జెకర్యా ప్రవచనం నిరాశ చెంది ఉన్న ఒక ఇశ్రాయేలీయుల సమూహానికి ప్రకటించబడిరది. దేవుడు ఎన్నుకున్న ప్రజలకు అది ఒక నూతన దినం అని అతడు ప్రకటించాడు. చెరనుండి తిరిగి వచ్చినవారిని దేవాలయాన్ని తిరిగి నిర్మించి, తమ జీవితాలను యెహోవాకు పునరంకితం చేసుకోమని ప్రేరేపించడానికి అతడు ప్రయత్నించాడు. అతని ప్రోత్సాహక సందేశం నమ్మశక్యం కాని దర్శనాలు, ఉజ్వలమైన కవితాచిత్రాలతో నిండి, దేవుని తీర్పును వెనక్కి మళ్ళించడం మీద దృష్టి సారించి, ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని పిలుపునిచ్చింది.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: చెరనుండి ముందటిసారి యూదాకు తిరిగి వచ్చిన వారిలో జెకర్యా ఒకడు. బహుశా అతడు ఒక యాజకుడై ఉండవచ్చు (నెహెమ్యా 12:16). అతడు హగ్గయి సమకాలికుడు. వీరిద్దరి మధ్య సహకార సంబంధాలు ఉన్న సంగతి గురించి ఏమీ తెలియదు కానీ, వారిద్దరి పరిచర్యా ఒక్కటే. దేవాలయ పునర్నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంలో ఈ ఇద్దరి పాత్రా ఉంది (ఎజ్రా 5:1-2, 6:14). తన ప్రవచన పరిచర్యలో రెండు కాలాలకు సంబంధించిన తేదీలను జెకర్యా పేర్కొన్నాడు (క్రీ.పూ.520, 518, జెకర్యా 1:1,7, 7:1). ఈ గ్రంథం అంతా అతడే రాశాడా అన్నది చర్చనీయాంశమే. దీనిలోని 1-8 అధ్యా., 9-14 అధ్యాయాల మధ్య ఉన్న వ్యత్యాసాలను బట్టి చాలామంది పండితులు చివరి ఆరు అధ్యాయాలు జెకర్యా రాయలేదు అని నిర్ధారించారు. అయితే ఇది అంత తీవ్రమైన అంశమేమీ కాదు. బైబిలు కాలంలో గ్రంథకర్తృత్వం అనేది ఆధునిక ప్రమాణాలకు భిన్నంగా ఉండేది. పా.ని.లో ఒకే రచయిత పేరుమీద ఉన్న గ్రంథంలో కొన్ని భాగాలు వాస్తవానికి అతడు రాసి ఉండకపోవడం అనేదానికి రుజువులు ఉన్నాయి (సంఖ్యా 12:3, ద్వితీ 34:5-12, యిర్మీయా 51-64).
నేపథ్యం: పర్షియా రాజైన కోరెషు చెరలోనున్నవారు పాలస్తీనాకు తిరిగి వెళ్ళడానికి అనుమతి నివ్వడం ఇశ్రాయేలు చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది (క్రీ.పూ.538). ఎన్నుకోబడిన ఆ ప్రజలు ప్రాచీన ప్రపంచంలోకెల్లా అత్యంత హీనమైన ఒక అనుభవం గుండా వచ్చారు. వారి స్వదేశం తమపైకి దండెత్తి వచ్చిన సైన్యాలచేత సర్వనాశనం అయ్యింది. వారి రాజధాని, దేవాలయం దోచుకోబడి కూలదోయబడ్డాయి. అనేకమంది వారి నాయకులు, ప్రజలు చంపబడ్డారు. మిగిలినవారిలో అధికులు అనాగరిక పరాయి దేశాలకు బందీలుగా కొనిపోబడ్డారు. సుదీర్ఘమైన ప్రయాణం చేసి యూదాకు తిరిగి వచ్చినవారు యెరూషలేమును, దేవాలయాన్ని తిరిగి నిలబెట్టాలనే గొప్ప సవాలును ఎదుర్కొన్నారు.
