Telugu Study Bible
Ezra
ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు వాటిలోని ప్రధానపాత్రలు పోషించిన వ్యక్తుల పేర్లనే తమ శీర్షికలుగా కలిగి ఉన్నాయి. క్రీ.శ. మూడవ శతాబ్దం వరకు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు రెండూ కలిసి ఒకే గ్రంథంగా ఉండేవి. ఒక గ్రంథంలో ఉన్న సమాచారం రెండోదానిలో కూడా ఉంటూ అవి రెండూ ఒకదానిని ఒకటి సంపూర్తి చేసుకొనేవి. ఓరిగెన్ వెంబడి జెరోము చేసిన బైబిలు లాటిన్ అనువాదమైన వల్గేట్ ప్రభావంతో ఆ ఒకే గ్రంథాన్ని క్రైస్తవ సమాజం ఎజ్రా, నెహెమ్యా అనే రెండు వేరు వేరు గ్రంథాలుగా విభజించింది. అదే యూదా సమాజంలో అయితే పదిహేనో శతాబ్దంలో హెబ్రీ బైబిలు ముద్రణలోకి వచ్చే వరకు అవి రెండు గ్రంథాలుగా వేరు చేయబడలేదు. హెబ్రీ బైబిల్లో ఎజ్రా-నెహెమ్యా గ్రంథం కేనన్లో మూడవ విభాగంలో ఉపభాగంగా ఉండేది. దీనినే వ్రాతలు (హెబ్రీ. కెటువిమ్) అని పిలిచేవారు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఎజ్రా-నెహెమ్యా గ్రంథాల రచయితలు ఎవరో తెలియదు. ప్రాచీన యూదా వర్గాల సమాచారం ప్రకారం వీటి గ్రంథకర్తృత్వాన్ని ఎజ్రాకు ఆపాదించారు. 1,2 దినవృత్తాంతాల గ్రంథాలు రాసిన వ్యక్తి దీనిని కూడా రాసి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు వాటి ఉపోద్ధాతంలో దినవృత్తాంత గ్రంథాల కొనసాగింపులాగా కనిపిస్తాయి (ఎజ్రా 1:1-2Ñ 2దిన 36:22,23). వాటి భాష, పదజాలం, అంశాలు, దృక్పథాలలో కూడా వాటిమధ్య పోలికలు కనిపిస్తాయి.
నేపథ్యం: ఎజ్రా-నెహెమ్యా గ్రంథం నెహెమ్యా పరిచర్య ముగిసిన వెంటనే రాయబడినట్టు భావించడం సమంజసం. ఇది సుమారుగా క్రీ.పూ.400 కి ముందే రాసి ఉండవచ్చనిపిస్తుంది. ఈ గ్రంథం ప్రకారం ఎజ్రా క్రీ.పూ.458లో, అంటే క్రీ.పూ. 445లో వచ్చిన నెహెమ్యాకంటే 13 సంవత్సరాలు ముందే యెరూషలేముకు వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఎజ్రా గురించీ, అతని పరిచర్య, అతని సంస్కరణలను గురించీ నెహెమ్యా ఏమీ ప్రస్తావన చేయలేదు. ఎజ్రా, నెహెమ్యాలు ఇద్దరూ కలిసి కేవలం రెండు వచనాల్లో కలిసి ప్రస్తావించబడ్డారు (నెహెమ్యా 8:9Ñ 12:36). ఇద్దరూ కలిసి ఉన్న ఈ రెండు సంఘటనలు బహు ప్రాముఖ్యమైనవి. నెహెమ్యా 8 అధ్యా.లోని సందర్భం ప్రజలకు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించడమైతే, నెహెమ్యా 12 అధ్యా.లో యెరూషలేము నగర ప్రాకారాన్ని ప్రతిష్టించే సమయంలో దాని చుట్టూ నడిచే ఆనందకరమైన సంఘటనల్లో ఎజ్రా (నెహెమ్యా 12:36), నెహెమ్యా (నెహెమ్యా 12:38)లు ఇద్దరూ కనిపిస్తారు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
2దిన వృత్తాంతాలు గ్రంథం ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి ఎజ్రా కొనసాగించింది. అత్యంత కీలకమైన చారిత్రక సమాచారం అందించడంతో బాటు ఈ గ్రంథంలో దేవుని ప్రజలకోసం సమృద్ధిjైున సందేశాలను మనం చూడగలం.
దేవుని ప్రజల ఉనికి కొనసాగింపు: ఎజ్రా-నెహెమ్యా గ్రంథంలోని సంఘటనలు ఇశ్రాయేలీయుల్ని చెరకు ముందటి సమాజంతో కలుపుతాయి. చెరనుండి తిరిగి వచ్చే వారికి అది ఒక నిర్గమన అనుభవం. తద్వారా వారు దేవుని విమోచనా ప్రణాళికలో ఇంకా నిలిచే ఉన్నారు. దేవుడు అన్యజాతి నాయకులైన కోరెషు, అర్తహషస్తలను కూడా తన ప్రజల పునరుద్ధరణ కోసం వాడుకున్నాడు.
పరిశుద్ధత: ప్రజలు దేవునితో నిబంధనా సంబంధంలో కొనసాగాలంటే వారు వేరుపడి, సిద్ధాంతాలు, నైతికత్వం, సంప్రదాయాల విషయంలో పవిత్రంగా నిలిచి ఉండాలి. చెరకు ముందు తమ నిబంధనా దేవునితో సంబంధంలో నమ్మకంగా, ఏకమనస్సుతో నిలిచి ఉండడంలో విఫలం చెందడం వలన ఆయన తీర్పుకు లోనయ్యారు. వారు దేవుని కోసం ప్రత్యేకించుకోవాలన్న ఆసక్తి వారిలో నూతనపరచబడినట్టు ఎజ్రా-నెహెమ్యా గ్రంథం పేర్కొన్నది.
లేఖనం: ఇశ్రాయేలు సమాజ జీవనానికీ, వారి కార్యకలాపాలకూ ధర్మశాస్త్రమే కేంద్రకం అని ఎజ్రా, నెహెమ్యాలు పునరుద్ఘాటించారు. ఇశ్రాయేలీయులకు లేఖనాల అధికారం గురించి తెలుసు గాని వాటి బోధలను నిర్లక్ష్యం చేసిన పరిస్థితి నుండి వెనక్కి రమ్మని వారికి పిలుపు ఇవ్వబడిరది. ప్రజలు మోషే రాసిన ధర్మశాస్త్రానుసారం పనిచేసి, వ్యవహరించిన అనేక సందర్భాలను ఈ గ్రంథంలో ఉదహరించారు (ఎజ్రా 3:2, 6:18, నెహెమ్యా 8:14-15, 13:1-3). గ్రంథరూపంలోని తన వాక్కు ద్వారా పని చేస్తున్న దేవుని శక్తికి ఎజ్రా, నెహెమ్యాలు అతి శ్రేష్ఠమైన ఉదాహరణలుగా నిలుస్తాయి.
ఆరాధన: చెరనుండి తిరిగి వచ్చినవారు దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ముందు దేవునికి బలులు అర్పించడానికి ఒక బలిపీఠాన్ని నిర్మించారు. ఆరాధనా స్థలం పూర్తి అయిన తరువాత మాత్రమే వారు గోడల నిర్మాణం ప్రారంభించారు. దేవుని ఆరాధన, ఆయనతో సరైన సంబంధం అన్నిటికంటే ముందుంచడం వలన వారు చేసిన పనులన్నీ సక్రమంగా కొనసాగాయి.
ప్రార్థన: ఆరాధనతోబాటు ఈ గ్రంథాల్లో ప్రార్థన సమృద్ధిగా నిండి ఉంది. రెండు సుదీర్ఘమైన ప్రార్థనలు దీనిలో గ్రంథస్థం చేయబడ్డాయి (ఎజ్రా 9, నెహెమ్యా 9). వారు ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన, ఉపవాసాలు జరిపినట్లు పదే పదే కనిపిస్తాయి. ప్రాకార పునర్నిర్మాణం అంతా ప్రార్థనతో ఆవరించబడిరది. నెహెమ్యా గ్రంథమంతటిలోని కార్యాచరణ పూర్తిగా ప్రార్థనతో ముడిపడి ఉంది. ప్రార్థనలో దేవుణ్ణి సమీపించాల్సిన అవసరతను రెండు గ్రంథాలూ గట్టిగా నొక్కి చెప్పాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో జరిగిన సంఘటనలు దేవాలయ పునర్నిర్మాణం, యెరూషలేము నగర స్థిరీకరణ, యూదు సమాజం అభివృద్ధి చెందడం ఇవన్నీ సువార్తల్లో రాయబడిన క్రీస్తు జీవితం, పరిచర్యల్లో కీలకమైన పాత్రలు పోషించాయి. తిరిగి నిర్మించబడిన దేవాలయం సొలొమోను దేవాలయంతో పోలిస్తే తక్కువస్థాయిలో ఉన్నప్పటికీ అది కొన్ని శతాబ్దాల తరువాత క్రీస్తు వచ్చి అసలు ఒక భౌతిక దేవాలయ కట్టడం యొక్క అవసరాన్నే తొలగించే వరకు యూదుల అవసరం తీర్చింది.
