావళి, నాటి ప్రాచీన సంప్రదాయాల ప్రస్తావన వెలుగులో చూస్తే ఇది రాజైన దావీదు పరిపాలన (క్రీ.పూ.1011-971) కాలంలో గానీ, ఆ తరవాత గానీ రాసి ఉంటారని భావించవచ్చు. బహుశా చెర తరువాతి కాలంలో అన్యులను ఇశ్రాయేలు వంశావళిలో చేర్చే విషయం చర్చకు వచ్చినప్పుడు ఇది రాసి ఉంటారని అనుకోడానికి కూడా అవకాశం ఉంది.
నేపథ్యం: రూతు గ్రంథానికి నేపథ్యం ‘‘న్యాయాధిపతులు ఏలిన దినములయందు’’ (1:1) అది సామాజికంగా, మతసంబంధంగా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ‘‘ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు’’ (న్యాయాధి 17:6) వచ్చిన కాలం. చారిత్రికంగా ఈ గ్రంథం యెహోషువ నాయకత్వంలో కనానును స్వాధీనం చేసుకున్న కాలానికీ, ఈ గ్రంథం ముగింపులో ఉన్న దావీదు వంశావళిలో కనిపించే రాజైన దావీదు పాలన కాలానికీ మధ్య వారధిలా ఉంది. న్యాయాధిపతులు కాలంలో సరిగ్గా ఏ సమయంలో ఇది జరిగిందో స్పష్టంగా లేదు కానీ ఇశ్రాయేలు చేసిన విగ్రహారాధన కారణంగా సంభవించిన ఒక కరవు తో ఈ గ్రంథం ప్రారంభమైంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
కృప: తాను, తన భర్త ఆహారం కోసం వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి సంతానం కోసం (1:21) తమ కుమారులకు మోయాబు యువతులతో వివాహం జరిగించిన దానిని బట్టి దేవుని తీర్పు తన పైకి వచ్చిందని నయోమి భావించింది. ఆమె దేవుని కృపను తక్కువగా అంచనా వేసింది. దేవుడు ఆమెకు ఆహారాన్నీ, ఆమె వంశం పేరును కొనసాగించడానికి కావలసిన సంతానాన్నీ అందించడానికి ఆమె కోడలైన రూతు అనే మోయాబీయురాలిని సాధనంగా వాడుకున్నాడు. రూతు గోదుమ పరిగెలు ఏరుకోడానికి కాకతాళీయంగా ఎంచుకున్న పొలం నయోమి, రూతుల విషయంలో కుటుంబ విమోచకుడుగా పాత్ర వహించిన బోయజు అనే వ్యక్తిని కలుసుకోడానికి దోహదం చేసింది.
రూతు గ్రంథం రెండు విధాలుగా తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని పోలి ఉంది (లూకా 15:11-32). యెహోవా తన ప్రజలను దీవిస్తానని వాగ్దానం చేసిన దేశం నుండి ఎలీమెలెకు కుటుంబం సమృద్ధిని వెదుకుతూ పరాయి దేశానికి వెళ్ళిపోయింది. దాని ఫలితంగా నయోమి రిక్తహస్తాలతో, ఒంటరిగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఆమెపైకి వచ్చిన దేవుని తీర్పు ఆమెను తిరిగి తన స్వదేశానికి తీసుకువచ్చి ఆమెలోని శూన్యాన్ని ఒక కొత్త సమృద్ధితో నింపడం కోసం నిర్దేశించబడిరది. అదే విధంగా రూతు గ్రంథం దేవుని ప్రజలు న్యాయాధిపతుల కాలంలో అనుభవించిన శ్రమలతో, వారి సార్వత్రిక అవిధేయత కారణంగా గొప్ప కరువు రావడంతో ప్రారంభమైంది. అయినప్పటికీ దేవుడు ఆకలితో ఉన్న తన ప్రజలకు ఆహారాన్ని, నాయకుడుగా వారిని నడిపించడానికి ఒక రాజును అనుగ్రహించాడు. దీనిలో ఆధునిక పాఠకులమైన మనకు అన్వయించే పాఠాలు సహితం ఉన్నాయి. మనం కూడా దేవునినుండి దూరమైపోయి ఆయన కృప, కనికరాలు పొందవలసిన అవసరతలో ఉన్నాం.
దేవుని ఏర్పాటు: దేవుడు ఈ వృత్తాంతం ద్వారా తన ప్రజలకు అవసరమైన ఒక రాజును వారికి అనుగ్రహించడానికి కార్యం జరిగించాడని ఈ గ్రంథం ముగింపులో కనిపించే దావీదు వంశావళి వెల్లడి చేస్తున్నది. దీనిలో దేవుని కార్యాచరణ ఎక్కువ భాగం మరుగై ఉన్నప్పటికీ రెండు ప్రత్యేకమైన సంఘటనలు నేరుగా ఆయనకు ఆపాదించబడ్డాయి – తన ప్రజలకు ఆహారం అనుగ్రహించడం (1:6), రూతుకు గర్భఫలం దయచేయడం (4:13). ఈ మార్గాల ద్వారా దేవుడు తన ప్రజలందరి అవసరాలు తీర్చాడు.
