1 Corinthians
పౌలు ఉత్తరాల్లోకెల్లా 1కొరింథీ అత్యంత సాహితీపరమైన గ్రంథం. వక్రోక్తి, వ్యంగ్యం, అలంకారికం, ప్రతివాదం, మానవీకరణ, అతిశయోక్తి, పునరుక్తి, సుందరమైన పదాలు (స్థానికతతో కూడిన), ద్వంద్వార్థాలు, ఇంకా ఇతర పద చతురతలు కలబోసిన వివిధ సాహితీ రూపాలతో రాసిన ఈ ఉత్తరంతో పౌలు తన పాఠకులను ఒప్పించడానికి ప్రయత్నించాడు. కొరింథీయులు తమ జీవితాలపై ప్రభువు యొక్క అధికారానికి అంగీకరించాల్సిన ఆవశ్యకతను అతడు వారికి నొక్కి చెప్పాడు.
Read More
గ్రంథరచనా కాలంనాటి పరిస్థితులు
గ్రంథకర్త: 1కొరింథీ పత్రిక గ్రంథకర్తృత్వం పౌలుకు ఆపాదించబడిరది (1:1, 16:21). బైబిలు పండితులంతా ఏకగ్రీవంగా ఈ ఉత్తరం రాసింది పౌలే అని నిర్ధారించారు. అతడు ఈ ఉత్తరాన్ని ఎఫెసులో తన మూడు సంవత్సరాల పరిచర్య చివరి సంవత్సరంలో, అంటే క్రీ.శ.56 వసంతకాలంలో బహుశా పెంతెకోస్తుకు కొద్ది వారాల ముందు రాసి ఉంటాడు (15:32, 16:8-9, అపొ.కా.20:31).
నేపథ్యం: పౌలు రెండవ మిషనరీ యాత్రలో త్రోయలో ఉన్నప్పుడు అతనికి ఒక దర్శనంలో ఒక వ్యక్తి ‘‘మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి’’ (అపొ.కా.16:9) అని పిలిచాడు. ఆ విధంగా తన ప్రణాళికలో చోటుచేసుకున్న మార్పులు అతణ్ణి ఫిలిప్పీ, థెస్సలోనిక, ఏథెన్సు, చివరికి కొరింథుకు నడిపించాయి (అపొ.కా.18:5). కొరింథులో పౌలు కనీసం 18 నెలలపాటు పరిచర్య చేశాడు (అపొ.కా.18:1-18). అతడు కొరింథునుండి అకుల, ప్రిసిల్లలతో కలిసి వెళ్ళి (అపొ.కా.18:18), వారిని ఎఫెసులో విడిచిపెట్టాడు. వారక్కడ ‘‘విద్వాంసుడు’’ అయిన అపొల్లోను కలిసికొని అతనికి దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు (అపొ.కా.18:24-26). అపొల్లొ అక్కడినుండి కొరింథుకు వెళ్ళి అక్కడ శక్తివంతమైన పరిచర్య జరిగించాడు (అపొ.కా.18:27-19:1). 1కొరింథీ పత్రిక పౌలు కొరింథు సంఘానికి రాసిన రెండవ ఉత్తరం. దీనికి ముందు అతడు వారికి లైంగిక దుర్నీతిలో ఉన్న వ్యక్తులతో కలిసిపోవద్దని హెచ్చరిస్తూ ఒక ఉత్తరం రాశాడు (5:9). ఆ సంఘంలో చెలరేగిన వర్గపోరు గురించి క్లోయె ఇంటివారి ద్వారా తెలుసుకున్న పౌలు ఈ రెండవ ఉత్తరం (1కొరింథీ) రాయడానికి ప్రేరేపించబడ్డాడు (1:11). ఆ సంఘంలో జరుగుతున్న జారత్వం గురించి (5:1), ప్రభువు బల్లను ఆచరించే సమయంలో విభేదాల గురించి (11:18), మృతుల పునరుత్థానం విషయంలో నెలకొన్న గందరగోళం గురించీ (15:12) కూడా పౌలుకు సమాచారం అందింది. దాని ఫలితంగా ఆ విషయాల గురించి వివరించడానికి పౌలు ఈ 1కొరింథీ పత్రికను రాశాడు. అతడు ఈ ఉత్తరం రాస్తూ ఉండగానే వివిధ రకాల అంశాల గురించి అతని అభిప్రాయం కోరుతూ కొరింథీయులు ఒక ఉత్తరం రాసినట్టు తెలుస్తుంది (7:1, 25, 8:1, 12:1, 16:1). కాబట్టి వాటన్నిటికీ అతడు జవాబులు ఇస్తూ కొరింధీ విశ్వాసులకు ఈ ఉత్తరం రాశాడు.