గ్రంథ నిర్మాణం
ఎజ్రా-నెహెమ్యా హెబ్రీ, అరమేయిక్ అనే దగ్గర సంబంధం కలిగిన, పూర్తిగా వేరైన రెండు భాషల్లో రాయబడిరది. దీనిలోని హెబ్రీ భాగాలు సాధారణంగా అక్కడక్కడా అరమేయిక్ భాష ప్రభావం కనిపిస్తూ చెరకు ముందు కాలం నాటి శైలిని ప్రతిబింబిస్తుంటాయి. హెబ్రీ భాషలాగానే కనిపించే మరొక సెమెటిక్ భాష అయిన అరమేయిక్ ఎజ్రా గ్రంథంలో రెండు భాగాల్లో కనిపిస్తుంది (4:8-6:18, 7:12-26). పర్షియనుల పాలనాకాలంలో (క్రీ.పూ. రమారమి 540 నుండి క్రీ.పూ. 330) వారి పరిపాలన, వాణిజ్య విభాగాల్లో అరమేయిక్ అధికారిక భాషగా ఉంది. ఎజ్రా-నెహెమ్యా గ్రంథ కూర్పులో సమూయేలు, రాజులు గ్రంథాలు, మరి ముఖ్యంగా దినవృత్తాంతాలు గ్రంథాలను పోలి ఉండి వాటిలోని మూల సమాచారాన్ని వాడుకున్నది. వీటిలో రెండు రకాల ప్రధానమైన ఆధారాలు ఉన్నాయి. ఎజ్రా-నెహెమ్యా గ్రంథంలోని సమాచారంలో అధికభాగం ఎజ్రా జ్ఞాపకాల వృత్తాంతం, నెహెమ్యా జ్ఞాపకాల వృత్తాంతం నుండి సంగ్రహించబడిరది. ఎజ్రా జ్ఞాపకాల వృత్తాంతం ఎక్కువగా ప్రధమ పురుషలో రాయబడి ఎజ్రా 7-10, నెహెమ్యా 8, బహుశా 9 అధ్యాయాన్ని కూడా కలిగి ఉంది. ఈ జ్ఞాపకాల వృత్తాంతంలో ఎజ్రా ఇతర మూలాలనుండి సేకరించిన జాబితాలు, పట్టికలు ఇమిడి ఉన్నాయి. నెహెమ్యా జ్ఞాపకాల వృత్తాంతంలో అయితే నెహెమ్యా 1-7,11-13 అధ్యాయాలున్నాయి. వీటిలో కూడా నెహెమ్యా జాబితాలను, పట్టికలను కూర్చాడు. ఎజ్రా-నెహెమ్యా గ్రంథం అంతటిలో ఇంకా అనేక జాబితాలు, వంశావళులు, వస్తువుల పట్టికలు, ఉత్తరాలు, జనాభా లెక్కలు కనిపిస్తాయి. క్రీ.పూ.586 లో జరిగిన విధ్వంసం, దానిననునరించి బబులోను చెరలోకి వెళ్ళిన తరువాత తమను తాము పునర్వ్యవస్థీకృతం చేసుకుంటున్న ఒక సమాజానికి తమ జీవనాన్ని గ్రంథస్థం చేయడంలో ఈ సమాచారం చాలా ప్రాముఖ్యమైంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”
2 Chronicles
1 దినవృత్తాంతములు గ్రంథ పరిచయం చూడండి.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”
1 Chronicles
హెబ్రీ భాషలో దినవృత్తాంతములు అనే మాటకు జరుగుతున్న చరిత్ర అనే అర్థమిస్తుంది. అంటే అది ఒక దినపత్రిక, ఒక డైరీ, లేక ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల జాబితాను నమోదు చేయడంలాంటిది. ఈ రెండు గ్రంథాలు ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలతో కూడిన ఒక నాలుగు గ్రంథాల పరంపరలో మొదటి మరియు రెండవ భాగాలు. ఈ నాలుగు గ్రంథాలు కలిసి ఆదాము కాలం నుండి దేవుని మందిరాన్ని, యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేదాకా జరిగిన ఇశ్రాయేలు యాజక పరిచర్య చరిత్రను మనకు తెలియజేస్తున్నాయి. ఒక సమయంలో దినవృత్తాంతములు అనేది బహుశా ఒకే గ్రంథపు చుట్ట అయి ఉంటుంది. ఆ తరవాత అది పాత నిబంధనను గ్రీకులోకి అనువదించిన (సెప్టువజింట్) వారిద్వారా మరింత సౌకర్యంగా ఉండడం కోసం విభజించబడింది.
Read More
గ్రంథ రచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: ఒక ప్రాచీన సాంప్రదాయం ప్రకారం దినవృత్తాంతాలు గ్రంథకర్తృత్వం ఎజ్రాకు ఆపాదించబడిరది. రచయిత బబులోను చెరనుండి ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తరవాత జీవించినవాడై ఉండాలి. అతనికి ధర్మశాస్త్రాన్ని, దేవాలయ నియమనిబంధనలను తిరిగి అమలులోకి తేవాలనే తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండడమే కాక చారిత్రక దస్తావేజులతో అతడు పరిచయం, ప్రవేశం కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఎజ్రాలో కనిపిస్తున్నాయి. ఈ గుర్తింపు దినవృత్తాంతాల్లోని చివరి వచనాలే ఎజ్రా గ్రంథంలోని ప్రారంభ వచనాలు అనే వాస్తవంతో రూఢపిరచబడిరది. ఏదేమైనా ఈ గ్రంథంలో దాని రచయిత ఎజ్రా అని నేరుగా పేర్కొనకపోవడం బట్టి ఈ నోట్సులో మనం అతనిని ‘‘వృత్తాంతకారుడు’’ అని ప్రస్తావిస్తాం.
నేపథ్యం: 1,2 దినవృత్తాంతాలు గ్రంథాలలో ఆదాము కాలం మొదలుకొని యూదు ప్రజలు చెరలోకి వెళ్ళిన సమయం, చెరనుండి తిరిగి వచ్చిన సమయం వరకు ఉన్న వివిధ వంశావళులు విస్తారంగా కనిపిస్తాయి. 1దినవృత్తాంతాలు గ్రంథం మనకు వంశావళులు అందిస్తూ రాజైన దావీదు పరిపాలన వివరాలపై దృష్టి నిలిపింది. 2దినవృత్తాంతాలు దావీదు తరువాత నుండి యూదులు చెరలోకి వెళ్ళేటంతవరకు పరిపాలించిన రాజుల గురించీ, ఇశ్రాయేలు జాతి పునరుద్ధరణ గురించీ వివరిస్తుంది. 1,2 రాజులు చరిత్ర ఏ కాలంలో జరిగిందో ఆ కాలపు చరిత్రనే 2దినవృత్తాంతాలు గ్రంథం కూడా వివరించింది. అయితే ఈ గ్రంథం ప్రత్యేకంగా యూదా రాజులపైనే తన దృష్టి నిలిపింది. ఈ గ్రంథాల్లోని సమాచారం ప్రకారం ఇవి చెరనుండి తిరిగి వచ్చిన కొద్దికాలానికి, బహుశా క్రీ.పూ. 5వ శతాబ్దం మధ్యలో రాయబడి ఉంటాయి.
గ్రంథ సందేశం, ఉద్దేశం
చెరనుండి తిరిగివచ్చి యెరూషలేములో స్థిరపడిన తరువాత ప్రజలు తాము దేవుని ప్రజలమనే గుర్తింపును తిరిగి సంపాదించుకోవలసిన అవసరత ఏర్పడిరది. దినవృత్తాంతాలు గ్రంథాలు వారికి తమ వారసత్వాన్ని గుర్తు చేస్తూ, దేవాలయం దేనికైతే సూచనగా వారి మధ్య ఉన్నదో ఆ దేవుని సన్నిధికి వారిని నడిపించడం ద్వారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాయి. 1,2 దినవృత్తాంతాలు గ్రంథాల్లో ఈ కింది విషయాలు నొక్కి చెప్పబడ్డాయి: (1) గతంలో జీవించిన దేవుని ప్రజలతో నేరుగా ఉన్న సంబంధం, (2) యూదా రాజ్య సింహాసనంపై దావీదు వారసుని కొనసాగింపు, (3) దేవునిపై దృష్టి పెట్టడంలో దేవాలయం, దాని ఆచారాల ప్రాముఖ్యత, (4) దేవుణ్ణి ఆరాధించడంలో సంగీతం యొక్క ప్రాధాన్యత, (5) దేవునికి లోబడినప్పుడు దేవుని ప్రజల అజేయమైన శక్తి, (6) దేవుని ప్రజలు ఆయనకు అవిధేయులైనప్పుడు వారిపైకి తప్పనిసరిగా వచ్చే తీర్పు.