విశ్వసనీయమైన ప్రేమ: రూతు గ్రంథం అర్హతలేని తన ప్రజలపై దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఏ విధంగా తన నిబంధనా నమ్మకత్వాన్ని తరచుగా కనపరుస్తాడో వెల్లడి చేస్తుంది. ఈ వృత్తాంతం అంతటిలో ప్రధాన పాత్రలైన ప్రతి ఒక్కరూ అసాధారణమైన ధైర్యం, నిబంధనా ప్రేమ (హెబ్రీ. ఖెసెద్, ‘‘ప్రేమపూర్వక దయ, నమ్మకత్వం, విశ్వాసపాత్రత’’ అనే ఈ గ్రంథంలో కీలకమైన పదము 1:8, 2:20, 3:10) కలిగినవారుగా రుజువు చేసుకున్నారు. వీరు తమ ఆధ్యాత్మిక నిబద్ధతను తమ భక్తి జీవితంలో బహు స్పష్టంగా వెల్లడి చేసిన ప్రజలు.
కుటుంబ విమోచకుడు: రూతు గ్రంథంలో యూదా ధర్మశాస్త్రం ప్రకారం విమోచించడానికి తన అధికారాన్ని వినియోగించిన ఒక కుటుంబ సభ్యుని గురించిన గొప్ప ఉదాహరణ మనకు కనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు విధవరాలైన అతని భార్యను పెళ్ళి చేసుకోవడం అనే కుటుంబ సభ్యుని బాధ్యతను బోయజు నెరవేర్చి చూపించాడు. బోయజు రూతును విమోచించడాన్ని కొన్నిసార్లు క్రీస్తు పాపులను విమోచించడంతో పోల్చి చెప్తారు. దేవుడు తన నిబంధనా నమ్మకత్వాన్ని బట్టి మనందరికీ అవసరమైన విమోచకుణ్ణి యేసు క్రీస్తులో అనుగ్రహించాడు. దావీదు వంశం కొనసాగి అంతిమంగా చేరుకొనే నిజమైన రాజు యేసే (మత్తయి 1:5-6). అటూ ఇటూ తిరుగులాడుతున్న తన ప్రజలకు విశ్రాంతిని అనుగ్రహించే విమోచకుడు ఆయనే. ఆయనలోనే అన్యజాతులు సహితం విశ్వాసం ద్వారా దేవుని ప్రజలలో ఐక్యం చేయబడి వాగ్దాన కుటుంబంలో స్థానం సంపాదించారు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
తన అత్త నయోమి పట్లా, ఆమె దేవుని పట్లా రూతు చూపిన నిబంధనా నమ్మకత్వం జాతిపరంగా ఇశ్రాయేలీయులు కాకపోయినా ఎవరైనా విశ్వాసం ద్వారా దేవుని ప్రజలో చేర్చబడవచ్చు అనే విషయంలో ఒక నమూనాగా నిలిచింది. మోయాబీయులు తమకు తాముగా వచ్చి యెహోవా దేవుణ్ణి చేరగలిగితే ఇంకా మిగిలిన ఇతర అన్యజాతుల ప్రజలకు కూడా నిరీక్షణ ఉన్నట్టే (యెషయా 56:3-7). మోయాబీయ మూలాలు కలిగిన దావీదు రాజవంశం యొక్క చట్టబద్ధతపై రేకెత్తిన ప్రశ్నలకు ఈ గ్రంథం సమర్ధవంతంగా జవాబునిచ్చింది.
గ్రంథ నిర్మాణం
రూతు గ్రంథం ఒక విపత్తునుండి మరొక క్లిష్టమైన పరిస్థితికి, దానినుండి ఒక పరిష్కారానికి నడిపించే ఒక ఉత్తమమైన కథనంతో కూడిన ఒక రమ్యమైన గాథ. దీని వ్యాఖ్యాత దీనిని చదివేవారిని ఆయా పాత్రల (వరుసగా నయోమి, రూతు, బోయజు) మనసుల్లోకి నడిపించి వారి వ్యక్తిగతమైన చింతలు, ఆనందాలతో మనల్ని మనం అన్వయించుకొనేలా చేస్తాడు. అంతిమంగా ఒక శూన్యత, కృంగుదల లోనుండి సార్థకత, ఆనందంలోకి పయనించడం అనే వేడుకలోకి మనల్ని నడిపిస్తాడు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”