ఎజ్రా గ్రంథ వృత్తాంతం ప్రకారం పని వెంటనే ప్రారంభమైంది. బలిపీఠం పునర్నిర్మించి, పునాదులు వేసిన తరవాత సమస్యలు చెలరేగి పని ఆగిపోయింది (ఎజ్రా 3:1-4:24). బలిపీఠం మీద బలులు అర్పించబడుతున్నప్పటికీ దేవాలయం మాత్రం కనీసం రెండు దశాబ్దాలపాటు శిథిలాలుగానే మిగిలిపోయింది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
నిబంధనా సంబంధం: జెకర్యా సందేశం ప్రోత్సాహకరంగాను, సవాలుకరంగాను ఉంది. దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలను బలోపేతం చేస్తుండగా దేవాలయ పునర్నిర్మాణమే కాదు, మరేదీ వారికి అసాధ్యం కాదు. అయితే జెకర్యా ఆసక్తి కేవలం ఇటుకలు, కీలు విషయంలో మాత్రమే కాదు. యెహోవాకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్న నిబంధనే ఇక్కడ ప్రాథమికాంశం. కేవలం దేవాలయం, యెరూషలేము నగరం తిరిగి నిర్మించడంతో దేవుడు సంతృప్తి చెందడు. వారి మధ్య సంబంధం పునరుద్ధరించబడాలని ఆయన కోరుతున్నాడు. వారి పితరులు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించకపోవడం ద్వారా, ఒకరి పట్ల ఒకరు న్యాయంగా వ్యవహరించకపోవడం ద్వారా ధర్మశాస్త్రానికి లోబడడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. దాని ఫలితంగా తన ప్రజలను శిక్షించడానికి దేవుడు వారి పొరుగు రాజ్యాలకు పిలుపునిచ్చాడు. ఇప్పుడు తిరిగి వచ్చినవారు ఆ కఠినమైన పాఠాన్ని నేర్చుకున్నారా, ఇకనైనా ధర్మశాస్త్ర నియమాలను పాటించడంలో మరింత శ్రద్ధ వహిస్తారా అన్నదే ప్రశ్న.
విమర్శించడం, బలోపేతం చేయడం: జెకర్యా సందేశంలో తీవ్రమైన షరతులున్నాయి. ఇశ్రాయేలు భవిష్యత్తుకు ఉన్న ఏకైక నిరీక్షణ చెరనుండి బయటకు వచ్చిన ఈ శేషమే. వారి గత తరాల ప్రజల అనుభవాల జాడలను బట్టి చూస్తే దేవుని ప్రజల మొద్దుబారిన భుజాలు, మూసిన కన్నులు, రాయిలా బండబారిన హృదయాలను చొచ్చుకుపోవాలంటే అత్యంత కఠినమైన భాషను వాడడం తప్పనిసరి (7:11-12).