1,2 దినవృత్తాంతాలు గ్రంథాల్లో అనేక కీలకమైన అంశాలు కనిపిస్తాయి. అవి:
చరిత్రపై దేవుని ఆధిపత్యం: ఒక పరిపూర్ణమైన పరిశుద్ధ సంబంధంలో దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కోరుకుంటాడు. దానిలో ఆయన దేవుడుగా, విమోచింపబడిన వారు ఆయన ప్రజలుగా ఉంటారు. ప్రత్యక్ష గుడారం, దేవాలయం ఇట్టి దేవుని కోరికకు సూచనగా నిలిచాయి. అంతిమంగా ఇది దావీదు కుమారుడైన యేసు క్రీస్తులో నెరవేర్చబడిరది. ఆదాము కాలం నుండీ మరి ముఖ్యంగా దావీదు కాలంలో, ఎజ్రా, నెహెమ్యాల ద్వారా పరిశుద్ధతతో తన ప్రజలమధ్య నివసించాలనే తన కోరికను నెరవేర్చుకోడానికి దేవుడు ఏ విధంగా పనిచేస్తూ వచ్చాడో దినవృత్తాంతములు తెలియజేస్తున్నాయి.
దావీదుతో నిబంధన: దేవుడు తన ఇంటిని నిర్మించడానికి దావీదును, అతని వంశాన్ని ఎన్నుకున్నాడు. ఈ వంశంలో చివరి పాలకుడు దావీదు కుమారుడు అని చెప్పబడిన మెస్సీయ. సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని నిర్మించాడు గానీ దేవుని నిజమైన ఇంటిని నిర్మించేదీ, నిర్మిస్తున్నదీ యేసే. శాశ్వతంగా పరిపాలించే వాడు క్రీస్తే. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాక ఆయనలో విశ్వాసముంచి సమస్త దేశాలకూ చెందిన వారంతా ఆయన ప్రజలే.
పరిశుద్ధుడైన దేవుడు సక్రమంగా ఆరాధించబడాలి: దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రానుసారంగానే ప్రజలు పరిశుద్ధతలో నివసించే ఆ దేవుణ్ణి సమీపించాలని ఈ రెండు దినవృత్తాంత గ్రంథములు చూపిస్తున్నాయి. తన ప్రజలను దేవుని సన్నిధికి సమీపస్తులుగా చేయాలని కోరుకున్న దావీదు ఒక సక్రమమైన మార్గంలో దేవుణ్ణి వెదకాలని అని నేర్చుకున్నాడు. లేవీ యాజకవ్యవస్థ పరిచర్య చేసినట్లుగా బలిపీఠంపైన బలుల ద్వారా దేవుని ఆరాధించడం ప్రాముఖ్యమైన విషయం. ఆ బలిపీఠం యెరూషలేములో ఒర్నాను (అంటే అరౌనా) కళ్ళం ఉన్న స్థలంలో ఉండాలి. అక్కడే దావీదు బలిపీఠాన్ని నిలిపాడు, అక్కడే సొలొమోను దేవుని సూచనలను అనుసరించి దేవాలయాన్ని నిర్మించాడు.
దేవుని ఇల్లు: దేవుని ఇంటిని నిర్మించడానికి దేవునితో, ఒకరితో ఒకరు కలిసి పనిచేయాలని దినవృత్తాంతములు గ్రంథాలు దేవుని ప్రజలను ప్రోత్సహించడానికి ప్రయత్నించాయి. యెరూషలేముకు ఎక్కి వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించమని ఈ గ్రంథాలు ప్రజలను సవాలు చేశాయి. తన ప్రజల పట్ల, తన మందిరం పట్ల, దేవుని విశ్వాస్యతా చరిత్రను ఈ గ్రంథాలు ప్రజలకు జ్ఞాపకం చేశాయి. ఈ పిలుపుకు స్పందించి లోబడినవారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
బైబిలులో ఈ గ్రంథం పాత్ర
బైబిలు ప్రత్యక్షతలోని అనేక కోణాలను దినవృత్తాంతములు ఒకచోటకు సమకూర్చాయి. వాటిలో చారిత్రక సంఘటనలు (ఆదికాండం నుండి 2రాజులు వరకు), దేవాలయ ఆచారకాండలు (లేవీకాండంలో సూచించినట్లు), పాపము, తీర్పు (ప్రవక్తల బోధలు), ఇంకా కొన్ని కీర్తనలు సహితం ఉన్నాయి. ప్రజలు ఎంత దుర్మార్గులుగా వ్యవహరించినప్పటికీ తన దగ్గరకు తిరిగి వచ్చేవారిని దేవుడు ఎల్లప్పుడూ అంగీకరిస్తాడని దీనిలో మళ్ళీ మళ్ళీ కనిపించే సూత్రాన్ని బట్టి కొంచెం విచిత్రంగా అనిపించేలా బహుశా ఈ గ్రంథాన్ని ‘‘ఎజ్రా సువార్త’’ అని పిలిచారు. 1,2 దినవృత్తాంతాలు గ్రంథాలు ఆదామునుండి దావీదు నిబంధన వరకు ఇశ్రాయేలు చరిత్ర వెలుగులో పాత నిబంధన చరిత్రయొక్క విశాల చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. మెస్సీయ పరిపాలనలో ఆ నిబంధన శాశ్వత కొనసాగింపును ఈ గ్రంథాలు మనకు చూపిస్తాయి.
గ్రంథ నిర్మాణం
హెబ్రీ బైబిలు దాని గ్రంథాలను మూడు వర్గాలుగా విభజించింది: ధర్మశాస్త్రము, ప్రవక్తలు, చరిత్ర గ్రంథాలు. ఈ ఏర్పాటులో సమూయేలు, రాజులు గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. దినవృత్తాంతాలు చరిత్ర గ్రంథాలు జాబితాకు చెందుతాయి. అంతకు ముందు ఆదికాండంలోని వంశావళులు, సమూయేలు, రాజులు గ్రంథాల్లోని యూదా రాజుల చరిత్రలు గురించిన సమాచారం దినవృత్తాంతములు గ్రంథాల్లో పునరావృతం కావడమే ఇలాంటి విభజనకు కారణం కావచ్చు. అయినప్పటికీ దినవృత్తాంతకారుడు తాను చెప్పదలచుకున్నదానిని సమర్ధించుకోవడం కోసమే ఈ పునరావృత సమాచారాన్ని వాడాలని ఎన్నుకున్నాడు. అంతేకాక దినవృత్తాంతములులో మాత్రమే మనకు కనిపించే మరింత విస్తారమైన సమాచారాన్ని జోడిరచాడు. ఆయా రాజుల గురించిన చర్చను అతడు పూర్తిగా దక్షిణ రాజ్యమైన యూదా రాజులకు మాత్రమే పరిమితం చేశాడు.