గ్రంథ సందేశం, ఉద్దేశం
గలతీ పత్రికలో తప్ప పౌలు రాసిన ఇతర అన్ని ఉత్తరాల్లో అతని కృతజ్ఞతలు చెల్లించే విభాగం సారాంశంలోనో, లేక అతడు కృతజ్ఞతలు చెప్పడానికి చూపిన కారణంలోనో ఆ ఉత్తరం యొక్క ప్రధాన అంశం వెల్లడి అవుతుంది. ప్రతి ఉత్తరంలోని అతని అభివాదం, ప్రారంభ వాక్యాలు, పరిచయంలో కృతజ్ఞతల వెంబడి ఉండే ప్రార్థనలలోనే ఆ ఉత్తరం ప్రధానాంశం ఏమిటో తెలుసుకోవచ్చు. 1కొరింథీ పత్రికలోని తన పరిచయపలుకులు, కృతజ్ఞతా వాక్కులలోనే తనకు అలవాటైన విధంగా పౌలు విశ్వాసులందరూ ప్రభువుకు చెందినవారు (1:2) అనే తన ఉత్తరం యొక్క ప్రధానాంశాన్ని చొప్పించాడు. యేసే ప్రభువు, విశ్వాసులంతా ఆయన స్వాస్థ్యం. చర్చించిన సమస్య ఏదైనా సరే, దానిపై ప్రభువు యొక్క ఆధిపత్యాన్ని గుర్తు చేస్తూ పౌలు దానిని గూర్చి చర్చించాడు (1:2,10). విశ్వాసులు తమ యజమాని అయిన ప్రభువుతో కలిగి ఉన్న సంబంంధం గురించి మాట్లాడుతూ అతడు 75 సార్లకంటే మించి మొదటి శతాబ్దపు బానిసత్వ వ్యవస్థనుండి నుడికారాలను ఉపయోగించాడు. ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించువారు (1:2) అంటే ఆయనకు లోబడి ఉన్నామన్నదానికి సూచనగా ఆయన నామంలో ప్రార్థించేవారు అని అర్థం. 1కొరింథీ పత్రికలో ‘‘నామము’’ (1:2,10,13; 5;4, 6:11) అంటే అది ‘‘అధికారము’’కు సమానార్థకంగా వాడబడిరది. వారిపై ప్రభువు వారి యాజమాన్యాన్నీ, తద్వారా సంక్రమించిన వాటన్నిటినీ అంగీకరించమని కొరింథు సంఘాన్ని ప్రోత్సహించడమే 1కొరింథీ పత్రిక రాయడంలో పౌలు ఉద్దేశం. పౌలు చర్చించిన ప్రభువు యొక్క యాజమాన్యం, అధికారం అనే విస్తృత అంశాలలో క్రైస్తవ ఐక్యత, నైతికత, స్త్రీల పాత్ర, ఆత్మవరాలు, పునరుత్థానం అనేవి ఇమిడి ఉన్నాయి.
బైబిల్లో ఈ గ్రంథం పాత్ర
క్రీస్తు శరీరం అనే సంఘంలోని సభ్యులు ఏ విధంగా కలిసి పనిచేయాలి అనే విషయాన్ని వివరించడం ద్వారా క్రైస్తవ జీవితం, పరిచర్య, సంబంధ బాంధవ్యాల గురించి అర్థం చేసుకోడానికి కొరింథీ మొదటి పత్రిక చాలా దోహదం చేస్తుంది. ఏ సంఘంలోనైనా సమస్యలు రావచ్చు, ఎందుకంటే సంఘంలో ఉన్నది పాపులైన ప్రజలు కాబట్టి (కచ్చితంగా వారు విమోచింపబడిన వారే కాని పాపంలో పడిపోడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రజలు కాబట్టి). పౌలు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారాన్ని సూచించాడు. అయితే ఈ సమస్యలన్నిటికీ అంతర్లీనంగా ఉన్న ఒకే ఒక్క జవాబు ఏమిటంటే సంఘం, దాని సభ్యులు క్రీస్తు కేంద్రిత జీవితాలు కలిగి ఉండాలి. తన శరీరానికి (సంఘానికి) శిరస్సు అయిన క్రీస్తు ప్రభుత్వం, ఆయన అధికారం కిందికి రావడం పైనే అంతా ఆధారపడి ఉంది.
గ్రంథ నిర్మాణం
మొదటి శతాబ్దపు ఉత్తరంలో ప్రామాణికంగా కనిపించే నాలుగు భాగాలతో కూడిన ఉత్తరంలాగా పౌలు దీనిని రాశాడు: అభివాదం (1:1-3), కృతజ్ఞతలు (1:4-9), ప్రధాన విభాగం (1:10-16:18), చివరిగా వీడ్కోలు (16:19-21). ఇది సందర్భాÛనుసారంగా, దానిని అందుకున్నవారి ప్రస్తుత అవసరానికి అనుగుణంగా రాసిన కాపరి పత్రిక. ఒక అంశాన్ని పరిచయం చేసే ముందు ‘‘గూర్చి’’ అనే పదాన్ని ఎక్కువగా వాడడం గమనార్హం. ఈ ‘‘గూర్చి’’ అనే పదం పౌలు అప్పటికే వారి దగ్గరనుండి వచ్చిన ప్రశ్నల జాబితాకు ఒక్కొక్కటిగా జవాబిస్తూ రాసినట్టుగా, బహుశా వివిధ సమస్యల పరిష్కారానికి నియమించిన ఒక కమిటీ రూపంలో జవాబిచ్చినట్టుగా సూచిస్తుంది (16:17). ఈ సమస్యల్లో కొన్ని, వివాహాల్లో స్త్రీ పురుషులు (16:17), కన్యకలు (7:25), విగ్రహార్పితమైన ఆహారం (8:1), ఆత్మవరాలు (12:1), యెరూషలేములోని పరిశుద్ధులకోసం చందాలు (16:1), అపొల్లో (16:12).
TSB Video
“We are currently creating more video content exclusively for the TSB. Many of those videos are already available for other books of the Bible. In the mean time we have excellent curated content from trusted Bible teachers for you. Please click the link below to view those videos.”