జెకర్యా ఎంచుకొన్న విధానం ఏమంటే, ఇశ్రాయేలీయుల ఆలోచనా విధానంలో పాతుకుపోయిన వారి విశ్వ దృక్పథాన్ని విమర్శిస్తూనే ఒక సంపూర్ణమైన నూతన వాస్తవికతలోకి వారిని తేవడం ద్వారా బలోపేతం చేయడం. దీనికి అవసరమైన అదనపు వత్తిడిని అందించడానికి ఈ గ్రంథంలోని కవితా శైలి శక్తివంతంగా దోహదం చేసింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
జెకర్యా గ్రంథం అంతా తీర్పుసంబంధమైన భాషతో నిండి ఉంది. అదే సమయంలో అది దేవుని వాగ్దానాలతో కూడా నిండి ఉంది. వారి శక్తికి మించిన క్లిష్టమైన కార్యాన్ని చేయమని యెహోవా వారికి సవాలు విసిరి, తన శక్తి ద్వారా వారు విజయం సాధించగలరని వారికి భరోసా ఇచ్చాడు. కానీ వాటి మౌలిక స్వభావంలో ఈ వాగ్దానాలు దేవాలయ పునర్నిర్మాణాన్ని దాటి మరింత ముందుకు సాగాయి. బైబిలు ప్రారంభం నుండీ చివరి వరకూ చెడుపై దేవుని విజయం, పాపులకు రక్షణతో అంతమయ్యే దేవుని విమోచనా ప్రణాళికా గాథను వివరించింది. చరిత్రకు ఈ గంభీరమైన పరిసమాప్తి కోసం ఎదురుచూపులు చూస్తూ, రాబోతున్న ఒక మహిమాన్వితమైన రాజును వర్ణిస్తూ, సమస్తం మీదా విజయం సాధించి, సమస్త తప్పిదాలూ సరిచేయబడిన ఒక లోకాన్ని స్వాధీనం చేసుకొనే దేవుని గురించి జెకర్యా ప్రవచించాడు. కొ.ని. లో జెకర్యా గురించిన
ఉదాహరణలు, సూచనలు రుజువుపరచినట్లుగా ఈ వాగ్దానాలు దేవుని భావికాలపు రాజ్యానికి ఒక వేదికను సిద్ధపరిచాయి.
గ్రంథ నిర్మాణం
జెకర్యా గ్రంథం సంక్లిష్టమైంది. అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని ఫోటోలు తీసి వాటిని మళ్ళీ ఒక్కొక్కటి వరుసగా పేర్చుకోవలసిన అవసరం ఉన్నట్టుగా దీనిలోని భాగాలు ఒకదానికొకటి అతకని విధంగా ఉంటాయి. ఈ విధంగా సరైన కూర్పు లేని విధానం అది ప్రారంభంలో మౌఖికంగా చెప్పబడిన పద్ధతిని సూచిస్తుంది. వివిధ రకాల సందేశాలను సమకూర్చి వాటిని గ్రంథరూపంలోకి తీసుకు వచ్చినట్టు ఉంది. అయితే అది
ఉద్దేశపూర్వకంగానే ఆ విధంగా చేసినదై ఉండవచ్చు. పాఠకులను నిర్ఘాంతపోయేలా చేసి వారిని ఏకాగ్రతలోకి తేవడం కోసం ఒక అంశం నుండి మరొక అంశానికి త్వరితంగా అటూ ఇటూ మారడం జెకర్యా పాటించిన పద్ధతిలో భాగం కావచ్చు. 1-8 అధ్యాయాల్లోని దర్శనాలను, సందేశాలను జాగ్రత్తగా తేదీలతో సహా పేర్కొంటే, 9-14 అధ్యాయాల్లో పూర్తిగా తీర్పు, దీవెనల గురించి వివరణాత్మక వర్ణనలు, తేదీలు లేని కవితాత్మకమైన దేవోక్తులు కనిపిస్తాయి. జెకర్యా వివిధ రకాల సాహిత్య రీతులను కలిపి వాడాడు. అతని సందేశాలు, సాహిత్యం, తీర్పు గురించీ, రక్షణ గురించీ పలికిన దేవోక్తులు ప్రవచన రీతికి చెందినవి. కాని అతని దర్శనాలు మాత్రం అంత్యదినాల ప్రత్యక్షతా సాహిత్యాన్ని పోలి పా.ని.లో దానియేలు గ్రంథ సాహిత్యానికి దగ్గరగా ఉంది. దైవిక ప్రమేయం గురించీ, సంపూర్ణమైన వేరే లోకం గురించీ వర్ణిస్తూ అతడు పలికిన దేవోక్తులు కొన్నిటిలోని విషయం కూడా ప్రత్యక్షతా సాహిత్యాన్ని పోలి ఉంది. కాబట్టి, ప్రవచన సాహితీ శైలికీ, ప్రత్యక్షతా సాహితీ శైలికీ మధ్య అభివృద్ధి దశకు జెకర్యా ఒక ప్రతినిధిగా ఉన్నాడని చెప్పవచ్చు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”