TSB Video
2 Kings
ఈ గ్రంథ పరిచయ సమాచారం కోసం 1రాజులు గ్రంథ పరిచయం చూడండి.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”
1 Kings
ఈ గ్రంథాల శీర్షికలు వాటిలోని అంశాలను వివరిస్తున్నాయి: ఇశ్రాయేలు, యూదా రాజులు, రాజ్యాల చరిత్ర. రాజులు మొదటి, రెండవ గ్రంథాలు పాత నిబంధనలో 12 చరిత్ర గ్రంథాల (యెహోషువ -ఎస్తేరు) విభాగంలో ఒక భాగం అని చెప్పవచ్చు. మూలంలో ఈ రెండు గ్రంథాలు ఒక్కటిగానే ఉండేవి. సెప్టువజింట్ (పా.ని. గ్రీకు అనువాదం) అనువాదకులు దీనిని రెండుగా విభజించారు.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
రచయిత: ఈ గ్రంథాలలోని ఏ భాగానికీ రచయితలు ఎవరో పండితులు గుర్తించలేదు. సమూయేలు అనీ, యిర్మీయా అనీ సాంప్రదాయకంగా వస్తున్న అభిప్రాయాలకు సరైన రుజువులు లేవు. అయితే యెహోవాను ఆరాధించే యిర్మీయాలాంటి ప్రముఖమైన వ్యక్తి ఈ గ్రంథాల రచనలో ప్రభావం చూపి ఉండవచ్చు. ఈ గ్రంథాల రచనలో అనేక పూర్వ గ్రంథాలను ఆధారంగా తీసుకోవడం బట్టి వాటన్నిటినీ రచించిన వారిని కూడా ఈ గ్రంథాల రచయితలుగానే చెప్పుకోవాలి. ఏదో ఒక సమయంలో పరిశుద్ధాత్మ ఈ మానవ రచయితలపై పనిచేసి ఆత్మ ప్రేరితమైన, లోపం లేని విధంగా 1,2 రాజులు గ్రంథాలను అధీకృతమైన రచనలుగా రూపించాడు. ఈ గ్రంథాల సంకలనం లేక సమకూర్పుల అంతిమ ఘట్టం బబులోను చెరలోనుండి రాజైన యెహోయాకీను విడిపించబడిన తరువాత జరిగి ఉంటుంది (క్రీ.పూ. సుమారు 562 సం.). అది దీనిలో గత అనేక సంవత్సరాలకు పూర్వమే పూర్తయిన రచనలకు చేర్చిన ఒక ముక్తాయింపు అయి ఉంటుంది లేక దానిలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలను కూడా చేర్చి ఉండవచ్చు.
నేపథ్యం: 1,2 రాజులు గ్రంథాల్లోని చరిత్ర సుమారు 410 సంవత్సరాల నిడివి కలిగి ఉంది. 1రాజులు గ్రంథం రాజైన దావీదు చనిపోయిన తరువాత క్రీ.పూ. రమారమి 970 లో ప్రారంభమైతే 2రాజులు గ్రంథం క్రీ.పూ. సుమారు 560 సంవత్సరంలో రాజైన యెహోయాకీను బబులోనులో చెరసాలనుండి విడుదల పొందడంతో ముగుస్తున్నది. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు రాజ్యం రెండు రాజ్యాలుగా చీలిపోయింది (క్రీ.పూ.930), ఈ రెండు రాజ్యాలూ చెరలోకి కొనిపోబడ్డాయి (క్రీ.పూ.722లో ఇశ్రాయేలు రాజ్యం, క్రీ.పూ.587 లో యూదారాజ్యం).
గ్రంథాల సందేశం, ఉద్దేశం
1,2 రాజులు గ్రంథాల వేదాంతపరమైన దృక్పథం అనేక రకాల అంశాల ద్వారా వెల్లడిరచబడిరది: (1) రాజుల యొక్క, రాజ్యం యొక్క పాపస్వభావం, (2) ఆచరణాత్మకమైన రాజకీయాలు, విశ్వాసం, ఈ రెండూ ప్రజల నుండి ఎదురుచూసే అంశాల మధ్య సంఘర్షణ, (3) తనకు విధేయత చూపిన నిబంధనా రాజులకు దేవుడు అనుగ్రహించిన మహిమ, (4) కొన్ని సందర్భాల్లో దేవుడు వారిపై ప్రకటించిన తీర్పుల తీవ్రత, మరి కొన్ని సందర్భాల్లో ఆయన చూపిన ఉదారత, (5) యెహోవాను ఆరాధించడం, అన్యదేవతలను ఆరాధించడం మధ్య ఏర్పడిన సంఘర్షణ.
రాజు పాత్ర: నిబంధనా ఉద్దేశాలకు సంబంధించి దావీదు నిబంధన రాజును ప్రజలకు ఒక నైతిక ప్రతినిధిగా స్థిరపరచింది. కాబట్టి రాజులైన అజర్యా (ఉజ్జీయా అని మారుపేరు), యోతాముల వరకు రాజు యొక్క నైతిక స్థాయి ప్రజల నైతిక స్థాయితో సమానమైనదిగా పరిగణించబడిరది. రాజు ప్రవర్తనపై ఆధారపడి నిబంధనా సంబంధమైన దీవెనలు అనుగ్రహించడమో, త్రోసిపుచ్చడమో జరిగేది. ఆ విధంగా ఏ పాలనకైనా రాజు ప్రవర్తనే ప్రాముఖ్యమైన నిబంధనగా, నైతిక వాస్తవంగా చెలామణి అయ్యింది.
ప్రవక్త పాత్ర: ఈ కాలం ప్రవక్త కార్యకలాపాలు విస్తరించి ప్రబలిన కాలం. ఈ ప్రవక్తల కార్యకలాపాల స్వభావం ప్రజలను పరవశింపజేసే ఆశ్చర్యకార్యాలు జరిగించే ప్రవక్తలైన సౌలు (1సమూ 19:24), ఎలీషా (2రాజులు 3:14-16)లు, ఆ తరువాత ఆశ్చర్యకార్యాలు ఏమీ జరిగించని రాజాస్థాన ప్రవక్తలైన గాదు, మీకాయా, చివరిగా లేఖనాల్లో పేర్కొన్న గొప్ప రచయితలైన ప్రవక్తలు అనే రకరకాల స్థాయిలగుండా పయనించింది.
ఉజ్జీవం: యూదా రాజ్యంలో ఉజ్జీవానికి కారకులైన చివరి ఇద్దరు రాజులు (హిజ్కియా, యోషీయా) వ్యక్తిగతంగా అనుభవించిన ఉజ్జీవం వారి రాజకుటుంబాలపైనా లేక రాజ్యంపైనా ప్రభావం చూపింది. ఈ ఇద్దరు మంచి రాజులు మరణించిన వెనువెంటనే రాజ్యం తిరిగి భ్రష్టత్వంలోకి దిగజారిపోయింది. ఆ విధంగా ఈ రెండు ఉజ్జీవాలు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయంగా, సంపదపరంగా పూర్తి పునరుద్ధరణను తీసుకురాలేకపోయాయి. కాకపోతే తప్పనిసరిగా రాబోతున్న తీర్పును అవి కొంచెం ఆలస్యం చేశాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
బైబిలు రచయితల దృక్పథంలో దేవుని ఉద్దేశాల నెరవేర్పు కోసం కాకుండా చరిత్ర అనేదే లేదు. ఈ భావన చరిత్ర అంతటినీ వేదాంతపరమైన అంశంగా మార్చివేసింది. 1,2 రాజులు గ్రంథాలు హెబ్రీ చరిత్రను పాత నిబంధన వేదాంతపు వెలుగులో విశదీకరించింది. బబులోను చెర ఈ విధమైన చారిత్రిక సమర్ధనావాదం యొక్క ఆవశ్యకతను కల్పించింది. ఈ చెరలు సార్వభౌముడైన దేవుడు నెలకొల్పిన భక్తివిధానపు వైఫల్యాన్ని వివరించాల్సివచ్చింది. ఈ వైఫల్యం ద్వితీయోపదేశ కాండంలోని నిబంధనా షరతులు వర్తించే చరిత్రలో అంటే యెహోషువ, న్యాయాధిపతులు, 1,2 సమూయేలు గ్రంథాలు, 1,2 రాజులు గ్రంథాల్లోని చరిత్రలో నిబంధనకు సంబంధించి ప్రజలు తమ పాత్రను పోషించడంలో వైఫల్యం చెందడంగా పదే పదే వివరించబడిరది.
గ్రంథ నిర్మాణం
1,2 రాజులు గ్రంథాల మౌలిక సూత్రం కథనాత్మకం లేక వివరణాత్మకం కాదు. రాజులు గ్రంథం ప్రత్యేకమైంది, ఎందుకంటే రాజాస్థాన కార్యకలాపాల దస్తావేజుల పైనే దాని ప్రాథమిక నిర్మాణం ఆధారపడి ఉంది. దాని అధికారిక ప్రారంభం (1రాజులు 15:9-10), ముగింపు (1రాజులు 15:23-24) ఈ దస్తావేజుల పరిమితులను నిర్వచిస్తున్నాయి. ఆ తరవాతే రచయితలు తమ వివరణలు, ప్రార్థనలు, వర్ణనలు, మొదలైన ఇతర సాహిత్యాన్ని వాటికి ముందు, మధ్యలో, వెనుక చేర్చగలిగారు. అయితే వీటిలో అత్యంత ప్రాముఖ్యమైనదేమిటంటే నిబంధన విషయంలో పాలకుని నమ్మకత్వం ఏవిధంగా పరిణామం చెందింది అన్నదే (1రాజులు 15:11-15). ఈ సమాచారమంతా కలిసి ప్రజలు నిబంధనకు విధేయులుగా లేక అవిధేయులుగా ఉన్న చరిత్రను రూపుదిద్దింది.
TSB Video
1 Samuel
సమూయేలు రెండు గ్రంథాలు ఇశ్రాయేలు చరిత్రలోనే ప్రాముఖ్యమైన కాలగమనంలో వచ్చిన మార్పులను చూపిస్తాయి. 1సమూయేలు ప్రారంభంలో, ఇశ్రాయేలు అనేది పేలవమైన ఆధ్యాత్మిక నాయకత్వంలో బలహీనమైన సంబంధాలు కలిగిన కొన్ని గోత్రాల కూర్పుగా ఉంది. అయినప్పటికీ తన ప్రజల పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్పు కొనసాగుతూనే ఉంది. దైవపరిపాలన విధానంలో నుండి రాజుల పరిపాలన విధానంలోకి ఇశ్రాయేలును నడిపించడానికి ఆయన సమూయేలును లేవనెత్తాడు. 1సమూయేలు తరువాతి భాగంలో సౌలు పరిపాలన గురించిన వివరాలు ఉండగా 2సమూయేలు గ్రంథంలో దావీదు రాజరిక విషయాలు వివరించబడి ఉన్నాయి.
Read More
గ్రంథ రచనాకాలం నాటి పరిస్థితులు
గ్రంథకర్త: ప్రారంభంలో 1, 2 సమూయేలు గ్రంథాలు ఒకటే పుస్తకంగా ఉన్నాయని భావిస్తారు. 1సమూయేలు 1 నుంచి 25 అధ్యాయం వరకు సమూయేలు రాశాడనీ, మిగిలిన రచనలో నాతాను, గాదు ప్రవక్తలు ప్రధాన పాత్రను పోషించారనీ (1దిన 29:30) కొందరు పండితుల అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈ ఆలోచన కేవలము ఊహా జనితమే అయివుండవచ్చు. ఎందుకంటే ఈ పుస్తకాలలో రచయితల గురించి ఎక్కడా పేర్కొనలేదు. క్రీ.పూ.930లో రాజ్యం రెండుగా విభజించబడిన కొన్ని తరాలు తరువాతే ఈ గ్రంథాలు రాయబడినట్లు 1సమూ 27:6 సూచిస్తుంది.
నేపథ్యం: యెహోషువ కాలంలో ఇశ్రాయేలు వాగ్దాన భూమిని స్వతంత్రించు కొనిన తరవాత, ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మికంగా భ్రష్ట కాలంలో ప్రవేశించారు. ఇలాంటి పరిస్థితులు ఊహించగలిగే అవధులలో పదే పదే పునరావృతమైనట్లు న్యాయాధిపతులు గ్రంథం వివరిస్తుంది. మొదటగా ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసి విగ్రహారాధనలో పడిపోయారు. రెండవదిగా, దేవుడు వారికి విరోధంగా ఒక శత్రువును రేపి వారిని తనవైపు తిప్పుకునేవాడు. మూడవదిగా, ప్రజలు పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టేవారు. నాలుగవదిగా, దేవుడు ఒక న్యాయాధిపతిని లేవనెత్తి అతని ద్వారా వారికి విడుదలను కలుగజేసేవాడు. ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (21:25) అంటూ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రాముఖ్యంగా కనిపించే వచనం ఆనాటి పరిస్థితులను స్పష్టంగా వివరిస్తుంది. అలాంటి అపాయకరమైన రోజుల చివరిభాగం నుంచి 1సమూయేలు గ్రంథం ప్రారంభమైంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
నాయకత్వం: 1, 2 సమూయేలు గ్రంథాలు మంచి, చెడ్డ నాయకత్వానికి అనేక ఉదాహరణలు ఇస్తున్నాయి. నాయకులు యెహోవా మీద దృష్టిపెట్టి తమ నాయకత్వం ఆయనకు మహిమ కలిగించే విధంగా నెరవేర్చినపుడు వారు అభివృద్ది చెందారు. దేవుణ్ణి విడిచిపెట్టి అధికారాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడు వారు విఫలమయ్యారు. ఏలీ, అతని కుమారులు మొదలుకొని సమూయేలు, సౌలు, దావీదు తదితరుల జీవితాలు ఈ సూత్రాల్ని స్థిరంగా విశదీకరించాయి.
దేవుని సార్వభౌమత్వం: 1, 2 సమూయేలు గ్రంథాలు అన్ని పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులను పోషించిన విధానాన్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. సమూయేలు ద్వారా దేవుడు వారికి మంచి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అనుగ్రహించాడు, ఆ సమయంలో రాజరిక వ్యవస్థ తన ప్రజల విషయంలో తన పరిపూర్ణ చిత్తం కాకపోయినా దేవుడు వారికి మొదటి రాజును ఇచ్చాడు. ప్రజలు, నాయకులు ఆయన అంచనాలను అనేక పర్యాయాలు వమ్ముచేసినా, శత్రువులను జయించడానికి వారికి కావలసిన నాయకులను, వనరులను అందించి, వారికి ఇచ్చిన దేశంలో ఆయన ఉద్దేశాల ప్రకారం జీవించడానికి సమస్తం సమకూర్చాడు.
పాపపు ఫలితం: 1, 2 సమూయేలు గ్రంథాలు పాపాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, క్షమించబడిన పాపంతో సహా, ప్రతి పాపానికి ఉండే భయంకరమైన పరిణామాలను విపులంగా వివరించాయి. సౌలు దేవునికి చూపిన అవిధేయత, తన కుమారునితో, దావీదుతో ఎడబాటుకు, చివరకు యుద్ధంలో అతని మరణానికి దారితీసింది. దావీదు బత్షెబతో చేసిన పాపం దేవుడు క్షమించినా, దాని పరిణామాలు దావీదును అతని శేషజీవితమంతా వెంటాడాయి.
నిబంధన: 1, 2 సమూయేలు గ్రంథాలు తన నిబంధన జనముతో దేవుని సంబంధాన్ని, నిబంధనలోని షరతులకు దేవుడు నమ్మకంగా స్పందించిన విధానాన్ని వివరిస్తునాయి. యెహోవా దావీదుతో ఒక ప్రత్యేకమైన నిబంధన స్థాపించాడు, ఆ నిబంధన అంతిమంగా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
దేవుని ఆధిపత్యంలో వేర్వేరు గోత్రాల కూటమిగా ఉన్న స్థితి నుండి ఇశ్రాయేలు దేవునికి జవాబుదారిగా ఉండే (రాజరిక) రాజు నాయకత్వంలోకి వచ్చిన విధానాన్ని 1, 2 సమూయేలు గ్రంథాలు వివరిస్తాయి. నిత్యం ప్రజలను దేవుని వైపుకు మరల్చిన సమూయేలు జీవితం, పరిచర్య ఈ పునర్నిర్మాణ కాలాన్ని గొప్పగా రూపుదిద్దింది. తమను నడిపించడానికి రాజు కావాలని మొఱ్ఱపెట్టిన ప్రజలు దానిలోని ప్రమాదాలకు ఎలా బాధితులయ్యారో సౌలు పాలన వారికి ప్రత్యేకంగా చూపించింది. పొరుగు రాజ్యాలవలె ఉండాలనే ఆలోచనతో దేవుని ప్రజలు సమూయేలు హెచ్చరికను (1సమూ 8:10-20) పెడచెవిని పెట్టారు. చివరికి వారు అడిగింది పొందినప్పటికీ దానికి దారుణమైన మూల్యం చెల్లించారు. జీవితపు అవసరాలకు దేవుని సమయం కోసం కనిపెట్టాలని సౌలు జీవితం ఒక్క గొప్ప హెచ్చరికగా నిలిచింది. దేవునికి లోబడిన జీవితాల ద్వారా దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలడో లేదా చేస్తాడో అన్నదానికి దావీదు పాలన ఒక సాక్ష్యంగా ఉంది. ఇశ్రాయేలు రెండవరాజు తన జీవితంలో దేవుని ఆశీర్వాదం గురించి తెలిసినట్లే ప్రవర్తించాడు, దేవుని సంగతుల పట్ల మృదు హృదయాన్ని చూపించాడు (2సమూ 5:12; 7:1-2; 22:1-51; 23:1-7). దావీదు జీవితాన్ని బట్టి తరువాతి తరాలు ఆశీర్వదించబడతారు (యెషయా 37:35). దేవుడు దావీదుతో చేసిన ప్రత్యేకమైన నిబంధన (2సమూ 7:1-29) అంతిమంగా దావీదు కుమారుడైన యేసులో నెరవేరింది (లూకా 1:32-33). అయినప్పటికీ, బత్షెబతో దావీదు చేసిన పాపం వలన కలిగిన పరిణామాలు పాపపు ఆకర్షణలో పడేవారికి ఒక హెచ్చరికగా నిలుస్తాయి. దేవుడు తన ప్రజలను వారి క్రియలకు బాధ్యులను చేస్తాడు. క్షమించబడిన పాపాలకు కూడా కొన్నిసార్లు భయంకరమైన పర్యవసానాలు ఉంటాయి.
గ్రంథ నిర్మాణం
1సమూయేలు మొదటి ఏడు అధ్యాయాలు సమూయేలు పుట్టుక, పిలుపు, ఇశ్రాయేలీయుల మధ్య అతడు చేసిన ప్రారంభ పరిచర్యను వివరిస్తాయి. ‘‘సకల జనుల మర్యాద చొప్పున’’ (1సమూ 8:5) తమను ఏలుటకు రాజు కావాలని ప్రజలు అడగడంతో ఎనిమిదవ అధ్యాయంలో వృత్తాంతం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఆ సమయానికి దేవుని సంపూర్ణమైన చిత్తం కానప్పటికీ ఆయన నడిపింపులో జరిగిన సౌలు ఎంపికను 9-12 అధ్యాయాలు వివరించాయి (1సమూ 12:16-18). 1సమూ 13-31 అధ్యా. సౌలు విజయాలను, వైఫల్యాలను వివరించాయి. సౌలు గొప్ప దేహదారుఢ్యం, మంచి యుద్ధనేర్పు కలిగిన రాజు (1సమూ 14:47-52), కానీ అతని హృదయం దేవునితో ఒకటిగా లేదు (1సమూ 13:14). దేవుని ఆజ్ఞలకు అతడు చూపిన అవిధేయత అతడు సాధించిన వాటిని అల్పంగా చేసింది. అతని పాలన తిరోగమన పథంలో నడిచిన వైనాన్ని 16-31 అధ్యాయాలు వివరించాయి. అ సమయంలో, దేవుడు సౌలుకు వారసునిగా దావీదును లేవనెత్తి, సౌలుకు బదులుగా సింహాసనం అధిష్టించేటందుకు అతణ్ణి సిద్ధపరిచాడు. ఆ సత్యం సౌలు క్రమేణా తెలుసుకున్నాడు (1సమూ 15:28; 24:20-21; 28:17).
ఇశ్రాయేలు సింహాసనం విషయంలో సౌలు మరణంతో ప్రారంభమైన కష్టాన్ని 2సమూ 1-4 అధ్యాయాలు వివరించాయి. యూదా గోత్రీకులు దావీదును రాజుగా అభిషేకించారు (2సమూ 2:4). కానీ అబ్నేరు సౌలు కుమారులలో బ్రతికివున్న వారిలో పెద్దవాడైన ఇష్బోషెతును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు (2సమూ 2:8-9). రెండు సంవత్సరాల అంతర్యుద్ధం ఇష్బోషెతు మరణానికీ, ఇశ్రాయేలు అంతటి మీద దావీదు రాజు కావడానికీ దారితీసింది. 2సమూ 5-24 అధ్యాయాలు దావీదు పాలనలోని ప్రాముఖ్య ఘట్టాలను చూపించాయి. దావీదు రాజ్య సింహాసనం శాశ్వతంగా స్థాపిస్తానని దేవుడు దావీదుతో ఒక ప్రత్యేకమైన నిబంధన చేశాడు (2సమూ 7:1-29). ఏదేమైనా, దావీదు బత్షెబతో చేసిన పాపం అతని పాలనలో విపత్కరమైన పరిణామాలను తీసుకుని వచ్చింది, అది 2సమూయేలు గ్రంథంలోనే ఒక మలుపుగా మారింది. చివరికి, దావీదు పశ్చాత్తాప పడటం అతడు దేవుని హృదయానుసారుడు అన్న మాటను ధృవపరుస్తుంది. అయితే రాజైనా దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం కుదరదని అతని పాపం తెలియజేస్తుంది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”
Ruth
ఈ గ్రంథంలో ప్రధానమైన ఒక పాత్ర, దావీదుకు, యేసుకు పూర్వీకురాలైన రూతు అనే మోయాబీయురాలి పేరు మీద ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది. న్యాయాధిపతులు గ్రంథంలో అంధకారమయమైన, నిస్పృహతో నిండిన ఇశ్రాయేలు చరిత్రను చదివిన పాఠకులకు రూతు వృత్తాంతం ఎంతో ఊరటనిస్తుంది. ఈ గ్రంథం చిన్నదైనప్పటికీ ఇది దయ, విశ్వాసం, సహనం అనే మాదిరికరమైన లక్షణాలతో సుసంపన్నమై ఉంది. యూదుల పండుగల్లో, ముఖ్యంగా వారముల పండుగ సమయంలో చదవాల్సిన ఐదు గ్రంథపు చుట్టలలో ఇది ఒకటి.
Read More
గ్రంథరచనా కాలం నాటి పరిస్థితులు
రచయిత: తాల్ముద్ ప్రకారం ఈ గ్రంథ రచయిత సమూయేలు. అయితే ఈ గ్రంథంలో మాత్రం రచయిత గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించదు. రూతు గ్రంథాన్ని ఎవరు రాశారో మనం కేవలం ఊహించగలం. దీని మూలరచన గానీ, రచనాకాలాన్ని గానీ దానిలోని అంతర్గత రుజువుల నుండి, అంటే దాని భాష, శైలి, చారిత్రిక జాడలు, అంశాల నుండి రాబట్టవలసిందే. దీని చివరలో ఉన్న వంశావళి, నాటి ప్రాచీన సంప్రదాయాల ప్రస్తావన వెలుగులో చూస్తే ఇది రాజైన దావీదు పరిపాలన (క్రీ.పూ.1011-971) కాలంలో గానీ, ఆ తరవాత గానీ రాసి ఉంటారని భావించవచ్చు. బహుశా చెర తరువాతి కాలంలో అన్యులను ఇశ్రాయేలు వంశావళిలో చేర్చే విషయం చర్చకు వచ్చినప్పుడు ఇది రాసి ఉంటారని అనుకోడానికి కూడా అవకాశం ఉంది.
నేపథ్యం: రూతు గ్రంథానికి నేపథ్యం ‘‘న్యాయాధిపతులు ఏలిన దినములయందు’’ (1:1) అది సామాజికంగా, మతసంబంధంగా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ‘‘ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు’’ (న్యాయాధి 17:6) వచ్చిన కాలం. చారిత్రికంగా ఈ గ్రంథం యెహోషువ నాయకత్వంలో కనానును స్వాధీనం చేసుకున్న కాలానికీ, ఈ గ్రంథం ముగింపులో ఉన్న దావీదు వంశావళిలో కనిపించే రాజైన దావీదు పాలన కాలానికీ మధ్య వారధిలా ఉంది. న్యాయాధిపతులు కాలంలో సరిగ్గా ఏ సమయంలో ఇది జరిగిందో స్పష్టంగా లేదు కానీ ఇశ్రాయేలు చేసిన విగ్రహారాధన కారణంగా సంభవించిన ఒక కరవు తో ఈ గ్రంథం ప్రారంభమైంది.
గ్రంథ సందేశం, ఉద్దేశం
కృప: తాను, తన భర్త ఆహారం కోసం వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి సంతానం కోసం (1:21) తమ కుమారులకు మోయాబు యువతులతో వివాహం జరిగించిన దానిని బట్టి దేవుని తీర్పు తన పైకి వచ్చిందని నయోమి భావించింది. ఆమె దేవుని కృపను తక్కువగా అంచనా వేసింది. దేవుడు ఆమెకు ఆహారాన్నీ, ఆమె వంశం పేరును కొనసాగించడానికి కావలసిన సంతానాన్నీ అందించడానికి ఆమె కోడలైన రూతు అనే మోయాబీయురాలిని సాధనంగా వాడుకున్నాడు. రూతు గోదుమ పరిగెలు ఏరుకోడానికి కాకతాళీయంగా ఎంచుకున్న పొలం నయోమి, రూతుల విషయంలో కుటుంబ విమోచకుడుగా పాత్ర వహించిన బోయజు అనే వ్యక్తిని కలుసుకోడానికి దోహదం చేసింది.
రూతు గ్రంథం రెండు విధాలుగా తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని పోలి ఉంది (లూకా 15:11-32). యెహోవా తన ప్రజలను దీవిస్తానని వాగ్దానం చేసిన దేశం నుండి ఎలీమెలెకు కుటుంబం సమృద్ధిని వెదుకుతూ పరాయి దేశానికి వెళ్ళిపోయింది. దాని ఫలితంగా నయోమి రిక్తహస్తాలతో, ఒంటరిగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఆమెపైకి వచ్చిన దేవుని తీర్పు ఆమెను తిరిగి తన స్వదేశానికి తీసుకువచ్చి ఆమెలోని శూన్యాన్ని ఒక కొత్త సమృద్ధితో నింపడం కోసం నిర్దేశించబడిరది. అదే విధంగా రూతు గ్రంథం దేవుని ప్రజలు న్యాయాధిపతుల కాలంలో అనుభవించిన శ్రమలతో, వారి సార్వత్రిక అవిధేయత కారణంగా గొప్ప కరువు రావడంతో ప్రారంభమైంది. అయినప్పటికీ దేవుడు ఆకలితో ఉన్న తన ప్రజలకు ఆహారాన్ని, నాయకుడుగా వారిని నడిపించడానికి ఒక రాజును అనుగ్రహించాడు. దీనిలో ఆధునిక పాఠకులమైన మనకు అన్వయించే పాఠాలు సహితం ఉన్నాయి. మనం కూడా దేవునినుండి దూరమైపోయి ఆయన కృప, కనికరాలు పొందవలసిన అవసరతలో ఉన్నాం.
దేవుని ఏర్పాటు: దేవుడు ఈ వృత్తాంతం ద్వారా తన ప్రజలకు అవసరమైన ఒక రాజును వారికి అనుగ్రహించడానికి కార్యం జరిగించాడని ఈ గ్రంథం ముగింపులో కనిపించే దావీదు వంశావళి వెల్లడి చేస్తున్నది. దీనిలో దేవుని కార్యాచరణ ఎక్కువ భాగం మరుగై ఉన్నప్పటికీ రెండు ప్రత్యేకమైన సంఘటనలు నేరుగా ఆయనకు ఆపాదించబడ్డాయి – తన ప్రజలకు ఆహారం అనుగ్రహించడం (1:6), రూతుకు గర్భఫలం దయచేయడం (4:13). ఈ మార్గాల ద్వారా దేవుడు తన ప్రజలందరి అవసరాలు తీర్చాడు.
విశ్వసనీయమైన ప్రేమ: రూతు గ్రంథం అర్హతలేని తన ప్రజలపై దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఏ విధంగా తన నిబంధనా నమ్మకత్వాన్ని తరచుగా కనపరుస్తాడో వెల్లడి చేస్తుంది. ఈ వృత్తాంతం అంతటిలో ప్రధాన పాత్రలైన ప్రతి ఒక్కరూ అసాధారణమైన ధైర్యం, నిబంధనా ప్రేమ (హెబ్రీ. ఖెసెద్, ‘‘ప్రేమపూర్వక దయ, నమ్మకత్వం, విశ్వాసపాత్రత’’ అనే ఈ గ్రంథంలో కీలకమైన పదము 1:8, 2:20, 3:10) కలిగినవారుగా రుజువు చేసుకున్నారు. వీరు తమ ఆధ్యాత్మిక నిబద్ధతను తమ భక్తి జీవితంలో బహు స్పష్టంగా వెల్లడి చేసిన ప్రజలు.
కుటుంబ విమోచకుడు: రూతు గ్రంథంలో యూదా ధర్మశాస్త్రం ప్రకారం విమోచించడానికి తన అధికారాన్ని వినియోగించిన ఒక కుటుంబ సభ్యుని గురించిన గొప్ప ఉదాహరణ మనకు కనిపిస్తుంది. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు విధవరాలైన అతని భార్యను పెళ్ళి చేసుకోవడం అనే కుటుంబ సభ్యుని బాధ్యతను బోయజు నెరవేర్చి చూపించాడు. బోయజు రూతును విమోచించడాన్ని కొన్నిసార్లు క్రీస్తు పాపులను విమోచించడంతో పోల్చి చెప్తారు. దేవుడు తన నిబంధనా నమ్మకత్వాన్ని బట్టి మనందరికీ అవసరమైన విమోచకుణ్ణి యేసు క్రీస్తులో అనుగ్రహించాడు. దావీదు వంశం కొనసాగి అంతిమంగా చేరుకొనే నిజమైన రాజు యేసే (మత్తయి 1:5-6). అటూ ఇటూ తిరుగులాడుతున్న తన ప్రజలకు విశ్రాంతిని అనుగ్రహించే విమోచకుడు ఆయనే. ఆయనలోనే అన్యజాతులు సహితం విశ్వాసం ద్వారా దేవుని ప్రజలలో ఐక్యం చేయబడి వాగ్దాన కుటుంబంలో స్థానం సంపాదించారు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
తన అత్త నయోమి పట్లా, ఆమె దేవుని పట్లా రూతు చూపిన నిబంధనా నమ్మకత్వం జాతిపరంగా ఇశ్రాయేలీయులు కాకపోయినా ఎవరైనా విశ్వాసం ద్వారా దేవుని ప్రజలో చేర్చబడవచ్చు అనే విషయంలో ఒక నమూనాగా నిలిచింది. మోయాబీయులు తమకు తాముగా వచ్చి యెహోవా దేవుణ్ణి చేరగలిగితే ఇంకా మిగిలిన ఇతర అన్యజాతుల ప్రజలకు కూడా నిరీక్షణ ఉన్నట్టే (యెషయా 56:3-7). మోయాబీయ మూలాలు కలిగిన దావీదు రాజవంశం యొక్క చట్టబద్ధతపై రేకెత్తిన ప్రశ్నలకు ఈ గ్రంథం సమర్ధవంతంగా జవాబునిచ్చింది.
గ్రంథ నిర్మాణం
రూతు గ్రంథం ఒక విపత్తునుండి మరొక క్లిష్టమైన పరిస్థితికి, దానినుండి ఒక పరిష్కారానికి నడిపించే ఒక ఉత్తమమైన కథనంతో కూడిన ఒక రమ్యమైన గాథ. దీని వ్యాఖ్యాత దీనిని చదివేవారిని ఆయా పాత్రల (వరుసగా నయోమి, రూతు, బోయజు) మనసుల్లోకి నడిపించి వారి వ్యక్తిగతమైన చింతలు, ఆనందాలతో మనల్ని మనం అన్వయించుకొనేలా చేస్తాడు. అంతిమంగా ఒక శూన్యత, కృంగుదల లోనుండి సార్థకత, ఆనందంలోకి పయనించడం అనే వేడుకలోకి మనల్ని నడిపిస్తాడు.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”
Judges
న్యాయాధిపతులు గ్రంథం పాత నిబంధనలోని చరిత్ర గ్రంథాల్లో రెండవది (యెహోషువ-ఎస్తేరు). హెబ్రీ బైబిల్లో, ఈ పుస్తకాలను తొలి ప్రవక్తలు అని పిలిచేవారు. పంచకాండాలలో కనిపించే వేదాంత, ఆధ్యాత్మిక విషయాలు, ప్రవక్తల రచనలు కేవలం చారిత్రక సత్యాలను లిఖించడం కంటే మించినవి. ఈ గ్రంథంలోని ముఖ్య పాత్రలైన న్యాయాధిపతులు, హెబ్రీ. షోఫెటిం (2:18) నుండి దీనికా పేరు వచ్చింది. వారినే ‘‘గవర్నర్లు’’ లేక ‘‘అధిపతులు’’ అని కూడా అనువదించవచ్చు. ఈ న్యాయాధిపతులు దేవుని విమోచనా ప్రతినిధులు. యెహోవాయే న్యాయాధిపతులు గ్రంథానికి ప్రధాన పాత్రధారి, కథానాయకుడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: న్యాయాధిపతులు గ్రంథ రచయిత ఎవరో తెలియదు. కనీసం రచయిత లేక రచయితలు ఎవరైవుంటారు అనే సూచన కూడా కనిపించదు. ఈ పుస్తకంలోని మూడు భాగాలు, అవి తీసుకోబడిన మూలాలు భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. చారిత్రక పరిచయం ఒక విధంగా సాంప్రదాయ రూపంగా, యెహోషువ గ్రంథంలోని ఆక్రమణ వృత్తాంతాలకు సమాంతరంగా ఉంటుంది. పుస్తకంలోని ప్రధానభాగం, అంటే న్యాయాధిపతుల గురించిన వృత్తాంతాలు స్థానిక పరిశీలకుడు మౌఖికంగా లేక గ్రంథరూపంలో అందించిన దానిమీద ఆధారపడినట్లు కనిపిస్తుంది.
నేపథ్యం: ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల కాలం, యెహోషువ నేతృత్వంలో వాగ్దాన దేశాన్ని జయించడానికి, సౌలు, దావీదులతో రాచరికం ఆరంభం కావడానికి మధ్యలో జరిగింది. కాబట్టి ఇందులో జరిగిన సంఘటనలు క్రీ.పూ. 15 శతాబ్దం ముగింపు నుండి క్రీ.పూ. 11 శతాబ్దపు చివరి భాగానికి, అంటే సుమారు 300 సంవత్సరాల కాలానికి చెందినవి. ఇది సామాజికంగా, మతపరంగా అస్థవ్యస్థంగా ఉన్న కాలం. ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (17:6; 18:1; 19:1; 21:25) అనే మాటలు పదే పదే ప్రతిధ్వనిస్తూ ఆనాటి పరిస్థితిని వివరిస్తున్నాయి.
న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడు సంకలనం చేశారో ఇదమిద్ధంగా చెప్పలేము. 18:30లోని దాను గోత్రికుల గతిని గూర్చి ‘‘ఆ దేశము చెరపట్టబడు వరకు’’ అని చెప్పిన మాటలు, సుమారు క్రీ.పూ. 722లో ఉత్తర రాజ్యం అష్షూరు చేత చెరపట్టబడిన కాలంలో దీని కూర్పు ముగిసి ఉంటుందని సూచిస్తున్నాయి. అయితే, ఓఫ్రాలో గిద్యోను బలిపీఠం ఉన్న స్థలమును పాఠకులు ఇప్పటికీ చూడవచ్చని 6:24లోని సూచన, దక్షిణరాజ్యమైన యూదయ క్రీ.పూ. 586లో చెరపట్టబడడానికి ముందున్న కాలాన్నిసూచిస్తుంది. దీని సందేశం ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేకసార్లు బలంగా ప్రతిధ్వనించి, మనష్షే (క్రీ.పూ.686-642; 2రాజులు 21:1-18) చీకటికాలానికి సరిపోయేదిగా ఉన్నదనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ న్యాయాధిపతుల గ్రంథం రాసిన కాలాన్ని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
న్యాయాధిపతులు గ్రంథం, ఆరంభంలో ఆధ్యాత్మికంగా, నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్న ఇశ్రాయేలు, క్రమ క్రమంగా పతనమై, అధ్యా.17-21లో అధో:స్థాయికి దిగజారడాన్ని నమోదు చేసింది. న్యాయాధిపతులనే విమోచకులను దేవుడు వరుసగా లేవనెత్తినా, ఈ పోకడను వాళ్ళు సరిదిద్దలేదు గదా, వారిలో కొందరు ఆ సమస్యలో భాగంగా మారారు. పుస్తకం చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయులు వారు వెళ్ళగొట్టిన కనానీయులకన్నా దారుణమైన అపవిత్రతలోకి పడిపోయి, వారికన్నా భ్రష్టులుగా మారిపోయారు. ఇదే కొనసాగి ఉంటే, కాలక్రమేణా ఆ దేశం వారికి ముందున్న కనానీయులను కక్కివేసినట్టే వీరిని కూడ కక్కివేసేది (లేవీ 18:28).
మానవ భ్రష్టత్వం: ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేస్తే, దేవుని ప్రజలకు ఏమౌతుందో న్యాయాధిపతులు గ్రంథం చూపిస్తుంది. ఇశ్రాయేలీయులు గాని, లేక క్రైస్తవులు గాని దేవుని కృపను తేలిగ్గా తీసుకోకూడదని అది చూపుతుంది. ఆయన ఆజ్ఞలను విడిచి, మన స్వంతంగా ఊహించుకున్న విగ్రహాలను వెంబడిస్తే దాని ఫలితం నైతిక, ఆధ్యాత్మిక గందరగోళమే. దేవుడు మన ఇష్టానికి మనల్ని విడిచిపెడితే మన గతి ఇలాగే ఉంటుంది.
దేవుని కృప: న్యాయాధిపతులు గ్రంథం దేవుని కృపను గూర్చి గంభీరమైన వ్యాఖ్యానాన్ని మనకందించింది. వారి మట్టుకు వారిని వదిలేస్తే ఇశ్రాయేలీయులు తమను తాము నాశనం చేసుకుని ఉండేవారు. దేవుడు పదే పదే కృపతో జోక్యం చేసుకోవడంవల్లే వారు రాచరిక వ్యవస్థకు ముందున్న అంధకార స్థితి నుండి, చుట్టూ ఉన్న అన్యజనుల మధ్యనుండి ఒక విస్పష్టమైన జీవిత విధానం, విశ్వాసం గల జనాంగంగా, దేశంగా ఆవిష్కృతమయ్యారు.
దేవుని నాయకత్వ ఆవశ్యకత: ‘‘ఇశ్రాయేలులో రాజు లేడు’’ (17:6; 18:1; 19:1; 21:25) అనే పల్లవి, రాచరిక వ్యవస్థను కోరుకుంటున్న చిత్రాన్ని కనపరుస్తున్నా దానిని తమ రాజైన దేవుని దగ్గరకు తిరిగిరమ్మని పిలిచే పిలుపుగా చూడడం మేలు. ఈ కాలంలో వచ్చిన గందరగోళానికి పరిష్కారంగా రాజులను ఎత్తి చూపడానికి బదులు, ‘‘ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (17:6; 21:25) అనేది తరువాతి సంవత్సరాల్లో ప్రజలను ఇశ్రాయేలు రాజుల నైతిక, ఆధ్యాత్మిక స్థాయిని తగ్గించేసింది. మరొకమాటలో చెప్పాలంటే-దేవునిపట్ల తిరుగుబాటు, ఒక ప్రజాస్వామ్య వైఖరిగా మారిపోయింది. ఇశ్రాయేలును పాపంలోనికి నడిపించడానికి ఒక రాజుతో అవసరం లేకపోయింది; వారంతట వారే దుర్నీతిలో పడిపోగలిగారు. ఇశ్రాయేలీయులు తమతో నిబంధన చేసిన దేవుణ్ణి విడిచి దేశంలోని సంతానోత్పత్తి దేవతలను అనుసరించారు. ఈ సమస్యను ఎత్తి చూపిస్తూ గ్రంథకర్త తన తరమువారిని మేల్కొల్ప ప్రయత్నించాడు. ఈ గ్రంథం సమస్త అన్యాచారాలను విడిచిపెట్టి యెహోవావైపు తిరగమని నిబంధన జనులకు ఇచ్చిన ఒక పిలుపు.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
ఇశ్రాయేలు దేశం న్యాయాధిపతుల చీకటికాలంలో కేవలం దేవుని కృపచేతనే నిలిచివుండ గలిగింది అని న్యాయాధిపతులు గ్రంథం కనపరుస్తుంది. దేవుడు తన దయతో వారి తిరుగుబాటును వారికి గుర్తుచేస్తూ వారి పైకి శత్రువులను పంపించాడు. అదే దయతో వారి మొఱ్ఱలకు ఆయన స్పందించి, విమోచకులను లేవనెత్తాడు. మానవ హృదయంలోని ప్రాధమిక సమస్యను కూడా న్యాయాధిపతులు గ్రంథం ఉదహరిస్తుంది. దేవుని ప్రజలు ఆయన రక్షణ కార్యాలను మర్చిపోయినపుడు ఇతర దేవతలవైపు తిరుగుతారు. ఆత్మీయ సమర్పణకు, నైతిక ప్రవర్తనకు మధ్య ఉన్న బంధాన్ని న్యాయాధిపతులు గ్రంథం చూపిస్తుంది. చివరిలో న్యాయాధిపతులు గ్రంథం ఒక నిత్య సత్యాన్ని చూపుతుంది: మన పాపం, మన తిరుగుబాటులతో సంబంధం లేకుండా దేవుడు తన రాజ్యాన్ని నిర్మిస్తాడు.
గ్రంథ నిర్మాణం
ఈ పుస్తకం మూడు భాగాలుగా ఉంది. కనానును స్వాధీనం చేసుకోవడం కొనసాగించడంలో రెండవతరం విఫలం కావడం గురించి ఉపోద్ఘాతం వివరించింది (1:1-3:6). దీని వెంటనే పుస్తకంలో ప్రధానాంశంగా ఆరుసార్లు వారు పాపంలో పడడం, దేవుడు వారిని రక్షించడం (3:7-16:31) చూస్తాం. చివరిగా, ప్రజల పైకి వచ్చిన పూర్తి భ్రష్టత్వ ప్రభావం గురించి వివరించిన ఒక అనుబంధం (అధ్యా. 17-21). ఈ నిర్మాణం కేవలం పాపం, దానిపై వచ్చిన తీర్పు పునరావృతం కావడమే కాక, వారి తిరోగమనాన్ని కూడా ప్రత్యక్షంగా చూపుతుంది. ఈ వృత్తాంతంలో ఒక కేంద్ర బిందువుగా గిద్యోను, అబీమెలెకుల ఉదంతంలో సమాంతరంగా కనిపించే రాచరికం అనే అంశం ప్రత్యేకంగా చూపబడిరది.
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”